ఆశారాం బాపు శిక్ష రద్దు పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: టీనేజీ అమ్మాయిలపై లైంగిక దాడులు, అత్యాచారం ఆరోపణల్లో దోషిగా తేలి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వివాదాస్పద గురువు ఆశారాం బాపు తన శిక్షను రద్దుచేయాలంటూ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయంలో తామేమీ వినదల్చుకోలేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ఏదైనా ఉపశమనం కావాలంటే రాజస్థాన్ హైకోర్టుకు వెళ్లండి’’ అని స్పష్టం చేసింది.
అయితే ఈ మేరకు ఆశారం గతంలో పెట్టుకున్న పిటిషన్లను రాజస్థాన్ హైకోర్టు నాలుగుసార్లు కొట్టేసిందని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆశారాం శిక్ష రద్దుచేసి మహారాష్ట్ర ఆస్పత్రిలో వైద్యానికి అవకాశం ఇవ్వాలని కోరారు. తామేమీ చేయలేవని, మళ్లీ హైకోర్టుకే వెళ్లాలని ధర్మాసనం స్పష్టం చేసింది. 2013 ఏడాదిలో తన ఆశ్రమంలో టీనేజీ అమ్మాయిని రేప్ చేశాడనే కేసులో అదే ఏడాది అరెస్టయి 2018లో పోక్సో కోర్టు యావజ్జీవ శిక్ష విధించిన నాటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment