కాపులను బీసీల్లో చేర్చడం అవసరమా?
పెదవాల్తేరు (విశాఖ): రాజ్యాంగంలోని ప్రకరణ 340 ప్రకారం సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారినే బీసీలుగా గుర్తించాలని, అయితే ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేశామనే కారణంతో కాపులను బీసీల్లో చేర్చాల్సిన అవసరముందా అని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు ప్రశ్నించారు. ఆయన శనివారం కిర్లంపూడిలో జిల్లా బీసీ సంఘం నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందిన వారికి బీసీ కోటా కల్పిస్తే న్యాయస్థానాల తీర్పును ధిక్కరించినట్లవుతుందని పేర్కొన్నారు.
రాజమహేంద్రవరంలో జరిగిన అర్బన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో శంకరరావు మాట్లాడుతూ... రాబోయే కాలంలో బీసీలు అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. బీసీ నాయకులందరూ తమ ప్రాంతాల్లో బూత్, గ్రామ, నగర స్థాయిల్లో కార్యవర్గాలను ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సాహవంతులైన యువతను తీసుకుని బీసీ సంఘాన్ని బలోపేతం చేయాలని సూచించారు.