న్యూఢిల్లీ: ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ ఫైటర్‌జెట్ల కొనుగోలుపై దేశంలో రగడ నడుస్తున్న వేళ సుప్రీంకోర్టు బుధవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. రాఫెల్ ఫైటర్‌జెట్ల కొనుగోలు ఒప్పందం కోసం పాటించిన ప్రక్రియ వివరాలను సీల్డ్ కవర్‌లో ఈ నెల 29లోగా సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఒప్పందంలోని ఫైటర్‌జెట్ల ధర, ఇతర సాంకేతిక అంశాలను వెల్లడించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. న్యాయవాదులు వినీత్ ధండ, ఎంఎల్ శర్మ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాల(పిల్స్)ను సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ.. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాలను రాజకీయ దురుద్దేశాలతో దాఖలు చేశారనీ, వీటిని వెంటనే కొట్టివేయాలని కోరారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ..‘మేం రాఫెల్ ఫైటర్ జెట్ల ధర, అవి మన అవసరాలకు సరిపోతాయా? వంటి ప్రశ్నలు అడగడం లేదు. కేవలం ఈ ఒప్పందం కుదుర్చుకునేందుకు పాటించిన ప్రక్రియ చట్టబద్ధత గురించి మాత్రమే ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ రాఫెల్ కొనుగోలు ఒప్పందం సందర్భంగా పాటించిన పద్ధతిని తెలపాలని కోరితే మీరు(కేంద్రం) ఏమంటారు?’ అని ప్రశ్నించింది.
దీనికి వేణుగోపాల్ జవాబిస్తూ..‘ఫైటర్‌జెట్ల కొనుగోలు ఒప్పందంలోని నిబంధనలతో పాటు దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ వివరాలను ఎవ్వరికీ వెల్లడించలేం’ అని చెప్పారు. ‘ఒకవేళ ఒప్పందంలోని సాంకేతిక అంశాలు లేకుండా వివరాలు సమర్పించమని మేం కోరితే మీరేం చేస్తారు?’ అని అత్యున్నత న్యాయస్థానం మరోసారి ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో అటార్నీ జనరల్ స్పందిస్తూ..‘రాఫెల్ ఒప్పందంపై సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దేశంలోని ఏ ఒక్క నిరుపేద ప్రయోజనాలను ప్రస్తావించలేదు. ఇవన్నీ రాజకీయ దురుద్దేశంతో దాఖలు చేసిన పిటిషన్లు. పార్లమెంటులో కేంద్రం రాఫెల్ ఒప్పందంపై వివరణ ఇచ్చినప్పటికీ అవే ప్రశ్నలను పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ ఒప్పందంపై దేశంలో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఈ పిటిషన్లపై విచారణకు అనుమతిస్తే వీటిని రాజకీయ అస్త్రాలుగా వాడుకునే వీలుంది. ప్రభుత్వం తీసుకునే ఇలాంటి విధానపరమైన నిర్ణయాల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరాదు. ఒకవేళ కోర్టు ఇప్పుడు నోటీసులు జారీచేస్తే అది నేరుగా ప్రధానమంత్రికి వెళుతుంది. కాబట్టి దయచేసి ఈ పిటిషన్లను కొట్టివేయండి’ అని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా పిటిషనర్ ఎం.ఎల్.శర్మ వాదిస్తూ.. రాఫెల్ ఫైటర్ జెట్ల ధర సహా మిగిలిన ఒప్పంద వివరాలను ఫ్రాన్స్ ప్రభుత్వం ఇప్పటికే అక్కడి పార్లమెంటు ముందు ఉంచిందని తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌లో దాచిపెట్టడం సరికాదని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం.. ఈ పిటిషన్లలో ప్రస్తావించిన అంశాల లోతుకు తాము వెళ్లడం లేదని స్పష్టం చేసింది. అలాగే రాఫెల్ ఒప్పందం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేయబోమని తేల్చిచెప్పింది. రాఫెల్ ఫైటర్‌జెట్ల కొనుగోలు చట్టబద్ధతపై తాము సంతృప్తి చెందేందుకే ఈ సమాచారాన్ని కోరుతున్నామని వెల్లడించింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది. కదనరంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్న 36 రాఫెల్ జెట్లను రూ.58,000 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు కేంద్రం 2016, సెప్టెంబర్ 23న ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భారీ అవినీతి చోటుచేసుకుందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
నిర్మల పర్యటన అందుకే: రాహుల్
రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాన్ని సమర్థించేందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభమయ్యాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఇందులోభాగంగా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ పర్యటనకు వెళుతున్నారన్నారు.
రిలయన్స్ ఉంటేనే ఒప్పుకుంటాం!
రాఫెల్ ఒప్పందం కుదరాలంటే ఫ్రాన్స్‌కు చెందిన డసో ఏవియేషన్ తనకు భారత భాగస్వామిగా రిలయన్స్‌ను ఒప్పుకోవాల్సిందేనంటూ ఓ షరతు ఉన్న పత్రం తాజాగా తమకు లభించినట్లు ఓ ఫ్రెంచ్ మీడియా సంస్థ పేర్కొంది. రిలయన్స్‌ను డసోకు భారత భాగస్వామిగా మోదీ ప్రభుత్వమే ఎంపిక చేసిందనీ, మరో కంపెనీని తీసుకునే అవకాశం కూడా తమకు ఇవ్వలేదని గతంలో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ వెల్లడించడం.. ఆ తర్వాత రిలయన్స్‌ను తామే ఎంచుకున్నామని డసో వివరణ ఇవ్వడం తెలిసిందే. తాజాగా ఫ్రెంచ్ జర్నల్ ‘మీడియాపార్ట్’.. రాఫెల్ ఒప్పందంలో భారత భాగస్వామిగా రిలయన్స్‌ను తప్పనిసరిగా తీసుకోవాలని ఓ షరతు ఉన్నట్లుగా తెలిపే పత్రం తమకు దొరికిందని వెల్లడించింది.
రాఫెల్ కొనుగోలు వివరాలివ్వండి
Published Thu, Oct 11 2018 2:55 AM | Last Updated on Thu, Oct 11 2018 2:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment