ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకుంటున్నాయి. దేశమంతటా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఆరు, ఏడు దశల ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందన్న అంశంపై సర్వత్రా చర్చ సాగుతుంది. ఇప్పటికే 292 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ సజావుగా సాగింది. గురువారం మరో 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 7వ తేదీన ఏడో దశతో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది.
దేశ రాజకీయాలకు దిక్సూచి గా భావించే ఉత్తర ప్రదేశ్‌లో పార్టీల జయాపజయాలను అంచనా వేసేందుకు జాతీయ, ప్రాంతీయ చానళ్లు సహా దాదాపు 87 మీడియా, రీసెర్చ్ సంస్థలు ఎగ్జిట్ పోల్, ప్రీ పోల్ సర్వేలు నిర్వహిస్తున్నాయి. ‘ఒకవైపు మాకు ఎన్నికల హడావుడి. ఇంకో వైపు సర్వే సంస్థల దరఖాస్తుల పరిశీలన. నా సర్వీసులో ఇంత పెద్ద సంఖ్యలో సర్వేలు చేయడం ముందెన్నడూ చూడలేదు’ అని సుల్తాన్‌పూర్ జిల్లా మేజిస్ట్రేట్ రవీశ్ గుప్తా అన్నారు. బెట్టింగు సంస్థలు సైతం సర్వే సంస్థల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాయి. దేశంలోని దాదాపు అన్ని మెట్రో నగరాల్లో యూపీ ఎన్నికలపై వందల కోట్లలో బెట్టింగులు నడుస్తున్నాయంటున్నారు.
నేడు యోగి కోటలో పోలింగ్
నేడు ఎన్నికలు జరగనున్న 57 నియోజకవర్గాలు అంబేడ్కర్ నగర్ (5), బలరాంపూర్ (4), సిద్ధార్థ్ నగర్ (5), బస్తీ (5), సంత్ కబీర్ నగర్ (3), మహరాజ్‌గంజ్ (5), గోరఖ్‌పూర్ (9), ఖుషీనగర్ (7), దియోరియా (7), బలియా (7) జిల్లాల పరిధిలో ఉన్నాయి. వీటిలో అంబేడ్కర్ నగర్, బలియా మినహా మిగతా జిల్లాలు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు బలమైన కోటలని రాజకీయ పరిశీలకులు చెపుతున్నారు. ‘గతంలో గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓటమి చవిచూసిన తరువాత యోగి వైఖరిలో చాలా మార్పు కన్పించింది. గోరఖ్‌పూర్, దాని సమీప జిల్లాల్లో అభివృద్ధిపై ఆయన పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు.
ప్రధాని మోదీ సహకారం కూడా తోడవడంతో ఇప్పుడు ఈ ప్రాంతం యోగి బాబాకు మద్దతు పలుకుతోంది. అయితే 2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ప్రాంతంలో ఎస్పీ కూడా గణనీయంగా ఓట్లు పెంచుకుంటుందని మా అంచనాలో వెల్లడైంది’ అని బెనారస్ హిందూ యూనివర్సిటీ మాజీ పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ కె.కె.శర్మ చెప్పారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఓటర్ల మనోభావాలు తెలుసుకోవడం తనకు హాబీ అని సుల్తాన్‌పూర్‌లో సాక్షి ప్రతినిధులకు తారసపడిన సందర్భంగా శర్మ తన అనుభవాలను నెమరేసుకున్నారు.
ఆరో దశ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో నిన్నటిదాకా సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్, యోగి విస్తృతంగా పర్యటించారు. ‘మా సభలకు విస్తృతంగా జనాలు వస్తున్నారు. అనూహ్య స్పందన కూడా ఉంది. కచ్చితంగా మా పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుంది. రాష్ట్ర నలు దిక్కులా మా తడాఖా ఏమిటో చూపించబోతున్నాం’ అని ఎస్పీ సీనియర్ నేత డాక్టర్ చంద్రపాల్ సింగ్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. అఖిలేశ్ సభలకే కాదు, మోదీ, యోగి సభలకు కూడా భారీగా జనం వస్తున్నారు. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎస్పీ అనూహ్య విజయాలు నమోదు చేసుకోబోతున్నదన్నదే రాజకీయ పండితులంతా చెపుతున్న మాట. ‘ఏమాత్రం అనుమానం లేదు. ఎస్పీ బాగా పుంజుకుంది. కానీ, ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనుకోవడం పొరపాటు. మరోసారి ప్రజలు యోగికే పట్టం కట్టబోతున్నారు’ అని సుల్తాన్‌పూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఆర్ ఈ వర్మ చెప్పారు.
కుల ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక
అభ్యర్థుల ఎంపికలో పార్టీలు అసెంబ్లీ స్థానాలవారీగా ఓటర్ల సామాజిక గణనను పరిగణనలోకి తీసుకున్నాయి. నిర్దిష్ట కులం/మతానికి చెందిన అభ్యర్థి తన సొంత నియోజకవర్గంలోనే కాకుండా, పొరుగు నియోజకవర్గాలు, ప్రాంతాల్లో కూడా కుల, సామాజిక వర్గ ఓట్లు రాబట్టగలడని భావించి ఆ ప్రాతిపదికన అభ్యర్ధులను నిలబెట్టాయి. కుల ప్రాతిపదికన సరైన అభ్యర్థులను నామినేట్ చేయడానికి యూపీలో పార్టీలు ప్రతి నియోజకవర్గంలో కుల గణన ఆధారంగా ఓటర్ల పర్యవేక్షణకు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకున్నాయి. ప్రత్యేకించి బీజేపీ ఈ విషయంలో ముందుంది.
ఎస్పీ కూడా ఆయా ప్రాంతాల్లో ఎక్కువ జనాభా ఉన్న కులాల ఆధారంగా టికెట్లు కేటాయించింది. ‘యూపీలో కులాల ప్రభావం ఎక్కువ. అభ్యర్థుల ఎంపిక, బూత్ స్థాయి ఏజంట్ల నియామకం ఆ ప్రాతిపదికనే జరిగింది. ఎన్నికల సంఘం ఓటర్ల కుల, మత నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ ఓటర్ల జాబితాను ప్రచురించదు గనుక పార్టీలు దీని కోసం ప్రత్యేక కసరత్తు చేశాయి’ అని ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకుంటున్న ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు.
సుల్తాన్ పూర్ (యూపీ) నుంచి
‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధులు
కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి:
Comments
Please login to add a commentAdd a comment