మద్దతు ధరకు ఢోకా లేదు | Central government reassures farmers MSP will continue | Sakshi
Sakshi News home page

మద్దతు ధరకు ఢోకా లేదు

Published Mon, Dec 7 2020 3:52 AM | Last Updated on Mon, Dec 7 2020 4:49 AM

Central government reassures farmers MSP will continue - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మద్దతు ధర ప్రధాన అంశంగా వ్యవసాయ బిల్లుల రద్దు డిమాండ్‌ చేస్తున్న రైతు సంఘాల ఆందోళనను పరిష్కరించేందుకు కేంద్రం స్పష్టమైన ప్రతిపాదనలతో ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైతులతో చర్చలు జరుపుతున్న కేంద్ర ప్రభుత్వం ఈనెల 9న జరగనున్న ఆరో విడత చర్చల్లో మరింత స్పష్టతతో రైతులకు భరోసా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రైతుల ప్రతినిధి బృందం, కేంద్ర మంత్రుల మధ్య విజ్ఞాన్‌ భవన్‌లో శనివారం జరిగిన ఐదో విడత చర్చలు అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం మళ్లీ డిసెంబర్‌ 9న సమావేశం కానుంది.

12 రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు.. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)ను క్రమంగా తొలగించేందుకు ఈ చట్టాలు ఊతమిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా మొదటి నుంచి ఈ అంశంపై ఆందోళన అవసరం లేదని చెబుతూ వస్తోంది. ఈ చట్టాలు చేసిన అనంతరం కూడా పలు పంటలకు మద్దతు ధర ప్రకటించినట్టు వివరిస్తోంది. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నడూ లేనంతగా మద్దతు ధరలు పెంచుతూ, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా ముందుకు వెళుతున్నామని వాదిస్తోంది.  

గతంలోనూ చట్టరూపం లేదు..
‘వ్యవసాయ వ్యయాలు మరియు ధరల కమిషన్‌’ (సీఏసీపీ) సిఫారసుల ఆధారంగా మొత్తం 22 వ్యవసాయ పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధరలను(ఎమ్మెస్పీ) నిర్ణయిస్తుంది. పంటలకు ఎమ్మెస్పీని సిఫారసు చేస్తున్నప్పుడు సీఏసీపీ వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఉత్పత్తి వ్యయంపై ఎమ్మెస్పీ ఒకటిన్నర రెట్లు అధికంగా ఉండాలని 2018–19 బడ్జెట్‌లోనే ప్రకటించామని, దీని ప్రకారమే అన్ని ఖరీఫ్, రబీ, ఇతర వాణిజ్య పంటల కనీస మద్దతు ధరలను పెంచినట్టు కేంద్రం వాదిస్తోంది. 2018–19, 2019–20 సంవత్సరాల్లో దేశపు సగటు ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం మార్జిన్‌ తిరిగి వచ్చేలా ఈ చర్యను చేపట్టినట్టు పేర్కొంది. ఇదే సూత్రానికి అనుగుణంగా 2020–21 మార్కెటింగ్‌ సీజన్‌ కోసం అన్ని ఖరీఫ్‌ పంటలకు, రబీ పంటలకు మద్దతు ధర ప్రకటించామని తెలిపింది. మద్దతు ధరకు చట్టరూపం గతంలోనూ లేదని, ఇప్పుడు కూడా అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

దీనికి కొనసాగింపుగా ఐదో విడత చర్చల అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ మరోసారి స్పష్టత ఇచ్చారు. ‘ఎమ్మెస్పీ కొనసాగుతుందని మేం చెప్పాం. ఎమ్మెస్పీపై భయాలు, సందేహాలు పూర్తిగా నిరాధారమైనవి. అయితే  రైతుల మనస్సులో ఏమైనా సందేహాలు ఉంటే, వాటిని నివృత్తి చేసేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. ఏపీఎంసీ చట్టం రాష్ట్రాలకు చెందినది. రాష్ట్రానికి చెందిన మండీలను ఏ విధంగానైనా ప్రభావితం చేయాలనేది మా ఉద్దేశం కాదు. ఈ దిశగా ఏపీఎంసీ చట్టాన్ని మరింత బలోపేతం చేసేందుకు  ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందులో ఎవరికైనా అనుమానాలు ఉంటే, వాటినీ నివృత్తి చేస్తాం. ఈ 9వ తేదీన జరగనున్న చర్చల్లో అన్ని అంశాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నాం’ అని తోమర్‌ తెలిపారు. రైతులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్న 39 అంశాల్లోని 8 అంశాల్లో సవరణలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.  

వెనక్కి తగ్గని రైతు సంఘాలు..
మద్ధతు ధరపై భరోసా ఇస్తే సరిపోదని, అది చేతల్లో కూడా ఉండాలని, చట్టబద్ధత తప్పని సరిగా కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఎమ్మెస్పీకి చట్టరూపం అవసరం లేదని, అది కార్యనిర్వాహక నిర్ణయమని ప్రభుత్వం చెబుతుండగా.. ఉపాధి హామీ, ఆహార భద్రత వంటివి కూడా చట్టరూపం దాల్చకముందు కార్యనిర్వాహక నిర్ణయంగానే ఉండేవని రైతు సంఘాలు గుర్తుచేస్తున్నాయి. 9వ తేదీన జరిగే చర్చల్లో ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి, ఆ తదుపరి నిర్ణయం తీసుకుంటామని రైతు సంఘాలు చెబుతున్నాయి. ముందు ఈ మూడు చట్టాలు రద్దు చేస్తేనే కేంద్రం చెప్పేది ఏదైనా వింటామని స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం సవరణలు తెస్తామని చెబుతున్నప్పటికీ ఈ మూడు చట్టాల మౌలిక స్వరూపం రైతులకు వ్యతిరేకంగా ఉందన్నది తమ ఆందోళన అని వివరిస్తున్నాయి. అందుకే రేపు 8వ తేదీన జరిగే భారత్‌ బంద్‌ ఆందోళన కార్యక్రమం కొనసాగుతుందని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement