ఉత్తర్‌ప్రదేశ్‌లోని 27 లోక్‌సభ స్థానాలకు చివరి రెండు దశల్లో జరిగే పోలింగ్ పాలకపక్షమైన బీజేపీకి అత్యంత కీలకమైనది. 2014లో రాష్ట్రంలోని మొత్తం 80 సీట్లలో బీజేపీ, దాని మిత్రపక్షం 73 స్థానాలు కైవసం చేసుకున్నాయి. గతంలో యూపీలో వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్న ఎస్పీ, బీఎస్పీ మరో ప్రాంతీయపక్షమైన ఆరెల్డీతో చేతులు కలిపి మహా కూటమి పేరుతో 2019 ఎన్నికల్లో పోటీచేయడం కొత్త పరిణామం. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెల్లెలు, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ విస్తృతంగా ప్రచారం చేయడం రెండో ప్రధానాంశం.
ప్రియాంక ప్రచారం కారణంగా కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో పది శాతం వరకూ ఓట్లు అదనంగా పడుతున్నాయని ఎన్డీటీవీ అధిపతి, ప్రసిద్ధ ఎన్నికల విశ్లేషకుడు ప్రణయ్ రాయ్ జరిపించిన సర్వేలో తేలింది. అయితే, కాంగ్రెస్‌కు పెరిగే ఈ ఓట్లు బీజేపీ వ్యతిరేక ఓట్ల నుంచే వస్తున్నందువల్ల ఎస్పీ–బీఎస్పీ కూటమికి నష్టదాయకం కావచ్చని అంచనా వేస్తున్నారు. దేశంలోని మిగతా ప్రాంతాల సగటు కన్నా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎక్కువ మంది దళితులు, ముస్లింలు ఉన్నారు. అలాగే పట్టణ ఓటర్ల కంటే గ్రామీణ ఓటర్ల
శాతం యూపీలో ఎక్కువ.
బీజేపీ నుంచి కాంగ్రెస్, కూటమి వైపు మొగ్గుతున్న దళితులు
కిందటి లోక్‌సభ ఎన్నికల్లో కాషాయపక్షానికి అధిక సంఖ్యలో ఓట్లేసిన దళితుల్లో కొందరు ఈసారి ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లేసే అవకాశం ఉందని కూడా సర్వేలో తేలింది. 2014లో బీజేపీకి పడిన దళితుల ఓట్లలో 10 శాతం కాంగ్రెస్‌కు, ఐదు శాతం మహా కూటమికి దక్కే అవకాశముంది. యూపీలో ముస్లింలు జనాభాలో 19 శాతం వరకూ ఉన్నారు. వారిలో 75 శాతం ఓటర్లు మహాగఠ్‌బంధన్‌కు, 25 శాతం మంది కాంగ్రెస్‌కు ఓటేసే వీలుందని కూడా ఈ సర్వే సూచిస్తోంది. 18–25 ఏళ్ల యువ ఓటర్ల మద్దతు ఎక్కువగా బీజేపీకే ఉంటుందని తెలుస్తోంది. ఇంకా మహిళలు, వెనుకబడిన వర్గాల్లో కూడా బీజేపీకి ఎక్కువ మద్దతు కనిపిస్తోంది. యూపీలోని బీసీల్లో సగానికి పైగా(55 శాతం) జనం బీజేపీ అభ్యర్థులకు ఓటేయడానినికి ఇష్టపడుతున్నారు. మిగిలిన 35 శాతం మహా కూటమికి, పది శాతం కాంగ్రెస్‌కు ఓటేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
యువతలో సగం బీజేపీకే?
ఉత్తర్ ప్రదేశ్ యువ ఓటర్లలో(18–25 ఏళ్ల వయసువారు) దాదాపు సగం మంది బీజేపీకి ఓటేయడానికే మొగ్గు చూపుతున్నారని, ఈ అంశం పార్టీలు సాధించే లోక్‌సభ సీట్ల సంఖ్యను నిర్ణయిస్తుందని కూడా క్షేత్రస్థాయిలో జరిపిన అధ్యయనాలు చెబుతున్నాయి. ఏ ఎన్నికల్లోనైనా ఉత్సాహంగా ఓటు వేస్తున్న మహిళల విషయానికి వస్తే, పురుషులతో సమానంగా మహిళలు బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. కాంగ్రెస్‌కు పడే ఓట్లలో మహిళల ఓట్లు ఎక్కువనీ, మహా కూటమికి దక్కే ఓట్లలో పురుషులవి ఎక్కువనీ ఈ సర్వే సూచిస్తోంది.
బీసీలు, దళితుల మద్దతు అత్యధికంగా ఉన్న ఎస్పీ–బీఎస్పీ కూటమి ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో చేతులు కలపడం వల్ల గణనీయ సంఖ్యలో ఉన్న అగ్రవర్ణాలు బీజేపీకి అనుకూలంగా సమీకృతం అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని కూడా ఈ సర్వేలో తేలింది. వారు అత్యధిక సంఖ్యలో కాషాయపక్షం అభ్యర్థులకు ఓటేస్తారని తెలుస్తోంది. మొత్తం మీద రాజకీయ, కుల సమీకరణలు కొంత వరకు బీజేపీకి అనుకూలంగా మారుతున్నట్టు కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment