Supreme Court stays Bombay High Court Judgmenton on ‘Skin-To-Skin’ Contact - Sakshi

బాలిక ఛాతిపై తాకడం నేరంకాదు : హైకోర్టు

Jan 27 2021 2:26 PM | Updated on Jan 27 2021 4:28 PM

Supreme Court stays Bombay High Court judgment Over POCSO - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పన్నెండేళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. నాగపూర్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై దేశ వ్యాప్తంగా నిరసన స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వివాదాస్పదంగా మారిన అంశంపై తుది విచారణ ముగిసే వరకు స్టే విధిస్తున్నట్లు తెలిపారు. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆందోళనకరంగా ఉందని, దీనిపై మరోసారి సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని కేకే వేణుగోపాల్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా మహారాష్ట్రకు చెందిన 12 ఏళ్ల మైనర్‌ బాలికపై లైంగిక వేధింపుల కేసులో విచారణ జరిపిన జస్టిస్‌ పుష్పా గనేడివాలా ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు పెను దుమారానికి దారితీసింది. ఈ తీర్పుపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు తీర్పుపై ఆందోళన సైతం వ్యక్తం చేశారు. (వివాదాస్పదం: అక్కడ తాకితే నేరం కాదు)

కేసు పూర్వపరాలు.. 39 ఏళ్లు ఓ వ్యక్తి 12 ఏళ్ల బాలికను పండు ఆశచూపు ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం తలుపులన్నీ మూసి ఆమె ఛాతీభాగాన్ని నొక్కాడు. అంతేకాకుండా బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. కామాంధుడి కోరికను పసిగట్టిన బాలిక పెద్దగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి అతనికి దేహశుద్ధి చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌) చట్టం-2012 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దిగువ న్యాయస్థానంలో నిందితుడిని ప్రవేశపెట్టారు.  ఐపీసీ సెక్షన్‌ 354 కేసు కింద కూడా అతడిపై మరో కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షను విధించింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును దోషిగా తేలిన వ్యక్తి బాంబే హైకోర్టు నాగపూర్‌ బెంచ్‌లో తీర్పును సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ పుష్ప ఈనెల 19న తుది తీర్పును వెలువరించారు. (చర్మాన్ని చర్మం తాకలేదు గనుక..)

ఈ సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ‘దుస్తుల పై నుంచి చిన్నారి ఒంటిని తాకినంత మాత్రాన అది పోక్సో చట్టం ప్రకారం నేరంగా పరిగణించలేం. చర్మాన్ని చర్మం తాకాలి, కానీ ఈ కేసులో అలా జరగలేదు. స్కిన్‌–టు–స్కిన్‌ కాంటాక్టు లేదు. దుస్తుల లోపల చేతులు పెట్టినట్టి కూడా ఆధారాలు లేవు. పోక్సో చట్టం కింద నమోదైయ్యే కేసుల్లో ఆధారాలు పక్కాగా ఉండాలి’ అని జస్టిస్‌ పుష్ప తన తీర్పు సందర్భంగా పేర్కొన్నారు. చిన్నారుల ఒంటిని తాకకూడని చోట తాకడం పోక్సో చట్టం కింద నేరం అవుతాయి కనుక, అతడు ఆ పని చేయలేదని ఈ చట్టం ప్రకారం అతడు నిర్దోషే అని తీర్పును వెలువరించారు. ఐపీసీ సెక్షన్‌ 354 కింద మాత్రమే అతడిని నేరస్థుడిగా గుర్తిస్తామని పేర్కొన్నారు. ఈ తీర్పుపై సినీ నటి తాప్సితో పాటు గాయని చిన్మయి వంటి వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత సమయంలో ఇలాంటి తీర్పులు రావడం ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు. దీనిపై యూత్‌ బార్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ ఇండియా సైతం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement