న్యాయవ్యవస్థలో అసమానతలు | Low Priority To Women Staff In Indian Judiciary | Sakshi
Sakshi News home page

న్యాయవ్యవస్థలో అసమానతలు

Published Sat, Dec 5 2020 12:43 AM | Last Updated on Sat, Dec 5 2020 12:48 AM

Low Priority To Women Staff In Indian Judiciary - Sakshi

చాలా ఆలస్యంగానే కావొచ్చు... ఒక అర్థవంతమైన చర్చకు తెరలేచింది. న్యాయవ్యవస్థలో మహిళ లకు అతి తక్కువ ప్రాతినిధ్యం వున్నదని స్వయానా అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ సుప్రీం కోర్టులో ఎత్తిచూపారు. ఈ పరిస్థితిని మార్చాలని సూచించారు. ఆయన చెప్పిన వివరాలు దిగ్భ్రాంతి కలిగిస్తాయి. సుప్రీంకోర్టులోనూ, వివిధ హైకోర్టుల్లోనూ మొత్తం న్యాయమూర్తుల పదవులు 1,113 వుంటే అందులో కేవలం 80 మంది మాత్రమే మహిళలు. సుప్రీంకోర్టులో 34 న్యాయమూర్తుల పదవులుంటే అందులో ఇద్దరు మాత్రమే మహిళలు. ట్రిబ్యునల్స్‌కి సంబంధించిన లెక్కలు లేనేలేవు. వాటిల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితి వుంటుందని అనుకోనవసరం లేదు. ఇది దాటి సీనియర్‌ న్యాయవాదుల విషయానికొస్తే అందులోనూ మహిళలు అతి తక్కువ.

ఈ దుస్థితిని గురించి ఇంతవరకూ అసలు చర్చే జరగలేదని అనడం సరికాదు. ఎందరో సామాజిక కార్యకర్తలు లోగడ పలు సందర్భాల్లో చెప్పారు. మొన్న సెప్టెంబర్‌లో లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కూడా దేశంలో మహిళా న్యాయమూర్తులు తగిన సంఖ్యలో లేకపోవడాన్ని వివరంగానే చెప్పారు. రాజ్యాంగానికి సంబంధించిన మూడు మూలస్తంభాల్లో మిగిలిన రెండూ... కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థల్లో పరిస్థితి ఎంతో కొంత నయమే. 2007లో రాష్ట్రపతి పీఠాన్ని  ప్రతిభాపాటిల్‌ అధిరోహించారు. అంతకు చాన్నాళ్లముందే... అంటే 60వ దశకంలోనే ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. ఎన్నో రాష్ట్రాలకు మహిళా ముఖ్యమంత్రులు వచ్చారు. గవర్నర్‌ లుగా కూడా పనిచేస్తున్నారు. కానీ మహిళలకు అవకాశం ఇవ్వడంలో న్యాయవ్యవస్థ వెనకబడింది. స్వాతంత్య్రం వచ్చిన దగ్గరనుంచీ చూస్తే ఒక మహిళ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడానికి నాలుగు దశాబ్దాలు పట్టింది.

జస్టిస్‌ ఫాతిమా బీవీ 1989లో సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయ మూర్తి. రెండేళ్లక్రితం న్యాయవాద వృత్తినుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన జస్టిస్‌ ఇందూ మల్హోత్రా సంగతే తీసుకుంటే 68 ఏళ్లలో అలా ఎంపికైన తొలి మహిళా న్యాయమూర్తి ఆమెనే! మొన్న జూలైలో జస్టిస్‌ భానుమతి రిటైర్‌కాగా ప్రస్తుతం జస్టిస్‌ ఇందూ మల్హోత్రాతోపాటు మరో మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఇందిరా బెనర్జీ మాత్రమే వున్నారు. ఈ ఇద్దరూ ప్రధాన న్యాయమూర్తి పదవి అధిష్టించకుండానే రిటైరవుతారు. అంటే ఇంతవరకూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మహిళలు లేనేలేరు. సమీప భవిష్యత్తులో కూడా వుండే అవకాశం లేదు. ఇంత కన్నా అన్యాయం మరొకటుందా?

కెకె వేణుగోపాల్‌ మహిళా న్యాయమూర్తుల గురించి చర్చ లేవనెత్తిన సందర్భాన్ని చూడాలి. మధ్యప్రదేశ్‌లో ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించి అరెస్టయిన వ్యక్తికి బెయిల్‌ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి విచిత్రమైన ఉత్తర్వులిచ్చారు. అతగాడికి బెయిల్‌ మంజూరు చేస్తూ ఆ న్యాయమూర్తి ఒక షరతు పెట్టారు. నిందితుడు బాధిత మహిళ ఇంటికెళ్లి ఆమెకు రాఖీ కట్టాలన్నది దాని సారాంశం. అంతేకాదు... పోతూ పోతూ ఆమెకు, ఆమె కుమారుడికి స్వీట్లు తీసుకెళ్లాలట! ఈ ఉత్తర్వులపై అక్కడున్న న్యాయవాదులు స్పందించినట్టు లేదు.

కానీ సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదులు 8మంది మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఉత్తర్వులను సర్వో న్నత న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. ఆ మహిళ పడిన మానసిక హింసనూ, క్షోభనూ న్యాయ స్థానం చాలా చిన్న అంశంగా పరిగణించడం సరికాదని విన్నవించారు. ఈ విషయంలో న్యాయస్థానానికి తోడ్పడాలని సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన సూచనకు స్పందిస్తూ మహిళా న్యాయమూర్తుల సంఖ్య సరిగా లేకపోవడాన్ని వేణుగోపాల్‌ ప్రస్తావించారు. ఆయన చెప్పిన అంశాన్ని చాలా విస్తృతార్థంలో చూడాలి. భిన్న వర్గాలుగా వుండే సమాజంలో నిత్యం ఏవో సమ స్యలు, సంక్షోభాలూ తప్పవు. వాటికి ఎప్పటికప్పుడు మెరుగైన పరిష్కారాలు సాధించాలంటే, సమాజం ఉన్నత ప్రమాణాలతో ముందుకు సాగాలంటే అన్ని వర్గాల ప్రజల్లోనూ వ్యవస్థలపై విశ్వాసం ఏర్పడాలి.

ఆ వ్యవస్థల్లో తమకూ భాగస్వామ్యం వున్నదని, తామెదుర్కొంటున్న సమస్యలకు వాటి పరిధిలో పరిష్కారం లభిస్తుందని అందరిలోనూ నమ్మకం కలిగినప్పుడే ఏ సమాజమైనా సజావుగా మనుగడ సాగిస్తుంది. అందుకు భిన్నమైన స్థితి వుంటే ఒకరకమైన అనిశ్చితి, భయాందోళనలు నెలకొంటాయి. కులం, మతం, ప్రాంతం, జెండర్‌ వంటి వివక్షలు ఏ వ్యవస్థలోనైనా కొనసాగు తున్నాయన్న అభిప్రాయం పౌరుల్లో ఏర్పడితే అది ఆ వ్యవస్థకే చేటు తెస్తుంది. కనుకనే వేణుగోపాల్‌ లేవనెత్తిన అంశాన్ని సుప్రీంకోర్టు పట్టించుకోవాల్సిన అవసరం వుంది. తీర్పులు వెలువరించే ముందు బాధితుల స్థానంలో వుండి ఆలోచించేలా న్యాయమూర్తులకు అవగాహన పెంచాలన్న ఆయన సూచన మెచ్చదగ్గది.


దాదాపు దశాబ్దంక్రితం సైన్యంలో పురుషులతో సమానంగా తమకు బాధ్యతలు అప్పగించడం లేదని కొందరు మహిళలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈమధ్యే లైన్‌మన్‌ పోస్టులకు తమనెం దుకు పరిగణించరంటూ ఇద్దరు మహిళలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇలాంటి పిటి షన్లు విషయంలో న్యాయవ్యవస్థ బాగానే స్పందిస్తోంది. మంచి తీర్పులు వెలువడుతున్నాయి. కానీ తమదగ్గర వేళ్లూనుకున్న జెండర్‌ వివక్షను మాత్రం ఇన్ని దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక సమాజం ఏమేరకు ప్రగతి సాధించిందన్నది ఆ సమాజంలో మహిళలు సాధించిన ప్రగతినిబట్టే అంచనా వేస్తానని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ ఒక సందర్భంలో అన్నారు. ఆ కోణంలో చూస్తే మన సమాజం చాలా చాలా వెనకబడివున్నట్టు లెక్క.  కేంద్రం, సుప్రీంకోర్టు కూడా న్యాయవ్యవస్థలో వున్న ఈ అసమానతను సాధ్యమైనంత త్వరగా పట్టించుకుని సరిచేసే దిశగా అడుగులేస్తాయని ఆశిద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement