6 రాష్ట్రాలు, 2 యూటీల పరిధిలో ఎన్నికలు
అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ప్రముఖులు
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఆరో విడతకు రంగం సిద్ధమైంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 58 లోక్‌సభ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. హరియాణాలో మొత్తం 10, ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలతో పాటు పశి్చమబెంగాల్‌లోని గిరిజన ప్రాబల్య జంగల్‌మహల్ ప్రాంతంలోని పలు లోక్‌సభ స్థానాలు వీటిలో ఉన్నాయి.
ఒడిశాలో 6 లోక్‌సభ స్థానాలతో పాటు వాటి పరిధిలోని 42 అసెంబ్లీ సీట్లలో కూడా పోలింగ్ జరగనుంది. దీంతో 486 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ పూర్తవనుంది. మిగతా 57 స్థానాలకు జూన్ 1న చివరి విడతతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. మండే ఎండల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఈసీ ఆదేశించింది.
బరిలో కీలక నేతలు
కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రావు ఇందర్‌జీత్ సింగ్, కృష్ణపాల్ గుర్జర్‌తో పాటు మేనకా గాం«దీ, సంబిత పాత్ర, మనోహర్‌లాల్ ఖట్టర్ (బీజేపీ), రాజ్‌బబ్బర్, కన్హయ్య కుమార్, దీపీందర్‌సింగ్ హుడా (కాంగ్రెస్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితర ప్రముఖులు ఆరో విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
హరియాణాలోని కర్నాల్ అసెంబ్లీ స్థానం నుంచి సీఎం నాయబ్‌సింగ్ సైటీ పోటీ చేస్తున్నారు. కురుక్షేత్ర సిట్టింగ్ ఎంపీ అయిన ఆయన ఇటీవలే సీఎంగా పగ్గాలు చేపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్నెల్ల లోపు అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి ఉంది. మరోవైపు హరియాణా, ఢిల్లీల్లో 2019లో క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీకి ఈసారి మాత్రం కాంగ్రెస్–ఆప్ నుంచి గట్టి సవాలు ఎదురవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment