న్యూఢిల్లీ: వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రైతు ప్రతినిధులతో కేంద్రం జరుపుతున్న చర్చల ప్రక్రియ అత్యంత నిరుత్సాహపూరితంగా సాగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధిస్తామని స్పష్టం చేసింది. సమస్య పరిష్కారం కోసం మరింత సమయం కావాలన్న కేంద్రం అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని తేల్చిచెప్పింది. సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం లభించే వరకు ఆ చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపేయాలన్న తమ సూచనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని, ఆ చట్టాల అమలుపై అంత పట్టుదల ఎందుకని కేంద్రాన్ని ఘాటుగా ప్రశ్నించింది.
చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపేయాలన్న తమ సూచనపై కేంద్రం ఇప్పటివరకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఆ చట్టాల అమలును నిలిపేయండి. లేదంటే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ సిఫారసుల మేరకు మేమే స్టే విధించాల్సి వస్తుంది’అని హెచ్చరించింది. చట్టాలపై స్టే విధించాలనుకోవడం లేదని, వాటి అమలును మాత్రమే తాత్కాలికంగా నిలిపేసి, సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నది తమ ఉద్దేశమని పేర్కొంది. చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తే.. కోర్టు ఏర్పాటు చేయనున్న కమిటీకి పరిష్కారం కనుగొనడం సులభమవుతుందని వివరించింది. కొత్త వ్యవసాయ చట్టాలు, రైతు ఆందోళనలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై నేడు(మంగళవారం) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు ఇవ్వనుంది. సమస్య పరిష్కారం కోసం సూచనలు చేసేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసే విషయంపై కూడా నిర్ణయం తీసుకోనుంది.
అమలుపై స్టే ఇవ్వలేరు
విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ప్రాథమికహక్కులకు భంగం కలిగిస్తోందనో, లేక రాజ్యాంగ పరిధిలో లేదనో కోర్టు భావిస్తేనే.. చట్టాల అమలుపై స్టే విధించడం సాధ్యమవుతుందని ఆయన వాదించారు. పిటిషనర్లు తమ వాదనల్లో ఈ అంశాలను లేవనెత్తలేదని గుర్తు చేశారు. దానికి స్పందించిన ధర్మాసనం.. ‘మీరు పరిష్కారం కనుగొనడంలో విఫలమైనందువల్లనే మేం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. మీరు చేసిన చట్టాలు రైతుల ఆందోళనలకు కారణమయ్యాయి. ఆ సమస్యను మీరే పరిష్కరించాలి’అని వ్యాఖ్యానించింది. అసాధారణ పరిస్థితుల్లో తప్పిస్తే.. చట్టాలపై స్టే విధించడానికి తాము వ్యతిరేకమేనని పేర్కొంది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం అమలును సుప్రీంకోర్టు నిలిపివేసిన విషయాన్ని జస్టిస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రమణియన్ కూడా సభ్యులుగా ఉన్న ధర్మాసనం గుర్తు చేసింది. చట్టాల అమలుపై స్టే విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుల జాబితాను తమకు అందించాలని అటార్నీ జనరల్ వేణుగోపాల్‌ను కోరింది. వ్యవసా య చట్టాలను పలు రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. ఈ చట్టాలు ప్రయోజనకరమని పేర్కొనే ఒక్క పిటిషన్ కూడా తమ ముందుకు రాలేదని వ్యాఖ్యానించింది.
ఆందోళనలు కొనసాగించవచ్చు
‘చట్టాల అమలును నిలిపివేసిన తరువాత కూడా ఆందోళనలను కొనసాగించుకోవచ్చు. ఆందోళనల గొంతు నులిమేశామన్న విమర్శలను మేం కోరుకోవడం లేదు’అని రైతు సంఘాల తరఫున హాజరైన న్యాయవాదులతో ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసే కమిటీకి నేతృత్వం వహించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా సహా రెండు, మూడు పేర్లను సూచించాలని ఇరువర్గాలను ధర్మాసనం కోరింది. సమస్య పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అందులో ప్రభుత్వ, రైతు సంఘాల ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారని పేర్కొంది. ప్రభుత్వం, రైతు ప్రతినిధుల మధ్య జనవరి 15న మరో విడత చర్చలు జరగనున్నాయని, ఆ లోపు ఎలాంటి ఆదేశాలు ఇవ్వవద్దని అటార్నీ జనరల్ వేణుగోపాల్ కోర్టును కోరారు. దీనిపై స్పందిస్తూ.. చర్చల విషయంలో ప్రభుత్వ తీరు సరిగ్గా ఉందని తాము భావించడం లేదని వ్యాఖ్యానించింది. చట్టాల అమలుపై స్టే విధిస్తే.. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగే అవకాశముందని పేర్కొంది.
‘స్టే’తో లాభం లేదు
వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలును కేంద్రం కానీ, సుప్రీంకోర్టు కానీ తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ.. ఆ చట్టాల రద్దు కోసం తమ ఉద్యమం కొనసాగుతుందని రైతు నేతలు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని, అయితే, చట్టాల అమలుపై స్టే విధించడం పరిష్కారం కాబోదన్నది తమ అభిప్రాయమని భారతీయ కిసాన్ యూనియన్ హరియాణా శాఖ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చాదునీ పేర్కొన్నారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయడమొక్కటే ఏకైక పరిష్కారమని స్పష్టం చేశారు. రాజ్యాంగవిరుద్ధమైన ఆ చట్టాలను సుప్రీంకోర్టు రద్దు చేయాలని ఇండియన్ ఫార్మర్స్ యూనియన్ అధ్యక్షుడు భోగ్ సింగ్ మాన్సా కోరారు.
కొనసాగితే హింసాత్మకం..
రైతుల ఆందోళన ఎక్కువకాలం కొనసాగితే అది హింసాత్మకంగా మారే ప్రమాదముందని సుప్రీంకోర్టు ఆందోళన వెలిబుచ్చింది. ‘మనందరిపై బాధ్యత ఉంది. ఏ చిన్న సంఘటన అయినా హింసకు దారి తీయవచ్చు. అలాంటిది ఏదైనా జరిగితే మనమంతా బాధ్యులమవుతాం. ఎవరి మరణానికి కూడా మనం బాధ్యులం కాకూడదు’ అని వ్యాఖ్యానించింది. చట్టాలను ఉల్లంఘించేవారిని తాము కాపాడబోమని పేర్కొంది. పూర్తిస్థాయిలో సంప్రదింపులు జరపకుండానే ప్రభుత్వం ఈ చట్టాలను రూపొందించిందని అసంతృప్తి వ్యక్తం చేసింది.
రాజ్యాంగ విరుద్ధమని స్పష్టమైతేనే..
సాగు చట్టాలు అన్యాయమైనవని, ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తాయని, రాజ్యాంగ విరుద్ధమైనవని నిర్ధారణ అయితే చట్టాలపై కోర్టు స్టే విధించగలుగుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ విరుద్ధమని గట్టి ఆధారాలుంటే తప్ప పార్లమెంటు చేసిన చట్టాలపై స్టే విధించడం సాధ్యం కాదని న్యాయ నిపుణుడు రాకేశ్ ద్వివేదీ స్పష్టం చేశారు. ‘ప్రభుత్వ వాదన వినకుండానే ఒక నిర్ధారణకు వచ్చారు. పార్లమెంటు చేసిన చట్టాలపై స్టే విధించడానికి పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చేయడం ప్రాతిపదిక కాకూడదు. ఎంపీల విజ్ఞతకు సంబంధించిన విషయమిది. కోర్టు పరిధిలో లేని అంశమిది’ అని ద్వివేదీ పేర్కొన్నారు. ప్రజలు ఉద్యమిస్తున్నారు కాబట్టి చట్టాలను నిలిపేయాలనడం సరికాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment