
ముద్రగడ దీక్ష భగ్నానికి ఆదేశాలు?
విజయవాడ: కాపుల రిజర్వేషన్ కోసం ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొండి వైఖరికి దిగారు. ఆయన దీక్ష విషయంలో తాము ఒక్క మెట్టు కూడా దిగేది లేదని సీఎం చంద్రబాబునాయుడు మంత్రులకు స్పష్టం చేశారు. ముద్రగడతో చర్చలకోసం ప్రభుత్వం తరుపున ఎవరినీ పంపకూడదని కూడా నిర్ణయించారు.
ఆదివారం మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ అయిన విషయం తెలిసిందే. పలు అంశాలు ఈ కేబినెట్ భేటీలో చర్చకు వచ్చినా ముద్రగడ దీక్షనే కీలక చర్చనీయాంశం అయింది. అయితే, ముద్రగడ విషయంలో చంద్రబాబు తన నిర్ణయాన్ని కుండబద్ధలు కొట్టారు. పోలీసుల ద్వారా ఆయన దీక్షను భగ్నం చేయించాలని ఆదేశించారు. ముద్రగడ ప్రతిపాదనలకు ఏమాత్రం అంగీకరించకూడదని కూడా నిర్ణయించారు. చట్టప్రకారం ఆయన దీక్షను భగ్నం చేయాలని, వారి ఆరోగ్యం క్షీణించిన వెంటనే పోలీసుల ద్వారా దీక్షను భగ్నం చేయించాలని ఆదేశించారు. కాపు కార్పొరేషన్ కు వచ్చిన దరఖాస్తులన్నీ క్లియర్ చేయాలని నిర్ణయించారు. మంజునాథ కమిషన్ కాలపరిమితి తగ్గించడం సాధ్యంకాదని అభిప్రాయం వ్యక్తమైనట్లు కూడా సమాచారం.