backward castes
-
Bharat Ratna: నిరుపేదలకు గౌరవం: అమిత్ షా
న్యూఢిల్లీ: బిహార్ దివంగత సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించడం దేశంలోని కోట్లాది మంది నిరుపేదలు, వెనకబడ్డ వర్గాలు, దళితులకు నిజంగా గొప్ప గౌరవమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొనియాడారు. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన ద్వారా వందలాది ఏళ్ల నిరీక్షణకు తెర దించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆ మర్నాడే ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా అభినందనీయమన్నారు. బుధవారం ఇక్కడ ఠాకూర్ శతజయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. కర్పూరి స్ఫూర్తితో అన్ని వర్గాలనూ సమాదరిస్తూ మోదీ ప్రభుత్వం సాగుతోందన్నారు. ముఖ్యంగా ఓబీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలేనన్నారు. -
ఓబీసీ కులగణనకు 'నో' చెప్పిన కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో వెనుకబడిన కులాల జనాభా గణనకు జనాభా లెక్కల సేకరణ (సెన్సెస్) సరైన సాధనం కాదని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ స్పష్టం చేశారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన జనాభాను మినహా కులాలవారీగా జనాభా లెక్కలను సేకరించలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపిన మీదట జనాభా లెక్కల సేకరణకు ప్రభుత్వం షెడ్యూలును రూపొందిస్తుందని మంత్రి తెలిపారు. బీసీ జనాభా లెక్క తేల్చేందుకు వీలుగా సెన్సెస్‌లో కులగణన జరిపించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన విషయం హోం మంత్రిత్వ శాఖకు తెలుసునని చెప్పారు. దేశంలో జనాభా సంఖ్యను లేదా ఏదైనా సామాజిక వర్గానికి సంబంధించిన జనాభాను లెక్కించడం నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్) ఉద్దేశం కాదని మంత్రి అన్నారు. వర్గీకరణ అవసరాల కోసమే ఎన్ఎస్ఎస్ ఇంటింటి సర్వే చేపడుతుందని వెల్లడించారు. చదవండి: (ఏపీలో 3 కొత్త మెడికల్ కాలేజీలకు ఆమోదం) నరేగా బకాయిలు 1,341 కోట్లు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద మెటీరియల్, అడ్మినిస్ట్రేటివ్ కాంపోనెంట్ల కింద కేంద్రం చెల్లించాల్సిన బకాయిలు 1,341 కోట్లు ఉన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపిందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి బుధవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్న, అనుబంధ ప్రశ్నలకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం చెప్పారు. మెటీరీయల్, అడ్మినిస్ట్రేటివ్ కాంపోనెంట్ల కింద చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదన పంపినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రతిపాదనను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా మార్గదర్శకాలను అనుసరిస్తూ సవివరమైన ప్రతిపాదన పంపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. నరేగా కింద లేబర్ కాంపోనెంట్ కింద రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిలు ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు. చదవండి: ('విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు వెంటనే ప్రారంభిస్తాం') విశాఖ జిల్లాలో 79 కోట్లతో వాటర్‌షెడ్ పనులు ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కింద 2013-14లో విశాఖపట్నం జిల్లాలో 79 కోట్లతో 53 వేల హెక్టార్లలో 15 వాటర్‌షెడ్ అభివృద్ధి ప్రాజెక్ట్‌లు చేపట్టడానికి భూ వనరుల శాఖ ఆమోదం తెలిపిందని గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ 2015-16లో ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో భాగమైందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందిన సమాచారం మేరకు విశాఖ జిల్లాలో చేపట్టిన 15 ప్రాజెక్ట్‌లు అమలు దశలో ఉన్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా ఏర్పడిన అనిశ్చిత పరిస్థితుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం వీటని పూర్తి చేయలేకపోయింది. అందువలన ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు గుడువును 2022 మార్చి వరకు పొడిగించినట్లు మంత్రి తెలిపారు. -
2 Years Of YS Jagan Rule In AP: బీసీలకు వెన్ను దన్ను
సాక్షి, అమరావతి: సామాజిక న్యాయం అంటే అసలైన అర్థం ఇదేనని వైఎస్ జగన్ రెండేళ్ల పాలన స్పష్టం చేసింది. వాస్తవానికి రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల (బీసీ) వారు రెండేళ్ల క్రితం వరకూ వెనుకబడిపోయే ఉన్నారు. జనాభాలో అత్యధికులుగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వాల్లో వారికి ఏ రంగంలో కూడా తగిన వాటా లభించలేదు. ఆఖరికి దారిద్య్ర రేఖకు దిగువనున్న బీసీలు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందలేదు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదు... బీసీలంటే దేశానికి బ్యాక్ బోన్ అంటూ పాదయాత్రతో పాటు ఎన్నికల ముందు నిర్వహించిన బీసీ సదస్సులో కొత్త నిర్వచనం చెప్పిన అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వారికి అన్ని రంగాల్లో తగిన వాటా ఇచ్చేశారు. రెండేళ్ల పాలనలో ఇటు అభివృద్ది, సంక్షేమంలో బీసీలకు సామాజిక న్యాయం చేశారు. రాజ్యాధికారంలో కూడా బీసీలకు పెద్ద పీట వేశారు. మంత్రివర్గంలోనే కాకుండా బీసీల్లోని వివిధ వర్గాలకు జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఆయా వర్గాలకు నామినేటెడ్ పదవులు ఇచ్చారు. ఈ విషయంలో గత చంద్రబాబు సర్కారుతో పోల్చి చూస్తే ఇప్పటి జగన్ సర్కారులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నవరత్నాల ద్వారా బీసీలకు అందించిన ఆర్థిక ప్రయోజనాలే కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో బీసీలకు సబ్సిడీ పథకాలపై బ్యాంకు రుణాలు మాత్రమే మంజూరుకు చర్యలకు తీసుకున్నారు. అదీ కూడా ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేస్తేనే బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవి. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా రెండేళ్ల ముఖ్యమంత్రి జగన్ పాలనలో నవరత్నాల పథకాల ద్వారా రాష్ట్రంలోని బీసీలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యధిక ఆర్థిక ప్రయోజనం పొందారు. అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ► ఎన్నికల ముందు చెప్పిన మేరకు కులం, మతం, ప్రాంతం, రాజకీయం, పార్టీలు చూడకుండా నవరత్నాల పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తించింది. మంత్రులు, ఎమ్మెల్యేల జోక్యం గానీ సిఫార్సులకు ఎటువంటి ఆష్కారం ఇవ్వలేదు. ► వైఎస్సార్ నవశకం పేరుతో అర్హతగల ప్రతి ఒక్కరినీ నవరత్నాల పథకాలకు వలంటీర్ల ద్వారా గుర్తించారు. దీంతో ఎటువంటి వివక్షకు తావులేకుండా అర్హులైన బీసీలందరినీ ఆయా పథకాలకు ఎంపిక చేశారు. వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేశారు. ► 2019 జూన్ నుంచి ఈ ఏడాది మే ఆఖరు వరకు అంటే రెండేళ్ల పాలనలో నేరుగా నగదు బదిలీతో పాటు నగదేతర బదిలీ పథకాల ద్వారా 4.52 కోట్ల మంది బీసీలకు (పలువురికి ఒకటి కంటే ఎక్కువ పథకాల ద్వారా లబ్ధి కలిగింది) రూ.65,752.20 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరింది. ► ఇందులో నేరుగా నగదు బదిలీ ద్వారా 3.31 కోట్ల మంది బీసీలకు రూ.46,405.81 కోట్లను వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. నగదేతర పథకాల ద్వారా 1.21 కోట్ల మంది బీసీలకు రూ.19,346.39 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూర్చారు. వైఎస్సార్ రైతు భరోసాతో పాటు వైఎస్సార్ పెన్షన్ కానుక, జగనన్న అమ్మ ఒడి, పేదలందరికీ ఇళ్ల స్థలాల లబ్ధిదారుల్లో అత్యధికులు బీసీలే ఉండటం గమనార్హం. -
వెనకబడిన తరగతులకు వెయ్యిన్నర కోట్లు పెరుగుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ వెనుకబడిన తరగతులకు కాస్త ఊరటనిచ్చింది. గత రెండేళ్లుగా అరకొర నిధులతో సరిపెట్టిన ప్రభుత్వం 2021–22 బడ్జెట్ కేటాయింపుల్లో కాస్త ప్రాధాన్యతనిచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బీసీ సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వం రూ.5,522.09 కోట్లు ఖర్చు చేయనుంది. ఈమేరకు బడ్జెట్లో కేటాయింపులు చేసింది. 2020–21 వార్షిక బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే 2021–22 వార్షిక బడ్జెట్లో రూ.1,618.51 కోట్లు అధికంగా కేటాయించింది. దీంతో బీసీ సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాలకు ఊపిరి అందించినట్లయింది. కార్పొరేషన్లకు చేయూత.. ఫెడరేషన్లకు రిక్తహస్తం.. వెనుకబడిన తరగతుల ఆర్థిక సహకార సంస్థ, అత్యంత వెనుకబడిన తరగతుల ఆర్థిక సహకార సంస్థలకు తాజా బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించారు. ఇందులో బీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు దక్కాయి. ఈమేరకు నిధులు కేటాయించడంతో 2021–22 సంవత్సరంలో ఈ రెండు విభాగాల ద్వారా పథకాలను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సైతం అమలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ కులాలకు సంబంధించిన ఫెడరేషన్లకు మాత్రం ఈసారి బడ్జెట్లో నిధులు దక్కలేదు. కేవలం నిర్వహణ నిధులతో సరిపెట్టిన ప్రభుత్వం.. ప్రగతి పద్దులో మాత్రం ఎలాంటి కేటాయింపులు జరపకపోవడం గమనార్హం. కల్యాణలక్ష్మికి రూ.500 కోట్లు అదనం.. 2021–22 సంవత్సరంలో కల్యాణలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించింది. 2020–21 బడ్జెట్లో కల్యాణ లక్ష్మి కింద రూ.1,350 కోట్లు కేటాయించగా.. ఈ సారి ఆ మొత్తాన్ని రూ.1,850 కోట్లకు పెంచింది. క్షేత్రస్థాయి నుంచి బీసీ వర్గాల నుంచి దరఖాస్తుల సంఖ్య పెరగడం, లబ్ధిదారుల సంఖ్య కూడా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేటాయింపులు చాలడం లేదు. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ పరిధిలో దాదాపు 40 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే తాజా బడ్జెట్లో రూ.500 కోట్లు అదనంగా కేటాయించడంతో బకాయిలన్నీ పరిష్కరించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే 2021–22 ఏడాదిలో కల్యాణలక్ష్మి పథకాన్ని బకాయిలు లేకుండా అమలు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2021–22 వార్షిక బడ్జెట్లో ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖలకు పెద్దపీట వేసింది. ఈ రెండు శాఖల ద్వారా కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు సైతం అమలవుతుండగా.. వాటికి సరిపడా కేటాయింపులు చేస్తూనే మరిన్ని పథకాల అమలుకు నిధులు కేటాయించింది. వచ్చే సంవత్సరంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా రూ.5,587.97 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.3,056.12 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఇక మైనార్టీ సంక్షేమ శాఖకు కూడా కేటాయింపులు కాస్త పెరిగాయి. 2020–21 వార్షికంలో రూ.1,138.45 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి రూ.1,606.39 కోట్లు కేటాయించింది. -
సంచార జాతులు మరువలేని రోజు
2020 సెప్టెంబర్ 7. సంచార జాతులు, అత్యంత వెనుకబడిన 17 బీసీ కులాలు మర్చిపోలేనిరోజు. తరాలు మారినా మారని తలరాతను మార్చిన రోజది. ‘‘పెద్ద సారులూ! మా బాధను వినండి. ఎక్కని గడప లేదు, మొక్కని దేవుడు లేడు. మమ్మల్ని కనీసం బీసీ కులాల జాబితాలో కలుపుకోండి. మేం ఆశ్రితకులం. మేం సంచార జాతులం...’’ అన్న ఆ మూగవేదనలు ఈ నేలంతా విన్పిస్తూనే ఉన్నాయి. వాళ్ల పిల్లలకు చదువులు లేవు. జనజీవితంలో కలగలిసి ఉన్నట్లే ఉంటారు, బతుకు దెరువుకోసం సంచారులై సాగిపోతుంటారు. గత 70 ఏళ్లుగా వీళ్లను కాలం ఎట్లా వదిలివేసిందో తెలియదు. అందరూ అట్టడుగు వర్గాల గురించి పెద్దగా మాట్లాడేవాళ్ళే. కానీ, ఈ సంచార జాతులకు కనీస గుర్తింపును కూడా ఎందుకు ఇవ్వలేకపోయారన్నది ప్రశ్న. ఈ జాతుల వాళ్లు కనీసంగా విజ్ఞాపనా పత్రాన్ని రాసి వ్వలేని స్థితిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరణ తర్వాత అన్ని రంగాలలో పునర్నిర్మాణం జరుగుతున్నట్లుగానే బహుజన బతుకుల పునర్నిర్మాణం మొదలయ్యింది. ఇందులో భాగంగా సమగ్రంగా బీసీల జీవన విధానంపై అధ్యయనం చేయటానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణలో సామాజిక సూత్రాలను అమ లుచేసే దిశగానే అధ్యయనం కొనసాగించాలని, సమాజంలో సగభాగమైన బీసీల బతుకుచిత్రం మార్చటానికి అధ్యయనమే తొలిపునాది కావాలని కమిషన్ నియామకం తర్వాత సుదీర్ఘంగా ఐదుసార్లు సమావేశాలు జరిపి కమిషన్‌కు దిశానిర్దేశం చేశారు. బీసీ(ఇ) గ్రూపులోని ముస్లింల జీవన విధానాన్ని అధ్యయనం చేయాల్సిందిగా కమిషన్‌ను ఆదేశిం చారు. ఆ నివేదికను ముఖ్యమంత్రికి అందివ్వగానే ప్రత్యేక అసెంబ్లీని ఏర్పాటుచేసి ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించటం జరిగింది. అదే రోజు ఎస్టీలకు 6 నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభు త్వానికి నివేదించింది. కనీసం కుల సర్టిఫికెట్లకు నోచుకోకుండా ఉన్న సంచార జాతులను బీసీ కులాల్లో చేర్చాల్సి వుంది. 70 ఏళ్ల పాలకులు చేయలేని పనిని కేసీఆర్ చేశారు. సంచార జాతులను బీసీ కులాల్లో కలిపే విషయంపై చీఫ్ సెక్రటరీ బాధ్యతలు తీసుకోవలసిందిగా చెప్పారు. కేసీఆర్ చేసిన ఈ ప్రకటన చరిత్రాత్మ కమైనది. అది ఉద్యమకాలం నుంచి ఆయనను దగ్గ రగా చూసిన వాళ్లకు బాగా తెలుసు. ఒక విషయాన్ని తెలుసుకోవటానికి పుస్తక పఠనం ఉండాలి, క్షేత్ర స్థాయి అధ్యయన అనుభవం ఉండాలి. ఈ రెండూ కేసీఆర్‌లో ఉన్నాయి. బీసీ కులాల్లో చేర్చాల్సిన వారి పట్టికను ఇవ్వగానే వీళ్లంతా సంచార జాతుల వాళ్లే అన్నారు. 1. అద్దపువారు, 2. అహీర్/అహీర్ యాదవ కులము, 3. బాగోతుల/ భాగవతుల, 4. బైల్ కమ్మర/ ఘిసాడి/ గడియ లోహార్, 5.ఏనూటి/ యేనేటివాళ్లు, 6.గంజికూటి, 7.గౌడజెట్టి, 8.గవిలి/ గోవ్లీ/గౌలి/గవ్లి, 9.కాకిపడగల, 10.కుల్లకడిగి/ కుల్లె కడిగి/ చిట్టెపు, 11.పటంవారు/ మాసయ్యలు, 12. ఓడీ, 13.సారోల్లు/ సోమవంశ క్షత్రియ, 14. సొన్నా యిల/ సన్నాయిల/ సన్నాయోల్లు, 15. శ్రీక్షత్రియ రామజోగి/ రామబోగి/ రామజోగులు, 16. తెర చీరల/ తెల్వూరి/ బైకాని, 17. తోలుబొమ్మలవారు/ బొప్పలకులాల సంచారజాతుల వాళ్లు ఇప్పటిదాకా అనుభవించిన బాధలు అలవికానివి. వీళ్లది ఏ కులమో బీసీ కులపట్టికలో లేకపోవటంతో ఏ రెవెన్యూ అధికారి వీళ్లకు కులసర్టిఫికెట్లు ఇచ్చేవారు కాదు. బళ్లలో, హాస్టళ్లలో చేర్చుకునేటప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. రుణాలు పొందే సౌకర్యాలు ఉండేవి కావు. విద్యా, ఉద్యోగ విషయాలలో రిజర్వేషన్లు లేవు. ఇప్పుడు వీటన్నింటి నుంచి విముక్తి కలగబోతోంది. తరతరాలుగా సామాజిక చరిత్రను మోస్తున్న, గానం చేస్తున్న సంచార జాతులకు మంచి రోజులు రావాలి. పటం కథలు చెప్పుకుంటూ తిరిగే వారి పిల్లలు ఖగోళశాస్త్ర రంగంలోకి అడుగులు మోపాలి. తెలం గాణ రాష్ట్రం వస్తే ఏమవుతుందంటే, సంచార జాతుల బహుజనానికి విముక్తి లభిస్తుంది. జూలూరు గౌరీశంకర్, తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యులు -
బడుగు,బలహీన వర్గాలకు కీలక మంత్రిత్వ శాఖలు
-
యూపీ వెనుకబడిన వర్గాల మొగ్గు ఎటువైపు?
ఉత్తర్‌ప్రదేశ్‌లోని 27 లోక్‌సభ స్థానాలకు చివరి రెండు దశల్లో జరిగే పోలింగ్ పాలకపక్షమైన బీజేపీకి అత్యంత కీలకమైనది. 2014లో రాష్ట్రంలోని మొత్తం 80 సీట్లలో బీజేపీ, దాని మిత్రపక్షం 73 స్థానాలు కైవసం చేసుకున్నాయి. గతంలో యూపీలో వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్న ఎస్పీ, బీఎస్పీ మరో ప్రాంతీయపక్షమైన ఆరెల్డీతో చేతులు కలిపి మహా కూటమి పేరుతో 2019 ఎన్నికల్లో పోటీచేయడం కొత్త పరిణామం. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెల్లెలు, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ విస్తృతంగా ప్రచారం చేయడం రెండో ప్రధానాంశం. ప్రియాంక ప్రచారం కారణంగా కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో పది శాతం వరకూ ఓట్లు అదనంగా పడుతున్నాయని ఎన్డీటీవీ అధిపతి, ప్రసిద్ధ ఎన్నికల విశ్లేషకుడు ప్రణయ్ రాయ్ జరిపించిన సర్వేలో తేలింది. అయితే, కాంగ్రెస్‌కు పెరిగే ఈ ఓట్లు బీజేపీ వ్యతిరేక ఓట్ల నుంచే వస్తున్నందువల్ల ఎస్పీ–బీఎస్పీ కూటమికి నష్టదాయకం కావచ్చని అంచనా వేస్తున్నారు. దేశంలోని మిగతా ప్రాంతాల సగటు కన్నా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎక్కువ మంది దళితులు, ముస్లింలు ఉన్నారు. అలాగే పట్టణ ఓటర్ల కంటే గ్రామీణ ఓటర్ల శాతం యూపీలో ఎక్కువ. బీజేపీ నుంచి కాంగ్రెస్, కూటమి వైపు మొగ్గుతున్న దళితులు కిందటి లోక్‌సభ ఎన్నికల్లో కాషాయపక్షానికి అధిక సంఖ్యలో ఓట్లేసిన దళితుల్లో కొందరు ఈసారి ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లేసే అవకాశం ఉందని కూడా సర్వేలో తేలింది. 2014లో బీజేపీకి పడిన దళితుల ఓట్లలో 10 శాతం కాంగ్రెస్‌కు, ఐదు శాతం మహా కూటమికి దక్కే అవకాశముంది. యూపీలో ముస్లింలు జనాభాలో 19 శాతం వరకూ ఉన్నారు. వారిలో 75 శాతం ఓటర్లు మహాగఠ్‌బంధన్‌కు, 25 శాతం మంది కాంగ్రెస్‌కు ఓటేసే వీలుందని కూడా ఈ సర్వే సూచిస్తోంది. 18–25 ఏళ్ల యువ ఓటర్ల మద్దతు ఎక్కువగా బీజేపీకే ఉంటుందని తెలుస్తోంది. ఇంకా మహిళలు, వెనుకబడిన వర్గాల్లో కూడా బీజేపీకి ఎక్కువ మద్దతు కనిపిస్తోంది. యూపీలోని బీసీల్లో సగానికి పైగా(55 శాతం) జనం బీజేపీ అభ్యర్థులకు ఓటేయడానినికి ఇష్టపడుతున్నారు. మిగిలిన 35 శాతం మహా కూటమికి, పది శాతం కాంగ్రెస్‌కు ఓటేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. యువతలో సగం బీజేపీకే? ఉత్తర్ ప్రదేశ్ యువ ఓటర్లలో(18–25 ఏళ్ల వయసువారు) దాదాపు సగం మంది బీజేపీకి ఓటేయడానికే మొగ్గు చూపుతున్నారని, ఈ అంశం పార్టీలు సాధించే లోక్‌సభ సీట్ల సంఖ్యను నిర్ణయిస్తుందని కూడా క్షేత్రస్థాయిలో జరిపిన అధ్యయనాలు చెబుతున్నాయి. ఏ ఎన్నికల్లోనైనా ఉత్సాహంగా ఓటు వేస్తున్న మహిళల విషయానికి వస్తే, పురుషులతో సమానంగా మహిళలు బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. కాంగ్రెస్‌కు పడే ఓట్లలో మహిళల ఓట్లు ఎక్కువనీ, మహా కూటమికి దక్కే ఓట్లలో పురుషులవి ఎక్కువనీ ఈ సర్వే సూచిస్తోంది. బీసీలు, దళితుల మద్దతు అత్యధికంగా ఉన్న ఎస్పీ–బీఎస్పీ కూటమి ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో చేతులు కలపడం వల్ల గణనీయ సంఖ్యలో ఉన్న అగ్రవర్ణాలు బీజేపీకి అనుకూలంగా సమీకృతం అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని కూడా ఈ సర్వేలో తేలింది. వారు అత్యధిక సంఖ్యలో కాషాయపక్షం అభ్యర్థులకు ఓటేస్తారని తెలుస్తోంది. మొత్తం మీద రాజకీయ, కుల సమీకరణలు కొంత వరకు బీజేపీకి అనుకూలంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. -
బీసీలంటే బాబుకు పడదంతే..!
సాక్షి, అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు బీసీలకు బద్ధ వ్యతిరేకని మరోసారి రుజువైంది. అంతేకాదు బీసీలను ప్రతిపక్ష పార్టీ ప్రోత్సహించినా సహించరని స్పష్టమయ్యింది. హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన గోరంట్ల మాధవ్ వీఆర్ఎస్ ఉదంతం ఇందుకు నిదర్శనం. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా గోరంట్ల మాధవ్ పెట్టుకున్న స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) దరఖాస్తును, ఆ దరఖాస్తును ఆమోదించాల్సిందిగా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును అంగీకరించకుండా మొండికేయడం, చంద్రబాబుకు బీసీలంటే ఉన్న వ్యతిరేకతను స్పష్టం చేస్తోంది. మాధవ్ వారం పది రోజులుగా ఎక్కిన గడప ఎక్కకుండా తిరుగుతున్నా చంద్రబాబు మనసు కరగలేదు. పైగా ట్రిబ్యునల్ తీర్పుతో విభేదిస్తూ హైకోర్టుకు వెళ్లారు. అయితే అక్కడ బాబుకు చుక్కెదురయ్యింది. ట్రిబ్యునల్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తనకు అనుంగు శిష్యుని మాదిరి వ్యవహరించిన ఏపీ ఎన్జీవోల సంఘం నేత అశోక్ బాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు ఆఘమేఘాల మీద కేసులన్నింటినీ పరిష్కరించిన చంద్రబాబు.. గోరంట్ల మాధవ్‌ను ఇబ్బందులకు గురిచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. వాస్తవానికి మాధవ్ చాలా కాలం కిందటే వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. అయినా ఆయన వీఆర్ఎస్ను ఆమోదించకుండా కర్నూలు డీఐజీ నాగేంద్ర కుమార్ తొక్కిపట్టి తప్పించుకుతిరగడం అంతా సీఎం ఆదేశాల మేరకే జరుగుతోందనే విమర్శలు వచ్చాయి. వీఆర్ఎస్ను ఆమోదింపజేసుకోవడానికి ఓ బీసీ అభ్యర్థి పడిన కష్టం చూస్తుంటే ఆ వర్గాల పట్ల చంద్రబాబు ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తారో మరోసారి రుజువైందని బీసీ సంఘాలు పేర్కొన్నాయి. ఇప్పుడే కాదు.. ఎప్పుడూ అంతే చంద్రబాబు ఎప్పుడూ బీసీ వర్గాల వ్యతిరేకేనని పలువురు బీసీ సంక్షేమ సంఘాల నేతలు ధ్వజమెత్తుతున్నారు. గతంలో బాబు బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఉదంతాలను ఉదహరిస్తున్నారు. హైకోర్టు జడ్జీలుగా ఇద్దరు బీసీ న్యాయవాదులను కొలీజియం సిఫారసు చేస్తే వారు ఆ పదవికి అర్హులు కాదంటూ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సుప్రీంకోర్టుకు లేఖ రాసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. బడుగు, బలహీనవర్గాల కోసమే తమ పార్టీ పుట్టిందని, తమకు ఆ వర్గాలే వెన్నెముక అంటూ చంద్రబాబు ఉత్తుత్తి కబుర్లు చెబుతారని, కానీ ఆయన మాటలకు, చేతలకు చాలా తేడా ఉంటుందని బీసీ నేతలు చెబుతున్నారు. తమకు న్యాయం చేయమని అడగడానికి వెళ్లిన నాయీ బ్రాహ్మణులను ’ఏయ్, నోర్మూయ్, తాట తీస్తా’ అంటూ అహంకార పూరితంగా బెదిరించారని గుర్తుచేశారు. కాపుల్ని బీసీలలో, బోయల్ని ఎస్టీలలో, రజకుల్ని ఎస్సీలలో చేరుస్తానని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శిస్తున్నారు. -
గుర్తింపులేని కులాలను గుర్తించాలి
హైదరాబాద్: రాష్ట్రంలో గుర్తింపులేని 28 కులాలను వెనకబడిన కులాల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో గుర్తింపులేని కులాలకు గుర్తింపు, సామాజిక న్యాయం’అనే అంశంపై జాతీయ ఎంబీసీ, డీఎన్టీ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గుర్తింపులేని 28 కులాలను బీసీ జాబితాలో చేర్చాలని బీసీ కమీషన్‌కు, బీసీ సంక్షేమ శాఖ మంత్రికి టీజేఏసీ ఆధ్వర్యంలో త్వరలో వినతిపత్రాలు ఇస్తామని తెలిపారు. సంఘం అధ్యక్షుడు సంగెం సూర్యారావు, ప్రొఫెసర్ ఐ.తిరుమలి, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు పాండురంగారావు మాట్లాడుతూ సంచార జాతుల్లో బాగోతుల, గంజికూటి, రామజోగి, ఓడ్, గవిలి, బొప్పల వంటి కులాలు ఇప్పటికీ కనీసం గుర్తింపులేక కడుదీనమైన స్థితిలో జీవనం కొనసాగిస్తున్నాయని అన్నారు. వీరికి కుల సర్టిఫికెట్ ఇవ్వకపోవడంవల్ల పిల్లలను స్కూళ్లలో చేర్పించుకోలేక చదువుకు దూరమౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా కులాలకు చెందిన శ్రీనివాస్, సారయ్య, వెంకటనారాయణ, నరేందర్, పాండురంగచారి మాట్లాడుతూ ‘వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో కొన్ని కులాలకు గుర్తింపు ఇచ్చారు, తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని కులాలను గుర్తిస్తారని భావించాం. కాని నిరాశే ఎదురైంది’అని పేర్కొన్నారు. -
15న కలెక్టరేట్ల ఎదుట బీసీల రిలేదీక్షలు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపులను బీసీల్లో చేర్చే ప్రయత్నాలకు నిరసనగా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపుమేరకు ఈ నెల 15న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు శనివారం తెనాలిలో పిలుపునిచ్చారు. బీసీ కులాల వారు పెను ప్రమాదంలో ఉన్నారని, పార్టీలకతీతంగా బీసీలు ఏకమై ఉద్యమానికి మద్దతుగా రిలే దీక్షలు చేపట్టి, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని ఆయన సూచించారు. కాపుల సామాజిక, ఆర్ధిక పరిస్థితులపై నిష్పక్షపాతంగా సమగ్రమైన శాస్త్రీయ సర్వే చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీల్లో అభద్రతా భావాన్ని తొలగించడానికి బీసీ సంఘ నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్చలు జరపాలని కోరారు. ముఖ్యమంత్రి స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, తరువాతి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని శంకరరావు హెచ్చరించారు.