హామీలు నెరవేరుస్తారా? రోడ్డెక్కమంటారా?
హామీల అమలు ప్రక్రియ మొదలుకాకపోతే మరలా రోడ్డెక్కక తప్పదని ముద్రగడ హెచ్చరించారు.
కడప: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయమని మాత్రమే తాము అడుగుతున్నామని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. కాపులకు రిజర్వేషన్ కల్పించేందుకు ఏర్పాటు చేసిన కమిషన్ గడువు ఈ నెల ఆఖరుతో ముగుస్తుందని, అలాగే మంత్రివర్గ ఉపసంఘం గడువు కూడా సెప్టెంబర్ 7న ముగుస్తుందని.. అందువల్ల ఇచ్చిన హామీ నెరవేరుస్తారో.. రోడ్డెక్కమంటారో చంద్రబాబు తేల్చుకోవాలని పేర్కొన్నారు. కడపలో మంగళవారం ఒక వివాహ వేడుకకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. తుని ఘటనలో చంద్రబాబు చాలా మందిని ఇబ్బందులకు గురి చేశారన్నారు. గడువు ముగిసేలోగా హామీల అమలు ప్రక్రియ మొదలు కాకపోతే మరలా తాము రోడ్డెక్కక తప్పదని ఆయన హెచ్చరించారు. సీఎం స్థాయిలో ఉండి అబద్ధాలు ఆడటం తగదని విమర్శించారు.