kk venugopal
-
తేజస్ మార్క్1ఏ సక్సెస్
సాక్షి బెంగళూరు: అధునిక యుద్ధసామర్థ్యాలను సంతరించుకున్న నూతన తేజస్ మార్క్1ఏ తేలికపాటి యుద్ధవిమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంది. గురువారం బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) కేంద్రం నుంచి టేకాఫ్ తీసుకుని 18 నిమిషాలపాటు గాల్లో నిర్దేశిత ‘పథం’లో చక్కర్లు కొట్టింది. దీంతో తన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంది. తేజస్ ఎంకే1ఏ సిరీస్‌లో ఎల్ఏ5033 మొట్టమొదటి తేలికపాటి యుద్ధ విమానం. హెచ్‌ఏఎల్‌లోని చీఫ్ టెస్ట్ పైలెట్ గ్రూప్ కెపె్టన్ కెకె వేణుగోపాల్(రిటైర్డ్) ఈ విమానాన్ని నడిపారు. విమాన ప్రయాణం విజయవంతమవడంతో త్వరలోనే ఈ సిరీస్‌తో అధునాతన యుద్ధవిమానాలను తయారుచేసి భారత వాయుసేనకు అప్పగించనున్నారు. ‘‘ అంతర్జాతీయ పరిణామాలు, ఆయుధాల సరఫరా వ్యవస్థపై ఒత్తిడి నెలకొన్న ఈ తరుణంలో వేగంగా అధునాతన డిజైన్‌తో స్వదేశీ 4.5 నూతనతరం యుద్ధవిమానాన్ని తయారుచేయడంలో హెచ్ఏఎల్ సఫలీకృతమైంది. ఈ విజయంలో కీలక భాగస్వాములైన రక్షణ శాఖ, భారత వాయుసేన, రక్షణ పరిశోధనాభివృద్ది సంస్థకు కృతజ్ఞతలు’ అని హెచ్ఏఎల్ చీప్ మేనేజింగ్ డైరెక్టర్ అనంతకృష్ణన్ చెప్పారు. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, ఆయుధాలు, ఆధునిక ఎల్రక్టానిక్ రాడార్, కమ్యూనికేషన్ సిస్టమ్, స్వీయ రక్షణకు జామర్ పాడ్లను దీనిలో అమర్చారు. 2028 ఫిబ్రవరిలోపు 83 తేజస్ మార్క్1ఏలను తయారుచేసి భారత వాయుసేనకు అందించనుంది. భారత వాయుసేనలో ఇప్పటికే తేజస్ ‘ ఫ్లయింగ్ డ్యాగర్’, ‘ ఫ్లయింగ్ బుల్లెట్’ పేరుతో రెండు బృందాలు ఉన్నాయి. -
అనూహ్యం.. అటార్నీ జనరల్‌గా మళ్లీ ఆయనే!
ఢిల్లీ: సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి.. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా మరోసారి బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. గతంలోనూ అటార్నీ జనరల్‌గా సేవలందించిన ఆయన.. 2017లో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోహత్గి తదనంతరం కేకే వేణుగోపాల్ ఆ బాధ్యతలు చేపట్టారు. అయితే.. వేణుగోపాల్ పదవీకాలం సెప్టెంబర్ 30వ తేదీతో ముగియనుంది. ఈ క్రమంలో.. తర్వాతి అటార్నీ జనరల్‌గా మళ్లీ ముకుల్ రోహత్గినే బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. వాజ్‌పేయి టైంలోనూ అదనపు సోలిసిటర్ జనరల్‌గానూ పని చేసిన రోహత్గిని.. తిరిగి అటార్నీ జనరల్‌గా నియమించడం దాదాపు ఖాయమైనట్లేనని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వేణుగోపాల్(91) 2020లోనే బాధ్యతలు నుంచి తప్పుకోవాలనుకున్నారు. వయోభారం రిత్యా తనను తప్పించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. కానీ, కేంద్రం మాత్రం ఆయన్నే మరో దఫా కొనసాగాలని కోరింది. అయితే.. ఆ సమయంలోనే ఆయన రెండేళ్లపాటు మాత్రం ఉంటానని స్పష్టం చేశారు. ఇక గతంలో.. గుజరాత్ అల్లర్ల కేసుతో పాటు ప్రముఖ కేసులకు ప్రభుత్వాల తరపున వాదించారు ముకుల్ రోహత్గి. 2014లో అధికారంలోకి రాగానే ఏరికోరి బీజేపీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం, అటార్నీ జనరల్‌గా రోహత్గిని నియమించుకుంది. 2017లో అటార్నీ జనరల్ పదవి నుంచి ఆయన్ని తప్పించి.. జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదాకు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు పరిశీలన కోసం, ఇంకా కొన్ని సున్నితమైన అంశాల కోసం ఆయన సేవల్ని వినియోగించుకుంది. షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వ్యవహారం కేసులో వాదించిన డిఫెన్స్ టీం బృందానికి నేతృత్వం వహించింది కూడా ఈయనే. ఇదీ చదవండి: హింసాద్వేషాలు దేశ సమస్యలకు పరిష్కారం కాదు -
‘రాజద్రోహం’పై విస్తృత ధర్మాసనం అనవసరం
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహం చట్టంపై విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఈ చట్టం దుర్విని యోగం కాకుండా నియంత్రించగలిగామని చెప్పా రు. దీనిపై మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. రాజద్రోహం చట్టాన్ని సవాలు చేస్తూ ఎస్జీ వొంబట్కెరే, ఎడిటర్స్ గిల్డ్ తదితరులు వేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఇటీవల మహారాష్ట్రలో ఎంపీ నవనీత్ కౌర్ రాణా దంపతుల అరెస్టు కేసును ధర్మాసనం ప్రస్తావించింది. ‘‘దేశంలో ఏం జరుగుతోందో కోర్టుకు తెలుసు. హనుమాన్ చాలీసా చదువుతామన్న వారిపై దేశద్రోహం కేసులు పెడుతున్నారు. చట్టం దుర్వినియోగం కాకుండా మార్గదర్శకాలు జారీ చేయాలే గానీ విస్తృత ధర్మాసనం అవసరం లేదు. సెక్షన్ 142ఏ చెల్లుబాటుపై కేదార్నా«థ్‌సింగ్ కేసులో ఇచ్చిన తీర్పును సమర్థించాల్సి ఉంది. కేంద్రం వైఖరి చెప్పాల్సి ఉంది’’ అని ఏజీ వేణుగోపాల్ తెలిపారు. సెక్షన్ 124ఏను రద్దు చేయొచ్చు రాజద్రోహం చట్టంపై దాఖలైన పిటిషన్లపై కౌంటరు దాఖలు చేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించడం లేదంటూ కేంద్రంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. న్యాయవాదులు సిద్ధం చేసిన ముసాయిదాకు ఆమోదం రాలేదని, ఈ నేపథ్యంలో మరింత గడువు కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. భారతదేశంలో తమ పాలనను కాపాడుకోవడానికి బ్రిటిషర్లు చేసిన రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాలని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోరారు. ఈ చట్టం కారణంగా స్వేచ్ఛాభారతంలో జర్నలిస్టులు, విద్యార్థులు అరెస్టవుతున్నారని వాపోయారు. ‘‘సొలిసిటర్ జనరల్ అభ్యర్థన మేరకు కౌంటర్ దాఖలుకు సోమవారం వరకూ సమయం ఇస్తున్నాం. విస్తృత ధర్మాసనం ఏర్పాటుపై వాదప్రతివాదులు లిఖితపూర్వక అభ్యర్థనలను శనివారం ఉదయం అందజేయాలి. మే 10 మధ్యాహ్నం విచారిస్తాం. వాయిదాకు అంగీకరించబోం’’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఇక పూర్తి సామర్థ్యంతో సుప్రీంకోర్టు! సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులు ఉండాలి. ప్రస్తుతం రెండు ఖాళీలున్నాయి. వీటి భర్తీ ప్రక్రియ మొదలయ్యింది. కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు నియమితులైతే సుప్రీంకోర్టు ఇక పూర్తి సామర్థ్యంతో పనిచేయనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఇద్దరి పేర్లను ప్రతిపాదించింది. గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధూలియా, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జంషెడ్ బి.పార్దివాలాను సుప్రీం జడ్జీలుగా నియమించాలని కేంద్రానికి సూచించినట్లు సమాచారం. దీనిని ఆమోదిస్తే జస్టిస్ జంషెడ్ బి.పార్దివాలా జడ్జిగా, ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలున్నాయి. -
ఖాళీగా ఉన్న జడ్జి పోస్టుల భర్తీ ఎప్పుడు?
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం విషయంలో కొలీజియం చేసిన సిఫార్సులపై నిర్ణయం తీసుకొనేందుకు తగిన కాల వ్యవధిని(టైమ్ ఫ్రేమ్) సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గురువారం సూచించింది. మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్(ఎంఓపీ)లోని కాల వ్యవధికి కట్టుబడి ఉంటామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించిందని గుర్తుచేసింది. కొలీజియం 10 పేర్లను ప్రతిపాదించిందని, వీటిపై ప్రభుత్వం ఏడాదిన్నరగా నిర్ణయం తీసుకోలేదని ఆక్షేపించింది. ఈ 10 పేర్లపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. హైకోర్టుల్లో జడ్జీల నియామకంపై నిర్ణయం తీసుకోవడానికి ఎంఓపీలో ప్రధానమంత్రికి గడువు ఏదీ నిర్దేశించలేదని గుర్తుచేశారు. పీఎంఓ నుంచి ఆదేశాలు రాగానే కొలీజియం ప్రతిపాదించిన పేర్లను రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తామన్నారు. సుప్రీంకోర్టుకు 34 జడ్జీ పోస్టులను మంజూరు చేయగా, ప్రస్తుతం 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. హైకోర్టులకు 1,080 జడ్జీ పోస్టులను మంజూరు చేయగా, 416 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తుచేశారు. ఆయా పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని చెప్పారు. హైకోర్టుల్లో జడ్జీల పోస్టులను భర్తీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. -
102వ సవరణ రాష్ట్రాలకు ఆటంకం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: 102వ రాజ్యాంగ సవరణ ద్వారా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల(ఎస్ఈబీసీ)కు రిజర్వేషన్లు ఇచ్చే అధికారాన్ని రాష్ట్రాలు కోల్పోలేదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. 102వ రాజ్యాంగ సవరణ ద్వారా వెనుకబడిన కులాల జాతీయ కమిషన్(ఎన్సీబీసీ) అధికారాల్లో స్పష్టత, ఎస్ఈబీసీ జాబితా మార్చే అధికారం పార్లమెంట్‌కు దఖలు పడిందని ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. ఎన్ఈబీసీ విషయంలో రాష్ట్రాలకు స్వతంత్ర అధికారాలు అలాగే ఉన్నాయని, ఈ సవరణ ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 342ఏను ఏ మాత్రం మార్చలేదన్నది తన అభిప్రాయమని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి ఆయన నివేదించారు. ‘102వ సవరణ ఫలితంగా రాష్ట్రాలకున్న అధికారాలను లాగేసుకునే ప్రయత్నం జరిగిందన్న వాదన సరికాదు. ఆర్టికల్స్ 15(4), 16(4) ప్రకారం వెనుకబడిన వర్గాలను గుర్తించే అధికారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ ఉన్నాయి’అని చెప్పారు. ‘ప్రస్తుత విషయానికొస్తే, మరాఠాకు రిజర్వేషన్లు కల్పించడాన్ని ఎన్సీబీసీ వ్యతిరేకించింది. మరాఠాలు వెనుకబడిన తరగతికి చెందిన వారు కాదనేది కేంద్రం అభిప్రాయం. కానీ, రాష్ట్రం తన సొంత వైఖరి ఆవలంబించవచ్చు’అని వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను విచారించిన ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్లున్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదంటూ 1992 నాటి ఇందిరా సాహ్ని కేసు తీర్పును పునఃసమీక్షించేందుకు విస్తృత ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేసే విషయాన్ని పరిశీలించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కేంద్ర రిజర్వేషన్ జాబితానే ప్రామాణికంగా తీసుకుంటారే తప్ప, రాష్ట్ర జాబితా కాదని తెలిపారు. తదుపరి వాదనలు సోమవారం వింటామని ధర్మాసనం పేర్కొంది. సోమవారం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నారు. -
వివాదాస్పద తీర్పుపై సుప్రీంకోర్టు స్టే
సాక్షి, న్యూఢిల్లీ : పన్నెండేళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. నాగపూర్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై దేశ వ్యాప్తంగా నిరసన స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వివాదాస్పదంగా మారిన అంశంపై తుది విచారణ ముగిసే వరకు స్టే విధిస్తున్నట్లు తెలిపారు. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆందోళనకరంగా ఉందని, దీనిపై మరోసారి సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని కేకే వేణుగోపాల్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా మహారాష్ట్రకు చెందిన 12 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో విచారణ జరిపిన జస్టిస్ పుష్పా గనేడివాలా ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు పెను దుమారానికి దారితీసింది. ఈ తీర్పుపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు తీర్పుపై ఆందోళన సైతం వ్యక్తం చేశారు. (వివాదాస్పదం: అక్కడ తాకితే నేరం కాదు) కేసు పూర్వపరాలు.. 39 ఏళ్లు ఓ వ్యక్తి 12 ఏళ్ల బాలికను పండు ఆశచూపు ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం తలుపులన్నీ మూసి ఆమె ఛాతీభాగాన్ని నొక్కాడు. అంతేకాకుండా బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. కామాంధుడి కోరికను పసిగట్టిన బాలిక పెద్దగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి అతనికి దేహశుద్ధి చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) చట్టం-2012 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దిగువ న్యాయస్థానంలో నిందితుడిని ప్రవేశపెట్టారు. ఐపీసీ సెక్షన్ 354 కేసు కింద కూడా అతడిపై మరో కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షను విధించింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును దోషిగా తేలిన వ్యక్తి బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్‌లో తీర్పును సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ పుష్ప ఈనెల 19న తుది తీర్పును వెలువరించారు. (చర్మాన్ని చర్మం తాకలేదు గనుక..) ఈ సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ‘దుస్తుల పై నుంచి చిన్నారి ఒంటిని తాకినంత మాత్రాన అది పోక్సో చట్టం ప్రకారం నేరంగా పరిగణించలేం. చర్మాన్ని చర్మం తాకాలి, కానీ ఈ కేసులో అలా జరగలేదు. స్కిన్–టు–స్కిన్ కాంటాక్టు లేదు. దుస్తుల లోపల చేతులు పెట్టినట్టి కూడా ఆధారాలు లేవు. పోక్సో చట్టం కింద నమోదైయ్యే కేసుల్లో ఆధారాలు పక్కాగా ఉండాలి’ అని జస్టిస్ పుష్ప తన తీర్పు సందర్భంగా పేర్కొన్నారు. చిన్నారుల ఒంటిని తాకకూడని చోట తాకడం పోక్సో చట్టం కింద నేరం అవుతాయి కనుక, అతడు ఆ పని చేయలేదని ఈ చట్టం ప్రకారం అతడు నిర్దోషే అని తీర్పును వెలువరించారు. ఐపీసీ సెక్షన్ 354 కింద మాత్రమే అతడిని నేరస్థుడిగా గుర్తిస్తామని పేర్కొన్నారు. ఈ తీర్పుపై సినీ నటి తాప్సితో పాటు గాయని చిన్మయి వంటి వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత సమయంలో ఇలాంటి తీర్పులు రావడం ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు. దీనిపై యూత్ బార్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా సైతం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. -
మీరు చేయకపోతే.. మేమే స్టే విధిస్తాం
న్యూఢిల్లీ: వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రైతు ప్రతినిధులతో కేంద్రం జరుపుతున్న చర్చల ప్రక్రియ అత్యంత నిరుత్సాహపూరితంగా సాగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధిస్తామని స్పష్టం చేసింది. సమస్య పరిష్కారం కోసం మరింత సమయం కావాలన్న కేంద్రం అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని తేల్చిచెప్పింది. సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం లభించే వరకు ఆ చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపేయాలన్న తమ సూచనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని, ఆ చట్టాల అమలుపై అంత పట్టుదల ఎందుకని కేంద్రాన్ని ఘాటుగా ప్రశ్నించింది. చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపేయాలన్న తమ సూచనపై కేంద్రం ఇప్పటివరకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఆ చట్టాల అమలును నిలిపేయండి. లేదంటే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ సిఫారసుల మేరకు మేమే స్టే విధించాల్సి వస్తుంది’అని హెచ్చరించింది. చట్టాలపై స్టే విధించాలనుకోవడం లేదని, వాటి అమలును మాత్రమే తాత్కాలికంగా నిలిపేసి, సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నది తమ ఉద్దేశమని పేర్కొంది. చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తే.. కోర్టు ఏర్పాటు చేయనున్న కమిటీకి పరిష్కారం కనుగొనడం సులభమవుతుందని వివరించింది. కొత్త వ్యవసాయ చట్టాలు, రైతు ఆందోళనలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై నేడు(మంగళవారం) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు ఇవ్వనుంది. సమస్య పరిష్కారం కోసం సూచనలు చేసేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసే విషయంపై కూడా నిర్ణయం తీసుకోనుంది. అమలుపై స్టే ఇవ్వలేరు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ప్రాథమికహక్కులకు భంగం కలిగిస్తోందనో, లేక రాజ్యాంగ పరిధిలో లేదనో కోర్టు భావిస్తేనే.. చట్టాల అమలుపై స్టే విధించడం సాధ్యమవుతుందని ఆయన వాదించారు. పిటిషనర్లు తమ వాదనల్లో ఈ అంశాలను లేవనెత్తలేదని గుర్తు చేశారు. దానికి స్పందించిన ధర్మాసనం.. ‘మీరు పరిష్కారం కనుగొనడంలో విఫలమైనందువల్లనే మేం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. మీరు చేసిన చట్టాలు రైతుల ఆందోళనలకు కారణమయ్యాయి. ఆ సమస్యను మీరే పరిష్కరించాలి’అని వ్యాఖ్యానించింది. అసాధారణ పరిస్థితుల్లో తప్పిస్తే.. చట్టాలపై స్టే విధించడానికి తాము వ్యతిరేకమేనని పేర్కొంది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం అమలును సుప్రీంకోర్టు నిలిపివేసిన విషయాన్ని జస్టిస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రమణియన్ కూడా సభ్యులుగా ఉన్న ధర్మాసనం గుర్తు చేసింది. చట్టాల అమలుపై స్టే విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుల జాబితాను తమకు అందించాలని అటార్నీ జనరల్ వేణుగోపాల్‌ను కోరింది. వ్యవసా య చట్టాలను పలు రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. ఈ చట్టాలు ప్రయోజనకరమని పేర్కొనే ఒక్క పిటిషన్ కూడా తమ ముందుకు రాలేదని వ్యాఖ్యానించింది. ఆందోళనలు కొనసాగించవచ్చు ‘చట్టాల అమలును నిలిపివేసిన తరువాత కూడా ఆందోళనలను కొనసాగించుకోవచ్చు. ఆందోళనల గొంతు నులిమేశామన్న విమర్శలను మేం కోరుకోవడం లేదు’అని రైతు సంఘాల తరఫున హాజరైన న్యాయవాదులతో ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసే కమిటీకి నేతృత్వం వహించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్ఎం లోధా సహా రెండు, మూడు పేర్లను సూచించాలని ఇరువర్గాలను ధర్మాసనం కోరింది. సమస్య పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అందులో ప్రభుత్వ, రైతు సంఘాల ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారని పేర్కొంది. ప్రభుత్వం, రైతు ప్రతినిధుల మధ్య జనవరి 15న మరో విడత చర్చలు జరగనున్నాయని, ఆ లోపు ఎలాంటి ఆదేశాలు ఇవ్వవద్దని అటార్నీ జనరల్ వేణుగోపాల్ కోర్టును కోరారు. దీనిపై స్పందిస్తూ.. చర్చల విషయంలో ప్రభుత్వ తీరు సరిగ్గా ఉందని తాము భావించడం లేదని వ్యాఖ్యానించింది. చట్టాల అమలుపై స్టే విధిస్తే.. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగే అవకాశముందని పేర్కొంది. ‘స్టే’తో లాభం లేదు వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలును కేంద్రం కానీ, సుప్రీంకోర్టు కానీ తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ.. ఆ చట్టాల రద్దు కోసం తమ ఉద్యమం కొనసాగుతుందని రైతు నేతలు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని, అయితే, చట్టాల అమలుపై స్టే విధించడం పరిష్కారం కాబోదన్నది తమ అభిప్రాయమని భారతీయ కిసాన్ యూనియన్ హరియాణా శాఖ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చాదునీ పేర్కొన్నారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయడమొక్కటే ఏకైక పరిష్కారమని స్పష్టం చేశారు. రాజ్యాంగవిరుద్ధమైన ఆ చట్టాలను సుప్రీంకోర్టు రద్దు చేయాలని ఇండియన్ ఫార్మర్స్ యూనియన్ అధ్యక్షుడు భోగ్ సింగ్ మాన్సా కోరారు. కొనసాగితే హింసాత్మకం.. రైతుల ఆందోళన ఎక్కువకాలం కొనసాగితే అది హింసాత్మకంగా మారే ప్రమాదముందని సుప్రీంకోర్టు ఆందోళన వెలిబుచ్చింది. ‘మనందరిపై బాధ్యత ఉంది. ఏ చిన్న సంఘటన అయినా హింసకు దారి తీయవచ్చు. అలాంటిది ఏదైనా జరిగితే మనమంతా బాధ్యులమవుతాం. ఎవరి మరణానికి కూడా మనం బాధ్యులం కాకూడదు’ అని వ్యాఖ్యానించింది. చట్టాలను ఉల్లంఘించేవారిని తాము కాపాడబోమని పేర్కొంది. పూర్తిస్థాయిలో సంప్రదింపులు జరపకుండానే ప్రభుత్వం ఈ చట్టాలను రూపొందించిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజ్యాంగ విరుద్ధమని స్పష్టమైతేనే.. సాగు చట్టాలు అన్యాయమైనవని, ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తాయని, రాజ్యాంగ విరుద్ధమైనవని నిర్ధారణ అయితే చట్టాలపై కోర్టు స్టే విధించగలుగుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ విరుద్ధమని గట్టి ఆధారాలుంటే తప్ప పార్లమెంటు చేసిన చట్టాలపై స్టే విధించడం సాధ్యం కాదని న్యాయ నిపుణుడు రాకేశ్ ద్వివేదీ స్పష్టం చేశారు. ‘ప్రభుత్వ వాదన వినకుండానే ఒక నిర్ధారణకు వచ్చారు. పార్లమెంటు చేసిన చట్టాలపై స్టే విధించడానికి పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చేయడం ప్రాతిపదిక కాకూడదు. ఎంపీల విజ్ఞతకు సంబంధించిన విషయమిది. కోర్టు పరిధిలో లేని అంశమిది’ అని ద్వివేదీ పేర్కొన్నారు. ప్రజలు ఉద్యమిస్తున్నారు కాబట్టి చట్టాలను నిలిపేయాలనడం సరికాదన్నారు. -
సడలని రైతుల ఆత్మస్థైర్యం
సాక్షి, న్యూఢిల్లీ: ఎముకలు కొరికే చలి, అకాల వర్షాలు కురుస్తున్నా ఢిల్లీ సరిహద్దుల్లో 43 రోజులుగా అన్నదాతలు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు ఏమాత్రం వెనకడుగు పడే పరిస్థితులు కనిపించట్లేదు. నాలుగు రోజులుగా ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళనను విరమిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ, అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ విపరీతమైన చలిని సైతం తట్టుకుంటూ వర్షం నుంచి తప్పించుకొనేం దుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని ఆందోళన కొనసాగిస్తున్నారు. బుధవారమే జరగాల్సిన ట్రాక్టర్ల ర్యాలీ వాతావరణం అనుకూలించకపోవడంతో నేటికి వాయిదా పడింది. 26న ఢిల్లీలో ట్రాక్టర్ మార్చ్‌ను కచ్చితంగా నిర్వహిస్తామని రైతు నేతలు తెలిపారు. ఈ ట్రాక్టర్ మార్చ్‌లో సుమారు 20 వేల మంది పాల్గొంటారని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రామ్‌రాజీ ధుల్ తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరగనున్న ఈ ట్రాక్టర్ పరేడ్‌లో పాల్గొనేందుకు çపంజాబ్, హరియాణాల్లోని వేలాది మంది రైతులు సిద్ధమవుతున్నారు. టిక్రీ, సింఘు, ఘాజీపూర్ సరిహద్దుల్లో ఇప్పటికే వందలాది ట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నాయి. ర్యాలీలో పాల్గొనేందుకు మరిన్ని ట్రాక్టర్లను సమకూర్చుకునేందుకు రైతు నేతలు ప్రయత్నిస్తున్నారు. చర్చలపై, రైతుల సమస్యలను పరిష్కరించడంపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ విమర్శించింది. రేవారి వద్ద ఉన్న నిరసనకారులు, స్థానికుల మధ్య వివాదం సృష్టించేందుకు హర్యానా పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొంది. రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు ప్రారంభమయ్యాయని తెలిపింది. పరిస్థితి ఇలాగే కొనసాగే పక్షంలో తమ పశువులను సైతం నిరసన స్థలికి తీసుకు వచ్చేందుకు వందలాదిమంది రైతులు సన్నాహాలు చేస్తున్నారు. చర్చలు జరగాలన్నదే మా ఆకాంక్ష: సుప్రీం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతోన్న రైతుల ఆందోళన విషయంలో పురోగతి లేదని సుప్రీంకోర్టు ఆందోళన వెలిబుచ్చింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ఈనెల 11న విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది. ప్రభుత్వానికీ, రైతులకూ మధ్య చర్చలు జరగాలన్నదే తమ ఆకాంక్ష అని వ్యవసాయ చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే పేర్కొన్నారు. పరిస్థితిలో ఎటువంటి సానుకూల మార్పూ, పురోగతి కనిపించడం లేదని జస్టిస్ బాబ్డే వ్యాఖ్యానించారు. రైతు సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తోందని, త్వరలో సమస్యకు పరిష్కారం లభించే అవకాశముందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు.చర్చలను కొనసాగించాలని ఈ సందర్బంగా కోర్టు ప్రభుత్వాన్ని కోరింది.చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు పంజాబ్ సీఎం అమరీందర్ ప్రకటించారు. -
సోషల్ మీడియాపై అణచివేతలొద్దు
న్యూఢిల్లీ: సోషల్ మీడియాను అణచివేయాలనుకోవడం సరైంది కాదని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ చెప్పారు. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి అది ఎంతమాత్రం మంచిది కాదని పేర్కొన్నారు. సోషల్ మీడియాపై ఆంక్షలు విధిస్తే ప్రభుత్వానికి చట్టపరమైన ఇబ్బందులు వస్తాయని తెలిపారు. అతి తక్కువ కేసుల్లోనే సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ చర్యలు చేపడుతుందని గుర్తుచేశారు. సామాజిక మాధ్యమాల్లో బహిరంగ చర్చలు జరగడం ప్రజాస్వామ్యానికి మంచి చేసే పరిణామమేనని వ్యాఖ్యానించారు. హద్దులు మీరితే తప్ప సాధారణంగా విమర్శలపై సుప్రీంకోర్టు పెద్దగా స్పందించబోదని అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే చర్యలను ప్రారంభించకూడదని ప్రభుత్వానికి కె.కె.వేణుగోపాల్ సూచించారు. స్వేచ్ఛతో కూడిన ప్రజాస్వామ్యం, బహిరంగ చర్చలు అవసరమేనని తెలిపారు. సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకొని ట్వీట్లు చేస్తున్న వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని తనకు విజ్ఞప్తులు వస్తున్నాయని చెప్పారు. అలాంటి విజ్ఞప్తులు త్వరలో ఆగిపోతాయని ఆశిస్తున్నట్లు పీటీఐకి తెలిపారు. ఎవరిపై అయినా కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలంటే అటార్నీ జనరల్ లేదా సొలిసిటర్ జనరల్ అంగీకారం తెలిపాల్సి ఉంటుంది. సెంట్రల్ విస్టా శంకుస్థాపనకు ఓకే సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణానికి 10వ తేదీన పునాది రాయి వేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం నుంచి నిర్ణయం వెలువడే వరకూ ఎలాంటి నిర్మాణాలు, కూల్చివేతలు చేపట్టబోమని సర్కారు హామీ ఇవ్వడంతో శంకుస్థాపన విషయంలో సానుకూలంగా స్పందించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవన సముదాయం, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవన నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సంగతి తెలిసిందే. పర్యావరణానికి విఘాతం కలిగించే ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలువురు పిల్లు చేశారు. వీటిపై తాజాగా జస్టిస్ ఎ.ఎం.ఖాన్వీల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర ం హామీని పరిగణనలోకి తీసుకుని శంకుస్థాపనకు అనుమతి ఇచ్చింది. -
న్యాయవ్యవస్థలో అసమానతలు
చాలా ఆలస్యంగానే కావొచ్చు... ఒక అర్థవంతమైన చర్చకు తెరలేచింది. న్యాయవ్యవస్థలో మహిళ లకు అతి తక్కువ ప్రాతినిధ్యం వున్నదని స్వయానా అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ సుప్రీం కోర్టులో ఎత్తిచూపారు. ఈ పరిస్థితిని మార్చాలని సూచించారు. ఆయన చెప్పిన వివరాలు దిగ్భ్రాంతి కలిగిస్తాయి. సుప్రీంకోర్టులోనూ, వివిధ హైకోర్టుల్లోనూ మొత్తం న్యాయమూర్తుల పదవులు 1,113 వుంటే అందులో కేవలం 80 మంది మాత్రమే మహిళలు. సుప్రీంకోర్టులో 34 న్యాయమూర్తుల పదవులుంటే అందులో ఇద్దరు మాత్రమే మహిళలు. ట్రిబ్యునల్స్‌కి సంబంధించిన లెక్కలు లేనేలేవు. వాటిల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితి వుంటుందని అనుకోనవసరం లేదు. ఇది దాటి సీనియర్ న్యాయవాదుల విషయానికొస్తే అందులోనూ మహిళలు అతి తక్కువ. ఈ దుస్థితిని గురించి ఇంతవరకూ అసలు చర్చే జరగలేదని అనడం సరికాదు. ఎందరో సామాజిక కార్యకర్తలు లోగడ పలు సందర్భాల్లో చెప్పారు. మొన్న సెప్టెంబర్‌లో లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా దేశంలో మహిళా న్యాయమూర్తులు తగిన సంఖ్యలో లేకపోవడాన్ని వివరంగానే చెప్పారు. రాజ్యాంగానికి సంబంధించిన మూడు మూలస్తంభాల్లో మిగిలిన రెండూ... కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థల్లో పరిస్థితి ఎంతో కొంత నయమే. 2007లో రాష్ట్రపతి పీఠాన్ని ప్రతిభాపాటిల్ అధిరోహించారు. అంతకు చాన్నాళ్లముందే... అంటే 60వ దశకంలోనే ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. ఎన్నో రాష్ట్రాలకు మహిళా ముఖ్యమంత్రులు వచ్చారు. గవర్నర్ లుగా కూడా పనిచేస్తున్నారు. కానీ మహిళలకు అవకాశం ఇవ్వడంలో న్యాయవ్యవస్థ వెనకబడింది. స్వాతంత్య్రం వచ్చిన దగ్గరనుంచీ చూస్తే ఒక మహిళ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడానికి నాలుగు దశాబ్దాలు పట్టింది. జస్టిస్ ఫాతిమా బీవీ 1989లో సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయ మూర్తి. రెండేళ్లక్రితం న్యాయవాద వృత్తినుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన జస్టిస్ ఇందూ మల్హోత్రా సంగతే తీసుకుంటే 68 ఏళ్లలో అలా ఎంపికైన తొలి మహిళా న్యాయమూర్తి ఆమెనే! మొన్న జూలైలో జస్టిస్ భానుమతి రిటైర్‌కాగా ప్రస్తుతం జస్టిస్ ఇందూ మల్హోత్రాతోపాటు మరో మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ మాత్రమే వున్నారు. ఈ ఇద్దరూ ప్రధాన న్యాయమూర్తి పదవి అధిష్టించకుండానే రిటైరవుతారు. అంటే ఇంతవరకూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మహిళలు లేనేలేరు. సమీప భవిష్యత్తులో కూడా వుండే అవకాశం లేదు. ఇంత కన్నా అన్యాయం మరొకటుందా? కెకె వేణుగోపాల్ మహిళా న్యాయమూర్తుల గురించి చర్చ లేవనెత్తిన సందర్భాన్ని చూడాలి. మధ్యప్రదేశ్‌లో ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించి అరెస్టయిన వ్యక్తికి బెయిల్ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి విచిత్రమైన ఉత్తర్వులిచ్చారు. అతగాడికి బెయిల్ మంజూరు చేస్తూ ఆ న్యాయమూర్తి ఒక షరతు పెట్టారు. నిందితుడు బాధిత మహిళ ఇంటికెళ్లి ఆమెకు రాఖీ కట్టాలన్నది దాని సారాంశం. అంతేకాదు... పోతూ పోతూ ఆమెకు, ఆమె కుమారుడికి స్వీట్లు తీసుకెళ్లాలట! ఈ ఉత్తర్వులపై అక్కడున్న న్యాయవాదులు స్పందించినట్టు లేదు. కానీ సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదులు 8మంది మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులను సర్వో న్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఆ మహిళ పడిన మానసిక హింసనూ, క్షోభనూ న్యాయ స్థానం చాలా చిన్న అంశంగా పరిగణించడం సరికాదని విన్నవించారు. ఈ విషయంలో న్యాయస్థానానికి తోడ్పడాలని సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన సూచనకు స్పందిస్తూ మహిళా న్యాయమూర్తుల సంఖ్య సరిగా లేకపోవడాన్ని వేణుగోపాల్ ప్రస్తావించారు. ఆయన చెప్పిన అంశాన్ని చాలా విస్తృతార్థంలో చూడాలి. భిన్న వర్గాలుగా వుండే సమాజంలో నిత్యం ఏవో సమ స్యలు, సంక్షోభాలూ తప్పవు. వాటికి ఎప్పటికప్పుడు మెరుగైన పరిష్కారాలు సాధించాలంటే, సమాజం ఉన్నత ప్రమాణాలతో ముందుకు సాగాలంటే అన్ని వర్గాల ప్రజల్లోనూ వ్యవస్థలపై విశ్వాసం ఏర్పడాలి. ఆ వ్యవస్థల్లో తమకూ భాగస్వామ్యం వున్నదని, తామెదుర్కొంటున్న సమస్యలకు వాటి పరిధిలో పరిష్కారం లభిస్తుందని అందరిలోనూ నమ్మకం కలిగినప్పుడే ఏ సమాజమైనా సజావుగా మనుగడ సాగిస్తుంది. అందుకు భిన్నమైన స్థితి వుంటే ఒకరకమైన అనిశ్చితి, భయాందోళనలు నెలకొంటాయి. కులం, మతం, ప్రాంతం, జెండర్ వంటి వివక్షలు ఏ వ్యవస్థలోనైనా కొనసాగు తున్నాయన్న అభిప్రాయం పౌరుల్లో ఏర్పడితే అది ఆ వ్యవస్థకే చేటు తెస్తుంది. కనుకనే వేణుగోపాల్ లేవనెత్తిన అంశాన్ని సుప్రీంకోర్టు పట్టించుకోవాల్సిన అవసరం వుంది. తీర్పులు వెలువరించే ముందు బాధితుల స్థానంలో వుండి ఆలోచించేలా న్యాయమూర్తులకు అవగాహన పెంచాలన్న ఆయన సూచన మెచ్చదగ్గది. దాదాపు దశాబ్దంక్రితం సైన్యంలో పురుషులతో సమానంగా తమకు బాధ్యతలు అప్పగించడం లేదని కొందరు మహిళలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈమధ్యే లైన్‌మన్ పోస్టులకు తమనెం దుకు పరిగణించరంటూ ఇద్దరు మహిళలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇలాంటి పిటి షన్లు విషయంలో న్యాయవ్యవస్థ బాగానే స్పందిస్తోంది. మంచి తీర్పులు వెలువడుతున్నాయి. కానీ తమదగ్గర వేళ్లూనుకున్న జెండర్ వివక్షను మాత్రం ఇన్ని దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక సమాజం ఏమేరకు ప్రగతి సాధించిందన్నది ఆ సమాజంలో మహిళలు సాధించిన ప్రగతినిబట్టే అంచనా వేస్తానని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ ఒక సందర్భంలో అన్నారు. ఆ కోణంలో చూస్తే మన సమాజం చాలా చాలా వెనకబడివున్నట్టు లెక్క. కేంద్రం, సుప్రీంకోర్టు కూడా న్యాయవ్యవస్థలో వున్న ఈ అసమానతను సాధ్యమైనంత త్వరగా పట్టించుకుని సరిచేసే దిశగా అడుగులేస్తాయని ఆశిద్దాం. -
అవసరమైతే నేనే కశ్మీర్‌కు వెళ్తా
న్యూఢిల్లీ/శ్రీనగర్: కశ్మీర్ స్వతంత్రప్రతిపత్తి రద్దు అనంతరం అక్కడి పరిస్థితులపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కశ్మీర్లో పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని హైకోర్టును ఆదేశించింది. దీంతోపాటు అవసరమైతే శ్రీనగర్‌కు వెళ్లి పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తానని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. కశ్మీర్ హైకోర్టును ఆశ్రయించడంలో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై ఈ మేరకు స్పందించారు. కశ్మీర్ లోయలో మొబైల్, ఇంటర్నెట్, రవాణా సేవలను నిలిపివేయడంతో జర్నలిస్టులకు విధి నిర్వహణతోపాటు హైకోర్టును ఆశ్రయించడం ప్రజలకు కష్టంగా మారిందంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. ‘హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఈరోజే మాట్లాడతా. అవసరమైతే శ్రీనగర్ వెళ్లి, పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తా’ అని ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ గొగోయ్ పేర్కొన్నారు. ఆరోపణలు తప్పని తేలితే తదనంతర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పిటిషనర్లను హెచ్చరించారు. ఆ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్రం, జమ్మూకశ్మీర్ పరిపాలన యంత్రాంగాన్ని ధర్మాసనం ఆదేశించింది. అయితే, ఈ ప్రక్రియ ప్రాధాన్యతా క్రమంలో, జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను ఆదేశించింది. వాస్తవ పరిస్థితులపై రాష్ట్ర హైకోర్టుకే అవగాహన ఉంటుంది కాబట్టి..మోబైల్, ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై అక్కడే తేల్చుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. హైకోర్టుతోపాటు అన్ని కోర్టులు, లోక్ అదాలత్‌లు కూడా సక్రమంగా పనిచేస్తున్నాయని కశ్మీర్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తెలిపారు. 370 రద్దుపై విచారణకు ఓకే ఆర్టికల్–370 రద్దు, కశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని సవాల్ చేస్తూ పీపుల్స్ కాన్ఫరెన్స్ పిటిషన్‌పై విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. పార్లమెంట్ నిర్ణయం చట్టబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనానికి ఈ పిటిషన్‌ను పంపింది. ఆర్టికల్–370 రద్దుకు వ్యతిరేకంగా ఇంకా పిటిషన్లను స్వీకరించబోమని, ఈ విషయంలో ఇంప్లీడ్మెంట్ అప్లికేషన్ మాత్రం వేసుకోవచ్చని బెంచ్ తెలిపింది. ‘పార్లమెంట్ నిర్ణయంలో చట్టబద్ధతపై అక్టోబర్‌లో విచారిస్తాం’ అని కోర్టు తెలిపింది. ఆజాద్‌కు అనుమతి కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ కశ్మీర్ వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, ఆయన అక్కడ రాజకీయ సమావేశాలు చేపట్టరాదని స్పష్టం చేసింది. శ్రీనగర్, జమ్మూ, బారాముల్లా, అనంత్‌నాగ్ జిల్లాలకు వెళ్లి ప్రజలను కలసుకోవచ్చని పేర్కొంది. తన కుటుంబ సభ్యులు, బంధువులను కలుసుకునేందుకు అనుమతించాలంటూ ఆజాద్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అలాగే, అస్వస్థతకు గురై ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కశ్మీర్ సీపీఎం నేత యూసఫ్ తారిగమి సొంత రాష్ట్రం వెళ్లేందుకు కోర్టు ఓకే చెప్పింది. ఫరూక్ అబ్దుల్లాకు సొంతిల్లే జైలు కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా(81) సోమవారం ప్రజాభద్రత చట్టం(పీఎస్ఏ)లోని ‘పబ్లిక్ ఆర్డర్’ నిబంధన కింద పోలీసులు అరెస్ట్ చేశారు. ఎటువంటి విచారణ లేకుండా ఆరు నెలలపాటు జైల్లో ఉంచేందుకు అవకాశం కల్పించే, కశ్మీర్‌కు మాత్రమే వర్తించే చట్టం ఇది. శ్రీనగర్‌లోని గుప్కార్ రోడ్డులోని ఫరూక్ నివాసాన్నే తాత్కాలిక జైలుగా అధికారులు ప్రకటించారు. ఆర్టికల్ 370ను కేంద్రప్రభుత్వం రద్దుచేసిన నాటి నుంచీ అంటే ఆగస్టు 5వ తేదీ నుంచి ఫరూక్ అబ్దుల్లా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. -
రఫేల్‌పై సుప్రీం తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందానికి సంబంధించిన సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రానికి పలు ప్రశ్నలు వేసింది. ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఈ ఒప్పందంలో సార్వభౌమ గ్యారంటీని ఎందుకు మాఫీ చేశారనీ, సాంకేతికతను ఎందుకు బదిలీ చేసుకోవడం లేదని కోర్టు ప్రశ్నించింది. గతేడాది డిసెంబర్ 14న సుప్రీంకోర్టు రఫేల్ విషయంలో కేంద్రానికి క్లీన్చిట్ ఇస్తూ తీర్పు చెప్పడం తెలిసిందే. ఆ తీర్పును పునఃసమీక్షించాలంటూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, సామాజిక కార్యకర్త, లాయర్ ప్రశాంత్ భూషణ్, ఆప్ శాసనసభ్యుడు సంజయ్ సింగ్, లాయర్ వినీత్ రివ్యూ పిటిషన్లు వేయడం తెలిసిందే. ఈ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నిస్తూ సాంకేతికత బదిలీ అంశం ఒప్పందంలో ఎందుకు లేదో చెప్పాలంది. దీనికి కేంద్రం తరఫున అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ వాదిస్తూ అలాంటి సాంకేతిక అంశాలను కోర్టు విచారించకూడదన్నారు. సార్వభౌమ గ్యారంటీని మాఫీ చేసి కేవలం లెటర్ ఆఫ్ కంఫర్ట్‌ను తీసుకోవడాన్ని ప్రశ్నించగా, ఇదేమీ కొత్తగా జరిగింది కాదనీ, రష్యా, అమెరికాలతో ఒప్పందాల్లోనూ ప్రభుత్వం ఇలాగే చేసిందని తెలిపారు. ఇంకా వేణుగోపాల్ మాట్లాడుతూ ‘ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. ప్రపంచంలోని ఇతర ఏ కోర్టు కూడా ఇలాంటి వాదనలపై రక్షణ ఒప్పందాలపై విచారణ జరపదు’ అని అన్నారు. డిసెంబర్ 14 నాటి తీర్పును పునఃసమీక్షించాలా? వద్దా? అన్న విషయంపై తీర్పును కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. రాహుల్ కేసుపై తీర్పు సైతం రిజర్వ్‌లోనే.. రఫేల్ కేసు విషయంలో ‘కాపలాదారుడే (మోదీ) దొంగ’ అన్న వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు ఆపాదించినందుకు తాను ఇప్పటికే బేషరతుగా క్షమాపణ చెప్పినందున తనపై క్రిమినల్ ధిక్కార చర్యలను ఆపేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును కోరారు. బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి గతంలో సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేశారు. దీనిపై తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం రిజర్వ్‌లో ఉంచింది. రాహుల్ తరఫున ఏఎం సింఘ్వీ వాదిస్తూ రాహుల్ ఇప్పటికే బేషరతు క్షమాపణ చెప్పి, తన చింతన కూడా వ్యక్తపరిచారని కోర్టుకు తెలిపారు. మీనాక్షి తరఫున ముకుల్ రోహత్గీ వాదిస్తూ ఆ క్షమాపణను తిరస్కరించాలనీ, రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు క్షమాపణ చెప్పేలా రాహుల్‌ను కోర్టు ఆదేశించాలని కోరారు. దీనిపై తీర్పును కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. -
రఫేల్‌పై వాడివేడీ వాదనలు.. తీర్పు రిజర్వు
సాక్షి: న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కోనుగోలు ఒప్పందంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ వాడీవేడిగా జరిగింది. పిటిషనర్లు, కేంద్ర ప్రభుత్వం తరఫు అటర్నీ జనరల్ ధర్మసనానికి వాదనలు వినిపించారు. వారి వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. పిటిషనర్ల తరుఫున తొలుత వాదనలు వినిపించిన ప్రశాంత్ భూషణ్ కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ఒప్పందంలోని నిజనిజాలు బయటకు రావాల్సి ఉందన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తరఫున అటర్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారం కాబట్టి.. జెట్ల ధరలను బహిర్గతం చేయలేమని అన్నారు. పిటిషనర్లు ప్రతిసారి ధరల గురించి ప్రస్తావించడం సరైనది కాదని అసహనం వ్యక్తంచేశారు. ఇద్దరి వాదనలు విన్న ధర్మాసనం రెండు వారాల్లోగా లిఖితపూర్వక వాదనలు తమకు సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించింది. కాగా రాఫెల్‌పై పిటిషన్ దాఖలు చేసిన మరో పిటిషనర్ అరుణ్ శౌరి న్యాయస్థానం ఎదుట తన వాదనల్ని విన్పించారు. పత్రాలు చోరీకి గురయ్యాయన్న కేంద్రం వాదన సరైంది కాదన్నారు. ఇప్పటికే కొన్ని పత్రాలు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయని చెప్పారు. కేంద్రం ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే సుప్రీంకోర్టు గత తీర్పు ఇచ్చిందని న్యాయస్థానం ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
కులాలకు అతీతంగా ఒకే చట్టం ఉండాలి: సుప్రీం
న్యూఢిల్లీ: దేశంలో చట్టాలు పౌరులందరికీ సమానంగా, కులాలకు అతీతంగా ఉండాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎస్టీ,ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంపై గతంలో ఇచ్చిన తీరును పునఃసమీక్షించాలని దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం బుధవారం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా జస్టిస్ అరుణ్‌మిశ్రా, జస్టిస్ యు.యు.లలిత్‌ల ధర్మాసనం స్పందిస్తూ.. ‘దేశంలో జనరల్ కేటగిరీకి ఓ చట్టం, ఎస్సీ,ఎస్టీలకు మరో చట్టం ఉండటానికి వీల్లేదు. అందరికీ ఒకే చట్టం ఉండాలి’ అని వ్యాఖ్యానించింది. అటార్నీ జనరల్ వేణుగోపాల్ స్పందిస్తూ.. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సమస్యాత్మకంగా మారిందనీ, దీన్ని సమీక్షించాలని కోరారు. దీన్ని వికాస్‌సింగ్ అనే న్యాయవాది వ్యతిరేకించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం, తీర్పును రిజర్వులో ఉంచింది. -
ప్రమాదంలో ‘న్యాయ’ స్వతంత్రత
న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. సీజేఐ కార్యాలయాన్ని అస్థిరపరిచేందుకు ఓ బలీయమైన శక్తి కుట్ర పన్నుతోందని ఆరోపించారు. జస్టిస్ గొగోయ్ తనను లైంగికంగా వేధించారంటూ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్(జేసీఏ)గా పనిచేసిన ఓ మహిళ(35) 22 మంది సుప్రీంకోర్టు జడ్జీలకు లేఖ రాయడంపై ఆయన ఈ మేరకు స్పందించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో తన సారథ్యంలో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటుచేసిన గొగోయ్.. అత్యవసరంగా విచారణను చేపట్టారు. మరోవైపు జస్టిస్ గొగోయ్‌కు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్, జాతీయ హరిత ట్రైబ్యునల్ బార్ కౌన్సిల్ సహా పలు న్యాయవాదుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. నాకంటే నా ప్యూన్ ఆస్తులే ఎక్కువ.. ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గొగోయ్ మాట్లాడుతూ.. ‘జడ్జీలకు గౌరవం ఒక్కటే ఉంటుంది. నిరాధార ఆరోపణలతో ఏకంగా దానిపైనే దాడి జరిగితే బుద్ధి ఉన్నవారెవరూ జడ్జీ బాధ్యతలు చేపట్టేందుకు ముందుకురారు. ఇలాంటి ఘటనలు జరిగితే ఏ జడ్జీ తీర్పులను వెలువరించరు. కోర్టులోకి సావధానంగా వచ్చి విచారణను వాయిదా వేస్తారు. నేను 20 ఏళ్లకు పైగా న్యాయమూర్తిగా పనిచేస్తున్నా. నా బ్యాంకులో రూ.6.80 లక్షలు మాత్రమే ఉన్నాయి. మరో రూ.40 లక్షల ప్రావిడెంట్ ఫండ్ ఉంది. మరో బ్యాంకు ఖాతాలో రూ.21.80 లక్షలు ఉండగా, వాటిలో రూ.15 లక్షలను గువాహటిలో ఇంటి మరమ్మతు కోసం నా కుమార్తె అందజేసింది. నా మొత్తం ఆస్తులు ఇవే. నేను న్యాయమూర్తి కావాలనుకున్నప్పుడు నా దగ్గర ఇంతకంటే ఎక్కువ ఆస్తులు ఉండేవి. ఇప్పుడు నా కంటే నా ఫ్యూన్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి. డబ్బు విషయంలో నన్నెవరూ ఇబ్బంది పెట్టలేరు. అందుకే ఇలా తప్పుడు ఆరోపణలతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నాపై వచ్చిన అభియోగాలపై మరీ అంతగా దిగజారిపోయి ఖండించలేను’ అని స్పష్టం చేశారు. మీడియా విజ్ఞతకే వదిలేస్తున్నాం.. గతంలో ఓ సుప్రీం జడ్జితో పాటు సీనియర్ న్యాయవాదిపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఇందుకు సంబంధించి ఎలాంటి వార్తలను ప్రచురించరాదని మీడియాను సుప్రీం ఆదేశించిన విషయాన్ని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ గుర్తుచేశారు. తాజాగా లైంగికవేధింపులకు సంబంధించిన ఆరోపణలను పలు వెబ్సైట్లు ప్రచురించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వేణుగోపాల్ వాదనలపై జస్టిస్ గొగోయ్ స్పందిస్తూ..‘పరిస్థితులు చాలాదూరం పోవడంతోనే ఈ అసాధారణ విచారణను చేపట్టాల్సి వచ్చింది. ఈ విషయంలో బాధ్యతాయుతంగా, నియంత్రణతో వ్యవహరించే అంశాన్ని మీడియా విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. ఈ కేసులో ఉత్తర్వులు ఇచ్చే అధికారాన్ని సీనియర్ జడ్జి జస్టిస్ మిశ్రాకు వదిలిపెడుతున్నా. ఇందులో నేను భాగం కాబోను’ అని తెలిపారు. సుప్రీంకోర్టుకు సంబంధించిన ప్రతీ ఉద్యోగి పట్ల న్యాయంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు. ఇలాంటి విషయాల్లో న్యాయవ్యవస్థ బలిపశువు కారాదని జస్టిస్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఉద్యోగం నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టినప్పుడు మౌనంగా ఉన్న సుప్రీంకోర్టు ఉద్యోగిని, అకస్మాత్తుగా సీజేఐపై ఆరోపణలు చేస్తున్నారని జస్టిస్ ఖన్నా చెప్పారు. ఈ కేసును 30 నిమిషాలపాటు విచారించాక ఈ వ్యవహారంలో ఎప్పుడు అవసరమైతే అప్పుడు న్యాయపరమైన ఉత్తర్వులు జారీచేస్తామని కోర్టు తెలిపింది. ఇలాంటి ఆరోపణల వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వసనీయత సడలిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. సుప్రీం ప్రధాన కార్యదర్శిæ సుధాకర్ మాట్లాడుతూ.. మాజీ జేసీఏ లేఖ కొన్ని మీడియా పోర్టల్స్‌లో ఉదయం 8–9 గంటల మధ్యలో రాగా, తమకు 9.30 గంటల ప్రాంతంలో తెలిసిందని వ్యాఖ్యానించారు. సీజేఐ మాస్టర్ ఆఫ్ రోస్టర్ అనీ, ఆయన ఏ బెంచ్‌ను ఏర్పాటుచేస్తే వారే కేసును విచారిస్తారని స్పష్టం చేశారు. కాగా, ప్రత్యేకబెంచ్లో సీజేఐ జస్టిస్ గొగోయ్ సభ్యుడిగా ఉండొచ్చా? అన్న విషయమై లాయర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం కానీ, రాజకీయ పార్టీలు కానీ ఇంతవరకూ స్పందించలేదు. కాగా, నవీన్ అనే వ్యక్తికి సుప్రీంకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.50,000 వసూలుచేసిన కేసులో ఈ మాజీ జేసీఏకు మంజూరుచేసిన బెయిల్‌ను రద్దుచేయాలని ఢిల్లీ పోలీసులు ట్రయల్‌కోర్టును శనివారం ఆశ్రయించారు. ఆమెపై 3 ఎఫ్ఐఆర్లున్నాయ్.. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మాజీ జేసీఏకు నేరచరిత్ర ఉందని జస్టిస్ గొగోయ్ తెలిపారు. ‘కోర్టులో చేరేనాటికే ఆమెపై ఓ ఎఫ్ఐఆర్ పెండింగ్‌లో ఉంది. బెయిల్‌పై విడుదలయ్యాక ఓ సాక్షిని బెదిరించడంతో ఆమెపై నమోదైన ఎఫ్ఐఆర్ల సంఖ్య మూడుకు చేరింది. ఎఫ్ఐఆర్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు అసలు సుప్రీంకోర్టు సిబ్బందిగా ఆమెను ఎలా ఎంపికచేశారు? నేరచరిత్ర కారణంగా ఆమె నాలుగురోజుల పాటు జైలులో గడిపారు. ప్రస్తుతం స్వతంత్ర న్యాయవ్యవస్థ అదిపెద్ద ప్రమాదంలో ఉంది. దీన్ని నేను అనుమతించను. నా పదవీకాలం ఉన్న మరో 7 నెలల పాటు ఈ కుర్చీలో పక్షపాతంలేకుండా ధైర్యంగా తీర్పులను వెలువరిస్తా’ అని వెల్లడించారు. లేఖలో ఏముంది? ‘‘నేను సుప్రీంకోర్టులో జేసీఏగా లైబ్రరీలో టైపింగ్, డాక్యుమెంటేషన్ పనులను చేసేదాన్ని. జస్టిస్ గొగోయ్ వద్ద పనిచేసే జేసీఏ.. సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో నన్ను 2016, అక్టోబర్‌లో నియమించారు. 2018 ఆగస్టులో తన రెసిడెన్స్ ఆఫీస్‌లో నన్ను ఆయన చేరమన్నారు. ఓరోజు ఆఫీస్‌లో ఉన్నపుడు ‘నా భార్య, నా కూతురు తర్వాత నువ్వు నా మూడో ఆస్తివి’ అని అన్నారు. తాను సీజేఐ అయ్యాక తప్పకుండా సాయం చేస్తామని పదేపదే చెప్పేవారు. అయితే మా బావ దివ్యాంగుడనీ, ఆయనకు ఉద్యోగమేదీ లేదని చెప్పా. సీజేఐగా బాధ్యతలు చేపట్టగానే మా బావను జూనియర్ కోర్ట్ అటెండెంట్‌గా నియమించారు. తర్వాత నన్ను ఆఫీస్‌కు పిలిచి నా తలను, వీపును, వెనుకభాగాన్ని తడిమారు. 2018, అక్టోబర్ 11న ఆఫీసులో గొగోయ్ నా పక్కకు వచ్చి నిలబడి నా నడుముపై చేయి వేసి దగ్గరకు లాక్కున్నారు. వెంటనే నేను ఆయన్ను వెనక్కి తోసి భయంతో డెస్క్‌లో కూర్చుండిపోయాను. ఇది జరిగిన కొద్దిరోజులకే తాను క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు మెమో ఇచ్చారు. అక్టోబర్, నవంబర్ మధ్యలో నన్ను మూడుసార్లు బదిలీ చేశారు. అధికారుల నిర్ణయాన్ని ప్రశ్నించాననీ, అధికారులను ప్రభావితం చేసేందుకు యత్నించాననీ, చెప్పకుండా విధులకు గైర్హాజరయ్యానని నాపై 3 అభియోగాలు నమోదుచేశారు. డిసెంబర్ 21న నన్ను విధుల నుంచి తొలగించారు’’ అని ఆమె లేఖలో పేర్కొన్నారు. -
దాతలు తెలీకుండా నల్లధనం నియంత్రణా?
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత పెంచే లక్ష్యంతో జారీ చేస్తున్న ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసేదెవరో తెలియనప్పుడు ఎన్నికల్లో నల్లధనాన్ని కట్టడి చేయడంలో ప్రభుత్వ ప్రయత్నాలు వృథా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎలక్టోరల్ బాండ్ల జారీని నిలిపివేయాలి లేదా బాండ్లను కొనుగోలు చేసే వారి వివరాలను బహిర్గతం చేయాలంటూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారŠమ్స్(ఏడీఆర్) సంస్థ వేసిన పిటిషన్‌పై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్నికల్లో నల్లధనం కట్టడికే ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువచ్చినట్లు అటార్నీ జనరల్(ఏజీ) కేకే వేణుగోపాల్ తెలిపారు. ఈ సమయంలో సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోరాదని, ఎన్నికల తర్వాతే ఈ విధానం పనిచేస్తుందా లేదా అనేది పరిశీలించాలని కోరారు. అయితే, బాండ్ల కొనుగోలు దారుల వివరాలు బ్యాంకులకు తెలుస్తుందా అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి వేణుగోపాల్.. అతని వివరాలు తెలిసినప్పటికీ ఏ బాండ్ ఏ పార్టీకి అందిందో తెలపడం కష్టమని బదులిచ్చారు. అలాంటప్పుడు, ఆదాయపన్ను చట్టాల్లో లొసుగుల ఆధారంగా నల్లధనాన్ని నియంత్రించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు వృథాయే కదా అని ధర్మాసనం పేర్కొంది. చెక్కులు, డిమాండ్ డ్రాఫ్టులు, ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా మాత్రమే అసలైన డబ్బు బాండ్ల కొనుగోలు దారుల ద్వారా బ్యాంకులకు చేరుతుందని ఏజీ వేణుగోపాల్ పేర్కొనగా దాతలు ఎవరో తెలియకపోతే బినామీ కంపెనీలు కూడా నల్లధనాన్ని ఈ మార్గంలో పార్టీల నిధులుగా మార్చుకునే అవకాశముందని ధర్మాసనం అభిప్రాయపడింది. కానీ, ఎన్నికల్లో తాము ఎన్నుకోబోయే అభ్యర్థులకు నిధులు ఎక్కడి నుంచి అందుతున్నాయో తెలుసుకునే హక్కు ప్రజలకుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
పారదర్శకత పేరిట నాశనం చేయలేరు
న్యూఢిల్లీ: దాపరికంతో కూడిన వ్యవస్థను ఎవరూ కోరుకోరని, అదే సమయంలో పారదర్శకత పేరిట న్యాయ వ్యవస్థను నాశనం చేయలేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి వస్తుందని గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తూ గురువారం పైవిధంగా స్పందించింది. సుప్రీంకోర్టు సెక్రెటరీ జనరల్, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి 2010లో ఈ పిటిషన్లు వేశారు. తాజాగా జరిగిన విచారణలో ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్, ఆర్టీఐ కార్యకర్త అగ్రావాల్ తరఫున లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదించారు. సీజే జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును నిలుపుదలలో ఉంచింది. ఎవరూ అజ్ఞాతంలో ఉండాలని కోరుకోరని, సమాచారం ఎప్పుడు ఇవ్వాలి? ఎప్పుడు ఇవ్వకూడదనే విషయంలో స్పష్టమైన రేఖ గీసుకోవాలని బెంచ్ సూచించింది. ఆర్టీఐ కింద న్యాయ వ్యవస్థ సమాచారం బహిర్గతం చేయకపోవడం విచారకరమని, జడ్జీలు ఏమైనా వేరే విశ్వంలో నివసిస్తున్నారా అని ప్రశాంత్ భూషణ్ ప్రశ్నించారు. ప్రభుత్వ విభాగాలు పారదర్శకతతో వ్యవహరించాలని సూచించిన సుప్రీంకోర్టు తన విషయం వచ్చే సరికి వెనకడుగు వేస్తోందని అన్నారు. -
ముందుగా కేంద్ర అభ్యంతరాల పరిశీలన
న్యూఢిల్లీ: రఫేల్ కేసు విషయంలో కేంద్రం లేవనెత్తిన ప్రాథమిక అభ్యంతరాలను తాము ముందుగా పరిశీలిస్తామనీ, ఆ తర్వాత రఫేల్ ఒప్పందంపై పునఃసమీక్ష కోసం వచ్చిన పిటిషన్లలోని అంశాలపై విచారిస్తామని సుప్రీంకోర్టు గురువారం చెప్పింది. అక్రమంగా పొందిన కొన్ని ప్రత్యేక పత్రాల్లోని సమాచారం ఆధారంగా రఫేల్ కేసుపై పునఃసమీక్ష చేయాలంటూ పిటిషనర్లు కోరజాలరంటూ కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే. ఈ కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం వాదనలు వినడాన్ని ముగించింది. ముందుగా తాము కేంద్రం అభ్యంతరాలను పరిశీలిస్తామనీ, అవి సరైన అభ్యంతరాలు అయితే తాము రఫేల్ ఒప్పందంపై పునఃసమీక్ష జరపబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ కేంద్రం అభ్యంతరాలు అనవసరమైనవని అనిపిస్తేనే పునఃసమీక్ష పిటిషన్లపై విచారణ జరుపుతామంది. దీంతో ఈ అంశంపై తీర్పు ఎప్పుడు వస్తుందో భవిష్యత్తులోనే తెలియనుంది. విచారణ ప్రారంభంలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదిస్తూ రఫేల్ ఒప్పంద పత్రాలు ప్రత్యేకమైనవనీ, వాటిని సంబంధిత విభాగం అనుమతి లేకుండా ఎవరూ సుప్రీంకోర్టుకు సమర్పించకూడదని అన్నారు. అయితే ఆ పత్రాలు ఇప్పటికే ప్రజల్లోకి వచ్చేశాయనీ, ఇప్పుడు అవి ప్రత్యేకమైనవి కావని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. కేంద్రం అభ్యంతరాలు దురుద్దేశంతో కూడుకున్నవనీ, అవి కోర్టులో నిలువవని ఆయన అన్నారు. అలాగే భారత ప్రెస్ కౌన్సిల్ చట్టం ప్రకారం తమకు సమాచారాన్ని ఎవరిచ్చారో విలేకరులు చెప్పాల్సిన అసవరం లేదనీ, సమాచార వనరులకు ఇది రక్షణ కల్పిస్తుందన్నారు. -
దొంగిలించలేదు.. జిరాక్స్ తీశారంతే!
న్యూఢిల్లీ: భారత రక్షణశాఖ కార్యాలయం నుంచి రఫేల్ ఒప్పంద పత్రాలు దొంగతనానికి గురయ్యాయని చెప్పిన అటార్నీ జనరల్ వేణుగోపాల్ మాటమార్చారు. రఫేల్ ఒప్పందానికి సంబంధించిన పత్రాల ఫొటోకాపీలను మాత్రమే తీసుకెళ్లారని, నిజమైన పత్రాలు రక్షణశాఖ ఆఫీసులోనే ఉన్నాయని చెప్పారు. ‘రక్షణశాఖ నుంచి రఫేల్ ఒప్పంద పత్రాలు అదృశ్యమయ్యాయని నేను సుప్రీంకోర్టుకు చెప్పినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని తెలిసింది. ఇది ఎంత మాత్రం నిజం కాదు. యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, ప్రశాంత్ భూషణ్ దాఖలుచేసిన పిటిషన్‌కు రఫేల్ ఒప్పంద పత్రాల ఫొటోకాపీలను జతచేశారు’ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా స్పందిస్తూ..‘మోదీ ప్రభుత్వపు ఏజీకి రఫేల్ పత్రాల దొంగతనం, ఫొటోకాపీలకు మధ్య వ్యత్యాసం తెలియదు. భారత్ సురక్షితమైన చేతుల్లో ఉందని ఆ ప్రభుత్వమే ప్రజలకు హామీ ఇస్తోంది. మోదీజీ ఈ మోసం ఏంటి? ఇప్పటివరకూ అనితరసాధ్యమైన అబద్ధాలన్నీ ఇప్పుడు సుసాధ్యంగా కనిపిస్తున్నాయి’ అని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ, అబద్ధాలు పర్యాయపదాలని బీజేపీ చీఫ్ అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పటేల్ విగ్రహం చైనాలో రూపొందించారంటూ రాహుల్ అబద్ధం చెప్పారన్నారు. -
అటార్నీ జనరల్ వ్యాఖ్యలను ఖండించిన ఐజేయూ
సాక్షి, హైదరాబాద్: అధికారిక రహస్యాల చట్టం కింద ‘ద హిందూ’పత్రికపై చర్యలు తీసుకుంటామంటూ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వ్యాఖ్యానించడాన్ని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) తీవ్రంగా ఖండించింది. రఫేల్ ఒప్పందంలోని దొంగలించిన డాక్యుమెంట్ల ఆధారంగా కథనాలు రాశారని ఆరోపిస్తూ ఈ హెచ్చరికలు చేయడం సరికాదని ఐజేయూ అధ్యక్షుడు, భారత ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు దేవులపల్లి అమర్, సెక్రటరీ జనరల్ సబీనా ఇంద్రజిత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టులోనే వేణుగోపాల్ వ్యాఖ్యలు చేయడాన్ని బట్టి ప్రభుత్వంలోని అవకతవకలను బయటపెట్టకుండా మీడియాకు, వర్కింగ్ జర్నలిస్టులకు పరోక్షంగా హెచ్చరిస్తున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని బెంచ్ ముందే అటార్నీ జనరల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. అటార్నీ జనరల్ తన ప్రకటనను వెనక్కు తీసుకుని రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులను గౌరవించాలని వారు డిమాండ్ చేశారు. ప్రపంచంలోని ఏ శక్తి కూడా తమ వార్త కథనాలకు ఆధారాలను బయటపెట్టమని ఒత్తిడి చేయరాదని హిందూ పత్రిక అధినేత ఎన్.రామ్ చేసిన ప్రకటనకు వారు తమ పూర్తి మద్దతు ప్రకటించారు. -
‘రఫేల్’ ఒప్పందంపై ‘ఫేక్’ వాదనలు
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునర్ సమీక్షించాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను.. పరిగణనలోకి తీసుకోకూడదంటూ ప్రభుత్వ అటార్నీ జనరల్ కేకే వేణు గోపాల్ బుధవారం కోర్టు ముందు చేసిన వాదన చిత్రంగా ఉంది. ‘రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం పత్రాలను రక్షణ శాఖ నుంచి ఎవరో తస్కరించారు. అందులోని అంశాలను హిందూ ఆంగ్ల దిన పత్రిక ప్రచురిస్తే వాటిని ఆధారంగా చేసుకొని ప్రశాంత భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. అక్రమంగా సాధించిన డాక్యుమెంట్లను ఆధారం చేసుకున్నందున ఆ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోకూడదు. పైగా ఆ డాక్యుమెంట్లలోని అంశాలను హిందూ పత్రిక ప్రచురించడం అనేది అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుంది. ఆ మేరకు ఆ పత్రికపై చర్య తీసుకోవచ్చు’ అన్నది అటార్నీ జనరల్ చేసిన వాదన. పిటిషన్లో సవాల్ చేసిన లేదా లేవనెత్తిన అంశాల్లో బలం ఉందా, లేదా ? అవి తప్పా, ఒప్పా ? అని వాదించాల్సిన అటార్నీ జనరల్, అవి దొంగలించినవి, అవి అక్రమంగా సంపాదించినవి అనడం చిత్రమే కాదు, అవివేకం కూడా. రఫేల్ పత్రాలను దొంగలించారంటే, ఆ లెక్కన ప్రశాంత్ భూషణ్ పిటిషన్లో ప్రస్తావించిన అంశాలన్నీ నిజమని తేలినట్లే. పత్రిక మీద అధికార రహస్యాల చట్టం కింద చర్య తీసుకోమని సూచించడం అంటే కేంద్రానికి మద్దతుగా ఏదో దాస్తున్నట్లే లెక్క! మరో పక్క ఇది పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమే.(రఫేల్ పత్రాలు చోరీ) 1923 నాటి చట్టం ఏమి చెబుతోంది? భారత దేశానికి స్వాతంత్య్ర రాకముందు బ్రిటీష్ హయాంలో అంటే, 1923లో అధికార రహస్యాల చట్టం అమల్లోకి వచ్చింది. జాతీయ భద్రతా లేదా జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు నాటి నుంచి నేటి వరకు పాలకులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వాలు ఇరుకున పడినప్పుడల్లా ఈ చట్టాన్ని ఆశ్రయించడం పరిపాటిగా మారిపోయింది. పైగా 2005లో తీసుకొచ్చిన సమాచార హక్కుకు ఈ అధికార రహస్యాల చట్టం పూర్తి భిన్నంగా ఉంది. ఈ చట్టాన్ని సమీక్షించాల్సిందిగా ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వమే 2015లో చట్టం సమీక్షకు ఓ ప్యానెల్‌ను నియమించింది. ఆ ప్యానెల్ సమీక్ష ఎంతవరకు వచ్చిందో తెలియదు. ఇంకెంత కాలం పడుతుందో తెలియదు. ఈ నేపథ్యంలో రెండు చట్టాలు పరస్పరం భిన్నంగా ఉన్నందున ప్రభుత్వ ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. గతంలో కేసులు భారత సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని మిలిటెంట్లకు అందజేశారన్న ఆరోపణలపై ఓ కశ్మీర్ జర్నలిస్ట్‌పై అధికార రహస్యాల చట్టం కింద 2006లో కేసు పెట్టారు. దర్యాప్తు సందర్భంగా ఆ సమాచారం ఎంత మాత్రం రహస్యమైనది కాదని, అది ప్రజలందరికి అందుబాటులో ఉన్న సమాచారమేనని తేలింది. పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన కేబినెట్ నోట్‌ను బయట పెట్టినందుకు 1998లో కూడా ఓ జర్నలిస్టుపై ఈ చట్టం కింద కేసు పెట్టి వేధించారు. అమెరికా సుప్రీం కోర్టు ఏమి తీర్పు ఇచ్చింది ? ‘వియత్నాంతో ఎన్నేళ్లు యుద్ధం చేసినా విజయం సాధించడం కష్టం. రాజకీయ ప్రయోజనాల కోసం యుద్ధం చేయక తప్పడం లేదు. వేలాది మంది యువకుల ప్రాణాలు వృథా అవుతున్నాయి. ప్రాణ నష్టంతోపాటు ఎంతో అర్థిక నష్టం జరుగుతోంది’ అన్న కీలక సమాచారం కలిగిన ప్రభుత్వ రహస్య డాక్యుమెంట్లు అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కాలంలో అమెరికాలోని ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రికకు దొరికాయి. వాటిని ప్రచురించాలా, వద్దా ? అని అప్పటి ఎడిటర్ ఇన్ చీఫ్ బెన్ బ్రాడ్లీ సంశయించారు. చివరకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రచురించాలని నిర్ణయించుకొని వరుసగా ప్రచురించారు. అందులో ఓ భాగాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక కూడా ప్రచురించింది. జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఆ రెండు పత్రికలపైనా అమెరికా ప్రభుత్వం ‘యూఎస్ ఎస్పనేజ్ యాక్ట్’ కింద కేసులు పెట్టింది. పత్రికా స్వేచ్ఛ ప్రకారం ఆ డాక్యుమెంట్లను ప్రచురించడంలో తప్పు లేదంటూ తొమ్మిది మంది సభ్యులు గల అమెరికా జ్యూరీ 6-3 తేడాతో మెజారిటీ తీర్పు చెప్పింది. ‘ది పోస్ట్’ పేరిట సినిమా పత్రికల న్యాయపోరాటాన్ని ఇతివృత్తంగా తీసుకొని హాలివుడ్ ప్రముఖ దర్శక, నిర్మాత స్టీవెన్ స్పీల్బెర్గ్ ‘ది పోస్ట్’ చిత్రాన్ని నిర్మించారు. 2017లో విడుదలైన ఈ చిత్రంలో పత్రికా సంపాదకుడిగా టామ్ హాంక్స్ నటించారు. పలు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు అందుకున్న ఈ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అయినా అవార్డులు మాత్రం రాలేదు. -
రఫేల్ పత్రాలు చోరీ
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ దగ్గరి నుంచి దొంగతనానికి గురయ్యాయని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఆ చోరీకి గురైన పత్రాల్లోని సమాచారం ఆధారంగానే ‘ద హిందూ’ పత్రిక రఫేల్‌పై కథనాలు రాసి అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించిన నేరానికి పాల్పడిందని అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. రఫేల్ వ్యవహారం మొత్తం రక్షణ పరికరాలను సమకూర్చుకోవడానికి సంబంధించినది కాబట్టి అసలు ఈ కేసుపై న్యాయసమీక్ష జరపడమే సాధ్యం కాదని ఏజీ అన్నారు. రఫేల్ ఒప్పందంపై వచ్చిన ప్రజాహిత వ్యాజ్యా(పిల్)లను గతేడాది డిసెంబర్ 14న సుప్రీంకోర్టు తిరస్కరించడం తెలిసిందే. ఆ సమయంలో కేంద్రం కొన్ని కీలక వాస్తవాలను దాచిపెట్టిందనీ, ఇప్పుడు ద హిందూ పత్రిక కథనాలతో అవన్నీ వెలుగులోకి వచ్చినందున పిల్లను విచారణకు స్వీకరించడంపై పునరాలోచించాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు సంయుక్తంగా పిటిషన్ వేశారు. ఆ వాస్తవాలు అప్పుడే బయటకొచ్చి ఉంటే సుప్రీంకోర్టు ఆ పిల్లను కొట్టివేసేది కాదని వారు పిటిషన్లో పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును బుధవారం విచారించింది. ఈ సందర్భంగా ఏజీ తన వాదన వినిపిస్తూ ‘రఫేల్ పత్రాల దొంగతనం కేసులో విచారణ జరుగుతోంది. ఇప్పటికైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. రఫేల్ ఒప్పందం వివరాలు రహస్యమైనవి. వాటిని ప్రజా బాహుళ్యంలో పెట్టడం ద్వారా అధికారిక రహ్యసాల చట్టాన్ని ఉల్లంఘించడం, కోర్టు ధిక్కార నేరాలకు పాల్పడినట్లైంది. రహస్యం అన్న పదాన్ని తొలగించి వారు కథనాలు ప్రచురించారు’ అని తెలిపారు. కోర్టు విచారణను ప్రభావితం చేయడమే లక్ష్యంగా వార్తా కథనాలు వచ్చాయన్నారు. గత నెల 8 నుంచి ఇప్పటివరకు ద హిందూ పత్రిక రఫేల్‌పై పలు సంచలన కథనాలను ప్రచురించడం తెలిసిందే. ఈ వాదనలు జరిగిన బుధవారమే తాజాగా మరో కథనం వెలువడింది. అవినీతి జరిగితే చట్టాన్ని అడ్డుపెట్టుకుంటారా? ఏజీ వాదనలపై న్యాయమూర్తులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. చోరీకి గురైన పత్రాల్లోని సమాచారం ఆధారంగా కథనాలు వచ్చాయని ఏజీ వెల్లడించడంతో ‘ఆ విషయం ఇప్పుడెందుకు చెబుతున్నారు? ఇప్పటివరకు ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఇన్ని రోజుల్లో ఏమేం చర్యలు తీసుకున్నారో చెప్పండి.’ అని జడ్జీలు ప్రశ్నించారు. ‘రఫేల్ ఒప్పందంలో అవినీతి జరిగి ఉంటే, దానిని కప్పిపుచ్చుకోడానికి అధికారిక రహస్యాల చట్టాన్ని అడ్డుపెట్టుకుంటారా? అవినీతి జరిగిందని నేననడం లేదు. కానీ ఒకవేళ జరిగి ఉంటే, ప్రభుత్వం చట్టాన్ని తమకు రక్షణగా ఉపయోగించుకోజాలదు’ అని జస్టిస్ గొగోయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణను కోర్టు ఈ నెల 14న కొనసాగించనుంది. ఆ సమాచారం ఎక్కడిదో చెప్పం: ఎన్.రామ్ న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందంపై కీలక సమాచారాన్ని తమకు అందించిన వర్గాల వివరాల్ని బహిర్గతం చేయలేమని ది హిందూ దినపత్రిక చైర్మన్ ఎన్.రామ్ తేల్చిచెప్పారు. రాజ్యాంగంలోని భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ 19(1)కు లోబడే రఫేల్ వివరాల్ని ప్రచురించామని సమర్థించుకున్నారు. ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం వివరాల్ని గోప్యంగా నిలిపి ఉంచే ప్రయత్నం జరిగిందని, అందుకే వాటిని బహిర్గతం చేశామని తెలిపారు. రఫేల్ పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి చోరీకి గురయ్యాయని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపిన నేపథ్యంలో రామ్ స్పందించారు. రఫేల్ ఒప్పందంపై ఆయన పలు కథనాలు రాశారు. అందులో బుధవారం కూడా ఒకటి ప్రచురితమైంది. ‘ రఫేల్ ఒప్పంద పత్రాలు తస్కరణకు గురయ్యాయని భావిస్తే మాకేం సంబంధం లేదు. మాకు ఆ సమాచారం కొన్ని విశ్వసనీయ వర్గాల నుంచి అందింది. మా వనరులను కాపాడుకునేందుకు కట్టుబడి ఉన్నాం. వారి గురించి మా నుంచి ఎవరూ సమాచారం పొందలేరు. మేము ప్రచురించిన పత్రాలు యధార్థమైనవి. ప్రజా ప్రయోజనాల రీత్యానే వాటిని వెలుగులోకి తెచ్చాం. ముఖ్యమైన అంశాలపై సంబంధిత సమాచారాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకురావడం పాత్రికేయుల విధి’ అని రామ్ అన్నారు. -
రఫేల్ డీల్: సుప్రీంకోర్టులో బాంబు పేల్చిన కేంద్రం
న్యూఢిల్లీ: వివాదాస్పద రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంలో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. రఫేల్ డీల్‌కు సంబంధించిన పత్రాలు చోరీకి గురయ్యాయని, వీటిని ప్రభుత్వ ఉద్యోగులే దొంగలించి ఉంటారని పేర్కొంది. రఫేల్ యుద్ధ విమానాలను ఎంతకు కొనుగోలు చేశారు? వాటి ధర ఎంత? అన్నది రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో రఫేల్ ధరలకు సంబంధించిన పత్రాలు రక్షణ మంత్రిత్వశాఖ నుంచి దొంగలించబడ్డాయని, ప్రచురణ కోసం ఈ పత్రాలను ‘ది హిందూ’ న్యూస్‌పేపర్‌కు అందించారని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. రఫేల్ ఒప్పందంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్లో.. దొంగలించిన పత్రాల నుంచి సేకరించిన విషయాలు ఉన్నాయని, కాబట్టి ఆయన పిటిషన్ కొట్టివేయాలని వేణుగోపాల్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. పత్రాలు దొంగలించిన వారు.. అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు దోషులుగా మారుతారని ఆయన తెలిపారు. అయితే, ఈ విషయంలో చట్టపరమైన ఉల్లంఘనలేమీ లేవని, ఈ పత్రాల్లోని సమాచారం సమాచార హక్కు చట్టం పరిధిలోనేదేనని ప్రశాంత్ భూషణ్ కోర్టుకు స్పష్టం చేశారు. ఫ్రెంచ్ నుంచి యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఉద్దేశించిన రఫేల్ ఒప్పందంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం కొనసాగిన సంగతి తెలిసిందే. -
ఇద్దరూ పిల్లుల్లా కొట్లాడుకున్నారు!
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్తానాలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో దేశ ప్రజల ముందు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) నవ్వులపాలయిందని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య కీచులాటతో సీబీఐ ప్రతిష్ట దెబ్బతిందని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనానికి విన్నవించుకున్నారు. సీబీఐపై చెదిరిన ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడమే కేంద్రప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ పేర్కొన్నారు. తనను సీబీఐ డైరెక్టర్‌గా తొలగించడంపై అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ సందర్భంగా వేణుగోపాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలోక్ వర్మ, అస్తానాల గొడవతో సీబీఐలో అసాధారణ పరిస్థితి నెలకొందనీ, ఇద్దరు పిల్లుల్లా కొట్లాడుకోవడంతో కేంద్రం జోక్యం చేసుకోవడం మినహా మరే ప్రత్యామ్నాయం లేకపోయిందని ఈ సందర్భంగా వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. ఒకవేళ తాము కల్పించుకోకుంటే ఏం జరిగేదో ఆ దేవుడికే తెలుసన్నారు. చట్టానికి లోబడే ఇద్దరు ఉన్నతాధికారులపై కేంద్రం చర్యలు తీసుకుందన్నారు. సీబీఐలో పరస్పరం అవినీతి ఆరోపణలు గుప్పించుకున్న అలోక్ వర్మ, అస్తానాలను కేంద్రం సెలవుపై పంపిన సంగతి తెలిసిందే. -
సుప్రీంకోర్టు తీరుపై అటార్నీ జనరల్ నిరసన
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు వ్యవహారశైలిపై అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ సోమవారం అసహనం వ్యక్తం చేశారు. చాలా పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం పరిశీలించకుండానే కొట్టివేస్తోందని నిరసన తెలిపారు. రాజస్తాన్ ప్రభుత్వం తరఫున పన్ను చెల్లింపులకు సంబంధించి ఓ కేసులో వాదించేందుకు వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పిటిషన్ విచారణకు కోర్టు సుముఖంగా లేకపోవడంపై స్పందిస్తూ..‘ప్రజలు వేలాది కిలోమీటర్ల దూరం నుంచి న్యాయస్థానానికి వస్తున్నారు. కానీ మీరు మాత్రం కనీసం వారి వాదనలు వినకుండానే పిటిషన్లను కొట్టివేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. కనీసం పిటిషనర్ల వాదనలైనా కోర్టు వినాలి. ఇది ప్రభుత్వ ఆదాయానికి సంబంధించిన కేసు. కానీ సీజేఐ మాత్రం ప్రతివాదికి నోటీసు జారీచేసేందుకు ఆలోచిస్తున్నారు’ అని తెలిపారు. వెంటనే సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్ల ధర్మాసనం స్పందిస్తూ..‘సరే మిస్టర్ వేణుగోపాల్.. మీ వ్యాఖ్యలను సానుకూల దృష్టితో పరిగణనలోకి తీసుకుంటున్నాం. వాదనలు వినిపించండి. మేం పిటిషన్‌ను పరిశీలించలేదని భావించకండి. దాన్ని పొరపాటుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. కానీ కచ్చితంగా పరిశీలిస్తాం’ అని వ్యాఖ్యానించింది.