గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపులను బీసీల్లో చేర్చే ప్రయత్నాలకు నిరసనగా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపుమేరకు ఈ నెల 15న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు శనివారం తెనాలిలో పిలుపునిచ్చారు.
బీసీ కులాల వారు పెను ప్రమాదంలో ఉన్నారని, పార్టీలకతీతంగా బీసీలు ఏకమై ఉద్యమానికి మద్దతుగా రిలే దీక్షలు చేపట్టి, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని ఆయన సూచించారు. కాపుల సామాజిక, ఆర్ధిక పరిస్థితులపై నిష్పక్షపాతంగా సమగ్రమైన శాస్త్రీయ సర్వే చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీల్లో అభద్రతా భావాన్ని తొలగించడానికి బీసీ సంఘ నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్చలు జరపాలని కోరారు. ముఖ్యమంత్రి స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, తరువాతి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని శంకరరావు హెచ్చరించారు.