2020 సెప్టెంబర్ 7. సంచార జాతులు, అత్యంత వెనుకబడిన 17 బీసీ కులాలు మర్చిపోలేనిరోజు. తరాలు మారినా మారని తలరాతను మార్చిన రోజది. ‘‘పెద్ద సారులూ! మా బాధను వినండి. ఎక్కని గడప లేదు, మొక్కని దేవుడు లేడు. మమ్మల్ని కనీసం బీసీ కులాల జాబితాలో కలుపుకోండి. మేం ఆశ్రితకులం. మేం సంచార జాతులం...’’ అన్న ఆ మూగవేదనలు ఈ నేలంతా విన్పిస్తూనే ఉన్నాయి. వాళ్ల పిల్లలకు చదువులు లేవు. జనజీవితంలో కలగలిసి ఉన్నట్లే ఉంటారు, బతుకు దెరువుకోసం సంచారులై సాగిపోతుంటారు. గత 70 ఏళ్లుగా వీళ్లను కాలం ఎట్లా వదిలివేసిందో తెలియదు. అందరూ అట్టడుగు వర్గాల గురించి పెద్దగా మాట్లాడేవాళ్ళే. కానీ, ఈ సంచార జాతులకు కనీస గుర్తింపును కూడా ఎందుకు ఇవ్వలేకపోయారన్నది ప్రశ్న. ఈ జాతుల వాళ్లు కనీసంగా విజ్ఞాపనా పత్రాన్ని రాసి వ్వలేని స్థితిలో ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రం అవతరణ తర్వాత అన్ని రంగాలలో పునర్నిర్మాణం జరుగుతున్నట్లుగానే బహుజన బతుకుల పునర్నిర్మాణం మొదలయ్యింది. ఇందులో భాగంగా సమగ్రంగా బీసీల జీవన విధానంపై అధ్యయనం చేయటానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణలో సామాజిక సూత్రాలను అమ లుచేసే దిశగానే అధ్యయనం కొనసాగించాలని, సమాజంలో సగభాగమైన బీసీల బతుకుచిత్రం మార్చటానికి అధ్యయనమే తొలిపునాది కావాలని కమిషన్ నియామకం తర్వాత సుదీర్ఘంగా ఐదుసార్లు సమావేశాలు జరిపి కమిషన్‌కు దిశానిర్దేశం చేశారు. బీసీ(ఇ) గ్రూపులోని ముస్లింల జీవన విధానాన్ని అధ్యయనం చేయాల్సిందిగా కమిషన్‌ను ఆదేశిం చారు. ఆ నివేదికను ముఖ్యమంత్రికి అందివ్వగానే ప్రత్యేక అసెంబ్లీని ఏర్పాటుచేసి ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించటం జరిగింది. అదే రోజు ఎస్టీలకు 6 నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభు త్వానికి నివేదించింది.
కనీసం కుల సర్టిఫికెట్లకు నోచుకోకుండా ఉన్న సంచార జాతులను బీసీ కులాల్లో చేర్చాల్సి వుంది. 70 ఏళ్ల పాలకులు చేయలేని పనిని కేసీఆర్ చేశారు. సంచార జాతులను బీసీ కులాల్లో కలిపే విషయంపై చీఫ్ సెక్రటరీ బాధ్యతలు తీసుకోవలసిందిగా చెప్పారు. కేసీఆర్ చేసిన ఈ ప్రకటన చరిత్రాత్మ కమైనది. అది ఉద్యమకాలం నుంచి ఆయనను దగ్గ రగా చూసిన వాళ్లకు బాగా తెలుసు. ఒక విషయాన్ని తెలుసుకోవటానికి పుస్తక పఠనం ఉండాలి, క్షేత్ర స్థాయి అధ్యయన అనుభవం ఉండాలి. ఈ రెండూ కేసీఆర్‌లో ఉన్నాయి. బీసీ కులాల్లో చేర్చాల్సిన వారి పట్టికను ఇవ్వగానే వీళ్లంతా సంచార జాతుల వాళ్లే అన్నారు. 1. అద్దపువారు, 2. అహీర్/అహీర్ యాదవ కులము, 3. బాగోతుల/ భాగవతుల, 4. బైల్ కమ్మర/ ఘిసాడి/ గడియ లోహార్, 5.ఏనూటి/ యేనేటివాళ్లు, 6.గంజికూటి, 7.గౌడజెట్టి, 8.గవిలి/ గోవ్లీ/గౌలి/గవ్లి, 9.కాకిపడగల, 10.కుల్లకడిగి/ కుల్లె కడిగి/ చిట్టెపు, 11.పటంవారు/ మాసయ్యలు, 12. ఓడీ, 13.సారోల్లు/ సోమవంశ క్షత్రియ, 14. సొన్నా యిల/ సన్నాయిల/ సన్నాయోల్లు, 15. శ్రీక్షత్రియ రామజోగి/ రామబోగి/ రామజోగులు, 16. తెర చీరల/ తెల్వూరి/ బైకాని, 17. తోలుబొమ్మలవారు/ బొప్పలకులాల సంచారజాతుల వాళ్లు ఇప్పటిదాకా అనుభవించిన బాధలు అలవికానివి. వీళ్లది ఏ కులమో బీసీ కులపట్టికలో లేకపోవటంతో ఏ రెవెన్యూ అధికారి వీళ్లకు కులసర్టిఫికెట్లు ఇచ్చేవారు కాదు. బళ్లలో, హాస్టళ్లలో చేర్చుకునేటప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు.
రుణాలు పొందే సౌకర్యాలు ఉండేవి కావు. విద్యా, ఉద్యోగ విషయాలలో రిజర్వేషన్లు లేవు. ఇప్పుడు వీటన్నింటి నుంచి విముక్తి కలగబోతోంది. తరతరాలుగా సామాజిక చరిత్రను మోస్తున్న, గానం చేస్తున్న సంచార జాతులకు మంచి రోజులు రావాలి. పటం కథలు చెప్పుకుంటూ తిరిగే వారి పిల్లలు ఖగోళశాస్త్ర రంగంలోకి అడుగులు మోపాలి. తెలం గాణ రాష్ట్రం వస్తే ఏమవుతుందంటే, సంచార జాతుల బహుజనానికి విముక్తి లభిస్తుంది.
జూలూరు గౌరీశంకర్, తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యులు
సంచార జాతులు మరువలేని రోజు
Published Wed, Sep 9 2020 1:25 AM | Last Updated on Wed, Sep 9 2020 1:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment