ఓబీసీ కులగణనకు 'నో' చెప్పిన కేంద్రం | Union Minister Answers Vijayasai Reddy Question in Rajya Sabha | Sakshi
Sakshi News home page

ఓబీసీ కులగణనకు 'నో' చెప్పిన కేంద్రం

Published Wed, Dec 15 2021 4:39 PM | Last Updated on Wed, Dec 15 2021 6:54 PM

Union Minister Answers Vijayasai Reddy Question in Rajya Sabha - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో వెనుకబడిన కులాల జనాభా గణనకు జనాభా లెక్కల సేకరణ (సెన్సెస్‌) సరైన సాధనం కాదని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌ స్పష్టం చేశారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన జనాభాను మినహా కులాలవారీగా జనాభా లెక్కలను సేకరించలేదని తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపిన మీదట జనాభా లెక్కల సేకరణకు ప్రభుత్వం షెడ్యూలును రూపొందిస్తుందని మంత్రి తెలిపారు. బీసీ జనాభా లెక్క తేల్చేందుకు వీలుగా సెన్సెస్‌లో కులగణన జరిపించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన విషయం హోం మంత్రిత్వ శాఖకు తెలుసునని చెప్పారు. దేశంలో జనాభా సంఖ్యను లేదా ఏదైనా సామాజిక వర్గానికి సంబంధించిన జనాభాను లెక్కించడం నేషనల్‌ శాంపిల్‌ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌) ఉద్దేశం కాదని మంత్రి అన్నారు. వర్గీకరణ అవసరాల కోసమే ఎన్‌ఎస్‌ఎస్‌ ఇంటింటి సర్వే చేపడుతుందని వెల్లడించారు.

చదవండి: (ఏపీలో 3 కొత్త మెడికల్ కాలేజీలకు ఆమోదం)

నరేగా బకాయిలు 1,341 కోట్లు
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద మెటీరియల్, అడ్మినిస్ట్రేటివ్ కాంపోనెంట్ల కింద కేంద్రం చెల్లించాల్సిన బకాయిలు 1,341 కోట్లు ఉన్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపిందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వెల్లడించారు. వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి బుధవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్న, అనుబంధ ప్రశ్నలకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం చెప్పారు.

మెటీరీయల్‌, అడ్మినిస్ట్రేటివ్‌ కాంపోనెంట్ల కింద చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదన పంపినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రతిపాదనను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా మార్గదర్శకాలను అనుసరిస్తూ సవివరమైన ప్రతిపాదన పంపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. నరేగా కింద లేబర్ కాంపోనెంట్ కింద రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిలు ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు.

చదవండి: ('విశాఖ రైల్వే జోన్‌ కార్యకలాపాలు వెంటనే ప్రారంభిస్తాం')

విశాఖ జిల్లాలో 79 కోట్లతో వాటర్‌షెడ్‌ పనులు
ఇంటిగ్రేటెడ్‌ వాటర్‌షెడ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ కింద 2013-14లో విశాఖపట్నం జిల్లాలో 79 కోట్లతో 53 వేల హెక్టార్లలో 15 వాటర్‌షెడ్‌ అభివృద్ధి ప్రాజెక్ట్‌లు చేపట్టడానికి భూ వనరుల శాఖ ఆమోదం తెలిపిందని గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఇంటిగ్రేటెడ్‌ వాటర్‌షెడ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ 2015-16లో ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో భాగమైందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి అందిన సమాచారం మేరకు విశాఖ జిల్లాలో చేపట్టిన 15 ప్రాజెక్ట్‌లు అమలు దశలో ఉన్నాయి. కోవిడ్‌ మహమ్మారి కారణంగా ఏర్పడిన అనిశ్చిత పరిస్థితుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం వీటని పూర్తి చేయలేకపోయింది. అందువలన ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు గుడువును 2022 మార్చి వరకు పొడిగించినట్లు మంత్రి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement