
న్యూఢిల్లీ: ప్రత్యక్ష ఎన్నికల్లో వ్యక్తిగత ఓటరు కోసం ఉద్దేశించిన నోటాను రాజ్యసభ ఎన్నికల్లోనూ వినియోగించడంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నోటా వినియోగాన్ని ప్రశ్నిస్తూ గుజరాత్ మాజీ కాంగ్రెస్ చీఫ్ శైలేశ్ పర్మార్ వేసిన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం.. ఈసీకి ఈ ప్రశ్న వేసింది.
‘ఓ రాజ్యాంగబద్ధమైన సంస్థ.. రాజ్యాంగవ్యతిరేక చర్యలో ఎందుకు భాగస్వామి కావాలి? రాజ్యభ ఎన్నికల్లో ఓ ఎమ్మెల్యే ఓటేయకపోతే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశముంది. కానీ నోటాను ప్రవేశపెట్టడం ద్వారా ఆ వ్యక్తి ఓటేయకుండా మీరు (ఈసీ) ఎలా ప్రోత్సహిస్తారు. ఓటు వేయాలా వద్ద అనేది సభ్యుడి విచక్షణ. ఎన్నికల సంఘం నోటా ఆప్షన్ ఇవ్వకూడదు. రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహిరంగ బ్యాలట్ ఓటింగ్ ద్వారా అవినీతికి జరకుండా క్రాస్ ఓటింగ్‌కు ఆస్కారం లేకుండా చేయవచ్చు. మీరెందుకు అనవసరంగా ఇబ్బందులు కొనితెచ్చుకుంటారు’ అని పేర్కొంది.
దీనిపై అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కూడా.. రాజ్యసభ ఎన్నికల్లో నోటా ఉండాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ‘ఓ పార్టీ మరో పార్టీతో ముందుస్తు అవగాహన ఆధారంగా ఓటు వేస్తుంది. పార్టీ విప్ జారీ చేస్తే ఎమ్మెల్యే కట్టుబడి ఉండాల్సిందే. అలాంటప్పుడు నోటాకు అర్థమేముంద’ ని పేర్కొన్నారు. కాంగ్రెస్ తరపున అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు కూడా విన్న ధర్మాసనం తీర్పును రిజర్వులో పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment