
జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ కేఎం జోసెఫ్
సాక్షి, న్యూఢిల్లీ : జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సమక్షంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు పలువురు న్యాయవాదులు కూడా పాల్గొన్నారు. వీరి ముగ్గురి చేరికతో అత్యున్నత న్యాయస్థానంలో మొత్తం జడ్జీల సంఖ్య 25కు పెరిగింది. జస్టిస్ ఇందిరా బెనర్జీ చేరికతో మహిళా జడ్జీల సంఖ్య మూడుకు పెరిగింది. జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఇందూ మల్హోత్రా ఇది వరకే సుప్రీం కోర్టు జడ్జీలుగా విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఒకేసారి ముగ్గురు మహిళలు సుప్రీంకోర్టు జడ్జీలుగా ఉండటం ఇదే తొలిసారి. సుప్రీంకోర్టు చరిత్రలో జస్టిస్ ఇందిరా బెనర్జీ 8వ మహిళా జడ్జి కానున్నారు.
కాగా, ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ సీనియారిటీని తగ్గిస్తూ నోటిఫికేషన్‌లో ఆయన పేరును మూడో స్థానంలో పేర్కొనడంతో సుప్రీంకోర్టు జడ్జీలు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రాను కలిసి తమ నిరసన తెలియజేయడంతో.. ప్రమాణ స్వీకార కార్యక్రమం యథావిధిగా జరపాలని, సీనియర్ జడ్జి జస్టిస్ రంజన్ గొగోయ్‌తో మాట్లాడాక నిర్ణయం తీసుకుందామని సీజేఐ హామీ ఇచ్చారు. దీంతో కార్యక్రమం సజావుగా కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment