న్యూఢిల్లీ: ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోలు ధర వివరాలను తమకు సీల్డ్ కవర్‌లో సమర్పించాలని సుప్రీంకోర్టు బుధవారం కేంద్రాన్ని ఆదేశించింది. రఫేల్ ధర విషయం వ్యూహాత్మకమనీ, దాన్ని రహస్యంగా ఉంచాలన్న కేంద్రం వాదనను అంగీకరించింది. ఈ ఒప్పందం వివరాలను 10 రోజుల్లోగా సమర్పించాలని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం ఆదేశించింది.
ఈ సందర్భంగా కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ వాదిస్తూ.. రఫేల్ ఒప్పందం ధర వివరాలు చాలా రహస్యమైన సమాచారమనీ, దాన్ని దేశ పార్లమెంటుతో కూడా పంచుకోలేదని కోర్టుకు తెలిపారు. ఈ వివరాలు అధికారిక రహస్యాల చట్టం–1923 పరిధిలోకి వస్తాయని వెల్లడించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, రఫేల్ ఒప్పందం సందర్భంగా పాటించిన విధివిధానాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలనీ, పిటిషనర్లకు అందజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే ఒప్పందంలోని వ్యూహాత్మక, రహస్య సమాచారాన్ని బయటపెట్టాల్సిన అవసరం లేదని పేర్కొంది.
ఒకవేళ రఫేల్ ధర వివరాలను అందజేయడం వీలుకాకపోతే అదే విషయాన్ని పిటిషన్ ద్వారా తెలియజేయాలని బెంచ్ తెలిపింది. పిటిషనర్లు రఫేల్ యుద్ధ విమానం పనితీరు, ఇతర సాంకేతిక అంశాలను కోరలేదనీ, కేవలం కొనుగోలు సందర్భంగా పాటించిన పద్ధతి, ధరపైనే స్పష్టత అడిగారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రఫేల్ కొనుగోలు ధర వివరాలను సీల్డ్ కవర్‌లో 10 రోజుల్లోగా సమర్పించాలని స్పష్టం చేసింది. సీబీఐలో ప్రస్తుతం కొనసాగుతున్న అనిశ్చితి ముగిశాక రఫేల్‌పై ఆ సంస్థతో విచారణ జరిపే అంశాన్ని పరిశీలిస్తామని తేల్చిచెప్పింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 14కు వాయిదా వేసింది. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, కేంద్ర మాజీ మంత్రులు అరుణ్‌శౌరీ, యశ్వంత్ సిన్హా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment