KM Joseph
-
ఏపీ రాజధాని కేసు: ‘28 నుంచి మూడు రోజుల పాటు విచారణ జరపండి’
సాక్షి ఢిల్లీ: ఏపీ రాజధాని కేసుపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈనెల 28 నుంచి మూడు రోజుల పాటు విచారించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది.. అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. కాగా, ఈ ప్రతిపాదనపై జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం స్పందించి.. సీజేఐ వద్ద మెన్షన్ చేయాలని సూచించింది. ఇక, ఈ కేసుపై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్నం ధర్మాసనం మార్చి 28వ తేదీన విచారణ చేపట్టనుంది. -
..‘ఎస్ సర్’లే సీఈసీలా?!
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పలు కీలక సందేహాలు లేవనెత్తింది. ‘‘కేంద్రంలో అధికారంలో ఉండే ప్రతి పార్టీ ఎలాగోలా దాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలని భావిస్తుంది. అందుకోసం అన్ని విషయాల్లోనూ తను చెప్పిన దానికి ‘ఎస్ సర్’ అనేవారినే సీఈసీగా నియమించుకునే ఆస్కారముంది’’ అని పేర్కొంది. ప్రస్తుత నియామక వ్యవస్థ అందుకు వీలు కల్పిస్తోందంటూ న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆక్షేపించింది. ఓవైపు ఈ అంశంపై తమ విచారణ కొనసాగుతుండగానే ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్‌ను ఎలా నియమిస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీని వెనక వేరే రహస్య ఉద్దేశాలేమీ లేవు కదా అంటూ నిలదీసింది. ‘‘సీఈసీ, ఈసీల నియామక ప్రక్రియపై దాఖలైన పిటిషన్లపై గత గురువారం నుంచి మేం విచారణ జరుపుతున్నాం. ఓవైపు అది కొనసాగుతుండగానే కేంద్ర సర్వీసులో కొనసాగుతున్న ఐఏఎస్ అధికారిని ముందస్తుగా రిటైర్ చేయించి మరీ ఈసీగా ఎందుకు నియమించాల్సి వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాం. గోయల్ నియామక ఫైలును పరిశీలన నిమిత్తం మాకు సమర్పించండి’’ అని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ఆర్.వెంకటరమణి ఇందుకు తీవ్రంగా అభ్యంతరాలు వెలిబుచ్చినా వాటిని తోసిపుచ్చింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ సి.టి.రవికుమార్ సభ్యులుగా ఉన్నారు. ఈసీలు, సీఈసీ నియామకాలకు కొలీజియం తరహా వ్యవస్థ ఉండాలంటూ దాఖలైన పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు మంగళవారం వాదనలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అవి బుధవారం రోజంతా కొనసాగాయి. కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవాలంటే అందులోకి నియామకాలను తొలి దశలోనే పూర్తిస్థాయిలో తనిఖీ చేసే వ్యవస్థ ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ అంశంపై ధర్మాసనానికి, కేంద్రం తరఫున వాదించిన ఏజీ వెంకటరమణికి మధ్య సుదీర్ఘ వాదోపవాదాలు జరిగాయి. ఈసీ స్వతంత్ర ప్రతిపత్తికి 1991 నాటి చట్టం పూర్తి రక్షణ కల్పిస్తోందని ఏజీ వాదించారు. ‘దినేశ్ గోస్వామి కమిటీ నివేదిక ఆధారంగా పార్లమెంటు ఆమోదించిన చట్టమిది. కాబట్టి దాని రూపకల్పన వెనక సరైన ఆలోచన చేయలేదని చెప్పలేం. సీఈసీ, ఈసీల జీతభత్యాలు, పదవీకాలం తదితరాలన్నింటికీ రాజ్యాంగపరమైన రక్షణ ఉంది. కనుక ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరమేదీ లేదు’’ అని స్పష్టం చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శి స్థాయిల్లో ఉన్న అధికారులను ఎలక్షన్ కమిషనర్లుగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. అమల్లో ఉన్న విధానం ప్రకారం వారిలో సీనియర్ అధికారి సీఈసీగా నియమితులవుతారు’’ అని వివరించారు. ‘‘మేం ఆనవాయితీని పాటిస్తున్నాం. అలాగాకుండా సీఈసీ నియామకానికి జాతీయ స్థాయిలో ఎన్నికలు పెట్డం సాధ్యం కాదు’’ అన్నారు. ఈ వ్యవస్థ సరిగా పని చేయడం లేదని చెప్పడం తమ ఉద్దేశం కాదని ధర్మాసనం పేర్కొంది. అందుకు పారదర్శక వ్యవస్థ ఉండాలన్నది మాత్రమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. ‘‘కేంద్రం ఒకవేళ తమ భావజాలమే ఉన్న, తాము చెప్పిన దానికల్లా తలూపే వ్యక్తిని సీఈసీగా నియమిస్తే? అందుకే సీఈసీ నియామక ప్రక్రియపై మేం మరింతంగా దృష్టి సారించాలనుకుంటున్నాం. అందులో సీజేఐనీ చేరిస్తే బాగుంటుంది’’ అని పేర్కొంది. గోయల్‌పై వాదోపవాదాలు ఈసీగా గోయల్ నియామకంపై వాడివేడి వాదనలు సాగాయి. ఓవైపు ఈ కేసులో విచారణ జరుగుతుండగానే కేంద్రం హడావుడిగా ఆయనను నియమించిందని పిటిషనర్ అనూప్ బరన్వాల్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘‘గోయల్ గురువారం దాకా కేంద్రంలో కార్యదర్శి స్థాయి అధికారిగా కొనసాగారు. ఉన్నట్టుండి ఆయనకు వీఆర్ఎస్ ఇచ్చి శుక్రవారానికల్లా ఈసీగా నియమించారు’’ అని గుర్తు చేశారు. తనకు తెలిసినంత వరకూ వీఆర్ఎస్ ఆమోదానికి మూడు నెలలు పడుతుందని జస్టిస్ జోసెఫ్ అన్నారు. గోయల్ ఆయన నియామక ఫైలును సమర్పించాలన్న ఆదేశించారు. దీనిపై ఏజీ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘విచారణ జరుగుతున్నది ఈసీలు, సీఈసీ నియామకాలకు సంబంధించిన విస్తృతమైన అంశం మీద. అలాంటప్పుడు ప్రశాంత్ భూషణ్ తెరపైకి తెచ్చిన ఈ వ్యక్తిగత నియామకాన్ని ఎలా పరిశీలనకు తీసుకుంటారు? దీనికి నేను తీవ్రంగా అభ్యంతరం తెలుపుతున్నా. విచారణ మధ్యలో ఇలా నియామక ఫైలును కోర్టు చూడటంపై చాలా అభ్యంతరాలున్నాయి’’ అన్నారు. వాటిని ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘మేం విచారణ మొదలు పెట్టిన తర్వాత నవంబర్ 19న గోయల్ నియామకం జరిగింది. దానికి కారణమేమిటో తెలుసుకోవడానికే ఫైలు చూడాలనుకుంటున్నాం. నియామకం పూర్తిగా నిబంధనలకు లోబడే జరిగిందని మీరంటున్నారు. దాన్నే మేం పరిశీలించదలచాం. నియామకంలో అక్రమాలేవీ జరగని పక్షంలో మీరు భయపడాల్సిందేముంది? రేపట్లోగా సంబంధిత ఫైలును మా ముందుంచాల్సిందే’’ అని స్పష్టం చేసింది. ‘‘ఫైలును సమర్పిస్తారా, లేదా? దాన్ని బయట పెట్టొద్దనుకుంటుంటే అదే విషయం చెప్పండి. మీరు (ఏజీ) గనక బిజీగా ఉంటే ఫైలును మాకు సమర్పించాల్సిందిగా ఇంకెవరికైనా పురమాయించండి’’ అని జస్టిస్ జోసెఫ్ అన్నారు. ఈసీగా మంగళవారం బాధ్యతలు చేపట్టిన గోయల్ 2025లో రాజీవ్‌కుమార్ రిటైర్మెంట్ అనంతరం సీఈసీ కానున్నారు. ఆయన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా డిసెంబర్ 31 దాకా పదవిలో కొనసాగాల్సి ఉండగా ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్నారు. మనకిప్పుడో శేషన్ కావాలి! సీఈసీ, ఈసీల నియామకం విషయంలో రాజ్యాంగం మౌనాన్ని ప్రభుత్వాలు తమకు అనుకూలంగా దుర్వినియోగం చేసుకుంటూ వస్తున్నాయంటూ మంగళవారం విచారణ సందర్భంగా ధర్మాసనం అసహనం వెలిబుచ్చడం తెలిసిందే. ఇదో అవాంఛిత పోకడ అంటూ ఆక్షేపించింది. వారి నియామకానికి ఎలాంటి ప్రక్రియనూ ఆర్టికల్ 324 నిర్దేశించని విషయాన్ని గుర్తు చేసింది. ఇందుకోసం చట్టం చేయాలని రాజ్యాంగం నిర్దేశించినా 72 ఏళ్లుగా ఆ పని చేయలేదంటూ తప్పుబట్టింది. ‘‘2004 నుంచి ఒక్క సీఈసీ కూడా ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోలేదు. ఇక పదేళ్ల యూపీఏ పాలనలో ఏకంగా ఆరుగురు సీఈసీలు మారారు. ప్రస్తుత ఎన్డీఏ ఎనిమిదేళ్ల పాలనలో ఏకంగా 8 మంది మారారు’’ అంటూ ఆక్షేపించింది. గట్టి వ్యక్తిత్వమున్న టి.ఎన్.శేషన్ వంటివారు సీఈసీగా రావాలని తాము కోరుకుంటున్నట్టు స్పష్టం చేసింది. ప్రధానిపై ఆరోపణలొస్తే.. సీఈసీ చర్యలు తీసుకోగలరా? ప్రధాని స్థాయి వ్యక్తితో సీఈసీ తలపడాల్సిన పరిస్థితి తలెత్తితే? అందుకాయన సిద్ధపడతారా, ససేమిరా అంటారా? మీకేమనిపిస్తోంది? ప్రధానిపై సీఈసీ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే... ఆయన ఏ చర్యలూ తీసుకోలేదనుకుందాం. అప్పుడది వ్యవస్థ పూర్తిగా కుప్పకూలినట్టు కాదా? అందుకే సీఈసీకి రాజకీయ ప్రభావం నుంచి సంపూర్ణ రక్షణ తప్పనిసరి. – సుప్రీంకోర్టు ధర్మాసనం సీఈసీ, ఈసీలను పార్టీల ప్రభావం నుంచి దూరంగా ఉంచాలి. అప్పుడే వాళ్లు స్వతంత్రంగా పని చేయగలరు. ఇది జరగాలంటే సీఈసీ ఎంపికలో భారత ప్రధాన న్యాయమూర్తిని కూడా భాగస్వామిని చేయాలి. అప్పుడే కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని నిలుపుకుంటూ ఒత్తిళ్లకు అతీతంగా బాధ్యతలు నెరవేర్చగలుగుతుంది. – సుప్రీం ధర్మాసనం -
‘రఫేల్’ ధర వివరాలివ్వండి
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోలు ధర వివరాలను తమకు సీల్డ్ కవర్లో సమర్పించాలని సుప్రీంకోర్టు బుధవారం కేంద్రాన్ని ఆదేశించింది. రఫేల్ ధర విషయం వ్యూహాత్మకమనీ, దాన్ని రహస్యంగా ఉంచాలన్న కేంద్రం వాదనను అంగీకరించింది. ఈ ఒప్పందం వివరాలను 10 రోజుల్లోగా సమర్పించాలని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం ఆదేశించింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ వాదిస్తూ.. రఫేల్ ఒప్పందం ధర వివరాలు చాలా రహస్యమైన సమాచారమనీ, దాన్ని దేశ పార్లమెంటుతో కూడా పంచుకోలేదని కోర్టుకు తెలిపారు. ఈ వివరాలు అధికారిక రహస్యాల చట్టం–1923 పరిధిలోకి వస్తాయని వెల్లడించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, రఫేల్ ఒప్పందం సందర్భంగా పాటించిన విధివిధానాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలనీ, పిటిషనర్లకు అందజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే ఒప్పందంలోని వ్యూహాత్మక, రహస్య సమాచారాన్ని బయటపెట్టాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఒకవేళ రఫేల్ ధర వివరాలను అందజేయడం వీలుకాకపోతే అదే విషయాన్ని పిటిషన్ ద్వారా తెలియజేయాలని బెంచ్ తెలిపింది. పిటిషనర్లు రఫేల్ యుద్ధ విమానం పనితీరు, ఇతర సాంకేతిక అంశాలను కోరలేదనీ, కేవలం కొనుగోలు సందర్భంగా పాటించిన పద్ధతి, ధరపైనే స్పష్టత అడిగారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రఫేల్ కొనుగోలు ధర వివరాలను సీల్డ్ కవర్లో 10 రోజుల్లోగా సమర్పించాలని స్పష్టం చేసింది. సీబీఐలో ప్రస్తుతం కొనసాగుతున్న అనిశ్చితి ముగిశాక రఫేల్‌పై ఆ సంస్థతో విచారణ జరిపే అంశాన్ని పరిశీలిస్తామని తేల్చిచెప్పింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 14కు వాయిదా వేసింది. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, కేంద్ర మాజీ మంత్రులు అరుణ్‌శౌరీ, యశ్వంత్ సిన్హా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. -
కేరళ కోసం జడ్జీల గానం
న్యూఢిల్లీ: సంక్షోభ సమయాల్లో మానవీయంగా స్పందించగలమని, అందుకు అవసరమైతే మైక్ పట్టుకుని పాటలు కూడా పాడగలమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిరూపించారు. కేరళ వరద బాధితుల సహాయార్థం సోమవారం సుప్రీంకోర్టు జర్నలిస్ట్‌లు చేపట్టిన నిధుల సేకరణ కార్యక్రమంలో జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ కురియన్ జోసెఫ్ తమ గాత్ర ప్రావీణ్యాన్ని చూపారు. ఈ ఇద్దరు జడ్జీలు కేరళకే చెందినవారు కావడం గమనార్హం. మలయాళ క్లాసిక్ సినిమా ‘అమరం’లోని మత్స్యకారుల జీవనాన్ని వర్ణించే ఓ పాటను కేఎం జోసెఫ్ పాడారు. ‘కేరళలో వరద బాధితుల సహాయానికి ముందు స్పందించింది మత్స్యకారులే. అందుకే వారి కోసం ఈ పాట’ అని జస్టిస్ జోసెఫ్ అన్నారు. గాయకుడు మోహిత్ చౌహాన్‌తో కలిసి ‘వి షల్ ఓవర్‌కమ్ సమ్‌డే’ అనే పాటను జస్టిస్ కురియన్ జోసెఫ్ ఆలపించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, పలువురు ఇతర జడ్జీలు, జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రూ. 10 లక్షలకు పైగా విరాళాలు వసూలయ్యాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఒక్కొక్కరూ రూ. 25 వేల చొప్పున, కోర్టు ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. -
ప్రమాణ స్వీకారం చేసిన సుప్రీంకోర్టు కొత్త జడ్జ్‌లు
-
సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణ స్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ : జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సమక్షంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు పలువురు న్యాయవాదులు కూడా పాల్గొన్నారు. వీరి ముగ్గురి చేరికతో అత్యున్నత న్యాయస్థానంలో మొత్తం జడ్జీల సంఖ్య 25కు పెరిగింది. జస్టిస్ ఇందిరా బెనర్జీ చేరికతో మహిళా జడ్జీల సంఖ్య మూడుకు పెరిగింది. జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఇందూ మల్హోత్రా ఇది వరకే సుప్రీం కోర్టు జడ్జీలుగా విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఒకేసారి ముగ్గురు మహిళలు సుప్రీంకోర్టు జడ్జీలుగా ఉండటం ఇదే తొలిసారి. సుప్రీంకోర్టు చరిత్రలో జస్టిస్ ఇందిరా బెనర్జీ 8వ మహిళా జడ్జి కానున్నారు. కాగా, ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ సీనియారిటీని తగ్గిస్తూ నోటిఫికేషన్లో ఆయన పేరును మూడో స్థానంలో పేర్కొనడంతో సుప్రీంకోర్టు జడ్జీలు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రాను కలిసి తమ నిరసన తెలియజేయడంతో.. ప్రమాణ స్వీకార కార్యక్రమం యథావిధిగా జరపాలని, సీనియర్ జడ్జి జస్టిస్ రంజన్ గొగోయ్‌తో మాట్లాడాక నిర్ణయం తీసుకుందామని సీజేఐ హామీ ఇచ్చారు. దీంతో కార్యక్రమం సజావుగా కొనసాగింది. -
జోసెఫ్ సీనియార్టీపై అసంతృప్తి
న్యూఢిల్లీ: జస్టిస్ కేఎం జోసెఫ్ సీనియారిటీని తగ్గించడంపై సుప్రీంకోర్టు జడ్జీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రాను కలిసి తమ నిరసన తెలియజేశారు. మంగళవారం జస్టిస్ జోసెఫ్‌తోపాటు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ సరన్‌లు బాధ్యతలు తీసుకోనున్న నేపథ్యంలో ఈ నిరసన వ్యక్తమైంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం యథావిధిగా జరపాలని, సీనియర్ జడ్జి జస్టిస్ రంజన్ గొగోయ్‌తో మాట్లాడాక నిర్ణయం తీసుకుందామని సీజేఐ హామీ ఇచ్చినట్లు తెలిసింది. సీజేఐని కలిసి నిరసన తెలిపిన వారిలో కొలీజియంలోని ఇద్దరు సీనియర్ జడ్జీలు జస్టిస్ మదన్ బీ లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఏకే సిక్రీ ఉన్నారు. కేంద్ర నోటిఫికేషనే ఫైనల్! కేంద్రం శుక్రవారం ముగ్గురు జడ్జీల పేర్లతో విడుదల చేసిన నియామకపు నోటిఫికేషన్లో జస్టిస్ జోసెఫ్ పేరును ప్రకటించినప్పటికీ ఆయన సీనియారిటీని తగ్గిస్తూ మూడోస్థానంలో పేర్కొన్నారు. మద్రాసు హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఇందిరా బెనర్జీ, ఒరిస్సా హైకోర్టు సీజే జస్టిస్ వినీత్ సరన్‌ల తర్వాత మూడో స్థానంలో ఉత్తరాఖండ్ హైకోర్టు సీజే జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును పేర్కొంది. దీనిని రాష్ట్రపతి ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జడ్జీల వరుస క్రమం ఆధారంగానే సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు. జనవరి 10న కొలీజియం సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్రాతోపాటుగా జస్టిస్ జోసెఫ్ పేరును సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రతిపాదించింది. అయితే, ఇందు మల్హోత్రా పేరును అంగీకరించిన కేంద్రం.. జోసెఫ్ పేరును తిరస్కరించింది. మే 16న మరోసారి కొలీజియం జస్టిస్ జోసెఫ్ పేరును ప్రతిపాదనల్లో పెట్టింది. జూలైలో దీన్ని కూడా కేంద్రం తిరస్కరించింది. శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో జోసెఫ్ పేరును పేర్కొనడంతో కొలీజియం, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదానికి తెరపడ్డట్లేనని అర్థమవుతోంది. షెడ్యూల్ ప్రకారమే బాధ్యతల స్వీకరణ ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ బాధ్యతల స్వీకరణ మంగళవారం జరగనుంది. కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయడం, రాష్ట్రపతి ఆమోదం అయిపోయిన తర్వాత ఈ దశలో ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదని కోర్టు ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. ఆలిండియా జాబితాలో జోసెఫ్ః39 ‘హైకోర్టు జడ్జీల ఆలిండియా సీనియారిటీ లెక్కల్లో జస్టిస్ బెనర్జీ 4వ స్థానంలో, జస్టిస్ సరన్ 5వ స్థానంలో, జస్టిస్ జోసెఫ్ 39వ స్థానంలో ఉన్నారు’ అని న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ ముగ్గురు జడ్జీలూ సీజేఐ కాలేరని.. ఎందుకంటే ఇప్పటికే సుప్రీం జడ్జీలుగా ఉన్న వారు వీరికంటే సీనియర్లని తెలిపాయి. ఈ ముగ్గురిలో జస్టిస్ జోసెఫ్ 2023లో రిటైరవుతుండగా.. జస్టిస్ డీవై చంద్రచూడ్ నవంబర్ 2024 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉంటారన్నాయి. అప్పటికి ఆయనే సీజేఐగా ఉండొచ్చన్నాయి. కాగా, సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా తలచుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, జాబితాను మార్చేందుకు వీలుందని మాజీ సీజేఐ జస్టిస్ లోధా పేర్కొన్నారు. అయితే, కేంద్రం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ స్వాగతించారు. హైకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న సీనియారిటీ ఆధారంగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సీనియారిటీని పొందుతారని ఆయన వ్యాఖ్యానించారు. నిబంధనల ప్రకారమే నోటిఫికేషన్: కేంద్రం జస్టిస్ కేఎం జోసెఫ్ సీనియారిటీని తగ్గించారంటూ నెలకొన్న వివాదంపై కేంద్రం స్పందించింది. నిబంధనల ప్రకారమే నోటిఫికేషన్లో సీనియారిటీ (హైకోర్టు సీనియారిటీ ఆధారంగా) నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సరన్‌లతో పోలిస్తే జస్టిస్ కేఎం జోసెఫ్ రెండేళ్లు జూనియర్ కాబట్టే ఆయన్ను సీనియారిటీలో మూడోస్థానం కల్పించినట్లు పేర్కొంది. జస్టిస్ జోసెఫ్ 2004 అక్టోబర్ 14న హైకోర్టు న్యాయమూర్తిగా.. 2014, జూలై 31న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన 2023 జూన్ 16న రిటైరవుతారు. జస్టిస్ ఇందిరా బెనర్జీ 2002, ఫిబ్రవరి 5న హైకోర్టు జడ్జిగా 2017, ఏప్రిల్ 5న హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా పదోన్నతి పొందారు. ఈమె 2022, సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైరవుతారు. జస్టిస్ సరన్ 2002, ఫిబ్రవరి 14న హైకోర్టు న్యాయమూర్తిగా, 2016 ఫిబ్రవరి 26న ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2022, మే 10న ఈయన పదవీ విరమణ చేస్తారు. జోసెఫ్‌తో పోలిస్తే మిగిలిన ఇద్దరు రెండేళ్ల ముందుగానే హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన అంశాన్ని కేంద్రం ప్రాతిపదికగా తీసుకుంది. -
జస్టిస్ జోసెఫ్ సీనియారిటీ తగ్గింపు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కేఎం జోసెఫ్ నియామక వివాదం మరో మలుపు తిరిగింది. జోసెఫ్ నియామకాన్ని ఆమోదించిన కేంద్రం.. తాజాగా శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్లో ఆయన సీనియారిటీని తగ్గించింది. కొలీజియం తొలుత జస్టిస్ జోసెఫ్ పేరును, ఆతర్వాత జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ సరన్‌ల పేర్లను సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా సిఫార్సు చేసింది. కానీ కేంద్రం మాత్రం జోసెఫ్ పేరును జాబితాలో మూడోస్థానంలో ఉంచుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నిబంధనల ప్రకారం మొదటగా కొలీజియం సిఫార్సు చేసిన పేర్లనే నోటిఫికేషన్లో ప్రాధాన్యతా క్రమంలో ప్రచురించాలి. దీంతో కేంద్రం చర్యపై కొలీజియం సభ్యులు సహా పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శాసన, న్యాయ వ్యవస్థల మధ్య ఉన్న లక్ష్మణరేఖను ప్రభుత్వం దాటిందని మండిపడుతున్నారు. ఈ విషయమై జడ్జీలు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాను సోమవారం కలసి ఫిర్యాదు చేయనున్నారు. ముగ్గురు జడ్జీలు ప్రమాణస్వీకారం చేసేలోపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సరిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సీజేఐపై ఒత్తిడి తీసుకురానున్నారు. జడ్జీలతో పాటు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కూడా ఈ విషయమై దీపక్ మిశ్రాతో నేడు సమావేశమై ఈ విషయంలో తమ అభ్యంతరాలను సీజేఐ ముందు ఉంచనుంది. ప్రసుత్తం దేశవ్యాప్తంగా న్యాయమూర్తుల సీనియారిటీలో జస్టిస్ జోసెఫ్ 45వ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ఆరంభంలో జస్టిస్ జోసెఫ్ పేరును కొలీజియం సిఫార్సు చేయగా.. ఇతర రాష్ట్రాల నుంచి సుప్రీంకు తగిన ప్రాతినిధ్యం లేదంటూ ఆ ప్రతిపాదనను కేంద్రం తిప్పిపంపింది. దీంతో జోసెఫ్ పేరును కొలీజియం మరోసారి ఆమోదించి పంపడంతో మరో మార్గం లేక కేంద్రం ఆమోదించింది. అయితే మిగతా ఇద్దరు జడ్జీల కంటే ఆయన్ను జూనియర్‌గా చేస్తూ శనివారం నోటిఫికేషన్ ఇచ్చింది. అంతకుముందు ఆగస్టు 3న రాష్ట్రపతి కోవింద్ జస్టిస్ జోసెఫ్, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ సరన్‌లను సుప్రీం జడ్జీలుగా నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఇద్దరు న్యాయమూర్తుల కంటే జస్టిస్ జోసెఫ్ జూనియర్‌గా మారారు. 2016లో ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఉత్తరాఖండ్‌లో విధించిన రాష్ట్రపతి పాలనను జోసెఫ్ ఉత్తరాఖండ్ హైకోర్టు జడ్జీగా కొట్టివేశారు. ఈ కారణంగానే ఆయన పదోన్నతికి ప్రభుత్వం అడ్డుతగులుతోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కేంద్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. కాగా, జస్టిస్ జోసెఫ్, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ సరన్ మంగళవారం ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. -
ముగ్గురు సుప్రీం జడ్జీల పదోన్నతికి ఆమోదం
న్యూఢిల్లీ: ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీచేశారు. పదోన్నతి పొందిన వారిలో ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ, ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరణ్ ఉన్నారు. ఈ నియామకాలకు సంబంధించిన వారెంట్లపై కోవింద్ శుక్రవారం సంతకం చేయగా, శనివారం అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో అత్యున్నత న్యాయస్థానంలో మొత్తం జడ్జీల సంఖ్య 25కు పెరిగింది. మహిళా జడ్జీల సంఖ్య మూడుకు చేరింది. జస్టిస్ ఇందిరా బెనర్జీ కొత్తగా చేరబోతుండగా, జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఇందూ మల్హోత్రా ఇది వరకే జడ్జీలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకేసారి ముగ్గురు మహిళలు సుప్రీంకోర్టు జడ్జీలుగా ఉండటం ఇదే తొలిసారి. సుప్రీంకోర్టు చరిత్రలో జస్టిస్ ఇందిరా బెనర్జీ 8వ మహిళా జడ్జి కానున్నారు. -
జస్టిస్ జోసెఫ్ పదోన్నతికి గ్రీన్‌సిగ్నల్!
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలన్న కొలీజియం సిఫార్సుకు కేంద్రం ఎట్టకేలకు ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ మధ్య కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. జస్టిస్ జోసెఫ్‌తో పాటు మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ, ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వినీత్ శరణ్‌ల పదోన్నతికి ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిసింది. ఈ నియామకాలకు సంబంధించిన దస్త్రాలకు ఆమోదం లభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజా నియామకాలతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 25కు పెరగనుంది. అయినా మరో 6 పోస్టులు ఖాళీగా ఉంటాయి. జస్టిస్ జోసెఫ్‌కు సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పించాలని సుప్రీం సీజేఐ నేతృత్వంలోని కొలీజియం జనవరి 10న కేంద్రానికి సిఫార్సుచేసింది. కేరళ నుంచి సుప్రీంలో ఇది వరకే తగిన ప్రాతినిధ్య ఉందని పేర్కొంటూ ఈ ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కేంద్రం వెనక్కి పంపింది. ఆయన పేరును సుప్రీం జడ్జి పదవికి పరిశీలించాలని మే 10న కొలీజియం మరోసారి కేంద్రానికి సూచించగా, తాజాగా ఆమోదం లభించింది. మరోవైపు, జస్టిస్ జోసెఫ్‌కు ఉత్తరాఖండ్ హైకోర్టు బార్ అసోసియేషన్ శుక్రవారం వీడ్కోలు సమావేశం నిర్వహించింది. -
సుప్రీం జడ్జిగా జస్టిస్ కేఎం జోసెఫ్
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ నియామకానికి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలిపింది. సుప్రీం న్యాయమూర్తిగా జోసెఫ్ నియామకంపై కొద్ది కాలంగా కేంద్రం, సుప్రీం కొలీజియంల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 10న సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల నియామకంపై సుప్రీం కోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. అయితే మల్హోత్రా నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం జోసెఫ్‌ను సుప్రీం న్యాయమూర్తిగా ప్రమోట్ చేసేందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ జోసెఫ్ పేరును పున:పరిశీలించాలని కొలీజియంను కోరింది. సుప్రీం న్యాయమూర్తిగా జోసెఫ్ నియామకాన్ని తిరిగి పరిశీలించాలని కొలీజియం జులై 16 కేంద్రానికి తేల్చిచెప్పింది. కొలీజియం నిర్ణయంతో వెనక్కితగ్గిన కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్ధాన న్యాయమూర్తిగా జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును ఆమోదించింది. జోసెఫ్‌తో పాటు మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వినీత్ శరణ్‌లను కూడా సుప్రీం న్యాయమూర్తులుగా నియమించేందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.