న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో ఢిల్లీ, హరియాణా సరిహద్దుల్లో రైతులు నిరసన ప్రదర్శనలకు వేదికైన టిక్రిలో పోలీసులు బారికేడ్లు తొలగించి వాహనాల రాకపోకల్ని పునరుద్ధరించారు. శుక్రవారం నుంచి బారికేడ్లను తొలగించడం ప్రారంభించిన పోలీసులు ఢిల్లీ–రోహ్తక్ హైవే మీద ఉన్న టిక్రిలో పనులు శనివారానికి పూర్తయ్యాయి. రైతు సంఘాల నాయకులు, పోలీసుల మధ్య చర్చలు జరిగిన తర్వాత అక్కడ మార్గాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చారు.
‘‘రైతు సంఘాల నాయకులతో చర్చించాం. హరియాణాకు వెళ్లే మార్గాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చాం. ఆ మార్గంలో రాకపోకలు మొదలయ్యాయి’’ అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు పర్వీందర్ చెప్పారు. రైతు సంఘం నాయకులు కొన్ని సమయాల్లో మాత్రమే రాకపోకలను అనుమతిస్తామని అంటున్నారని, తాము మాత్రం 24 గంటలు ట్రాఫిక్ తిరిగేలా రహదారిని పునరుద్ధరించామని చెప్పారు.
ఆ రోడ్డుపై చిన్న వాహనాలు రాకపోకలు సాగించవచ్చునని సింగ్ వివరించారు. టిక్రి రహదారిపై రాకపోకల్ని పునరుద్ధరించడంతో ఢిల్లీ నుంచి హరియాణా మీదుగా రాజస్థాన్‌కు వెళ్లేవారికి ప్రయాణం సులభతరంగా మారుతుంది. మరోవైపు ఢిల్లీ–మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే మీదనున్న ఘజియాపూర్‌లో బారికేడ్లు, వైరింగ్‌లను తొలగించినప్పటికీ సిమెంట్ బారికేడ్లు, తాత్కాలిక శిబిరాలను తొలగించాల్సి ఉంది.
అది పూర్తయితే ఆ మార్గంలో కూడా రాకపోకలకు అనుమతిస్తామని పర్వీందర్ తెలిపారు. రైతులకు నిరసనలు చేసే హక్కు ఉన్నప్పటికీ, నిరవధికంగా రహదారుల్ని మూసివేయకూడదంటూ సుప్రీంకోర్టు అక్టోబర్ 21న రూలింగ్ ఇచ్చిన నేపథ్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించే ప్రాంతాల్లో బారికేడ్లను ఎత్తివేస్తున్నారు. తమ పోరాటాన్ని ఇకపై ఎలా కొనసాగించాలో వ్యూహరచన చేస్తున్నట్టు రైతు సంఘం నాయకుడు రాకేష్ తికాయత్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment