నరేంద్ర సింగ్ తోమర్
న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలపై రైతులు మొండిపట్టు వీడి, ప్రభుత్వంతో అంశాల వారీగా చర్చలకు రావాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కోరారు. కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించినందున, రైతులు పంతానికి పోవడంలో అర్థం లేదన్నారు. 19వ తేదీన రైతు సంఘాలతో పదో విడత చర్చలు జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మధ్యప్రదేశ్‌లోని మోరెనాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సమస్యను పరిష్కరించేం దుకు ప్రభుత్వం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తోంది. ఎటువంటి దాపరికాలు లేకుండా మనస్ఫూర్తిగా చర్చలకు ఆహ్వానిస్తోంది. ప్రభుత్వం కొన్ని రాయితీలను ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది.
రైతులు మాత్రం చట్టాల రద్దుపైనే పట్టుదలకు పోతున్నారు’అని చెప్పారు. ‘దేశం మొత్తానికి వర్తించే విధంగా ప్రభుత్వం చట్టాలు తీసుకువచ్చింది. వీటికి రైతులు, నిపుణులు, సంబంధిత వర్గాల మద్దతు ఉంది’అని తెలిపారు. ‘మండీలు, వ్యాపారుల రిజిస్ట్రేషన్ తదితర సమస్యలను పరిష్కరించేందుకు అంగీకరిస్తూ రైతు సంఘాలకు ప్రతిపాదనలు పంపాం. పంట వ్యర్థాల దహనం, విద్యుత్ వంటి వాటిపైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపాం. రైతు సంఘాలు మాత్రం సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతున్నాయి.
అంశాల వారీగా చర్చల్లో సంఘాల అభ్యంతరాలు సరైనవే అని తేలితే, ప్రభుత్వం పరిశీలించడానికి సిద్ధంగా ఉంది’అని చెప్పారు. కాగా, కొత్త సాగు చట్టాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 19వ తేదీన మొట్టమొదటి సమావేశం జరపనుంది. పూసా క్యాంపస్‌లో ఈ సమావేశం ఉంటుందని కమిటీ సభ్యుడు అనిల్ ఘన్వత్ తెలిపారు. భవిష్యత్ కార్యాచరణను ఈ భేటీలో నిర్ణయిస్తామన్నారు. కమిటీలోని నలుగురు సభ్యుల్లో ఒకరు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సాగు చట్టాలపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు జరపనున్న విచారణ సందర్భంగా కమిటీ సభ్యుడు వైదొలగిన విషయం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి. దీంతోపాటు, 26న ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీకి అనుమతివ్వరాదంటూ ఢిల్లీ పోలీసుల ద్వారా కేంద్రం వేసిన పిటిషన్ కూడా విచారణకు రానుంది.
ట్రాక్టర్ పరేడ్ కొనసాగుతుంది
26న గణతంత్ర దినోత్సవం రోజున ముందుగా ప్రకటించిన విధంగానే ట్రాక్టర్ పరేడ్ కొనసాగుతుందని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. సింఘు వద్ద ఆదివారం రైతు సంఘం నేత యోగేంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడారు. ‘మా ర్యాలీ ప్రశాంతంగా సాగుతుంది. రిపబ్లిక్ డే పరేడ్‌కు ఎటువంటి ఆటంకం కలిగించం. రైతులు తమ ట్రాక్టర్లపై జాతీయ జెండాలను ప్రదర్శిస్తారు’అని వివరిం చారు. రైతుల ఆందోళనల్లో పాల్గొంటున్న /మద్దతు పలికిన నిషేధిత సిక్కు సంస్థకు చెందిన రైతు నేతకు ఎన్‌ఐఏ నోటీసులు జారీ చేయడాన్ని మరో నేత దర్శన్ పాల్ సింగ్ తీవ్రంగా ఖండించారు.
2024 మే వరకు పోరుకు సిద్ధం
నాగపూర్: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 2024 మే వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ అన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతు ఆందోళనలను సైద్ధాంతిక విప్లవంగా ఆయన అభివర్ణించారు. పంటలకు కనీస మద్దతు ధరను చట్టపరమైన హామీగా రైతులు భావిస్తున్నారన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుని ప్రభుత్వం ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పించాలన్నారు. అప్పటి వరకు వెనక్కి తగ్గబోమని గ్రామీణ ప్రాంతాల నుంచి వేర్వేరు సంఘాల నుంచి వచ్చిన రైతులు కోరుకుంటున్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలు 2024 ఏప్రిల్/మే నెలలో జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment