Indira Banerjee
-
భారత ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళను చూడగలమా?
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళ నియామకమయ్యే రోజు ఎంతో దూరం లేదంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే చేసిన వ్యాఖ్యలతో కోర్టుల్లో మహిళా న్యాయమూర్తుల ప్రాతినిధ్యంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 29 మంది న్యాయమూర్తులుంటే వారిలో కేవలం ఒక్కరంటే ఒక్కరే మహిళా న్యాయమూర్తి. ఆమే జస్టిస్ ఇందిరా బెనర్జీ. మూడేళ్ల క్రితం 2018లో జస్టిస్ ఇందిరా బెనర్జీ సుప్రీంలో అడుగు పెట్టినప్పుడు ఒకే సమయంలో ముగ్గురు మహిళా న్యాయమూర్తుల్ని అత్యున్నత న్యాయస్థానంలో చూడగలిగాము. అప్పటికే జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఇందూ మల్హోత్రాలు న్యాయమూర్తులుగా ఉన్నారు. దీంతో వీరి ముగ్గురిని త్రిమూర్తులుగా అభివర్ణించేవారు. అప్పట్లో న్యాయవ్యవస్థలో మహిళా వివక్ష నశిస్తుందనే ఆశలు చిగురించాయి.. ఆ తర్వాత భానుమతి, ఇందూ మల్హోత్రాలు పదవీ విరమణ చేయడంతో మళ్లీ జస్టిస్ ఇందిర ఒక్కరే మిగిలారు. జస్టిస్ ఇందిరకు సీజేఐగా ఛాన్స్ వస్తుందా భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) ఈ నెల 24 ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ ఎన్వీ రమణ పదవీ కాలం 26, ఆగస్టు, 2022తో ముగియనుంది. సీనియార్టీ ప్రకారం చూస్తే రమణ తర్వాత పదో స్థానంలో ఇందిర ఉన్నారు. ఆమె సెప్టెంబర్ 23, 2022న పదవీ విరమణ చేస్తారు. ఎన్వీ రమణ తర్వాత జస్టిస్ ఆర్.ఎఫ్ నారిమన్ సీనియార్టీ జాబితాలో ఉన్నారు. అయితే నారిమన్ ఈ ఏడాది ఆగస్టులోనే పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత స్థానంలో ఉన్న జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్‌కు 2022 సంవత్సరం నవంబర్ 8 వరకు పదవీ కాలం ఉంది. అందువల్ల రమణ తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం జస్టిస్ లలిత్‌కు వస్తుంది. అందుకే ఇందిరకు భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉండదు. ఇకమీదట ఎవరైనా మహిళా న్యాయమూర్తి సుప్రీంకోర్టులో నియమితులైతే... ఆమె అందరికంటే జూనియర్‌గా ప్రస్థానం (పురుషులకైనా అంతే) మొదలుపెడతారు. రిటైర్మెంట్ వయసుకు ముందే సీనియారిటీ జాబితాలో రెండోస్థానానికి చేరినపుడు మాత్రమే తదుపరి సీజేగా అవకాశం వస్తుంది. ఇది ఎప్పటికి జరిగేనో? ఇక సుప్రీంకోర్టుకు న్యాయమూర్తుల పదవుల ఖాళీలను భర్తీ చేయడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఎనిమిది మందే.. స్వతంత్ర భారతావనిలో అత్యున్నత న్యాయస్థానం ఏర్పడిన తర్వాత ఒక మహిళ తీర్పులు వెలువరించడానికి దాదాపుగా 40 ఏళ్ల కాలం పట్టింది. 1950, జనవరి 26న సుప్రీంకోర్టు ఏర్పాటైతే ఆ తర్వాత 1989లో భారత దేశ మొట్టమొదటి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఫాతిమా బీవి నియమితులయ్యారు. ఇప్పటివరకు సుప్రీం కోర్టులో 247 మందిని జడ్జీలుగా నియమిస్తే వారిలో ఎనిమిది మాత్రమే మహిళలు. జస్టిస్ ఫాతిమా బీవీ తర్వాత . జస్టిస్ సుజాత మనోహర్, జస్టిస్ రుమాపాల్, జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్, జస్టిస్ భానుమతి, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలకు మాత్రమే అత్యున్నత న్యాయస్థానంలో తీర్పులు చెప్పే అవకాశం వచ్చింది. హైకోర్టుల్లో న్యాయమూర్తుల్ని నియమించే అత్యున్నత అధికారాలు కలిగిన కొలీజియమ్‌లో సభ్యులుగా జస్టిస్ రుమాపాల్, జస్టిస్ ఆర్ భానుమతిలకు మాత్రమే భాగస్వామ్యులయ్యారు. ఏమిటి పరిష్కారం న్యాయవ్యవస్థలో వివక్ష రూపు మాపాలంటే అన్ని స్థాయిల్లో మహిళల నియామకం పెద్ద సంఖ్యలో జరగాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అడ్వకేట్లగా ఉన్న మహిళలు న్యాయమూర్తులుగా పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ముందుకు రావాలనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ తాము తీర్పుల్ని వెల్లడించే అతి పెద్ద న్యాయమూర్తి బాధ్యతను చేపట్టలేమని ఆ అవకాశాన్ని మహిళా అడ్వకేట్లు తిరస్కరిస్తున్నారని సాక్షాత్తూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులే చెబుతున్నారు. మహిళా సాధికారత కోసం ఎన్నో చట్టాలు ఉన్నట్టుగానే మహిళా న్యాయమూర్తుల నియామకం అంశంలో కొన్ని విధివిధానాలను రూపొందిస్తూ చట్టాలు చెయ్యాలని బోంబే హైకోర్టు అడ్వకేట్ ప్రాస్పర్ డీ సౌజా సూచించారు. న్యాయమూర్తుల్ని నియమించే విశేష అధికారాలు కలిగిన సుప్రీం కోర్టు, హైకోర్టు కొలీజియంలలో మహిళా భాగస్వామ్యం పెరగడం వల్ల కూడా మహిళా న్యాయమూర్తుల సంఖ్య పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకు తొలి మహిళా సీజే తెలంగాణకు 2021 కొత్త సంవత్సరం కానుకగా ఒక మహిళ ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు. జనవరి 1న ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కొహ్లీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక గువాహటి, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, జార్ఖండ్, రాజస్థాన్, సిక్కిం రాష్ట్రాల్లో ఒక్కో మహిళా న్యాయమూర్తి ఉన్నారు. మణిపూర్, మేఘాలయా, పాట్నా, త్రిపుర, ఉత్తరాఖండ్ హైకోర్లుల్లో మహిళా న్యాయమూర్తులెవరూ లేరు. -
రిపబ్లిక్ టీవీకి సుప్రీంలో చుక్కెదురు
న్యూఢిల్లీ: టీఆర్పీ స్కామ్‌లో చిక్కుకున్న రిపబ్లిక్ టెలివిజన్ చానల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆ కేసుకు సంబంధించి రిపబ్లిక్ టీవీ బాంబే హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ‘హైకోర్టులపై విశ్వాసం కలిగి ఉండాలి’ అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోవిడ్ కాలంలోనూ పనిచేసిన బాంబే హైకోర్టును ఆశ్రయించాలని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం రిపబ్లిక్ టీవీ తరఫు న్యాయవాది హరీష్ సాల్వేకు తెలిపింది. అయితే కేసు విచారణపై హరీష్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. రిపబ్లిక్ టీవీ ఆఫీసు వొర్లి ప్రాంతంలో ఉంటుంది కదా? హైకోర్టు విచారించకుండానే ఇలాంటి పిటిషన్లను చేపట్టడం తప్పుడు సంకేతాలను పంపుతుందని ‘ఈ మధ్య కమిషనర్లు ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు’అని వ్యాఖ్యానించింది. టీఆర్పీ రేటింగ్‌లు పెంచుకునేందుకు రిపబ్లిక్ టీవీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ముంబై పోలీసులు కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసుకు సంబంధించి రిపబ్లిక్ టీవీ సీఎఫ్‌వో సుందరంను విచారణకు పిలిచారు. ఇప్పటికే ఫక్త్ మరాఠీ, బాక్స్ సినిమా చానళ్లపై కేసులు నమోదయ్యాయి. టీఆర్పీ రేటింగ్‌ల నిలిపివేత టీఆర్పీ రేటింగ్ పెంచుకునేందుకు చానళ్లు అక్రమ మార్గాలను ఎంచుకున్నా యనే ఆరోపణల నేపథ్యంలో టెలివిజన్ చానళ్ల వారపు రేటింగ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) గురువారం ప్రకటించింది. ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతులను సమీక్షించేందుకు 12 వారాలు పట్టొచ్చని, అప్పటిదాకా నిషేధం ఉంటుందని బార్క్ తెలిపింది. టీఆర్పీ స్కామ్‌కు సంబంధించి ముంబై పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బార్క్ రేటింగ్‌ల ఆధారంగానే టీవీ ఛానళ్లకు ప్రకటనలు అందుతాయి. -
అలా ఆదేశాలివ్వలేం..
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న వారిపై అధికారులు జాతీయ భద్రతా చట్టాన్ని (ఎన్ఎస్ఏ) ప్రయోగించకుండా ఆదేశాలివ్వలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. నిరసనల సందర్భంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, వాటిని ముందస్తుగా ప్లాన్ వేసుకుని చేసే అవకాశం ఉందని, అలాంటప్పుడు అధికారులకు ఎలాంటి ఆదేశాలివ్వలేమని స్పష్టం చేసింది. అయితే ఎన్ఎస్ఏ దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని సూచించింది. సీఏఏ వ్యతిరేక నిరసనలు వ్యక్తం చేస్తున్న రాష్ట్రాలు, ఢిల్లీలో ఎన్ఎస్ఏ ప్రయోగించకుండా చూడాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఒకవేళ ఆదేశిస్తే.. వ్యవస్థ గందరగోళంగా తయారవుతుందని అభిప్రాయపడింది. హింసకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోండి సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక నిరసనలు, ప్రజాస్వామ్య సంస్థలను కాపాడటం పేరుతో హింసకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని 154 మంది ప్రముఖులతో కూడిన బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు విజ్ఞప్తి చేసింది. కొన్ని రాజకీయ శక్తులు హింసాయుత నిరసనకారులకు సహాయం చేస్తున్నారని బృందానికి నేతృత్వం వహించిన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (సీఏటీ) చైర్మన్ జస్టిస్ పెర్మాడ్ కోహ్లి ఆరోపించారు. దేశాన్ని విభజించాలని చూస్తున్న శక్తుల పట్ల ఆందోళనచెందుతున్నామన్నారు. రాష్ట్రపతికి సమర్పించిన మెమొరాండంపై 11 మంది హైకోర్టు జడ్జిలు, 72 మంది మాజీ బ్యూరోక్రాట్లు, 56 మంది రక్షణ శాఖ మాజీ ఉన్నతాధికారులు, మేధావులు, విద్యావేత్తలు, వైద్య నిపుణులు సంతకాలు చేశారు. -
వేధింపులపై విచారణకు హాజరైన సీజేఐ
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై రహస్య విచారణ జరుపుతున్న త్రిసభ్య కమిటీ బుధవారం సీజేఐని కూడా విచారించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీల త్రిసభ్య కమిటీ ఎదుట సీజేఐ విచారణకు హాజరయ్యారు. లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో నిందితుడిగా ఓ సీజేఐ విచారణ కమిటీ ముందు హాజరవ్వడం భారత న్యాయ చరిత్రలో ఇదే తొలిసారి. విచారణకు హాజరు కావాల్సిందిగా గతంలోనే ఈ కమిటీ సీజేఐని కోరింది. దీంతో ఆయన విచారణకు వచ్చిన తన వంతుగా సహకరించారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని అయిన మహిళ, సీజేఐ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేయడం తెలిసిందే. కాగా, ఫిర్యాదు చేసిన మహిళ మూడు రోజులపాటు విచారణకు హాజరైన అనంతరం, ఈ కమిటీతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదంటూ వెళ్లిపోవడం తెలిసిందే. కమిటీ విచారణ వాతావరణం తనకు భయాన్ని కలిగిస్తోందనీ, తన లాయర్‌ను కూడా తనతోపాటు ఉండనివ్వటం లేదనీ, న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె విచారణ నుంచి మంగళవారం అర్ధాంతరంగా వెళ్లిపోయారు. విచారణను ఆడియో లేదా వీడియో రికార్డింగ్ కూడా చేయటం లేదనీ, ఏప్రిల్ 26, 29 తేదీల్లో ఆమె ఇచ్చిన వాంగ్మూలం ప్రతులను కూడా తనకు ఇవ్వలేదని ఆమె వాపోయారు. విచారణ ఎలా జరుగుతుందీ, ఏయే విధానాలను అనుసరిస్తారు అనే దానిని కూడా తనకు చెప్పలేదని ఆమె పేర్కొన్నారు. ఆమె లేకపోయినా విచారణ కొనసాగుతుందని చెప్పినా ఆమె విచారణకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో సీజేఐని త్రిసభ్య కమిటీ బుధవారం విచారించింది. -
సుప్రీం చరిత్రలో మొదటిసారి ముగ్గురు మహిళా జడ్జీలు
-
నేడు సుప్రీంలో మహిళా బెంచ్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో నేడు చరిత్ర పునరావృతం కానుంది. జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన మహిళా ధర్మాసనం కేసుల విచారణ జరపనుంది. సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా 2013లో జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్‌ల మహిళా ధర్మాసనం ఓ కేసుపై విచారణ జరిపింది. ప్రస్తుత మహిళా జడ్జీల్లో సీనియర్ అయిన జస్టిస్ భానుమతి 2014 ఆగస్టు 13న సుప్రీంకోర్టు జడ్జి అయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జస్టిస్ ఇందూ మల్హోత్రా, ఆగస్టులో జస్టిస్ ఇందిరా బెనర్జీ రాకతో సుప్రీంకోర్టులో సిట్టింగ్ మహిళా జడ్జిల సంఖ్య మూడుకు చేరింది. ఏకకాలంలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉండటం సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి. 39 ఏళ్ల తర్వాత మహిళా జడ్జి.. 1950లో ఏర్పాటైన సుప్రీంకోర్టులో ఓ మహిళ జడ్జిగా నియమితురాలు కావడానికి 39 ఏళ్లు పట్టింది. కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ ఫాతిమా బీవీ 1989లో జడ్జిగా సుప్రీంకోర్టులో బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కాలంలో వరుసగా జడ్జీలు సుజాతా మనోహర్, రుమా పాల్, జ్ఞాన్ సుధా మిశ్రా, రంజనా ప్రకాశ్ దేశాయ్, ఆర్.భానుమతి, ఇందూ మల్హోత్రా సుప్రీంకోర్టులో జడ్జీలయ్యారు. దిగువ కోర్టుల్లో 28 శాతమే! సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో మహిళా జడ్జీల సంఖ్య 12 శాతమేనని ప్రభుత్వ గణాంల్లో తేలింది. 7 హైకోర్టుల్లో మహిళా జడ్జి ఒక్కరు కూడా లేరు. 33 శాతం మహిళా జడ్జీలతో సిక్కిం తొలిస్థానంలో ఉంది. ఢిల్లీ హైకోర్టు ఆ తర్వాత స్థానంలో (27 శాతం) ఉంది. దిగువ కోర్టుల్లో మరీ అన్యాయంగా ఉందనీ, మొత్తం జడ్జీల్లో స్త్రీలు ఇంచుమించు 28 శాతమని విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ నివేదించింది. బిహార్ (11.52%), జార్ఖండ్ (13.98%), గుజరాత్ (15.11%), కశ్మీర్ (18.68%), యూపీ(21.4%),ఏపీæ(37.54%)కోర్టుల్లో స్త్రీల ప్రాతినిధ్యం అతి తక్కువగా ఉంది. తెలంగాణ లో 44.03 శాతం, పుదుచ్చేరి 41.66 శాతం మహిళా జడ్జీలు ఉన్నారు. -
ప్రలోభపెట్టాలనుకున్నారు: జస్టిస్ ఇందిరా
న్యూఢిల్లీ: హోటల్ రాయల్ ప్లాజాకు సంబంధించిన కేసులో తనను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఇందిరా బెనర్జీ చెప్పారు. ఆగస్టు 30న కోర్టులో ఈ కేసులో జస్టిస్ అరుణ్ మిశ్రాతో కలిసి వాదనలు వింటున్న సందర్భంగా జస్టిస్ బెనర్జీ ఈ విషయం చెప్పారు. ఎవరో వ్యక్తి తనకు ఫోన్ చేసి తనను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని ఇలాంటి ప్రయత్నాలను చాలా సీరియస్‌గా పరిగణిస్తామని ఆమె హెచ్చరించారు. 5న పూర్తిస్థాయి మహిళా బెంచ్ విచారణ.. సుప్రీంకోర్టు మరో అరుదైన ఘటనకు వేదిక కానుంది. అందరూ మహిళా జడ్జీలే ఉన్న బెంచ్ సెప్టెంబర్ 5న సుప్రీంకోర్టులో కేసుల విచారణను చేపట్టనుంది. జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీల బెంచ్ బుధవారం కేసులను విచారించనుంది. ఇంతకుముందు జస్టిస్ జ్ఞాన్ సుధామిశ్రా, జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్‌ల బెంచ్ 2013లో తొలిసారి సుప్రీంలో కేసులను విచారించిన పూర్తిస్థాయి మహిళా బెంచ్గా చరిత్ర సృష్టించింది. -
ప్రమాణ స్వీకారం చేసిన సుప్రీంకోర్టు కొత్త జడ్జ్‌లు
-
సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణ స్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ : జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సమక్షంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు పలువురు న్యాయవాదులు కూడా పాల్గొన్నారు. వీరి ముగ్గురి చేరికతో అత్యున్నత న్యాయస్థానంలో మొత్తం జడ్జీల సంఖ్య 25కు పెరిగింది. జస్టిస్ ఇందిరా బెనర్జీ చేరికతో మహిళా జడ్జీల సంఖ్య మూడుకు పెరిగింది. జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఇందూ మల్హోత్రా ఇది వరకే సుప్రీం కోర్టు జడ్జీలుగా విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఒకేసారి ముగ్గురు మహిళలు సుప్రీంకోర్టు జడ్జీలుగా ఉండటం ఇదే తొలిసారి. సుప్రీంకోర్టు చరిత్రలో జస్టిస్ ఇందిరా బెనర్జీ 8వ మహిళా జడ్జి కానున్నారు. కాగా, ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ సీనియారిటీని తగ్గిస్తూ నోటిఫికేషన్లో ఆయన పేరును మూడో స్థానంలో పేర్కొనడంతో సుప్రీంకోర్టు జడ్జీలు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రాను కలిసి తమ నిరసన తెలియజేయడంతో.. ప్రమాణ స్వీకార కార్యక్రమం యథావిధిగా జరపాలని, సీనియర్ జడ్జి జస్టిస్ రంజన్ గొగోయ్‌తో మాట్లాడాక నిర్ణయం తీసుకుందామని సీజేఐ హామీ ఇచ్చారు. దీంతో కార్యక్రమం సజావుగా కొనసాగింది. -
ముగ్గురు సుప్రీం జడ్జీల పదోన్నతికి ఆమోదం
న్యూఢిల్లీ: ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీచేశారు. పదోన్నతి పొందిన వారిలో ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ, ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరణ్ ఉన్నారు. ఈ నియామకాలకు సంబంధించిన వారెంట్లపై కోవింద్ శుక్రవారం సంతకం చేయగా, శనివారం అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో అత్యున్నత న్యాయస్థానంలో మొత్తం జడ్జీల సంఖ్య 25కు పెరిగింది. మహిళా జడ్జీల సంఖ్య మూడుకు చేరింది. జస్టిస్ ఇందిరా బెనర్జీ కొత్తగా చేరబోతుండగా, జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఇందూ మల్హోత్రా ఇది వరకే జడ్జీలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకేసారి ముగ్గురు మహిళలు సుప్రీంకోర్టు జడ్జీలుగా ఉండటం ఇదే తొలిసారి. సుప్రీంకోర్టు చరిత్రలో జస్టిస్ ఇందిరా బెనర్జీ 8వ మహిళా జడ్జి కానున్నారు. -
సీజేగా ఇందిరా బెనర్జీ
► ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ ► బాధ్యతల స్వీకరణ ► అందరి ఎదురుచూపుల మేరకు విధులు నిర్వర్తిస్తా ► కొత్త సీజే వ్యాఖ్య ► తమిళం నేర్చుకోవాలని ఆశ మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) ఇందిరా బెనర్జీ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌లో జరిగిన వేడుకలో ఆమె చేత రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ప్రమాణ స్వీకారం చేయించారు. అందరి ఎదురు చూపుల మేరకు విధుల్ని నిర్వర్తిస్తానని, చట్ట నిబంధనలు, శాసనాల మేరకు నడుచుకుం టానని ఇందిరా బెనర్జీ వ్యాఖ్యానించారు. సాక్షి, చెన్నై : మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సంజయ్ కిషన్ కౌల్ ఫిబ్రవరిలో పదోన్నతిపై సుప్రీం కోర్టుకు వెళ్లారు. అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది. తాత్కాళిక ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ న్యాయవాది రమేష్ వ్యవహరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో కోలకతాకు చెందిన ఇందిరా బెనర్జీని మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. మద్రాసు హైకోర్టులో రెండు దశాబ్దాల అనంతరం మహిళా ప్రధాన న్యాయమూర్తి నియమించ డంతో సర్వత్రా ఆహ్వానించారు. 1992లో శాంతాకుమారి పట్నాయక్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రస్తుతం రెండో మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఇందిరా బెనర్జీ కోల్‌కతాలో పుట్టి పెరిగారు. 1985లో న్యాయవాద వృత్తిలో అడుగు పెట్టారు. 2002లో కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గత నెల సీనియర్ హోదాను దక్కించుకున్నారు. ప్రస్తుతం మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై నియమితులయ్యారు. ప్రమాణ స్వీకారం : కొత్త సీజే ప్రమాణ స్వీకారం రాజ్ భవన్లో ఉదయం జరిగింది. రాష్ట్రపతి ఆమోదంతో వచ్చిన సీజే నియామక ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ ఈ వేడుకలో చదివి వినిపించారు. తదుపరి కొత్త సీజే ఇందిరా బెనర్జీకి రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పుష్పగుచ్ఛం అందించి శుభాకంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాడి కే పళనిస్వామి, న్యాయ శాఖ మంత్రి సీవీ షణ్ముగం, సీనియర్ న్యాయమూర్తి రమేష్, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ అధికారులు, అడ్వకేట్ జనరల్ ముత్తుకుమార స్వామి, అదనపు అడ్వకేట్ జనరల్ మణి శంకర్, సీనియర్ న్యాయవాదులు ఈ వేడుకకు హాజరై కొత్త సీజేకు పుష్పగుచ్ఛాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరి ఎదురు చూపుల మేరకు విధులు : ప్రమాణ స్వీకారం అనంతరం హైకోర్టుకు చేరుకున్న ఇందిరా బెనర్జీ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమెకు పొగడ్తల వర్షంలో ముంచెత్తుతు ప్రసంగాలు సాగాయి. అనంతరం ఇందిరా బెనర్జీ ప్రసంగిస్తూ, సంస్కృతి సంప్రదాయాలకు నెలవుగా ఉన్న తమిళనాడులో, చరిత్ర ప్రసిద్ధి చెందిన మద్రాసు హైకోర్టులో పనిచేసే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రాచీన తమిళ భాషను నేర్చుకోవాలన్న ఆశ కల్గుతుందని, నేర్చుకుంటానని వ్యాఖ్యానించారు. పర్యాటకా ప్రాంతాల్లో చూసేందుకు తమిళనాడుకు ఇది వరకు వచ్చానని, ఇప్పుడు జీవన పయనంలో విధులు నిర్వర్తించేందుకు వచ్చానని పేర్కొన్నారు. అందరి ఎదురు చూపులు మేరకు, శాసనాలు, చట్టాలకు లోబడి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానన్నారు. మద్రాసు హైకోర్టు తీర్పులు ఎన్నో హైకోర్టులకు మార్గదర్శకంగా, ఆదర్శంగా ఉన్నాయని, అలాంటి ఈ కోర్టులో పూర్తి స్థాయిలో తన విధులు, బాధ్యతల్ని నిర్వర్తించేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరం అని, అందరూ సహకరిస్తాన్న నమ్మకంతో ఉన్నట్టు ముగించారు.