న్యూఢిల్లీ: టీఆర్‌పీ స్కామ్‌లో చిక్కుకున్న రిపబ్లిక్ టెలివిజన్ చానల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆ కేసుకు సంబంధించి రిపబ్లిక్ టీవీ బాంబే హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ‘హైకోర్టులపై విశ్వాసం కలిగి ఉండాలి’ అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోవిడ్ కాలంలోనూ పనిచేసిన బాంబే హైకోర్టును ఆశ్రయించాలని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం రిపబ్లిక్ టీవీ తరఫు న్యాయవాది హరీష్ సాల్వేకు తెలిపింది.
అయితే కేసు విచారణపై హరీష్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. రిపబ్లిక్ టీవీ ఆఫీసు వొర్లి ప్రాంతంలో ఉంటుంది కదా? హైకోర్టు విచారించకుండానే ఇలాంటి పిటిషన్లను చేపట్టడం తప్పుడు సంకేతాలను పంపుతుందని ‘ఈ మధ్య కమిషనర్లు ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు’అని వ్యాఖ్యానించింది. టీఆర్‌పీ రేటింగ్‌లు పెంచుకునేందుకు రిపబ్లిక్ టీవీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ముంబై పోలీసులు కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసుకు సంబంధించి రిపబ్లిక్ టీవీ సీఎఫ్‌వో సుందరంను విచారణకు పిలిచారు. ఇప్పటికే ఫక్త్ మరాఠీ, బాక్స్ సినిమా చానళ్లపై కేసులు నమోదయ్యాయి.
టీఆర్పీ రేటింగ్‌ల నిలిపివేత
టీఆర్పీ రేటింగ్ పెంచుకునేందుకు చానళ్లు అక్రమ మార్గాలను ఎంచుకున్నా యనే ఆరోపణల నేపథ్యంలో టెలివిజన్ చానళ్ల వారపు రేటింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) గురువారం ప్రకటించింది. ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతులను సమీక్షించేందుకు 12 వారాలు పట్టొచ్చని, అప్పటిదాకా నిషేధం ఉంటుందని బార్క్ తెలిపింది. టీఆర్‌పీ స్కామ్‌కు సంబంధించి ముంబై పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బార్క్ రేటింగ్‌ల ఆధారంగానే టీవీ ఛానళ్లకు ప్రకటనలు అందుతాయి.
Comments
Please login to add a commentAdd a comment