tikrit
-
టిక్రిలో రాకపోకల పునరుద్ధరణ
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో ఢిల్లీ, హరియాణా సరిహద్దుల్లో రైతులు నిరసన ప్రదర్శనలకు వేదికైన టిక్రిలో పోలీసులు బారికేడ్లు తొలగించి వాహనాల రాకపోకల్ని పునరుద్ధరించారు. శుక్రవారం నుంచి బారికేడ్లను తొలగించడం ప్రారంభించిన పోలీసులు ఢిల్లీ–రోహ్తక్ హైవే మీద ఉన్న టిక్రిలో పనులు శనివారానికి పూర్తయ్యాయి. రైతు సంఘాల నాయకులు, పోలీసుల మధ్య చర్చలు జరిగిన తర్వాత అక్కడ మార్గాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ‘‘రైతు సంఘాల నాయకులతో చర్చించాం. హరియాణాకు వెళ్లే మార్గాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చాం. ఆ మార్గంలో రాకపోకలు మొదలయ్యాయి’’ అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు పర్వీందర్ చెప్పారు. రైతు సంఘం నాయకులు కొన్ని సమయాల్లో మాత్రమే రాకపోకలను అనుమతిస్తామని అంటున్నారని, తాము మాత్రం 24 గంటలు ట్రాఫిక్ తిరిగేలా రహదారిని పునరుద్ధరించామని చెప్పారు. ఆ రోడ్డుపై చిన్న వాహనాలు రాకపోకలు సాగించవచ్చునని సింగ్ వివరించారు. టిక్రి రహదారిపై రాకపోకల్ని పునరుద్ధరించడంతో ఢిల్లీ నుంచి హరియాణా మీదుగా రాజస్థాన్‌కు వెళ్లేవారికి ప్రయాణం సులభతరంగా మారుతుంది. మరోవైపు ఢిల్లీ–మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే మీదనున్న ఘజియాపూర్లో బారికేడ్లు, వైరింగ్లను తొలగించినప్పటికీ సిమెంట్ బారికేడ్లు, తాత్కాలిక శిబిరాలను తొలగించాల్సి ఉంది. అది పూర్తయితే ఆ మార్గంలో కూడా రాకపోకలకు అనుమతిస్తామని పర్వీందర్ తెలిపారు. రైతులకు నిరసనలు చేసే హక్కు ఉన్నప్పటికీ, నిరవధికంగా రహదారుల్ని మూసివేయకూడదంటూ సుప్రీంకోర్టు అక్టోబర్ 21న రూలింగ్ ఇచ్చిన నేపథ్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించే ప్రాంతాల్లో బారికేడ్లను ఎత్తివేస్తున్నారు. తమ పోరాటాన్ని ఇకపై ఎలా కొనసాగించాలో వ్యూహరచన చేస్తున్నట్టు రైతు సంఘం నాయకుడు రాకేష్ తికాయత్ చెప్పారు. -
11 నెలలకు.. తొలగిన అడ్డంకులు
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్న ప్రాంతాల్లో బారికేడ్ల తొలగింపు ప్రారంభమైంది. రైతు ఆందోళనల కారణంగా టిక్రి, ఘాజీపూర్‌లలో రోడ్లపై ఏర్పాటు చేసిన అడ్డంకులను దాదాపు 11 నెలల తర్వాత గురువారం నుంచి పోలీసులు తొలగిస్తున్నారు. ఈ పరిణామంపై రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ..తమ వాదనకు మద్దతు దొరికినట్లయిందని వ్యాఖ్యానించారు. దేశ రాజధాని సరిహద్దు పాయింట్లను తామెన్నడూ దిగ్బంధించ లేదని స్పష్టం చేశారు. రోడ్లపై నిరసనలను పూర్తిగా ఎత్తివేయాలా వద్దా అనే విషయాన్ని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నిర్ణయిస్తుందని చెప్పారు. రహదారులపై అడ్డంకులకు పోలీసులే కారణమంటూ రైతు సంఘాలు ఇటీవల సుప్రీంకోర్టులో వాదించిన నేపథ్యంలో బారికేడ్లను తొలగించాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు. రోడ్లపై అడ్డంకులు ఏర్పాటు చేసింది పోలీసులే తప్ప, రైతులు కాదని భారతీయ కిసాన్ యూనియన్ నేతలు తెలిపారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు పోలీసులు రోడ్లను తిరిగి తెరుస్తున్నారన్నారు. తదుపరి కార్యాచరణను ఎస్‌కేం త్వరలోనే నిర్ణయిస్తుందని చెప్పారు. సింఘు వద్ద రైతులు నిరసన తెలుపుతున్న ప్రాంతాన్ని ఇప్పటికే ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం అధికారులు మూసివేశారని వారు చెప్పారు. టిక్రి, ఘాజీపూర్, సింఘుల వద్ద రైతు సంఘాలు గత ఏడాది నవంబర్ 26వ తేదీ నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతాల్లో పోలీసులు నాలుగైదు అంచెల్లో వైర్లతో కూడిన ఇనుప, సిమెంట్ బారికేడ్లను నిర్మించారు. సాగు చట్టాలను రద్దు చేయాలి: రాహుల్ ఢిల్లీ సరిహద్దుల్లో బారికేడ్లను పోలీసులు తొలగించిన విధంగానే మూడు వివాదాస్పద వ్యవ సాయ చట్టాలను కూడా ఉపసంహరించు కోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎంఎస్పీకి చట్టబద్ధత ఇవ్వాలి: వరుణ్ గాంధీ రైతు సమస్యల విషయంలో యూపీ ప్రభుత్వ వైఖరిపై బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ ఘాటైన విమర్శలు చేశారు. ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద పెచ్చరిల్లిన అవినీతి కారణంగా రైతులు తమ ఉత్పత్తులను దళారులకు తెగనమ్ముకుంటున్నారని అన్నారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించాలని కోరారు. రైతు కుటుంబాలకు ప్రియాంక పరామర్శ యూపీలోని లలిత్‌పూర్‌లో ఎరువుల కొరత కారణంగా ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలను శుక్రవారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా పరామర్శించారు. అధికారులు, నేతలు, అక్రమార్కుల కారణంగా రైతుల ఎరువులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. -
తిక్రి వద్ద మహిళా రైతులను ఢీకొట్టిన ట్రక్కు
బహదూర్‌ఘర్: ఢిల్లీ–హరియాణా సరిహద్దుల్లోని తిక్రి వద్ద గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మహిళా రైతులు మృతి చెందగా ఇద్దరు గాయాలపాలయ్యారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తిక్రి వద్ద రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నిరసనల్లో పంజాబ్‌లోని మన్సా జిల్లా ఖీరా ద్యాలువాలా గ్రామానికి చెందిన మహిళారైతులు పాల్గొన్నారు. అనంతరం వారు బహదూర్‌ఘర్ రైల్వేస్టేషన్‌కు వెళ్లేందుకు పకోడా చౌక్ వద్ద ఆటో కోసం నిల్చుని ఉండగా ఒక ట్రక్కు వారిపైకి దూసుకెళ్లింది. ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరు గాయపడ్డారు. ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. రైతులను అణచివేస్తున్నారు: రాహుల్ గాంధీ తిక్రి వద్ద మహిళా రైతులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను అణచివేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రూరత్వం, విద్వేషం దేశాన్ని నాశనం చేస్తున్నాయన్నారు. దేశంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు బీజేపీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. -
సద్దాం హుస్సేన్ సమాధిలో లేడా!
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు, సైన్యానికి జరుగుతున్న పోరుతో ఇరాక్ అట్టుడికిపోతోంది. ఐఎస్ ఆక్రమిత టిక్రిట్ నగరంపై పట్టు సాధించేందుకు సైన్యం జరిపిన బాంబు దాడుల్లో ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ సమాధి ధ్వంసమైంది. 2006లో ఉరితీత తర్వాత సద్దాం పార్థివదేహాన్ని ఆయన సొంత గ్రామం.. టిక్రిట్ నగరానికి దక్షిన ప్రాంతంలోఉన్న అల్ ఔజా గ్రామంలో ఖననం చేశారు. అనంతరం దానిని ఓ అద్భుత కట్టడంలా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఇది పూర్తిగా నేలమట్టమైంది. అసోసియేటెడ్ ప్రెస్ విడుదల చేసిన వీడియో ఫుటేజిలో ఔజా గ్రామంలోని సద్దాం సమాధి ఫిల్లర్లు నేలకూలిన దృశ్యాలు పొందుపర్చారు. 48 గంటల్లో టిక్రిట్ పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్నీ స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో నగరం రెండువైపుల నుంచి ఆదివారం ఇరాకీ సైన్యం చేసిన దాడులవల్లే ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. కాగా సమాధి విధ్వంసం గత ఆగస్టులోనే జరిగిందని ఐఎస్ వాదిస్తోంది. ఈ వాదనలను సైన్యం తోసిపుచ్చింది. అయితే ఇలాంటి ఉపద్రవాన్ని ముందే ఊహించి టిక్రిట్లోని సమాధి నుంచి సద్దాం దేహాన్ని వేరొక ప్రాంతానికి తరలించినట్లు ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఆయన దేహం ఎక్కడన్నదనే విషయం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. జీవ రసాయన ఆయుధాలు ఉన్నాయనే సాకుతో ఇరాక్‌పై యుద్దం చేసిన ఆమెరికా.. 2003లో సద్దాం హుస్సేన్‌ను బందీగా పట్టుకుంది. పెద్ద సంఖ్యలో షియా ముస్లింలు, కుర్దులను హత్యచేశారని ఆరోపిస్తూ ఇరాకీ ట్రిబ్యూనల్ 2006లో సద్దాంకు ఉరిశిక్షను ఖరారుచేసి, అమలుచేసింది. 2007 లో టిక్రిట్ పట్టణ శివార్లలోని ఓజా గ్రామంలోని సమాధిలో ఆయన దేహాన్ని ఖననం చేశారు. -
భారత నర్సులకు దగ్గర్లో బాంబుల మోత
వారు సురక్షితంగానే ఉన్నారు:కేంద్రం ఇరాక్ నుంచి మరో 136 మంది భారత్‌కు న్యూఢిల్లీ: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న ఇరాక్‌లోని భారతీయుల పరిస్థితి దినదినగండంలా మారింది. మిలిటెంట్ల అధీనంలోని తిక్రిత్‌లో 46 మంది భారతీయ నర్సులు చిక్కుకుపోయిన భవనం దగ్గరలో బాంబుపేలుళ్లు, కాల్పులు సాగుతున్నాయని కేంద్రం మంగళవారం తెలిపింది. అయితే వీరికి ఎలాంటి హానీ జరగలేదని స్పష్టం చేసింది. కేరళకు చెందిన వీరు ప్రస్తుతం భవనం బేస్మెంట్లో తలదాచుకుంటున్నారని, వీరిని క్షేమంగా స్వదేశానికి తీసుకురాగలమని విదేశాంగ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పేర్కొన్నారు. ఇరాక్ నుంచి సోమవారం 94 మంది స్వదేశానికి బయల్దేరారని, మంగళవారం మరో 136 మంది పయనమయ్యారని, వీరిలో ఎక్కువ మంది ఉత్తర భారత్, హైదరాబాద్, కేరళ వాసులని వెల్లడించారు. కాగా, ఇరాక్‌లోని మోసుల్‌లో సున్నీ మిలిటెంట్ల చెరలో ఉన్న 39 మంది భారతీయుల విడుదలకు సాయం చేయాలని భారత్ ఫ్రాన్స్‌ను కోరింది. ఇరాక్‌లో చిక్కుకున్న తమ రాష్ట్రానికి చెందిన 40 మంది కుటుంబాలకు నెలకు రూ.20 వేల సాయం చేస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉండగా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్(ఐఎస్ఐఎల్) మిలిటెంట్లు మంగళవారం సిరియాలోని కీలక పట్టణం బౌకుమాల్ను చేజిక్కించుకున్నారు. ఇరాక్ సరిహద్దులో ఉన్న దీన్ని ఐఎస్ఐఎల్.. నుస్రా ఫ్రంట్ జీహాదీలతో తలపడి స్వాధీనం చేసుకుంది. ఇరాలోక్ జూన్ నాటి హింసలో 2,417 మంది ఇరాకీలు మృతిచెందారని ఐక్యరాజ్యసమితి ఇరాక్ సహాయ విభాగం తెలిపింది. -
ఇరాక్‌లో అంతర్యుద్ధం తీవ్రం
బాగ్దాద్‌కు చేరువైన తిరుగుబాటు దళాలు జీహాదీల స్వాధీనంలో మొసుల్,తిక్రిత్ నగరాలు బాగ్దాద్, కర్బాలాలే తదుపరి లక్ష్యమన్న ఐఎస్ఐఎల్ సద్దాం సైన్యాధికారులతో బలోపేతమైన జీహాదీ దళం బాగ్దాద్/లండన్: ఇరాక్ సంక్షోభం ముదురుతోంది. సోమవారం ప్రారంభమైన అంతర్యుద్ధం శనివారం నాటికి మరింత తీవ్రమైంది. అల్ కాయిదా ప్రభావిత సున్నీ జీహాదీ తిరుగుబాటు దళాలు మొసుల్, తిక్రిత్ నగరాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాయి. తిరుగుబాటులో దేశ ఉత్తరప్రాంతంలో బలంగా ఉన్న కుర్దులు కూడా పాలుపంచుకుంటున్నారు. ఉత్తర, ఉత్తరమధ్య ఇరాక్‌లోని అనేక ప్రాంతాలపై పట్టు సాధిస్తూ బాగ్దాద్‌ను కైవసం చేసుకునే దిశగా జీహాదీ దళాలు ముందుకు కదులుతున్నాయి. బాగ్దాద్‌కు అవి కేవలం 100 కి.మీల దూరంలో ఉన్నాయని సమాచారం. ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ మద్దతుదారులైన ఈ ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్(ఐఎస్ఐఎల్)’ దళాలనుఇరాక్ సైన్యం ఎదుర్కోలేకపోతోంది. షియా గిరిజన యోధులు మాత్రం వారిని కొంతవరకు నిలువరిస్తున్నారు. ఐఎస్ఐఎల్ దళాలను ప్రజలు సాయుధులై కలసికట్టుగా ఎదుర్కోవాలని షియాల అత్యున్నత మత పెద్ద అయోతుల్లా అలీ అల్ సిస్తానీ శుక్రవారం పిలుపునిచ్చారు. సున్నీ జీహాదీలను ఎదుర్కొనేందుకు వేలాది షియాలు స్వచ్ఛందంగా ముందుకువస్తున్నారు. అలాగే, షియాల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న, సుశిక్షితులైన ప్రభుత్వ దళాలున్న బాగ్దాద్‌ను కేవలం వేలల్లో ఉన్న జీహాదీ తిరుగుబాటుదారులు కైవసం చేసుకోలేరని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, బాగ్దాద్‌కు ఉత్తరంవైపు ప్రభుత్వ సైనికదళాలు కాపలాను కట్టుదిట్టం చేశాయి. చెక్‌పోస్ట్‌లు నిర్మించి, సాయుధులను కాపలాగా పెట్టాయి. కాగా, బాగ్దాద్‌తో పాటు షియాలకు పవిత్ర నగరమైన కర్బాలాలే తమ తదుపరి లక్ష్యమని ఐఎస్ఐఎల్ ప్రతినిధి అబూ మొహమ్మద్ అల్ అద్నానీ ప్రకటించారు. సున్నీలు, కుర్దులు అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రధానమంత్రి నౌరి అల్ మాలికి ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేని పరిస్థితి నెలకొంది. దళాలు పంపించబోం: అమెరికా, బ్రిటన్ తిరుగుబాటుదారులను అణచివేసేందుకు తమ దేశం నుంచి సైనిక దళాలను పంపించడం లేదని అమెరికా, బ్రిటన్లు స్పష్టం చేశాయి. ఇరాక్ తమకు అత్యంత ముఖ్యమైన దేశం అయినప్పటికీ.. ఆ దేశ సంక్షోభాన్ని ఆ దేశస్తులే పరిష్కరించుకోవాలని అమెరికా స్పష్టం చేసింది. సైనిక దళాలను పంపించడం కాకుండా.. ఇరాక్ ప్రభుత్వానికి సహకరించే ఇతర మార్గాల గురించి ఆలోచిస్తున్నామని అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. ఇరాక్‌లో అస్థిరతను అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని బ్రిటన్ తెలిపింది. అయితే, ఇరాక్ ప్రభుత్వానికి మద్దతుగా తమ దళాలను ఇరాక్ పంపించడం లేదని స్పష్టం చేసింది. అంతర్యుద్ధంతో సతమతమవుతున్న, జీహాదీలతో పోరాడుతున్న ఇరాక్ ప్రజలకు రూ. 29.84కోట్ల విలువైన సామగ్రిని బ్రిటన్ పంపిస్తోంది.