sixth phase
-
Lok Sabha Election 2024: ఆరో విడతలో 63.36 శాతం
న్యూఢిల్లీ: లోకసభ ఎన్నికల్లో భాగంగా ఆరో విడతలో 8 రాష్ట్రాలు, యూటీల్లో శనివారం 58 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తాజా గణాంకాల ప్రకారం పోలింగ్ 63.36 శాతానికి పెరిగింది. పశ్చిమబెంగాల్ పరిధిలోని ఎనిమిది లోక్‌సభ స్థానాల్లో 82.71 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారి ఆదివారం వెల్లడించారు. ఇప్పటివరకు ముగిసిన ఆరు దశలను పరిశీలిస్తే అన్నింటికన్నా తక్కువగా ఐదో దశలో 62.2 శాతం పోలింగ్ నమోదైంది. ఆరో దశ కింద 2019లో 59 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 64.4 శాతం పోలింగ్ నమోదైంది. ప్రతి దశలోని తుది పోలింగ్ శాతాలు ఓట్ల లెక్కింపు తర్వాతే అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం వివరించింది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కించడం వల్లే పోలింగ్ శాతాలు పెరుగుతాయని గుర్తుచేసింది. -
Lok Sabha Election 2024: ఆరో విడతలో 61.11 శాతం
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శనివారం ఆరో విడతలో 58 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కడపటి సమాచారం అందేసరికి 61.11 శాతం పోలింగ్ నమోదైంది. పశి్చమబెంగాల్లో అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు, ఢిల్లీలో ఒకట్రెండుచోట్ల ఈవీఎంలు మొరాయించడం మినహా పోలింగ్ సజావుగా సాగింది. ఈ విడతలో కూడా బెంగాల్లోనే అత్యధికంగా 79.40 శాతం పోలింగ్ నమోదైంది. జార్ఖండ్‌లో 63.76 శాతం, ఒడిశాలో 69.32, హరియాణాలో 60.06, ఢిల్లీలో 57.67, బిహార్‌లో 55.24, యూపీలో 54.03 శాతం పోలింగ్ జరిగింది. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్–రాజౌరీ లోక్‌సభ స్థానంలో 54.15 శాతం పోలింగ్ జరగడం విశేషం. అక్కడ గత కొన్ని దశాబ్దాల్లో ఇదే అత్యధికం. దీంతో జమ్మూ కశీ్మర్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అక్కడి 5 లోక్‌సభ స్థానాల్లో కలిసి 58 శాతం పోలింగ్ నమోదైంది. ఇది గత 40 ఏళ్లలో అత్యధికమని ఈసీ పేర్కొంది. అక్కడి బారాముల్లా (59 శాతం), శ్రీనగర్ (34.4 శాతం) స్థానాల్లోనూ ఈసారి అత్యధిక పోలింగ్ నమోదైంది. ఒడిశాలో 6 లోక్‌సభ స్థానాలతో పాటు వాటి పరిధిలోని 42 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరిగింది. శనివారంతో 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 486 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మిగిలిన 57 స్థానాలకు జూన్ 1న చివరిదైన ఏడో విడతలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. ఓటేసిన ప్రముఖులు రాజధాని ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకూ ఈ విడతలోనే పోలింగ్ జరిగింది. దాంతో ప్రముఖులంతా ఓటింగ్‌కు తరలివచ్చారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, కేంద్ర మంత్రులు ఎస్.జైశంకర్, హర్దీప్సింగ్ పురి, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వద్రా దంపతులు, హరియాణా సీఎం నయాబ్‌సింగ్ సైనీ తదితరులు ఓటు వేశారు. ప్రియాంక కూతురు మిరాయా తొలిసారి ఓటేశారు. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఆప్‌కు ఓటేయగా... ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దంపతులు కాంగ్రెస్‌కు ఓటేయడం విశేషం. సోనియా, రాహుల్ ఓటేసిన న్యూఢిల్లీ లోక్‌సభ స్థానంలో ఆప్, కేజ్రీవాల్‌కు ఓటున్న చోట చాందినీచౌక్ స్థానంలో కాంగ్రెస్ బరిలో ఉండటమే ఇందుకు కారణం. ఢిల్లీలో రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తుండటం తెలిసిందే.బెంగాల్లో బీజేపీ అభ్యరి్థపై దాడి! బెంగాల్‌లోని ఝార్గ్రాంలో తృణమూల్ కార్యకర్తలు తన కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డారని బీజేపీ అభ్యర్థి ప్రణత్ తుడు ఆరోపించారు. తనతో పాటు భద్రతా సిబ్బందికి గాయాలైనట్టు తెలిపారు. బీజేపీ ఖుర్దా అసెంబ్లీ అభ్యర్థి, చిలికా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్దేవ్ తన అనుచరులతో పాటు ఓ పోలింగ్ బూత్‌లోకి చొరబడి ఈవీఎంను పగలగొట్టారు. పోలింగ్ అధికారిని తీవ్రంగా గాయపరిచారు. ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. -
నేడే ఆరో దశ పోలింగ్
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఆరో విడతకు రంగం సిద్ధమైంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 58 లోక్‌సభ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. హరియాణాలో మొత్తం 10, ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలతో పాటు పశి్చమబెంగాల్‌లోని గిరిజన ప్రాబల్య జంగల్‌మహల్ ప్రాంతంలోని పలు లోక్‌సభ స్థానాలు వీటిలో ఉన్నాయి. ఒడిశాలో 6 లోక్‌సభ స్థానాలతో పాటు వాటి పరిధిలోని 42 అసెంబ్లీ సీట్లలో కూడా పోలింగ్ జరగనుంది. దీంతో 486 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ పూర్తవనుంది. మిగతా 57 స్థానాలకు జూన్ 1న చివరి విడతతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. మండే ఎండల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఈసీ ఆదేశించింది. బరిలో కీలక నేతలు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రావు ఇందర్జీత్ సింగ్, కృష్ణపాల్ గుర్జర్‌తో పాటు మేనకా గాం«దీ, సంబిత పాత్ర, మనోహర్‌లాల్ ఖట్టర్ (బీజేపీ), రాజ్‌బబ్బర్, కన్హయ్య కుమార్, దీపీందర్‌సింగ్ హుడా (కాంగ్రెస్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితర ప్రముఖులు ఆరో విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. హరియాణాలోని కర్నాల్ అసెంబ్లీ స్థానం నుంచి సీఎం నాయబ్‌సింగ్ సైటీ పోటీ చేస్తున్నారు. కురుక్షేత్ర సిట్టింగ్ ఎంపీ అయిన ఆయన ఇటీవలే సీఎంగా పగ్గాలు చేపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్నెల్ల లోపు అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి ఉంది. మరోవైపు హరియాణా, ఢిల్లీల్లో 2019లో క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీకి ఈసారి మాత్రం కాంగ్రెస్–ఆప్ నుంచి గట్టి సవాలు ఎదురవుతోంది. -
Lok Sabha Election 2024: బీజేడీకి సవాల్!
ఒడిశాలో ఇప్పటిదాకా 9 లోక్‌సభ సీట్లకు, వాటి పరిధిలోని 63 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఆరో విడతలో 6 లోక్‌సభ సీట్లకు శనివారం పోలింగ్ జరగనుంది. అధికార బిజూ జనతాదళ్, బీజేపీ హోరాహోరీగా తలపడుతుండగా కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో కీలక నియోజకవర్గాలపై ఫోకస్... సంభాల్పూర్... తొలిసారి కాషాయ జెండా 2019లో ఇక్కడ తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. బీజేపీ నేత నరేశ్ గంగదేవ్ కేవలం 9,162 ఓట్ల తేడాతో బీజేడీ అభ్యర్థి నళినీకాంత ప్రధాన్‌ను ఓడించారు. ఈసారి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. కాంగ్రెస్ నుంచి నాగేంద్ర ప్రధాన్, బీజేడీ నుంచి ప్రణబ్ ప్రకాశ్ దాస్ పోటీలో ఉన్నారు. త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది.కటక్... బీజేడీ కంచుకోటస్వాతంత్య్ర యోధుడు సుభాష్ చంద్ర బోస్ జన్మస్థలమిది, హొయలొలికించే మహానదీ తీరాన 900 ఏళ్లు కళింగ రాజధానిగా వెలిగింది. బీజేడీ దిగ్గజం భర్తృహరి మహతాబ్ 1998 నుంచి వరుసగా ఆరుసార్లు గెలిచారు. ఇటీవలే బీజేపీలో చేరి ఆ పార్టీ టికెట్‌పై బరిలోకి దిగారు. బీజేడీ నుంచి సంతృప్త్ మిశ్రా, కాంగ్రెస్ నుంచి సురేశ్ మహాపాత్ర రేసులో ఉన్నారు. కంచుకోటను కాపాడుకునేందుకు సీఎం నవీన్ పట్నాయక్ గట్టిగా ప్రయతి్నస్తున్నారు. కాంగ్రెస్‌కూ మంచి ఓటు బ్యాంకు ఉండటంతో త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది.పూరి.. నువ్వా నేనా! సుందరమైన బీచ్‌లు, జగన్నాథుడి సన్నిధితో కళకళలాడే పూరిలో బీజేడీకి 2019లో బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర చుక్కలు చూపించారు. చివరిదాకా గట్టి పోటీ ఇచ్చి కేవలం 11,714 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి మళ్లీ సవాలు విసురుతున్నారు. ఇక బీజేడీ సిట్టింగ్ ఎంపీ పినాకీ మిశ్రాకు బదులు ముంబై మాజీ పోలీస్ కమిషనర్ అరూప్ పట్నాయక్‌ను బరిలోకి దించింది. కాంగ్రెస్ నుంచి జయనారాయణ్ పటా్నయక్ పోటీలో ఉన్నారు. ఆ పారీ్టకి ఇక్కడ బలమైన ఓటు బ్యాంకుంది.భువనేశ్వర్... నవీన్‌కు సవాల్ ఈ టెంపుల్ సిటీలో గత ఎన్నికల్లో తొలిసారి బీజేపీ గెలిచింది. బీజేడీ అభ్యరి్థ, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ అరూప్ పటా్నయక్ను బీజేపీ తరఫున మాజీ ఐఏఎస్ అపరాజితా సారంగి ఓడించారు. ఈసారీ ఆమే బరిలో ఉన్నారు. బీజేడీ నుంచి మన్మథ రౌత్రే, కాంగ్రెస్ నుంచి యాసిర్ నవాజ్ పోటీలో ఉన్నారు. దాంతో త్రిముఖ పోటీ రసవత్తరంగా మారింది. ఇండియా కూటమి భాగస్వామి సీపీఎం కూడా పోటీలో ఉండటం కొసమెరుపు!కియోంజర్.. పోటాపోటీ ఈ ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం 2009 నుంచీ బీజేడీ గుప్పెట్లోనే ఉంది. 2019లో బీజేడీ నుంచి గెలిచిన చంద్రానీ ముర్ము యంగెస్ట్ ఎంపీగా రికార్డు సృష్టించారు. ఈసారి ధనుర్జయ సిద్దుకు బీజేడీ టికెటిచ్చింది. బీజేపీ నుంచి అనంత నాయక్, కాంగ్రెస్ నుంచి బినోద్ బిహారీ నాయక్ రేసులో ఉన్నారు. కియోంజర్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 బీజేడీ చేతిలోనే ఉండటం ఆ పారీ్టకి కలిసొచ్చే అంశం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: ఆరో విడతకు ముగిసిన ప్రచారం
న్యూఢిల్లీ: సార్వత్రిక సమరంలో ఆరో విడత పోలింగ్ జరగనున్న స్థానాల్లో ప్రచారం గురువారంతో ముగిసింది. 6 రాష్ట్రాలు, రెండు యూటీల్లోని 58 స్థానాలకు పోలింగ్ శనివారం జరగనుంది. ఢిల్లీ పరిధిలోని మొత్తం ఏడు నియోజకవర్గాల్లో, హరియాణాలోని మొత్తం 10 స్థానాల్లో ఒకేదఫాలో శనివారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. వీటితోపాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల మూడో విడతలో 42 ఎమ్మెల్యే స్థానాలకూ రేపే పోలింగ్ జరగనుంది. బరిలో ముఖ్య నేతలు బీజేపీ నేతలు మనోహర్ లాల్ ఖట్టర్(హరియాణాలోని కర్నాల్), ధర్మేంద్ర ప్రధాన్(ఒడిశాలోని సంబల్పూర్), అభిజిత్ గంగోపాధ్యాయ్(పశి్చమబెంగాల్‌లోని తామ్లుక్), నవీన్ జిందాల్ (కురుక్షేత్ర), రావు ఇందర్జిత్ సింగ్( గురుగ్రామ్), మేనకా గాంధీ( ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్)తోపాటు పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ( జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్–రాజౌరీ) బరిలో ఉన్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీ నేత మనోజ్ తివారీ, కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పోటీ పడుతున్నారు. -
Lok Sabha Election 2024: సిట్టింగ్ సీట్లలో గట్టి పోటీ
ఆరో విడతలో భాగంగా జార్ఖండ్‌లో 4 లోక్‌సభ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. ఇవన్నీ ఎన్డీఏ సిట్టింగ్ స్థానాలే కావడం విశేషం. మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ బీజేపీ ప్రతీకార రాజకీయాలకు నిదర్శనమంటూ జేఎంఎం ప్రచారంలో హోరెత్తిస్తోంది. బీజేపీకి మద్దతుగా నిలుస్తున్న ఆదివాసీలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయతి్నస్తోంది. ఆరో విడత స్థానాలపై ఫోకస్... ధన్‌బాద్ బొగ్గు గనుల స్థావరం. ఇక్కడి ఓటర్లలో 62 శాతం పట్టణవాసులే. ఎస్సీలు 16 శాతం, ఎస్టీలు 8 శాతముంటారు. యూపీ, బిహార్, పశి్చమబెంగాల్ నుంచి వలస వచ్చినవారు ఎక్కువ. 2009 నుంచి బీజేపీ కంచుకోటగా ఉంది. హ్యాట్రిక్ కొట్టిన సిట్టింగ్ ఎంపీ పశుపతినాథ్ పోటీకి దూరంగా ఉండటంతో ఎమ్మెల్యే దుల్లు మహతోకు బీజేపీ టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి అనుపమా సింగ్ పోటీ పడుతున్నారు. వీరిపై రెండు పారీ్టల్లోనూ అసంతృప్తే ఉంది. బీఎస్పీ, సమతా, ఆజాద్ సమాజ్, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా వంటి పారీ్టలు, స్వతంత్రులు... ఇలా మరో డజను మంది బరిలో ఉన్నారు.జంషెడ్పూర్ దీన్ని టాటా నగర్, స్టీల్ సిటీ అని కూడా పిలుస్తారు. టాటా స్టీల్ అతిపెద్ద ప్లాంట్ ఇక్కడ ఉంది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ బిద్యుత్ బరణ్ మహతో హాట్రిక్‌పై కన్నేశారు. 2019లో ప్రస్తుత సీఎం చంపయ్ సోరెన్‌పై 3 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారాయన. మాజీ ఎమ్మెల్యే కునాల్ సారంగికి టికెటివ్వకపోవడం ఒడిశావాసుల ఓట్లపై ప్రభావం చూపేలా ఉంది. కాకపోతే కురి్మ–మహతో ఓటర్లు 3 లక్షలకు పైగా ఉండటం మహతోకి కలిసొచ్చే అంశం. 27 శాతమున్న ఆదివాసీలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జేఎంఎం నుంచి సమీర్‌కుమార్ మొహంతీ బరిలో ఉన్నారు.రాంచీ సిట్టింగ్ ఎంపీ సంజయ్ సేత్‌ను కాదని 2014లో గెలిచిన రామ్ తహాల్ చౌదరికి బీజేపీ ఈసారి టికెటిచ్చింది. కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి సు¿ోద్కాంత్ సహాయ్ కుమార్తె, ప్రముఖ న్యాయవాది. యశస్వి పోటీ చేస్తున్నారు. తండ్రి ప్రాతినిధ్యం వహించిన స్థానం కావడం ఆమెకు కలిసొచ్చే అంశం. అయితే ఎంపీగా సంజయ్ పనితీరుపై ఏకంగా 73 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్టు గతేడాది ఓ సర్వేలో తెలిసింది. రాష్ట్రంలో బీజేపీకి ఆయన బలమైన గళంగా నిలుస్తున్నారు.గిరిధ్ బీజేపీకి బలమైన స్థానమిది. పొత్తులో భాగంగా ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ)కు విడిచిపెట్టింది. ఏజేఎస్‌యూ సిట్టింగ్ ఎంపీ చంద్రప్రకాశ్ చౌదరి మరోసారి పోటీ చేస్తున్నారు. జేఎంఎం నుంచి మధుర ప్రసాద్ మహతో బరిలో ఉన్నారు. వీరిద్దరికీ స్వతంత్ర అభ్యర్థి జైరాం కుమార్ మహతో గట్టి సవాల్ విసురుతున్నారు. ముగ్గురు నేతలూ కుర్మి సామాజికవర్గీయులే. టైగర్ జైరాంగా పిలిచే జైరాం ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజల మంచి స్పందన కూడా వస్తోంది. దీంతో పోటీ ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: బిహార్‌లో ఆరో విడత... బీజేపీకి అగ్నిపరీక్ష!
బిహార్‌లో ఇప్పటిదాకా ఐదు విడతల్లో 24 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. శనివారం ఆరో దశలో 8 చోట్ల పోలింగ్ జరగనుంది. వీటిలో ఏకంగా ఏడు ఎన్డీఏ సిట్టింగ్ స్థానాలే కావడం విశేషం. దాంతో వాటిని నిలబెట్టుకోవడం బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్–ఆర్జేడీ–లెఫ్ట్ పారీ్టలతో కూడిన ఇండియా కూటమి ఈసారి గట్టి పోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో కీలక స్థానాలపై ఫోకస్... వాలీ్మకి నగర్... పోటాపోటీ గత ఎన్నికల్లో జేడీ(యూ) నేత బైద్యనాథ్ ప్రసాద్ మహతో 3.5 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఆయ న మరణానంతరం ఉప ఎన్నికలో తనయుడు సునీల్ కుమా ర్ కుష్వాహ గెలుపొందారు. ఈసారీ ఆయనే బరిలో ఉన్నా రు. ఇండియా కూటమి తరఫున ఆర్జేడీ అభ్యర్థి దీపక్ యాదవ్ తలపడుతున్నారు. బీఎస్పీ దుర్గేశ్ సింగ్ చౌహాన్‌ను రంగంలోకి దించడంతో పోటీ హీటెక్కింది. నేపాల్ సరిహద్దులో ఉన్న ఈ నియోజకవర్గంలో 22 శాతం ముస్లింలు, 15 శాతం ఎస్సీ ఓటర్లుంటారు. పశి్చమ్ చంపారన్... కమలం అడ్డా నియోజకవర్గాల పునరి్వభజన తర్వాత 2008లో ఉనికిలోకి వచ్చినప్పటి నుంచీ ఇక్కడ కాషాయ జెండానే ఎగురుతోంది. బీజేపీ తరఫున సంజయ్ జైశ్వాల్ గత ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టారు. ఈసారి ఆయనే బరిలో ఉన్నారు. ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ తివారీ, బీఎస్పీ నుంచి ఉపేంద్ర రామ్ పోటీ చేస్తున్నారు. పలువురు ముస్లిం అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా బరిలో ఉండటం విశేషం. సుమారు 4 లక్షలున్న ముస్లిం ఓటర్లు ఇక్కడ కీలకం. బనియా, బ్రాహ్మణ ఓటర్లు రెండేసి లక్షల చొప్పున, యాదవులు, కురి్మ, కుశ్వాహ సామాజిక వర్గ ఓటర్లు 1.5 లక్షల చొప్పున ఉన్నారు.నితీశ్ ప్రభుత్వంపై వ్యతిరేకత, ఇండియా కూటమి గట్టి పోటీ నేపథ్యంలో బీజేపీ ఎదురీదుతోంది.గోపాల్‌గంజ్... లాలు సొంత జిల్లా తొలుత కాంగ్రెస్ గుప్పిట్లో ఉన్న ఈ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో క్రమంగా ప్రాంతీయ పార్టీలు పాగా వేశాయి. బిహార్ మాజీ ముఖ్య మంత్రి అబ్దుల్ గఫNర్ జనతాదళ్ తరఫున, సమతా పార్టీ తరఫున రెండు సార్లు ఇక్కడ గెలిచారు. ఆర్జేడీ, బీజేపీ ఒక్కోసారి మాత్రమే విజయం సాధించాయి. గత ఎన్నికల్లో జేడీయూ తరఫున అలోక్ కుమార్ సుమన్ 2.86 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఆర్జేడీ నేత సురేంద్ర రామ్‌పై విక్టరీ కొట్టారు. కాగా, ఈసారి కాంగ్రెస్, ఆర్జేడీ, లెఫ్ట్, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) ఇండియా కూటమి తరఫున వీఐపీ అభ్యర్థి ప్రేమ్‌నాథ్ చంచల్ పాశ్వాన్ బరిలోకి దిగారు. ఎన్డీఏ నుంచి జేడీయూ సిట్టింగ్ ఎంపీ అలోక్ కుమార్ పోటీలో ఉన్నారు. కాగా, ముస్లిం ఓటర్లు కూడా ఎక్కువగానే ఉన్న నేపథ్యంలో ఇక్కడ మజ్లిస్ పార్టీ (ఎంఐఎం) దియానాథ్ మాంఝీని రేసులో నిలపడంతో పోటీ రసవత్తరంగా మారింది. బీఎస్పీ కూడా సుజీత్ రామ్‌ను రంగంలోకి దించింది. ఇది లాలు, తేజస్వి సొంత జిల్లా కావడంతో ఆర్జేడీ ఈ సీటుపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. 94 శాతం గ్రామీణ జనాభా గల ఈ సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవడానికి నితీశ్ కుమార్ కూడా తీవ్రంగానే కష్టపడుతున్నారు. ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో జేడీయూ, బీజేపీ, ఆర్జేడీ ఖాతాలో తలో రెండు సీట్లు ఉన్నాయి.పూర్వీ చంపారన్... రాధామోహన్ జోరు బీజేపీ సిట్టింగ్ ఎంపీ రాధామోహన్ సింగ్ గత ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టారు. ఈసారీ ఆయనే బరిలో ఉన్నారు. 1989లో ఇక్కడ తొలిసారి కాషాయ జెండా పాతింది కూడా ఆయనే! ఇండియా కూటమి నుంచి వంచిత్ సమాజ్ ఇన్సాఫ్ పార్టీ అభ్యర్థి రాజేశ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 బీజేపీ ఖాతాలో ఉండగా, జేడీయూ, ఆర్జేడీ చెరొకటి దక్కించుకున్నాయి. వైశాలి... ప్రాంతీయ పారీ్టల హవా 1977లో ఏర్పాటైన ఈ ఎంపీ సీటును కాంగ్రెస్ నుంచి ప్రాంతీయ పార్టీలు చేజిక్కించుకున్నాయి. 1996 నుంచి ఆర్జేడీ కంచుకోటగా మారింది. ఆ పార్టీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ వరుసగా ఐదుసార్లు గెలిచారు. ఆర్జేడీ జైత్రయాత్రకు 2014లో ఎల్జేపీ బ్రేకులేసింది. రఘువంశ్పై ఎల్జేపీ అభ్యర్థి రామ్‌కిశోర్ సింగ్ గెలిచారు. 2019లో కూడా ఎల్జేపీ అభ్యర్థి వీణా దేవి చేతిలో రఘువంశ్ ఓటమి చవిచూశారు! ఈసారి కూడా ఎల్జేపీ (రాం విలాస్) నుంచి వీణా దేవే బరిలో ఉన్నారు. ఇండియా కూటమి నుంచి ఆర్జేడీ మున్నా శుక్లాను పోటీకి దించింది. ఆయన హత్య కేసులో బెయిల్‌పై ఉన్నారు. బీఎస్పీ నుంచి శంభు కుమార్ సింగ్ రేసులో ఉన్నారు. ఇక్కడ యాదవులు, కుష్వాహ, నిషాద్ సామాజిక వర్గాల ఓటర్లు కీలకం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: ఆరో విడత స్థానాల్లో... కాంగ్రెస్ ఖాతా తెరిచేనా?
ఏడు విడతలుగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటిదాకా ఐదు దశల్లో 428 స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. మిగతా 115 లోక్‌సభ స్థానాలకు మే 25న ఆరు, జూన్ 1న ఏడో విడతలో పోలింగ్ జరగనుంది. దాంతో 42 రోజుల సుదీర్ఘ పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఆరో విడతలో మొత్తం 58 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. హరియాణాలోని మొత్తం 10 సీట్లు, రాజధాని ఢిల్లీలోని 7 స్థానాలూ వీటిలో ఉన్నాయి. ఈ 58 స్థానాల్లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 చోట్ల బరిలో దిగినా కనీసం ఒక్క సీటు కూడా నెగ్గలేకపోయింది. అధికార బీజేపీ మాత్రం 53 చోట్ల పోటీ చేసి ఏకంగా 40 స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం! అంతేగాక వాటిలో ఏకంగా 90 శాతం స్థానాల్లో 40 శాతం పై చిలుకు ఓట్లు సాధించింది! ఈ నేపథ్యంలో ఆ 40 స్థానాలనూ నిలబెట్టుకోవడం బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. కానీ ఆప్‌తో జతకట్టిన కాంగ్రెస్ నుంచి అధికార పార్టీ ఈసారి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఏడో విడతలో పోలింగ్ జరగనున్న పంజాబ్‌లో ఆప్, కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తున్నా హరియాణా, ఢిల్లీల్లో మాత్రం ఇండియా కూటమి భాగస్వాములుగా బరిలో దిగాయి. హరియాణాలో 9, ఢిల్లీలో 3 చోట్ల కాంగ్రెస్, మిగతా స్థానాల్లో ఆప్ బీజేపీకి పెను సవాలు విసురుతున్నాయి. దీనికి తోడు హరియాణాలో రైతుల అసంతృప్తి బీజేపీకి మరింత ప్రతికూలంగా మారేలా కని్పస్తోంది. 2019లో బీజేపీదే హవా! ఆరో విడతలో పోలింగ్ జరుగుతున్న 58 లోక్‌సభ స్థానాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీయే పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఆరు స్థానాల్లోనైతే ఏకంగా 35 శాతం పై చిలుకు మెజారిటీ సాధించడం విశేషం. అవి కర్నాల్ (6.6 లక్షల మెజారిటీ), ఫరీదాబాద్ (6.4 లక్షలు), వెస్ట్ ఢిల్లీ (5.8 లక్షలు), నార్త్ వెస్ట్ ఢిల్లీ (5.5 లక్షలు), ధన్‌బాద్ (4.9 లక్షలు), భివానీ (4.4 లక్షలు). ఏ స్థానంలో అయినా మూడు వరుస ఎన్నికల్లో కనీసం రెండుసార్లు నెగ్గిన పార్టీని అక్కడ గట్టి పోటీదారుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటారు. ఆ లెక్కన ఆరో విడత స్థానాల్లో బీజేపీ కనీసం 30 స్థానాల్లో గట్టి పోటీదారుగా ఉంది. కాంగ్రెస్‌కు మాత్రం అలాంటి స్థానం కేవలం హరియాణాలోని రోహ్తక్ మాత్రమే. అక్కడ కూడా 2009, 2014ల్లో నెగ్గినా 2019లో మాత్రం వెంట్రుకవాసిలో బీజేపీకి కోల్పోవడం విశేషం! బీజేపీ కంచుకోటలు 5 ఆరో విడతలో పోలింగ్ జరగనున్న 58 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌కు కంచుకోటగా చెప్పదగ్గ సీటు ఒక్కటీ లేకపోవడం విశేషం. బీజేపీకి ఐదున్నాయి. బీజేపీ జార్ఖండ్‌లో ధన్‌బాద్, జెంషెడ్పూర్; బిహార్‌లో పూర్వీ చంపారన్, పశి్చమ చంపారన్, శివోహర్ స్థానాలను చాలా ఏళ్లుగా గెలుచుకుంటూ వస్తోంది. ఒడిశాలోని కటక్, ధెంకెనాల్, కియోంఝర్, పూరి స్థానాల్లో బీజేడీకి ఎదురు లేదు. అలాగే పశి్చమ బెంగాల్లో కాంథీ, తామ్లుక్ లోక్‌సభ స్థానాలు తృణమూల్ కంచుకోటలు. ఆరో విడత స్థానాల్లో 2019లో 5 చోట్ల పోరు హోరాహోరీగా సాగింది. అయితే వాట న్నింట్లోనూ బీజేపీయే విజేతగా నిలవడం విశేషం! మఛ్లీషహర్ (యూపీ) నియోజకవర్గంలోనైతే బీజేపీ అభ్యర్థి భోలానాథ్ కేవలం 198 ఓట్ల (0.02 శాతం) మెజారిటీతో గట్టెక్కారు! శ్రావస్తి (యూపీ), రోహ్తక్ (హరియాణా), సంభాల్పూర్ (ఒడిశా), ఝార్గ్రాం (పశ్చిమ బెంగాల్) స్థానాలను కూడా బీజేపీ ఒక్క శాతం కంటే తక్కువ మెజారిటీతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. అయితే ఆరో విడత పోలింగ్ జరుగుతున్న 58 స్థానాలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశముంది! వీటిలో మూడింట ఒక స్థానంలో ప్రజలు ప్రతి ఎన్నికలోనూ కొత్తవారిని గెలిపిస్తూ వస్తుండటం ఆసక్తికరం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Association for Democratic Reforms: ఆస్తుల్లో టాప్ జిందాల్
లోక్‌సభ ఎన్నికల ఆరో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థులందర్లో బీజేపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త నవీన్ జిందాల్ అత్యధిక ఆస్తులతో తొలి స్థానంలో ఉన్నారు. జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ చైర్మన్ అయిన నవీన్ హరియాణాలోని కురుక్షేత్ర నుంచి బీజేపీ అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు. తనకు రూ.1,241 కోట్ల ఆస్తులున్నట్టు అఫిడవిట్లో వెల్లడించారు. మొత్తం 866 మంది అభ్యర్థుల్లో 39 శాతం మంది కోటీశ్వరులే. వీరికి సగటున రూ.6.21 కోట్ల ఆస్తి ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ ప్రకటించింది. ఆశ్చర్యకరంగా కురుక్షేత్రలో జిందాల్‌పై ఆప్ కూడా సంపన్న నేతనే పోటీకి దించింది. ఆ పార్టీ అభ్యర్థి సుశీల్‌కుమార్ గుప్తా రూ.169 కోట్ల ఆస్తులతో టాప్–3లో ఉన్నారు. ఒడిశాలో కటక్ బీజేడీ అభ్యర్థి సంతృప్త్ మిశ్రా రూ.482 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. తనవద్ద కేవలం రెండు రూపాయలే ఉన్నట్టు రోహ్తక్ లోక్‌సభ స్థానంలో స్వతంత్రుడిగా పోటీ చేస్తున్న రణ«దీర్ సింగ్ పేర్కొన్నారు! 180 మందిపై క్రిమినల్ కేసులు ఆరో విడతలో 180 మంది (21 శాతం) అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ఏడీఆర్ వెల్లడించింది. వీరిలో 141 మందిపై సీరియస్ కేసులున్నాయి. 12 మంది తమను దోషులుగా కోర్టు ప్రకటించినట్టు పేర్కొనగా, పలువురు హత్య కేసుల్లోనూ అభియోగాలు ఎదుర్కొంటున్నట్టు వెల్లడించారు. 21 మందిపై హత్యాయత్నం కేసులున్నాయి. 24 మంది మహిళలకు సంబంధించిన కేసుల్లో నిందితులు. ముగ్గురిపై అత్యాచారం కేసులున్నాయి. ఆప్ తరఫున పోటీలో ఉన్న ఐదుగురు, ఆర్జేడీ అభ్యర్థులు నలుగురూ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఎస్పీ అభ్యర్థుల్లో 75 శాతం, బీజేపీ అభ్యర్థుల్లో 55 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఆర్జేడీకి చెందిన నలుగురూ, ఆప్‌నకు చెందిన నలుగురు (80 శాతం), ఎస్పీ నుంచి 12 మంది (75 శాతం) బీజేడీ నుంచి 18 మంది (35 శాతం)పై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యూపీలో ఆరో విడత పోలింగ్
-
యోగి కోటలో హోరాహోరీ
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకుంటున్నాయి. దేశమంతటా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఆరు, ఏడు దశల ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందన్న అంశంపై సర్వత్రా చర్చ సాగుతుంది. ఇప్పటికే 292 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ సజావుగా సాగింది. గురువారం మరో 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 7వ తేదీన ఏడో దశతో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. దేశ రాజకీయాలకు దిక్సూచి గా భావించే ఉత్తర ప్రదేశ్‌లో పార్టీల జయాపజయాలను అంచనా వేసేందుకు జాతీయ, ప్రాంతీయ చానళ్లు సహా దాదాపు 87 మీడియా, రీసెర్చ్ సంస్థలు ఎగ్జిట్ పోల్, ప్రీ పోల్ సర్వేలు నిర్వహిస్తున్నాయి. ‘ఒకవైపు మాకు ఎన్నికల హడావుడి. ఇంకో వైపు సర్వే సంస్థల దరఖాస్తుల పరిశీలన. నా సర్వీసులో ఇంత పెద్ద సంఖ్యలో సర్వేలు చేయడం ముందెన్నడూ చూడలేదు’ అని సుల్తాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ రవీశ్ గుప్తా అన్నారు. బెట్టింగు సంస్థలు సైతం సర్వే సంస్థల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాయి. దేశంలోని దాదాపు అన్ని మెట్రో నగరాల్లో యూపీ ఎన్నికలపై వందల కోట్లలో బెట్టింగులు నడుస్తున్నాయంటున్నారు. నేడు యోగి కోటలో పోలింగ్ నేడు ఎన్నికలు జరగనున్న 57 నియోజకవర్గాలు అంబేడ్కర్ నగర్ (5), బలరాంపూర్ (4), సిద్ధార్థ్ నగర్ (5), బస్తీ (5), సంత్ కబీర్ నగర్ (3), మహరాజ్‌గంజ్ (5), గోరఖ్‌పూర్ (9), ఖుషీనగర్ (7), దియోరియా (7), బలియా (7) జిల్లాల పరిధిలో ఉన్నాయి. వీటిలో అంబేడ్కర్ నగర్, బలియా మినహా మిగతా జిల్లాలు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు బలమైన కోటలని రాజకీయ పరిశీలకులు చెపుతున్నారు. ‘గతంలో గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓటమి చవిచూసిన తరువాత యోగి వైఖరిలో చాలా మార్పు కన్పించింది. గోరఖ్‌పూర్, దాని సమీప జిల్లాల్లో అభివృద్ధిపై ఆయన పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. ప్రధాని మోదీ సహకారం కూడా తోడవడంతో ఇప్పుడు ఈ ప్రాంతం యోగి బాబాకు మద్దతు పలుకుతోంది. అయితే 2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ప్రాంతంలో ఎస్పీ కూడా గణనీయంగా ఓట్లు పెంచుకుంటుందని మా అంచనాలో వెల్లడైంది’ అని బెనారస్ హిందూ యూనివర్సిటీ మాజీ పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ కె.కె.శర్మ చెప్పారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఓటర్ల మనోభావాలు తెలుసుకోవడం తనకు హాబీ అని సుల్తాన్‌పూర్‌లో సాక్షి ప్రతినిధులకు తారసపడిన సందర్భంగా శర్మ తన అనుభవాలను నెమరేసుకున్నారు. ఆరో దశ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో నిన్నటిదాకా సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్, యోగి విస్తృతంగా పర్యటించారు. ‘మా సభలకు విస్తృతంగా జనాలు వస్తున్నారు. అనూహ్య స్పందన కూడా ఉంది. కచ్చితంగా మా పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుంది. రాష్ట్ర నలు దిక్కులా మా తడాఖా ఏమిటో చూపించబోతున్నాం’ అని ఎస్పీ సీనియర్ నేత డాక్టర్ చంద్రపాల్ సింగ్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. అఖిలేశ్ సభలకే కాదు, మోదీ, యోగి సభలకు కూడా భారీగా జనం వస్తున్నారు. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎస్పీ అనూహ్య విజయాలు నమోదు చేసుకోబోతున్నదన్నదే రాజకీయ పండితులంతా చెపుతున్న మాట. ‘ఏమాత్రం అనుమానం లేదు. ఎస్పీ బాగా పుంజుకుంది. కానీ, ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనుకోవడం పొరపాటు. మరోసారి ప్రజలు యోగికే పట్టం కట్టబోతున్నారు’ అని సుల్తాన్పూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఆర్ ఈ వర్మ చెప్పారు. కుల ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక అభ్యర్థుల ఎంపికలో పార్టీలు అసెంబ్లీ స్థానాలవారీగా ఓటర్ల సామాజిక గణనను పరిగణనలోకి తీసుకున్నాయి. నిర్దిష్ట కులం/మతానికి చెందిన అభ్యర్థి తన సొంత నియోజకవర్గంలోనే కాకుండా, పొరుగు నియోజకవర్గాలు, ప్రాంతాల్లో కూడా కుల, సామాజిక వర్గ ఓట్లు రాబట్టగలడని భావించి ఆ ప్రాతిపదికన అభ్యర్ధులను నిలబెట్టాయి. కుల ప్రాతిపదికన సరైన అభ్యర్థులను నామినేట్ చేయడానికి యూపీలో పార్టీలు ప్రతి నియోజకవర్గంలో కుల గణన ఆధారంగా ఓటర్ల పర్యవేక్షణకు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకున్నాయి. ప్రత్యేకించి బీజేపీ ఈ విషయంలో ముందుంది. ఎస్పీ కూడా ఆయా ప్రాంతాల్లో ఎక్కువ జనాభా ఉన్న కులాల ఆధారంగా టికెట్లు కేటాయించింది. ‘యూపీలో కులాల ప్రభావం ఎక్కువ. అభ్యర్థుల ఎంపిక, బూత్ స్థాయి ఏజంట్ల నియామకం ఆ ప్రాతిపదికనే జరిగింది. ఎన్నికల సంఘం ఓటర్ల కుల, మత నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ ఓటర్ల జాబితాను ప్రచురించదు గనుక పార్టీలు దీని కోసం ప్రత్యేక కసరత్తు చేశాయి’ అని ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకుంటున్న ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. సుల్తాన్ పూర్ (యూపీ) నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధులు కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి: -
ఉత్తర ప్రదేశ్‌లో ముగిసిన ఆరో దశ పోలింగ్
-
బెంగాల్ 6వ విడతలో 79% పోలింగ్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి గురువారం 6వ విడత పోలింగ్ పూర్తయింది. 43 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ పోలింగ్‌లో సాయంత్రం 5 గంటలకు 79.09% పోలింగ్ నమోదైందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈవో) ఆరిజ్ అఫ్తాబ్ తెలిపారు. కొన్ని హింసాత్మక ఘటనలు మినహా మొత్తమ్మీద పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు మొరాయించిన ఘటనలు ఐదు దశలతో పోలిస్తే స్వల్పంగానే నమోదయ్యాయని చెప్పారు. ఆరో దశలో శాంతి భద్రతల కోసం ఈసీ 1,071 కంపెనీల కేంద్ర బలగాలను వినియోగించింది. ఈ నెల 26, 29వ తేదీల్లో మరో రెండు విడతల్లో రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 1071 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. పోలింగ్ కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ విడతలో నాలుగు జిల్లాల్లోని మొత్తం 43 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో 306 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చదవండి: ఈ విపత్తు మోదీ వైఫల్యమే: మమత -
మద్దతు ధరకు ఢోకా లేదు
సాక్షి, న్యూఢిల్లీ: మద్దతు ధర ప్రధాన అంశంగా వ్యవసాయ బిల్లుల రద్దు డిమాండ్ చేస్తున్న రైతు సంఘాల ఆందోళనను పరిష్కరించేందుకు కేంద్రం స్పష్టమైన ప్రతిపాదనలతో ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైతులతో చర్చలు జరుపుతున్న కేంద్ర ప్రభుత్వం ఈనెల 9న జరగనున్న ఆరో విడత చర్చల్లో మరింత స్పష్టతతో రైతులకు భరోసా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రైతుల ప్రతినిధి బృందం, కేంద్ర మంత్రుల మధ్య విజ్ఞాన్ భవన్లో శనివారం జరిగిన ఐదో విడత చర్చలు అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం మళ్లీ డిసెంబర్ 9న సమావేశం కానుంది. 12 రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు.. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)ను క్రమంగా తొలగించేందుకు ఈ చట్టాలు ఊతమిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా మొదటి నుంచి ఈ అంశంపై ఆందోళన అవసరం లేదని చెబుతూ వస్తోంది. ఈ చట్టాలు చేసిన అనంతరం కూడా పలు పంటలకు మద్దతు ధర ప్రకటించినట్టు వివరిస్తోంది. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నడూ లేనంతగా మద్దతు ధరలు పెంచుతూ, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా ముందుకు వెళుతున్నామని వాదిస్తోంది. గతంలోనూ చట్టరూపం లేదు.. ‘వ్యవసాయ వ్యయాలు మరియు ధరల కమిషన్’ (సీఏసీపీ) సిఫారసుల ఆధారంగా మొత్తం 22 వ్యవసాయ పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధరలను(ఎమ్మెస్పీ) నిర్ణయిస్తుంది. పంటలకు ఎమ్మెస్పీని సిఫారసు చేస్తున్నప్పుడు సీఏసీపీ వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఉత్పత్తి వ్యయంపై ఎమ్మెస్పీ ఒకటిన్నర రెట్లు అధికంగా ఉండాలని 2018–19 బడ్జెట్లోనే ప్రకటించామని, దీని ప్రకారమే అన్ని ఖరీఫ్, రబీ, ఇతర వాణిజ్య పంటల కనీస మద్దతు ధరలను పెంచినట్టు కేంద్రం వాదిస్తోంది. 2018–19, 2019–20 సంవత్సరాల్లో దేశపు సగటు ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం మార్జిన్ తిరిగి వచ్చేలా ఈ చర్యను చేపట్టినట్టు పేర్కొంది. ఇదే సూత్రానికి అనుగుణంగా 2020–21 మార్కెటింగ్ సీజన్ కోసం అన్ని ఖరీఫ్ పంటలకు, రబీ పంటలకు మద్దతు ధర ప్రకటించామని తెలిపింది. మద్దతు ధరకు చట్టరూపం గతంలోనూ లేదని, ఇప్పుడు కూడా అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీనికి కొనసాగింపుగా ఐదో విడత చర్చల అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరోసారి స్పష్టత ఇచ్చారు. ‘ఎమ్మెస్పీ కొనసాగుతుందని మేం చెప్పాం. ఎమ్మెస్పీపై భయాలు, సందేహాలు పూర్తిగా నిరాధారమైనవి. అయితే రైతుల మనస్సులో ఏమైనా సందేహాలు ఉంటే, వాటిని నివృత్తి చేసేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. ఏపీఎంసీ చట్టం రాష్ట్రాలకు చెందినది. రాష్ట్రానికి చెందిన మండీలను ఏ విధంగానైనా ప్రభావితం చేయాలనేది మా ఉద్దేశం కాదు. ఈ దిశగా ఏపీఎంసీ చట్టాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందులో ఎవరికైనా అనుమానాలు ఉంటే, వాటినీ నివృత్తి చేస్తాం. ఈ 9వ తేదీన జరగనున్న చర్చల్లో అన్ని అంశాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నాం’ అని తోమర్ తెలిపారు. రైతులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్న 39 అంశాల్లోని 8 అంశాల్లో సవరణలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. వెనక్కి తగ్గని రైతు సంఘాలు.. మద్ధతు ధరపై భరోసా ఇస్తే సరిపోదని, అది చేతల్లో కూడా ఉండాలని, చట్టబద్ధత తప్పని సరిగా కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎమ్మెస్పీకి చట్టరూపం అవసరం లేదని, అది కార్యనిర్వాహక నిర్ణయమని ప్రభుత్వం చెబుతుండగా.. ఉపాధి హామీ, ఆహార భద్రత వంటివి కూడా చట్టరూపం దాల్చకముందు కార్యనిర్వాహక నిర్ణయంగానే ఉండేవని రైతు సంఘాలు గుర్తుచేస్తున్నాయి. 9వ తేదీన జరిగే చర్చల్లో ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి, ఆ తదుపరి నిర్ణయం తీసుకుంటామని రైతు సంఘాలు చెబుతున్నాయి. ముందు ఈ మూడు చట్టాలు రద్దు చేస్తేనే కేంద్రం చెప్పేది ఏదైనా వింటామని స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం సవరణలు తెస్తామని చెబుతున్నప్పటికీ ఈ మూడు చట్టాల మౌలిక స్వరూపం రైతులకు వ్యతిరేకంగా ఉందన్నది తమ ఆందోళన అని వివరిస్తున్నాయి. అందుకే రేపు 8వ తేదీన జరిగే భారత్ బంద్ ఆందోళన కార్యక్రమం కొనసాగుతుందని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. -
ప్రశాంతంగా ముగిసిన ఆరో విడత పోలింగ్
-
ఓటేసిన 111 ఏళ్ల సీనియర్ ఓటర్ బచన్
ఆదివారం... ఢిల్లీలోని తిలక్ విహార్ పోలింగ్ కేంద్రం. ఆరో విడత ఎన్నికల్లో భాగంగా అక్కడ పోలింగ్ జరుగుతోంది. అంతలో ఎన్నికల సంఘం అధికారులతో ఒక కారు వచ్చింది. దానితోపాటే మీడియా కూడా వచ్చింది. ఎన్నికల అధికారులు దగ్గరుండి మరీ తీసుకొచ్చిన ఆ ఓటరు బచ్చన్ సింగ్. 111 ఏళ్ల బచ్చన్ ఢిల్లీ ఓటర్లందరిలోకి వృద్ధుడు. ఈ సీనియర్ మోస్ట్ ఓటరు ఇంత వరకు ఏ ఒక్క ఎన్నికనూ మిస్ కాలేదు. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సహా ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలన్నింటిలో ఓటు హక్కు వినియోగించుకున్నాడు. గత ఎన్నికల వరకు బచ్చన్ సైకిలు మీద వెళ్లి ఓటు వేసి వచ్చేవారు. అయితే, మూడు నెలల కింద పక్షవాతం సోకడంతో ప్రస్తుతం బయటకు రావడం లేదు. దాంతో అధికారులు స్వయంగా వెళ్లి ఆయనను కారులో తీసుకొచ్చారు. అక్కడ నుంచి కుర్చీలో మోసుకెళ్లి ఓటు వేయించారు. -
ఆరు ముగిసింది... ఆఖరు పోరు ముందుంది..
ఆదివారం దేశంలోని 7 రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో ఆరో విడత పోలింగ్ ముగిసింది. దీంతో 17వ లోక్‌సభ ఎన్నికలు చివరిదశకు చేరుకున్నాయి. మే 19న తుది విడత పోలింగ్ జరుగుతుంది. ఢిల్లీలో పోలింగ్ బూత్‌ల దగ్గర ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ల దగ్గర యువతులు బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో ఓటు వేసిన నవవధువు బిహార్ రాష్ట్రం సివాన్‌లో ఓటేసిన నాటి, నేటి తరం మహిళలు న్యూ ఢిల్లీ సంగం విహార్ పోలింగ్ స్టేషన్లో ఐడీకార్డులతో ఓటర్లు పశ్చిమ బెంగాల్ సింగ్‌భూమ్‌లోని పోలింగ్ స్టేషన్ వద్ద భద్రతా విధుల్లో ఉన్న జవాన్ హరియాణా ఫరీదాబాద్‌లో ఓటేసిన ఆనందంలో మహిళలు ఢిల్లీలో ఓ సీనియర్ ఓటర్ను పోలింగ్ బూత్‌కి ఎత్తుకుని వెళ్తున్న యువకుడు బిహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లాలో ఓటింగ్‌లో పాల్గొన్న మహిళలు ప్రయాగరాజ్‌లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న సాధువులు -
ఆరులో 63.48%
న్యూఢిల్లీ: ఆరో విడత సార్వత్రిక ఎన్నికలు ఆదివారం ముగిశాయి. ఏడు రాష్ట్రాల్లోని 59 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 63.48 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్‌లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగిందని వెల్లడించింది. పోలింగ్‌లో పశ్చిమబెంగాల్ మరోసారి అగ్రస్థానంలో నిలవగా, హరియాణా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, బిహార్, యూపీలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయని పేర్కొంది. తాజా పోలింగ్‌తో మొత్తం 543 స్థానాలకు గానూ 484 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయనీ, మిగతా 59 సీట్లకు మే 19న చివరి దశ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు ఢిల్లీలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసీ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. 2014లో ఢిల్లీలో 65 శాతం పోలింగ్ నమోదుకాగా, ఈసారి అది 60 శాతానికి పడిపోయింది. బీజేపీ నేత భారతిపై దాడి.. పశ్చిమబెంగాల్లోని 8 లోక్ సభ సీట్లకు పోలింగ్ సందర్భంగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఘటాల్ నియోజకవర్గంలోని కేశ్పూర్ ప్రాంతంలో పోలింగ్ సరళిని పరిశీలించడానికి వెళ్లిన బీజేపీ అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారిణి భారతీ ఘోష్‌పై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ)కి చెందిన మహిళా కార్యకర్తలు దాడిచేశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన భారతి రిగ్గింగ్ జరుగుతోందన్న సమాచారంతో దొగాచియా పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అక్కడ టీఎంసీ మద్దతుదారులు ఆమె కాన్వాయ్‌పై రాళ్లతో పాటు బాంబులు విసిరారు. ఈ ఘటనలో భారతి భద్రతా సిబ్బంది ఒకరు గాయపడగా, కారు ధ్వంసమైంది. ఈ సందర్భంగా మనస్తాపానికి లోనైన ఆమె కన్నీరు పెట్టుకున్నారు. కాగా, ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని పశ్చిమ మిడ్నాపూర్ మెజిస్ట్రేట్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. యూపీలో బీజేపీ ఎమ్మెల్యే దౌర్జన్యం.. ఉత్తరప్రదేశ్‌లోని బదోహీ నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా ప్రిసైడింగ్ ఆఫీసర్‌పై బీజేపీ నేతలు దాడిచేశారు. ఔరాయ్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉద్దేశపూర్వకంగా ఎన్నికల ప్రక్రియను నెమ్మదించేలా చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే దీననాథ్ భాస్కర్, ఆయన అనుచరులు ప్రిసైడింగ్ అధికారిని చితక్కొట్టారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఈసీ, మొత్తం వ్యవహారంపై నివేదిక సమర్పించాలని ఎన్నికల అధికారులను ఆదేశించింది. మరోవైపు బిహార్‌లోని షియోహర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓ హోంగార్డ్ పోలింగ్‌కు ముందు కాల్పులు జరపడంతో ఎన్నికల అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. బిహార్‌లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సందర్భంగా ఈవీఎంలు మొరాయించగా, అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. మరోవైపు హరియాణాలోని రోహతక్‌లో బీజేపీ నేత మనీశ్ గ్రోవర్ పోలింగ్ కేంద్రాల్లోకి బలవంతంగా ప్రవేశించి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని కాంగ్రెస్ రోహతక్ అభ్యర్థి దీపేందర్ సింగ్ హుడా ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను మనీశ్ ఖండించారు. హరియాణాలో ఎలాంటి హింసాత్మక ఘటనలు నమోదు కాలేదని ఎన్నికల సంఘం తెలిపింది. ఈసీకి ఫిర్యాదు చేస్తాం: బీజేపీ ఓడిపోతున్నామన్న ఆగ్రహంతోనే టీఎంసీ నేతలు భారతీ ఘోష్‌పై దాడిచేశారని కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. నిందితులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు తమ నేత కదలికలపై నిషేధాజ్ఞలు విధించారని మండిపడ్డారు. ఓటేసిన ప్రముఖులు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పలువురు ప్రముఖులు ఢిల్లీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన భార్యతో కలిసి నిర్మాణ్ భవన్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఇక్కడే ఓటు వేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఔరంగజేబురోడ్డులోని పోలింగ్‌బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రాతో కలసి న్యూఢిల్లీ స్థానంలో ఓటేయగా, మాజీ సీఎం షీలా దీక్షిత్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సందర్భంగా కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించగా, ఓట్లు గల్లంతయ్యాయని మరికొన్ని చోట్ల ఓటర్లు ఆందోళనకు దిగారు. ఢిల్లీలో ఆదివారం ఓటేసిన అనంతరం వేలిపై సిరా గుర్తు చూపిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులు యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రియాంక గాంధీ వాద్రా దంపతులు, కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ మాజీ సీఎం షీలా దీక్షిత్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ -
విజయం మాదే: సింథియా
భోపాల్: దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని గుణ లోకసభ అభ్యర్థి జ్యోతిరాదిత్యా సింథియా ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనదని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ సరళిని బట్టి చూస్తే తమ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని సింథియా అభిప్రాయపడ్డారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారనే విశ్వాసం తమకుందన్నారు. దేశంలో జరిగిన అభివృద్ధంతా కాంగ్రెస్ హాయాంలోనే జరిగిందన్నారు. మధ్య ప్రదేశ్‌లోని గుణ లోక్‌సభ స్థానం నుంచి ఆయన ఐదోసారి పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. -
యూపీ వెనుకబడిన వర్గాల మొగ్గు ఎటువైపు?
ఉత్తర్‌ప్రదేశ్‌లోని 27 లోక్‌సభ స్థానాలకు చివరి రెండు దశల్లో జరిగే పోలింగ్ పాలకపక్షమైన బీజేపీకి అత్యంత కీలకమైనది. 2014లో రాష్ట్రంలోని మొత్తం 80 సీట్లలో బీజేపీ, దాని మిత్రపక్షం 73 స్థానాలు కైవసం చేసుకున్నాయి. గతంలో యూపీలో వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్న ఎస్పీ, బీఎస్పీ మరో ప్రాంతీయపక్షమైన ఆరెల్డీతో చేతులు కలిపి మహా కూటమి పేరుతో 2019 ఎన్నికల్లో పోటీచేయడం కొత్త పరిణామం. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెల్లెలు, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ విస్తృతంగా ప్రచారం చేయడం రెండో ప్రధానాంశం. ప్రియాంక ప్రచారం కారణంగా కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో పది శాతం వరకూ ఓట్లు అదనంగా పడుతున్నాయని ఎన్డీటీవీ అధిపతి, ప్రసిద్ధ ఎన్నికల విశ్లేషకుడు ప్రణయ్ రాయ్ జరిపించిన సర్వేలో తేలింది. అయితే, కాంగ్రెస్‌కు పెరిగే ఈ ఓట్లు బీజేపీ వ్యతిరేక ఓట్ల నుంచే వస్తున్నందువల్ల ఎస్పీ–బీఎస్పీ కూటమికి నష్టదాయకం కావచ్చని అంచనా వేస్తున్నారు. దేశంలోని మిగతా ప్రాంతాల సగటు కన్నా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎక్కువ మంది దళితులు, ముస్లింలు ఉన్నారు. అలాగే పట్టణ ఓటర్ల కంటే గ్రామీణ ఓటర్ల శాతం యూపీలో ఎక్కువ. బీజేపీ నుంచి కాంగ్రెస్, కూటమి వైపు మొగ్గుతున్న దళితులు కిందటి లోక్‌సభ ఎన్నికల్లో కాషాయపక్షానికి అధిక సంఖ్యలో ఓట్లేసిన దళితుల్లో కొందరు ఈసారి ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లేసే అవకాశం ఉందని కూడా సర్వేలో తేలింది. 2014లో బీజేపీకి పడిన దళితుల ఓట్లలో 10 శాతం కాంగ్రెస్‌కు, ఐదు శాతం మహా కూటమికి దక్కే అవకాశముంది. యూపీలో ముస్లింలు జనాభాలో 19 శాతం వరకూ ఉన్నారు. వారిలో 75 శాతం ఓటర్లు మహాగఠ్‌బంధన్‌కు, 25 శాతం మంది కాంగ్రెస్‌కు ఓటేసే వీలుందని కూడా ఈ సర్వే సూచిస్తోంది. 18–25 ఏళ్ల యువ ఓటర్ల మద్దతు ఎక్కువగా బీజేపీకే ఉంటుందని తెలుస్తోంది. ఇంకా మహిళలు, వెనుకబడిన వర్గాల్లో కూడా బీజేపీకి ఎక్కువ మద్దతు కనిపిస్తోంది. యూపీలోని బీసీల్లో సగానికి పైగా(55 శాతం) జనం బీజేపీ అభ్యర్థులకు ఓటేయడానినికి ఇష్టపడుతున్నారు. మిగిలిన 35 శాతం మహా కూటమికి, పది శాతం కాంగ్రెస్‌కు ఓటేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. యువతలో సగం బీజేపీకే? ఉత్తర్ ప్రదేశ్ యువ ఓటర్లలో(18–25 ఏళ్ల వయసువారు) దాదాపు సగం మంది బీజేపీకి ఓటేయడానికే మొగ్గు చూపుతున్నారని, ఈ అంశం పార్టీలు సాధించే లోక్‌సభ సీట్ల సంఖ్యను నిర్ణయిస్తుందని కూడా క్షేత్రస్థాయిలో జరిపిన అధ్యయనాలు చెబుతున్నాయి. ఏ ఎన్నికల్లోనైనా ఉత్సాహంగా ఓటు వేస్తున్న మహిళల విషయానికి వస్తే, పురుషులతో సమానంగా మహిళలు బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. కాంగ్రెస్‌కు పడే ఓట్లలో మహిళల ఓట్లు ఎక్కువనీ, మహా కూటమికి దక్కే ఓట్లలో పురుషులవి ఎక్కువనీ ఈ సర్వే సూచిస్తోంది. బీసీలు, దళితుల మద్దతు అత్యధికంగా ఉన్న ఎస్పీ–బీఎస్పీ కూటమి ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో చేతులు కలపడం వల్ల గణనీయ సంఖ్యలో ఉన్న అగ్రవర్ణాలు బీజేపీకి అనుకూలంగా సమీకృతం అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని కూడా ఈ సర్వేలో తేలింది. వారు అత్యధిక సంఖ్యలో కాషాయపక్షం అభ్యర్థులకు ఓటేస్తారని తెలుస్తోంది. మొత్తం మీద రాజకీయ, కుల సమీకరణలు కొంత వరకు బీజేపీకి అనుకూలంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. -
రంగస్థలంలో హేమాహేమీలు
ఆరో దశ ఎన్నికలు అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ విడత ప్రచార పర్వం కొత్త పుంతలు తొక్కింది. ఒకరిపై మరొకరు ఆధిక్యం సాధించడానికి మండుటెండల్లో చెమట్లు కక్కుకుంటూ మరీ ఓటర్లను ఆకర్షించడానికి విస్తృతంగా ప్రచారం చేశారు. కేవలం మరో దశ ఎన్నికలు మాత్రమే ఉండడంతో అత్యధిక సీట్లు గెలుచుకోవడానికి ఎన్డీయే, యూపీఏ కూటములతో పాటు ఇతర ప్రధాన పార్టీలూ అన్ని అస్త్ర శస్త్రాలను బయటకు తీశాయి. ఈసారి ప్రచార పర్వం కొత్త పుంతలు తొక్కింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య మాటల తూటాలు పేలాయి. మోదీ రాజీవ్ గాంధీని నంబర్ వన్ అవినీతిపరుడని ఆరోపించడం, 1984 సిక్కు అల్లర్లను ప్రస్తావించడంతో ప్రచారం హద్దులు మీరింది. నేతలు వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు. బెంగాల్ కోటపై కాషాయ జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో ఉన్న మోదీ, అమిత్ షాలు ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రచారం నిర్వహించారు. ఈసారి బరిలో ఎందరో ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలుగా మారిన క్రీడాకారులు, నటులు, గాయకులు, వారసులు, కోట్లకు పడగలెత్తిన వాళ్లు, నేరచరితులు ఇలా ఎందరో ఉన్నారు. ధనబలం, కండబలం ఉన్నవారిదే ఎన్నికల్లో పై చేయి అని స్పష్టంగా తెలుస్తోంది. -
నేడే ఆరో దశ
న్యూఢిల్లీ: ఆరో విడత సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్‌సభ స్థానాలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. 1.13 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఈ విడతలో 10.17 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని 14 స్థానాలతో పాటు హరియాణా(10), బిహార్(8), మధ్యప్రదేశ్(8), పశ్చిమబెంగాల్(8), ఢిల్లీ(7), జార్ఖండ్(4) సీట్లకు ఆరో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో 979 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీకి ఎదురీత: 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 59 స్థానాల్లో బీజేపీ ఏకంగా 45 సీట్లను సొంతం చేసుకుంది. ఈసారి యూపీలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)–బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) కూటమి బీజేపీ జోరుకు బ్రేకులు వేయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతేడాది జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి గట్టిపట్టున్న గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ సీట్లను ఎస్పీ–బీఎస్పీ కూటమి దక్కించుకోవడం ఇందుకు ఉదాహరణ. 2014లో యూపీలోని ఈ 14 సీట్లలో 13 స్థానాలను బీజేపీ దక్కించుకుందనీ, ఈసారి ఆ పరిస్థితి పునరావృతమయ్యే అవకాశాలు లేవని వ్యాఖ్యానిస్తున్నారు. పశ్చిమబెంగాల్లో ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్‌ల మధ్య పోటీ ఉండనుంది. దేశరాజధానిలో ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు 60,000 భద్రతా సిబ్బందిని మోహరించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య తెలిపారు. బరిలో ఉన్న ప్రముఖులు వీరే నరేంద్రసింగ్ తోమర్ (బీజేపీ – మొరేనా), ప్రజ్ఞాసాధ్వీ ఠాకూర్ (బీజేపీ– భోపాల్) , మేనకాగాంధీ (బీజేపీ – సుల్తాన్పూర్) , గౌతం గంభీర్ (బీజేపీ – తూర్పు ఢిల్లీ), రీటా బహుగుణా జోషి (బీజేపీ – అలహాబాద్), హర్‡్షవర్ధన్ (బీజేపీ–ఢిల్లీలోని చాందినీచౌక్), దిగ్విజయ్ సింగ్ (కాంగ్రెస్– భోపాల్) , జోతిరాదిత్య సింధియా (కాంగ్రెస్ – గుణ) , షీలా దీక్షిత్ (కాంగ్రెస్ –ఈశాన్య ఢిల్లీ), భూపేందర్‌సింగ్ హుడా (కాంగ్రెస్– సోనిపట్), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ– అజాంగఢ్), విజేందర్ సింగ్ (కాంగ్రెస్–దక్షిణ ఢిల్లీ),దుష్యంత్ చౌతాలా (జేజేపీ–హిస్సార్), దీపేందర్ హుడా (కాంగ్రెస్ –రోహ్తక్) -
రేపే ఆరోదశ.. పోటీలో కీలక నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం పలు రాష్ట్రాల్లో 59 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 14, హర్యానాలో 10, పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్‌లో 8, ఢిల్లీలో 7, జార్ఘండ్‌లో 4 స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఆరో విడత ఎన్నికల్లో భాగంగా పలువురు ప్రముఖ నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వీరిలో నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరపున ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ చేతిలో తీవ్ర పరాభావానికి గురైన కాంగ్రెస్ ఈసారి కనీసం గౌరప్రదమైన స్థానాలను గెలుచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ముఖ్యంగా షీలా విజయంపై పార్టీ గంపెడు ఆశాలను పెట్టుకుంది. ఆమెతో బీజేపీ సీనియర్ నేత మనోజ్ తివారి బరిలో ఉన్నారు. దేశ రాజధానికి మూడు సార్లు ఏకంగా సీఎంగా వ్యవహించడం, సీనియర్ నేత కావడంతో విజయావకాశాలు ఎక్కువగా తమకే ఉన్నాయని హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. న్యూఢిల్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున మరో సీనియర్ నేత అజయ్ మాకెన్ బరిలో ఉన్నారు. 2004, 09 ఎన్నికల్లో విజయం సాధించిన మాకెన్ గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మీనాక్షిలేఖిపై పరాజయం పాలైయ్యారు. ఈసారి అదృష్టాన్ని పరీక్షించుంటున్నారు. కాగా ఈస్థానంలో ఎవరు గెలిస్తే ఆపార్టీనే కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే సాంప్రదాయం కూడా ఇక్కడుంది. గత రెండు దశాబ్ధాలుగా అదే జరుగుతూ వస్తోంది. ఈస్ట్ ఢిల్లీ నుంచి మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఆయన ఎన్నికల బరిలో నిలవడం ఇదే తొలిసారి. ఎన్నికల బరిలో నిలవడంతో వివాదాలు గంభీర్‌ను చుట్టుముట్టుతున్నాయి. ఆప్ అభ్యర్థి ఆతిషి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని గంభీర్‌కు నోటీసులు కూడా పంపారు. మధ్యప్రదేశ్‌లోని గుణ స్థానం నుంచి మధ్య ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జ్యోతిరాధిత్య సింధియా పోటీ పడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈయనకు కీలక పదవి దక్కింది. ఇప్పటి వరకు గుణలో నాలుగు సార్లు విజయం సాధించిన సింథియా ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక్కడ ఆయన తరఫున గెలుపు బాధ్యతలను ఆయన భార్య ప్రియదర్శినీ రాజే మోస్తున్నారు. గెలపు తథ్యమనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఆజంగఢ్ లోక్‌సభ స్థానం నుంచి యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆయన తండ్రి ములాయం సింగ్ విజయం సాధించారు. ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సౌత్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరపున ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్ బరిలో నిలిచారు. ఆయన ఎన్నికల బరిలో నిలవడం ఇదే తొలిసారి. రాజకీయాలకు కొత్తయినా ప్రచారం దూసుకుపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ నుంచి బీజేపీ తరపున వరుణ్ గాంధీ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆయన తల్లి కేంద్రమంత్రి మేనకా గాంధీ విజయం సాధించారు. గత ఎన్నికల్లో వరుణ్ సుల్తాన్ పూర్ నుంచి విజయం సాధించారు. ఈసారి వారిద్దరూ స్థానాలు మార్చుకున్నారు. భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి మధ్య ప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పోటీపడుతున్నారు. ఈస్థానంలో బీజేపీ అభ్యర్థిగా సాద్వీ ప్రజ్ఞాసింగ్ పోటీలో ఉన్నారు. -
6 ప్యాక్ ఎలక్షన్
ఎన్నికలు ముగింపు దశకు వచ్చేసరికి నరాలు తెగే ఉత్కంఠ ఊపిరాడనివ్వడం లేదు. కేంద్రంలో గద్దెనెక్కే దెవరు? మోదీ మరోసారి మ్యాజిక్ చేస్తారా? కాంగ్రెస్ కాస్తయినా పుంజుకుంటుందా? ముచ్చటగా మూడో కూటమి కొత్త రాజకీయ సమీకరణలకు బాటలు వేస్తుందా? ఇప్పుడందరి మదిలోనూ ఇవే ప్రశ్నలు. ఆరో దశలో ఏడు రాష్ట్రాల్లో 59 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. అన్ని పార్టీలకూ ఈ విడతే అత్యంత కీలకం. ముఖ్యంగా కమలం పార్టీ కఠిన పరీక్ష ఎదుర్కొంటోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ ఈ 59 నియోజకవర్గాల్లో 44 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. మరోసారి ఆ స్థాయి విజయం బీజేపీకి దక్కుతుందా? ఏకంగా 43 మంది సిట్టింగ్ ఎంపీలనే బరిలోకి దింపడంతో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొని ఎంతవరకు నిలబడగలదు? కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి పోరు ఉన్న నియోజకవర్గాల్లో హస్తం పార్టీ హవా చూపిస్తుందా? ఇప్పటివరకు అయిదు దశల్లో 424 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. ఇంకా 118 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ఆదివారం జరగబోయే ఆరోదశలో పై చేయి సాధించడానికి అన్ని పార్టీలు తమ శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఈ దశలో ఎవరు నెగ్గితే వారే కేంద్రంలో చక్రం తిప్పే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. బిహార్, హరియాణా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు గతంలో మాదిరిగా లేవు. 2014 ఎన్నికల్లో ఢిల్లీ రాష్ట్రాన్ని క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ బిహార్, హరియాణాలో ఎవరి అంచనాలకు అందని విధంగా దూసుకుపోయింది. ఇక యూపీలో విజయభేరి ఢిల్లీ పీఠానికి బాటలు వేసింది. కానీ ఈ అయిదేళ్లలో రాజకీయంగా, వ్యవస్థాగతంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోవడం, ఒకట్రెండు సీట్లకే పరిమితమైన చోట క్షేత్రస్థాయిలో పట్టు బిగించడం, పాత శత్రువులే కొత్త మిత్రులుగా మారడం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గద్దె దింపాలన్న ఏకైక లక్ష్యంతో ఆగర్భ శత్రువులు కూడా ఏకం కావడం వంటి పరిణామాలు రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పుతాయో ఎవరి అంచనాలకు అందడం లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పరిస్థితి. ఈ దశలో అత్యధిక స్థానాలు దక్కించుకోవడానికి మోదీ,షా ద్వయం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. మొత్తం రాష్ట్రాలు: 7 పోలింగ్ జరిగే నియోజకవర్గాలు: 59 బరిలో ఉన్న అభ్యర్థులు: 979 పశ్చిమ బెంగాల్ నియోజకవర్గాలు : 8 తామ్లుక్, కంథీ, ఘటాల్, ఝార్గ్రామ్, మేదినీపూర్, పురూలియా, బంకూరా, బిష్ణుపూర్ గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేసింది. అప్పట్లో సైడ్ ప్లేయర్‌గా ఉన్న బీజేపీ ఈసారి ప్రధాన ప్రత్యర్థిగా మారి హోరాహోరి పోరాటానికి తెరతీసింది. వీటిలో నాలుగు నియోజకవర్గాల్లో ఆదివాసీల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఒకప్పుడు మావోయిస్టుల ప్రాబల్యం అత్యధికంగా ఉండే జార్ఖండ్‌కు సరిహద్దుల్లో ఉండే జంగల్‌మహల్ ప్రాంతంలో ఎన్నికలూ జరుగుతున్నాయి. ఒకప్పుడు సీపీఎంకి కంచుకోటగా ఉండే ఈ ప్రాంతాల్లో ఆ పార్టీ నామమాత్రపు పోటీని కూడా ఇవ్వలేకపోతోంది. బీర్బహ సోరెన్ ఆదివాసీలను ఆకర్షించడానికి మమత దీదీ ఏకంగా 52 పథకాల్ని ప్రవేశపెట్టారు. మరోవైపు ఆరెస్సెస్ ఈ ప్రాంతంలో బలంగా విస్తరించింది. ఆదివాసీలను ఆకర్షించడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ 150 ఏకలవ్య విద్యాలయాలను నిర్వహిస్తూ వారిలో అక్షరాస్యత పెంచుతోంది, ఝార్గ్రామ్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి స్కూలు టీచర్‌గా పనిచేస్తున్న బీర్బహ సోరెన్, బీజేపీ అభ్యర్థి, ఇంజనీర్ అయిన కునార్ హేమంబరం మధ్య గట్టి పోటీ నెలకొంది. మమత ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా అవి అమలు జరగడం లేదన్న అసంతృప్తి ఆదివాసీల్లో ఉంది. అదే ఇప్పుడు బీజేపీ విజయావకాశాలను పెంచుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జార్ఖండ్ నియోజకవర్గాలు: 4 గిరిడీహ్, ధన్‌బాద్, జంషెడ్పూర్, సింగ్భూమ్ ఈ దశలో పోలింగ్ జరిగే నాలుగు స్థానాల్లోనూ గత ఎన్నికల్లో బీజేపీయే గెలుపొందింది. 2014 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ అధికారం దక్కించుకుంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అభివృద్ధి ఆశించినంత స్థాయిలో జరగలేదు. ఇక బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కేవలం ప్రధాని మోదీ ఇమేజ్‌పైనే ఆశలు పెట్టుకొని బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తోంది. మోదీ హవాను అడ్డుకోవడానికి విపక్ష పార్టీలైన కాంగ్రెస్, జేఎంఎం, మాజీ సీఎం బాబూలాల్ మరాండీకి చెందిన జార్ఖండ్ వికాస్ మోర్చా ప్రగతిశీల్ (జేవీఎంపీ), ఆర్జేడీ మహాకూటమిగా ఏర్పడి సవాల్ విసురుతున్నాయి. చమాయ్ సోరెన్, బిద్యుత్ బరణ్ ధన్‌బాద్ నియోజకవర్గంపై 2009 నుంచి కాషాయం జెండా ఎగురుతోంది. సిటింగ్ ఎంపీ పశుపతినాథ్ సింగ్నే బీజేపీ మళ్లీ బరిలో దింపింది. ఆయనపై కాంగ్రెస్ పార్టీ మాజీ క్రికెటర్, బీజేపీ నుంచి ఫిరాయించిన కీర్తీ ఆజాద్‌కు టికెట్ ఇవ్వడంతో పోరు రసవత్తరంగా మారింది. మరోముఖ్యమైన స్థానం జంషెడ్పూర్. ఇది జనరల్ సీటు అయినప్పటికీ మహాకూటమి అభ్యర్థిగా జేఎంఎం నుంచి ఆదివాసీ చమాయ్ సోరెన్‌కు పోటీకి నిలిపారు. అభ్యర్థి ఎంపికతోనే మహాకూటమి సగం విజయం సాధించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక బీజేపీ సిటింగ్ ఎంపీ, కుర్మి సామాజిక వర్గానికి చెందిన బిద్యుత్ బరణ్ మహతోకే టికెట్ ఇచ్చింది. కార్మికుల మద్దతు కలిగిన సోరెన్ మైనార్టీలను కూడా ఆకర్షించే ప్రయత్నాల్లో ఉంటే, మహతో కేవలం మోదీ పాపులారిటీనే నమ్ముకొని విజయంపై ధీమాగా ఉన్నారు. ఢిల్లీ నియోజకవర్గాలు: 7 చాందినీ చౌక్, తూర్పు ఢిల్లీ, న్యూఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ, వాయవ్య ఢిల్లీ (ఎస్సీ), దక్షిణ ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ గత ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసిన రాష్ట్రాల్లో ఢిల్లీ ఒకటి. కానీ ఈ అయిదేళ్లలో వచ్చిన మార్పులు, రోజురోజుకూ మారిపోయే ఢిల్లీ ఓటరు మూడ్ చూస్తుంటే గత ఎన్నికల మాదిరిగా కమలదళం అన్ని స్థానాలు దక్కించుకోలేదేమోనన్న అంచనాలున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్‌కున్న క్రేజ్‌తో ఆ పార్టీ గట్టి పోటీయే ఇస్తోంది. ఆప్ ఓటర్లందరూ ఒకప్పుడు కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన వారే. కాషాయం ఓటు బ్యాంకు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అందుకే బీజేపీ త్రిముఖ పోటీలో తమదే పై చేయి అన్న ధీమాతో ఉంది. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న తూర్పు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, ఆప్ అభ్యర్థి, విద్యావేత్త ఆతిషి మధ్య హోరాహోరి పోరు నెలకొంది. హర్షవర్ధన్, జేపీ అగర్వాల్ పాఠశాలల వ్యవస్థను సంస్కరించడంతో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ఓటర్లు ఆతిషి వైపు మొగ్గు చూపించే అవకాశాలున్నాయి. ఇక ఈశాన్య ఢిల్లీ నుంచి కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి, 81 ఏళ్ల వయసున్న షీలాదీక్షిత్ పోటీ చేస్తూ ఉండడంతో ఈ స్థానంపై ఆసక్తి పెరిగింది. అంత వయసులోనూ ఆమె ప్రచారాన్ని హోరెత్తించారు. కాంగ్రెస్ పార్టీలో కొత్త ఆశలు కల్పించారు. ముస్లిం ఓటర్ల మద్దతుతో షీలా విజయం సాధిస్తారన్న నమ్మకంలో కాంగ్రెస్ ఉంది. ఇక్కడ బీజేపీ నుంచి సిటింగ్ ఎంపీ, భోజ్‌పురీ గాయకుడు, నటుడు మనోజ్ తివారీ బరిలో ఉన్నారు. ఆప్ నుంచి దిలీప్ పాండే పోటీ పడుతున్నారు. చాందినీ చౌక్ నియోజకవర్గంలో శాస్త్ర, సాంకేతిక శాఖా మంత్రి హర్షవర్ధన్‌పై కాంగ్రెస్ పార్టీ నాలుగుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన జేపీ అగర్వాల్‌ను పోటీకి నిలిపింది. ఆప్ నుంచి పంకజ్ గుప్తా బరిలో ఉన్నారు. హర్షవర్ధన్ 1993–98 మధ్య ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా పల్స్ పోలియోను విజయవంతంగా అమలుచేశారు. మధ్యప్రదేశ్ నియోజకవర్గాలు: 8 మొరెనా, భిండ్, గ్వాలియర్, గుణ, సాగర్, విదిష, భోపాల్, రాజ్‌గఢ్ పదిహేనేళ్ళ తర్వాత బీజేపీ కంచుకోటను బద్దలుకొట్టి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ ఓట్ల శాతంలో మాత్రం బీజేపీకన్నా ఒకడుగు వెనకే ఉంది. 2014లో మధ్యప్రదేశ్‌లోని మొత్తం 29 స్థానాలకు గాను 27 స్థానాల్లో విజయకేతనాన్ని ఎగురవేసిన బీజేపీకిగానీ, 2018 ఎన్నికల్లో అవిశ్రాంతంగా పోరాడి తృటిలో బయటపడిన కాంగ్రెస్‌కి గానీ ఈ ఎన్నికల్లో గెలుపు నల్లేరుమీద నడకేం కాదు. దశాబ్దకాలం పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ గెలుపు భోపాల్‌లో ప్రతిష్టాత్మకంగా మారింది. మాలెగాం బాంబు పేలుడు కేసులో జైలుపాలై అనారోగ్యం పేరుతో బెయిలుపై బయటకు వచ్చిన సాధ్విని బీజేపీ బరిలోకి దింపింది. వీరేంద్ర కుమార్, కిరణ్ అహిర్వార్ బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించిన ఖజురహోలో ఈసారి బీజేపీ నుంచి వీ.డీ శర్మ తన విజయావకాశాలను పరీక్షించుకుంటున్నారు. స్థానిక రాజకుటుంబీకురాలు కవితాసింగ్‌ని కాంగ్రెస్ బరిలోకి దింపింది. హోశంగాబాద్ 1989 నుంచి బీజేపీకి మంచి పట్టున్న లోక్‌సభ స్థానం. మాజీ ముఖ్యమంత్రి సుందర్‌లాల్ పట్వా కూడా ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ బీజేపీ అభ్యర్థి ఉదయప్రతాప్ సింగ్. దామోహ్‌లో బీజేపీ నుంచి తిరిగి ప్రçహ్లాద్ సింగ్ పటేల్ పోటీ చేస్తోంటే, కాంగ్రెస్ నుంచి ప్రతాప్ సింగ్, ప్రహ్లాద్ సింగ్‌ని ఢీకొనబోతున్నారు. గతంలో రెండుసార్లు విజయం సాధించిన వీరేంద్ర కుమార్‌నే తిరిగి బీజేపీ టీకంగఢ్‌లో పోటీకి దింపింది. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ బీజేపీ వీరేంద్ర కుమార్ తిరిగి ఈ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ టికెట్‌పై కిరణ్ అహిర్వార్ తలపడుతున్నారు. బిహార్ నియోజకవర్గాలు: 8 వాల్మీకీనగర్, తూర్పు చంపారణ్, పశ్చిమ చంపారణ్, శివహార్, వైశాలి, మహారాజ్‌గంజ్, సివాన్, గోపాల్‌గంజ్ గత ఎన్నికల్లో బీజేపీ ఏడు స్థానాల్లో గెలుపొందితే, దాని మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ ఒక్క స్థానంలో గెలుపొందింది. అయితే ఈ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గత ఎన్నికల్లో మోదీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని విభేదించి ఎన్నికల్లో భంగపడ్డారు. ఇప్పుడు బీజేపీ పూర్తిగా నితీశ్‌కున్న ఇమేజ్ మీదే ఆధారపడి ఎన్నికల బరిలోకి దిగింది. ఆర్జేడీ, కాంగ్రెస్, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ), హిందూస్తాన్ అవామ్ మోర్చా (హెచ్ఏఎం)లతో కూడిన మహాగఠ్‌బంధన్ గట్టి సవాలే విసురుతోంది. ముఖేశ్ సహాని వీఐపీ పార్టీ అధినేత ముఖేశ్ సహాని తాను మల్లా (జాలరి) కుమారుడినంటూ గర్వంగా ప్రకటించుకొని ప్రచారం చేస్తున్నారు. ఈ సారి ఎన్నికలు జరగబోయే నియోజకవర్గాల్లో యాదవులు, ముస్లింలు, మల్లా ఓటర్లు బీజేపీకి అతి పెద్ద సవాల్ విసురుతున్నారు. ధనబలం, కండబలం ఇవే ఈ దశ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించబోతున్నాయి. మొత్తం 127 మంది అభ్యర్థులు బరిలో ఉంటే వారిలో 44 మంది కోట్లకు పడగలెత్తారు. మరో 43 మంది అభ్యర్థులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. వాల్మీకీనగర్ నుంచి పోటీ పడుతున్న దీపక్ యాదవ్ 59.46 కోట్లతో అత్యంత ధనిక అభ్యర్థిగా ఉంటే, సగటు ఆస్తులు చూసుకుంటే బీజేపీ అభ్యర్థులు ముందు వరసలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ నియోజకవర్గాలు: 14 సుల్తాన్పూర్, ప్రతాప్‌గఢ్, ఫూల్పూర్, అలహాబాద్, అంబేడ్కర్‌నగర్, శ్రావస్తి, దొమరియాగంజ్, బస్తీ, సంత్‌కబీర్‌నగర్, లాల్గంజ్, ఆజంగఢ్, జౌన్పూర్, మచిలీషెహర్, భాడోహి ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ప్రాంతంలోని 14 స్థానాలకు ఆరో దశలో పోలింగ్ జరుగుతోంది. ఈ స్థానాలున్న తూర్పు ప్రాంతం బాగా వెనుకబడి ఉంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిన్న కోడలు, కేంద్ర మంత్రి మేనకాగాంధీ (బీజేపీ) సుల్తాన్పూర్ నుంచి, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆజమ్గఢ్ నుంచి పోటీలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఆజమ్గఢ్ తప్ప మిగిలిన 13 సీట్లను బీజేపీ (ప్రతాప్‌గఢ్‌లో అప్నాదళ్ గెలుపుతో కలిపి) కైవసం చేసుకుంది. 2018 ఉప ఎన్నికలో ఫూల్పూర్ స్థానాన్ని ఎస్పీ గెలుచుకుంది. బీఎస్పీ మద్దతుతో ఈ నియోజకవర్గంలో ఎస్పీ విజయం సాధించడంతో మూడు పార్టీల మహా కూటమికి అంకురార్పణ జరిగింది. తొలి ప్రధాని నెహ్రూ మూడుసార్లు, ఆయన చెల్లెలు విజయలక్ష్మీ పండిత్ రెండుసార్లు లోక్‌సభకు ఫూల్పూర్ నుంచి ఎన్నికయ్యారు. కిందటి ఎన్నికల్లో సుల్తాన్పూర్ నుంచి ఇందిర మనవడు, బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ విజయం సాధించగా ఈసారి ఆయన తల్లి మేనక పోటీచేస్తున్నారు. మేనకాగాంధీ, అఖిలేశ్ యాదవ్ ఇక్కడ బీఎస్పీ అభ్యర్థితోపాటు, కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ సంజయ్‌సింగ్ పోటీకి దిగారు. ఎస్పీ అగ్రనేత ములాయంసింగ్ యాదవ్ కిందటిసారి ఆజమ్గఢ్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఈసారి ఆజమ్‌గఢ్‌లో అఖిలేశ్‌పై భోజ్‌పురీ నటుడు, గాయకుడు దినేశ్‌లాల్ యాదవ్ ‘నిర్హౌవా’ను బీజేపీ నిలబెట్టింది. అలహాబాద్ సిట్టింగ్ బీజేపీ ఎంపీ శ్యామాచరణ్ గుప్తా ఎస్పీలో చేరడంతో కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత, యూపీ కేబినెట్ మంత్రి రీటా బహుగుణ జోషీ బీజేపీ తరఫున పోటీకి దిగారు. ఈ స్థానంలో ప్రధాన పార్టీల తరఫున ఫిరాయింపుదారులే పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ ఇక్కడ బీజేపీ మాజీ నేత యోగేశ్ శుక్లాకు దక్కింది. ఎస్పీ తరఫున జేడీయూ మాజీ నేత రాజేంద్రసింగ్ పటేల్ పోటీకి దిగారు. బీసీలు, దళితులు, ముస్లింల మద్దతు అధికంగా ఉన్న ఎస్పీ, బీఎస్పీ కలిసిపోటీచేయడం వల్ల ఈ పార్టీల అభ్యర్థులు బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్నారు. 2014లో ఈ 14 నియోజకవర్గాల్లో ఒక ప్రతాప్‌గఢ్ తప్ప మిగిలిన స్థానాల్లో ఎస్పీ, బీఎస్పీకి పడిన ఓట్లు కలిపితే బీజేపీకి దక్కిన ఓట్లను మించిపోతాయి. ఈ రెండు కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీ పూర్తిగా జరుగుతుందా? అనేది కీలకాంశంగా మారింది. రాష్ట్రంలోని మిగిలిన స్థానాల్లో మాదిరిగానే యాదవేతర బీసీలు, జాటవేతర దళితులు, ఎస్సీ, బీసీ వర్గాల్లో బాగా వెనుకబడిన కులాలు మళ్లీ బీజేపీకే మద్దతిస్తాయనే ఆశతో పాలకపక్షం నేతలు ఉన్నారు. హరియాణా నియోజకవర్గాలు: 10 ఫరీదాబాద్, గుర్గావ్, హిసార్, రోహ్తక్, కర్నాల్, అంబాలా, సోనిపత్, సిర్సా, భివానీ–మహేంద్రగఢ్, కురుక్షేత్ర హరియాణా రాజకీయాలంటేనే ముగ్గురు లాల్స్ గుర్తుకొస్తారు. బన్సీలాల్, దేవీలాల్, భజన్‌లాల్ వారి కుటుంబాలే దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను తమ గుప్పిట్లో పెట్టుకొని నడిపించారు. జనాభాలో 27శాతం ఓటర్లు ఉన్న జాట్లు ఎవరికి మద్దతు ఇస్తే వారికే అధికారం దక్కడం ఆ రాష్ట్ర ఆవిర్భావం నుంచి జరుగుతోంది. గత ఎన్నికల్లో ఆ సంప్రదాయాన్ని తిరగరాసి బీజేపీ పది నియోజకవర్గాలకు గాను ఏడింట్లో విజయకేతనం ఎగురవేసింది. జాట్ వ్యతిరేక పంజాబీ ఓటర్లను కూడగట్టి కొత్త సామాజిక సమీకరణలకు తెర తీసింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ అధికారాన్ని దక్కించుకుంది. ఈ సారి అదే కార్డుని ప్రయోగిస్తూ జాట్ అభ్యర్థులపై పంజాబీ బ్రాహ్మణ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. దుష్యంత్ , భవ్య బిష్ణోయి రెండేళ్ల క్రితం జాట్ ఆందోళనల ప్రభావంతో సమాజంలో జాట్లు, జాటేతరుల అన్న చీలిక వచ్చింది. హరియాణాలో ఈ సారి హిసార్ స్థానంపైనే అందరి దృష్టి ఉంది. ఈ రాష్ట్రాన్ని తమ గుప్పిట్లో ఉంచుకొని శాసిస్తున్న మూడు కుటుంబాలకు చెందిన వారసులు పోటీ చేస్తున్న స్థానమిది. ఐఎన్ఎల్డీ వ్యవస్థాపకుడు దేవీలాల్ ముని మనవడు, జేపీపీ పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా సిట్టింగ్ ఎంపీ. గత ఎన్నికల్లో ఐఎన్ఎల్డీ తరఫున పోటీ చేసి నెగ్గిన దుష్యంత్ ఈ సారి సొంత పార్టీ తరఫున బరిలో ఉన్నారు. ఇక బీజేపీ తరఫున కేంద్ర మంత్రి బ్రిజేంద్ర సింగ్ కుమారుడు బీరేంద్ర సింగ్పోటీ చేస్తుంటే, కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు భవ్య బిష్ణోయి పోటీలో ఉన్నారు. -
ముగిసిన ఆరో విడత ప్రచారం
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఆరోవిడత ఎన్నికల ప్రచారం శుక్రవారంతో ముగిసింది. ఆరోవిడతలో భాగంగా దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఉన్న 59 స్థానాలకు ఈ నెల 12న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని 14 స్థానాలతో పాటు హరియాణా(10), బిహార్(8), మధ్యప్రదేశ్(8), పశ్చిమ బెంగాల్(8), ఢిల్లీ(7), జార్ఖండ్(4) రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేసింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 59 స్థానాల్లో 45 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. అయితే యూపీలో ఎస్పీ–బీఎస్పీ కూటమి బీజేపీ జోరుకు బ్రేకులు వేయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీలోని ఏడు సీట్ల కోసం ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ ఉండొచ్చని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, బాక్సర్ విజేందర్ సింగ్, బీజేపీ నేత, కేంద్ర మంత్రి హర్‡్ష వర్ధన్, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్, ఆప్ నేత అతీషీ ఢిల్లీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాగే యూపీ నుంచి కేంద్ర మంత్రి మేనకాగాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పోటీలో ఉన్నారు. పశ్చిమబెంగాల్లో గత లోక్‌సభ ఎన్నికల్లో గెలుచుకున్న ఈ 8 సీట్లను నిలబెట్టుకోవడానికి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.