
బహదూర్‌ఘర్: ఢిల్లీ–హరియాణా సరిహద్దుల్లోని తిక్రి వద్ద గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మహిళా రైతులు మృతి చెందగా ఇద్దరు గాయాలపాలయ్యారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తిక్రి వద్ద రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నిరసనల్లో పంజాబ్‌లోని మన్సా జిల్లా ఖీరా ద్యాలువాలా గ్రామానికి చెందిన మహిళారైతులు పాల్గొన్నారు. అనంతరం వారు బహదూర్‌ఘర్ రైల్వేస్టేషన్‌కు వెళ్లేందుకు పకోడా చౌక్ వద్ద ఆటో కోసం నిల్చుని ఉండగా ఒక ట్రక్కు వారిపైకి దూసుకెళ్లింది. ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరు గాయపడ్డారు. ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు.
రైతులను అణచివేస్తున్నారు: రాహుల్ గాంధీ
తిక్రి వద్ద మహిళా రైతులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను అణచివేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రూరత్వం, విద్వేషం దేశాన్ని నాశనం చేస్తున్నాయన్నారు. దేశంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు బీజేపీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.