Indu Malhotra
-
ప్రధాని భద్రతా వైఫల్యం.. తప్పు ఎవరిదో తేలాల్సిందే!
దర్యాప్తు కన్నా ముందే తప్పెవరిదో చెప్పేసేటంతటి పరస్పర విరుద్ధ అభిప్రాయాలతో ఇరువర్గాలు ఉంటే ఏం చేయాలి? పరస్పర నేరారోపణల నడుమ నిజానిజాలు ఎవరు తేల్చాలి? సాక్షాత్తూ దేశ ప్రధాని పంజాబ్ పర్యటన సందర్భంగా జనవరి 5న భద్రతా ఏర్పాట్లలో వైఫల్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర విరుద్ధ భావాలతో, విడివిడిగా విచారణ చేపట్టేసరికి ఇలాంటి పరిస్థితే తలెత్తింది. చివరకు సర్వోన్నత న్యాయస్థానం ఆ రెండు వేర్వేరు విచారణలకూ బ్రేకులు వేయాల్సి వచ్చింది. ప్రధాని భద్రతలో తలెత్తిన వైఫల్యంపై విచారణకు గాను రిటైర్డ్ సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి ఇందూ మల్హోత్రా సారథ్యంలో మరో నలుగురు సభ్యులతో ఉన్నత స్థాయి విచారణ సంఘాన్ని ఏర్పాటుచేసింది. సత్యాన్వేషకులు అందరూ స్వాగతించాల్సిన పరిణామం ఇది. జనవరి 5న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో హుస్సేనీవాలా సమీపంలో ఓ వంతెన మీద ప్రధాని మోదీ తన కాన్వాయ్‌తో సహా 20 నిమిషాల సేపు ప్రదర్శనకారుల మధ్య ఉండిపోవాల్సి వచ్చిన ఘటన ఏ రకంగా చూసినా దిగ్భ్రాంతికరమే. పంజాబ్ ఎన్నికల వేళ ఇది ప్రచార విన్యాసమనే వాదన నుంచి ప్రధాని ప్రాణాలకే రక్షణ లేనంతటి రైతుల నిరసన ఏమిటనే విమర్శల దాకా రక రకాల కథనాలు వినిపిస్తున్నాయి. దేనిలో నిజం ఎంతనేది పక్కనపెడితే, దేశంలోకెల్లా అత్యున్నత రాజకీయ పదవిలో ఉన్న వ్యక్తి భద్రతలో లోపమనేది సున్నితమైన అంశం. అందుకే, దాన్ని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్న అటు కేంద్రం, ఇటు పంజాబ్ ప్రభుత్వాల ఏకపక్ష విచారణలకు వదిలేయడం సరికాదు. సరిగ్గా సుప్రీమ్ కూడా అదే అభిప్రాయపడింది. మాటల యుద్ధంతో పరిష్కారం రాదని కుండబద్దలు కొట్టింది. తనదైన స్వతంత్ర ప్యానెల్‌తో విచారణకు ఆదేశించింది. ఈ స్వతంత్ర ఉన్నత స్థాయి విచారణ సంఘం దేశ ప్రధాని భద్రతా వైఫల్యానికి కారణాలేమిటి, ఆ లోపానికి బాధ్యులు ఎవరు, భవిష్యత్తులో వీవీఐపీల భద్రతలో లోపాలు తలెత్తకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి లాంటి వివిధ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించనుంది. విచారణ ఫలితాలను కోర్టుకు రహస్య నివేదికగా అందించనుంది. ఈ విచారణ కమిటీలో జాతీయ దర్యాప్తు సంఘం (ఎన్ఐఏ) డీజీ, చండీగఢ్ డీజీపీ, పంజాబ్ ఏడీజీపీ (సెక్యూరిటీ), పంజాబ్ – హరియాణా హైకోర్డ్ రిజిస్ట్రార్ జనరల్ లాంటి బాధ్యతాయుత పదవుల్లోని ఉన్నతాధికారులను సభ్యులుగా వేసింది కోర్టు. దాంతో విచారణ నిష్పాక్షికంగా, నిజాయతీగా సాగుతుందని సామా న్యులకు భరోసా! కేంద్ర, రాష్ట్ర సర్కార్లు రెండూ విచారణకు పూర్తిగా సహకరించడమే ఇక బాకీ! జరిగిన ఘటనలో జవాబు లేని ప్రశ్నలెన్నో. ఏటా రూ. 600 కోట్ల (2020 నాటికి) ఖర్చుతో, 3 వేల మందితో కూడిన ప్రత్యేక భద్రతా దళం (ఎస్పీజీ)దే ప్రధానమంత్రి భద్రత బాధ్యత. దానికి కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం, స్థానిక పోలీసులు, గూఢచర్యా విభాగం (ఐబీ) అండగా నిలుస్తాయి. ప్రధాని పర్యటనంటే తోడ్పడాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు, కార్యనిర్వాహక వ్యవస్థలే. ప్రధాని ఏదైనా రాష్ట్రంలో పర్యటిస్తే ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ లాంటి వారు స్వాగతించడం, రాజకీయేతర కార్యక్రమాలకు వెంట ఉండడం సర్వసాధారణం. కారణాలేమైనా, తాజా పంజాబ్ ఘటనలో వారెవరూ ఆయనతో లేరు. అలాగని నిరసనకారులు రోడ్డు మీద ప్రధానిని అడ్డగిస్తారనే సమాచారం వారి వద్ద ముందే ఉందని అనలేం. ప్రజాస్వామ్యంలో నిరసన ప్రదర్శన చట్టబద్ధమే గనక రైతులను తప్పుపట్టలేం. కానీ, వారి నిరసన వల్ల ప్రధాని ప్రయాణానికి ఇబ్బంది తలెత్తే పరిస్థితి రాకుండా చూడాల్సింది పంజాబ్ ప్రభుత్వమే. ఆ బాధ్యత నుంచి అక్కడి పాలకులు తప్పించుకోలేరు. జాతీయ ప్రాధాన్యం ఉన్న ఇలాంటి సంఘటనల్ని కూడా రాజకీయం చేయాలని ఎవరు ప్రయత్నించినా అది సరికాదు. సుప్రీమ్ తానే స్వతంత్ర విచారణకు దిగడానికి ముందు... కేంద్ర దర్యాప్తు బృందం అసలు విచారణైనా చేయకుండానే, ఏకంగా తప్పంతా రాష్ట్రప్రభుత్వ అధికారులదే అన్నట్టు వారికి నోటీసులివ్వడం విచిత్రం. ప్రధాని భద్రతా వైఫల్యానికి కారణాలు కనిపెట్టాల్సి ఉండగా, ఆ భద్రతకు బాధ్యుడైన ఎస్పీజీలోని సీనియర్ అధికారినే తీసుకెళ్ళి కేంద్రం దర్యాప్తు బృందంలో పెట్టడం మరీ విడ్డూరం. ఇక రాష్ట్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటైనా చేయక ముందే, తమ ప్రభుత్వాధికారుల తప్పేమీ లేదని ఘటన జరిగిననాడే పంజాబ్ సీఎం క్లీన్చిట్ ఇచ్చేసుకోవడం మరో వింత. ఇవి చాలదన్నట్టు ప్రతిపక్షాలు కావాలని ప్రధానికి హాని తలపెట్టాయన్నట్టుగా కేంద్రంలోని అధికార పార్టీ ప్రవర్తించడం విస్మయం రేపుతోంది. పంజాబ్, పొరుగునే ఉన్న యూపీ సహా మొత్తం 5 రాష్ట్రాల్లో ఎన్నికల వేళ ఈ ప్రవర్తనలన్నీ రాజకీయ కోణం నుంచి చూడాల్సిందే. అయితే, దేశ సరిహద్దుకు కిలోమీటర్ల దూరంలో, డ్రోన్ దాడులను కొట్టిపారేయలేని చోట... దేశనాయకుడికి జరగరానిది ఏదైనా జరిగితే ఏమిటన్నది ప్రశ్న. ఇరవై ఏళ్ళ క్రితం 2001 డిసెంబర్ 13న పార్లమెంట్ భవనంపై తీవ్రవాదుల దాడి దృశ్యాల్ని మర్చిపోలేం. ఇక జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేళ ఘాతుకచర్యలకు పాల్పడతామంటూ తీవ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు వస్తున్నా యని వార్త. ఈ పరిస్థితుల్లో పార్టీలకు అతీతంగా పౌరులు, నేతలందరికీ దేశ సమైక్యత, సమగ్రతే ప్రథమ ప్రాధాన్యం కావాలి. ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా సరే, ప్రధాని అంటే దేశమనే ఈ కుటుంబం అంతటికీ పెద్ద తలకాయేనని గుర్తించాలి, గౌరవించాలి. సుప్రీమ్ విచారణతో పంజాబ్ ఘటనలో తప్పెవరిదో తేలేదాకా ఆగాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి. -
రిపబ్లిక్ టీవీకి సుప్రీంలో చుక్కెదురు
న్యూఢిల్లీ: టీఆర్పీ స్కామ్‌లో చిక్కుకున్న రిపబ్లిక్ టెలివిజన్ చానల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆ కేసుకు సంబంధించి రిపబ్లిక్ టీవీ బాంబే హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ‘హైకోర్టులపై విశ్వాసం కలిగి ఉండాలి’ అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోవిడ్ కాలంలోనూ పనిచేసిన బాంబే హైకోర్టును ఆశ్రయించాలని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం రిపబ్లిక్ టీవీ తరఫు న్యాయవాది హరీష్ సాల్వేకు తెలిపింది. అయితే కేసు విచారణపై హరీష్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. రిపబ్లిక్ టీవీ ఆఫీసు వొర్లి ప్రాంతంలో ఉంటుంది కదా? హైకోర్టు విచారించకుండానే ఇలాంటి పిటిషన్లను చేపట్టడం తప్పుడు సంకేతాలను పంపుతుందని ‘ఈ మధ్య కమిషనర్లు ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు’అని వ్యాఖ్యానించింది. టీఆర్పీ రేటింగ్‌లు పెంచుకునేందుకు రిపబ్లిక్ టీవీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ముంబై పోలీసులు కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసుకు సంబంధించి రిపబ్లిక్ టీవీ సీఎఫ్‌వో సుందరంను విచారణకు పిలిచారు. ఇప్పటికే ఫక్త్ మరాఠీ, బాక్స్ సినిమా చానళ్లపై కేసులు నమోదయ్యాయి. టీఆర్పీ రేటింగ్‌ల నిలిపివేత టీఆర్పీ రేటింగ్ పెంచుకునేందుకు చానళ్లు అక్రమ మార్గాలను ఎంచుకున్నా యనే ఆరోపణల నేపథ్యంలో టెలివిజన్ చానళ్ల వారపు రేటింగ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) గురువారం ప్రకటించింది. ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతులను సమీక్షించేందుకు 12 వారాలు పట్టొచ్చని, అప్పటిదాకా నిషేధం ఉంటుందని బార్క్ తెలిపింది. టీఆర్పీ స్కామ్‌కు సంబంధించి ముంబై పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బార్క్ రేటింగ్‌ల ఆధారంగానే టీవీ ఛానళ్లకు ప్రకటనలు అందుతాయి. -
వేధింపులపై విచారణకు హాజరైన సీజేఐ
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై రహస్య విచారణ జరుపుతున్న త్రిసభ్య కమిటీ బుధవారం సీజేఐని కూడా విచారించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీల త్రిసభ్య కమిటీ ఎదుట సీజేఐ విచారణకు హాజరయ్యారు. లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో నిందితుడిగా ఓ సీజేఐ విచారణ కమిటీ ముందు హాజరవ్వడం భారత న్యాయ చరిత్రలో ఇదే తొలిసారి. విచారణకు హాజరు కావాల్సిందిగా గతంలోనే ఈ కమిటీ సీజేఐని కోరింది. దీంతో ఆయన విచారణకు వచ్చిన తన వంతుగా సహకరించారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని అయిన మహిళ, సీజేఐ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేయడం తెలిసిందే. కాగా, ఫిర్యాదు చేసిన మహిళ మూడు రోజులపాటు విచారణకు హాజరైన అనంతరం, ఈ కమిటీతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదంటూ వెళ్లిపోవడం తెలిసిందే. కమిటీ విచారణ వాతావరణం తనకు భయాన్ని కలిగిస్తోందనీ, తన లాయర్‌ను కూడా తనతోపాటు ఉండనివ్వటం లేదనీ, న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె విచారణ నుంచి మంగళవారం అర్ధాంతరంగా వెళ్లిపోయారు. విచారణను ఆడియో లేదా వీడియో రికార్డింగ్ కూడా చేయటం లేదనీ, ఏప్రిల్ 26, 29 తేదీల్లో ఆమె ఇచ్చిన వాంగ్మూలం ప్రతులను కూడా తనకు ఇవ్వలేదని ఆమె వాపోయారు. విచారణ ఎలా జరుగుతుందీ, ఏయే విధానాలను అనుసరిస్తారు అనే దానిని కూడా తనకు చెప్పలేదని ఆమె పేర్కొన్నారు. ఆమె లేకపోయినా విచారణ కొనసాగుతుందని చెప్పినా ఆమె విచారణకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో సీజేఐని త్రిసభ్య కమిటీ బుధవారం విచారించింది. -
సీజేఐపై కుట్ర.. ప్రత్యేక విచారణ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్‌తోపాటు, న్యాయమూర్తులపై భారీ కుట్ర జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించింది. విచారణ సమయంలో ఆయనకు సహకరించాలంటూ సీబీఐ, ఐబీ డైరెక్టర్లతోపాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్లకు ఆదేశాలిచ్చింది. అవసరమైతే ఇతరుల సాయం తీసుకోవచ్చంది. ఈ ఏకసభ్య కమిటీకి సీజేఐ అనుచిత ప్రవర్తన ఆరోపణలతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ కమిటీ తన దర్యాప్తు నివేదికను సీల్డు కవర్లో అందజేయాలని కోరింది. సీజేఐతో రాజీనామా చేయించేందుకు, ఇతర న్యాయమూర్తులను ప్రలోభాలకు గురిచేసి, తీర్పులను ప్రభావితం చేసేందుకు భారీ కుట్ర జరుగుతోందంటూ న్యాయవాది ఉత్సవ్ సింగ్ బైన్స్ వేసిన అఫిడవిట్‌ను గురువారం జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ దీపక్ గుప్తాల ప్రత్యేక ధర్మాసనం విచారించి, పై ఉత్తర్వులను వెలువరించింది. అఫిడవిట్లో పేర్కొన్న వివిధ అంశాలపై కమిటీ కోరినప్పుడు వివరణ ఇవ్వాలని లాయర్‌ను ఆదేశించింది. త్రిసభ్య కమిటీపై అభ్యంతరాలు.. సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మాజీ ఉద్యోగిని అంతర్గత విచారణకు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సీజేఐకు జస్టిస్ రమణ సన్నిహిత మిత్రుడని, నిత్యం సీజేఐ నివాసానికి ఆయన వెళ్తుంటారని, కమిటీలో ఆయన ఉండటం వల్ల తాను సమర్పించిన ఆధారాలు, అఫిడివిట్‌పై సరైన విచారణ జరుగుతుందని భావించడం లేదని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా, కమిటీలో మహిళా జడ్జి ఇందిరా బెనర్జీ ఒక్కరు మాత్రమే ఉండటంపైనా ఆమె జస్టిస్ బాబ్డేకు రాసిన లేఖలో అభ్యంతరం లేవనెత్తారు. కాగా, సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తునకు నియమించిన కమిటీ నుంచి జస్టిస్ ఎన్వీ రమణ తప్పుకున్నారు. ఈ మేరకు ఆయన సీజేఐకు సుదీర్ఘ లేఖ రాశారు. దీంతో ఆయన స్థానంలో జస్టిస్ ఇందూ మల్హోత్రాను నియమిస్తూ జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఫిర్యాదుదారు అభ్యంతరం తెలిపిన కారణంగా జస్టిస్ ఎన్వీ రమణ వైదొలగలేదని సమాచారం. -
అందరివాడు అయ్యప్ప
-
శబరిమలలో మహిళల ప్రవేశంపై సంచలన తీర్పు
న్యూఢిల్లీ: శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని పక్కనబెడుతూ అన్ని వయసుల స్త్రీలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది. రుతుస్రావాన్ని కారణంగా చూపుతూ ప్రస్తుతం 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు శబరిమల ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగానికి విరుద్ధం, అక్రమమని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పులో వెల్లడించింది. ఐదుగురు సభ్యుల బెంచ్ 4:1 మెజారిటీతో ఈ తీర్పు చెప్పింది. జస్టిస్ మిశ్రాతోపాటు జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్‌లు ఆలయంలోకి స్త్రీల ప్రవేశానికి అనుకూలంగా తీర్పునివ్వగా మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా మాత్రం వారితో విభేదించారు. మతపరమైన ఏ విశ్వాసాలను కొనసాగించాలి, ఏ సంప్రదాయాలను రద్దు చేయాలనేది కోర్టులు నిర్ణయించాల్సిన అంశం కాదని ఆమె తన తీర్పులో పేర్కొన్నారు. రుతుస్రావం అయ్యే వయసులో ఉన్న మహిళలకు ఆలయ ప్రవేశం నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ వచ్చిన పిటిషన్లను విచారించిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించగా.. తాజా తీర్పుపై భిన్న స్పందనలు వెలువడుతున్నాయి. లింగ సమానత్వం కోసం పోరాటంలో ఇదో కీలక విజయమని పలువురు మహిళా సామాజిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తుండగా, ఈ తీర్పు దురదృష్టకరమని కొన్ని హిందూ భక్త సంఘాలు, అయ్యప్ప భక్తులు పేర్కొంటున్నారు. తీర్పును అమలు చేస్తామని శబరిమల ఆలయ పరిపాలనను చూసుకునే ట్రావన్‌కోర్ దేవస్థాన మండలి తెలిపింది. భక్తిలో వివక్ష చూపలేం: జస్టిస్ మిశ్రా మహిళలకు ప్రవేశంపై శబరిమల ఆలయం పెట్టిన ఆంక్షలు తప్పనిసరి మత సంప్రదాయాలేమీ కాదనీ, మతం అనేది మనిషిని దైవత్వంతో అనుసంధానించే జీవన విధానమని జస్టిస్ మిశ్రా తన తీర్పులో పేర్కొన్నారు. భక్తిలో వివక్షను చూపలేమనీ, పురుషాధిక్య విధానాలతో ఆధ్యాత్మికతలో లింగ సమానత్వాన్ని పాటించకుండా ఉండలేమన్నారు. ‘ఆయప్ప భక్తులంతా హిందువులే. వారు ప్రత్యేక వర్గమేమీ కాదు. శరీర ధర్మ కారణాల ముసుగులో మహిళలను అణచివేయడం చట్టబద్ధం కాదు. నైతికత, ఆరోగ్యం తదితర కారణాలతో మహిళలను పూజలు చేయకుండా అడ్డుకోలేం. పురుషులు ఆటోగ్రాఫ్‌లు పెట్టేంత ప్రముఖులు అవుతున్నా మహిళలు సంతకం పెట్టే స్థితిలో కూడా లేరు’ అని అన్నారు. అయ్యప్ప భక్తులు ప్రత్యేక వర్గమన్న దేవస్థానం వాదనను జస్టిస్ మిశ్రా తోసిపుచ్చుతూ, ‘అయ్యప్ప భక్తులంటూ ప్రత్యేక వర్గంగా ఎవరూ లేరు. హిందువులెవరైనా శబరిమల ఆలయానికి వెళ్లొచ్చు. ఈ దేశంలోని ఇతర అయ్యప్ప ఆలయాల్లో మహిళలకు ప్రవేశం ఉంది. శబరిమలలో నిషేధమెందుకు? శబరిమల ఆలయం బహిరంగ ప్రార్థన స్థలమే. అయ్యప్పను పూజించేవారు ప్రత్యేక వర్గమేమీ కాదు’ అని స్పష్టం చేశారు. వచ్చే నెల 2న జస్టిస్ మిశ్రా పదవీ విరమణ పొందనుండగా, ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో ఆయన ఇచ్చిన చివరి తీర్పు ఇదే. తనతోపాటు జస్టిస్ ఖన్విల్కర్ తరఫున కూడా జస్టిస్ మిశ్రాయే 95 పేజీల తీర్పును రాశారు. మిగిలిన న్యాయమూర్తులు ఎవరికి వారు తమ తీర్పులు వెలువరించారు. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నారిమన్‌లు కూడా జస్టిస్ మిశ్రా అభిప్రాయాలతో తమ తీర్పుల్లో ఏకీభవించారు. రుతుస్రావం అయ్యే వయసులో ఉన్న మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26లకు విరుద్ధమని ఆయన జస్టిస్ నారిమన్ పేర్కొన్నారు. శబరిమల ఆలయ ప్రవేశం విషయంలో మహిళలపై వివక్ష చూపుతున్న కేరళ హిందూ బహిరంగ ప్రార్థనా స్థలాల నిబంధనలు–1965లోని 3(బి) నిబంధనను కూడా కొట్టేయాలని ఆయన అన్నారు. అది అంటరానితనమే: జస్టిస్ చంద్రచూడ్ వయసు, రుతుస్రావం స్థితి ఆధారంగా మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించకపోవడం అంటరానితనం కిందకే వస్తుందని జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పులో పేర్కొన్నారు. అది మహిళ గౌరవానికి భంగం కలిగించడంతోపాటు, పురుషుల కన్నా స్త్రీలు తక్కువనేలా ఉంటుందని అన్నారు. ‘రుతుస్రావం కారణంగా మహిళలు శుభ్రంగా లేరనే కారణం చూపుతూ వారిని గుడిలోకి రానివ్వకపోవడం ఓ రకమైన అంటరానితనమే. రాజ్యాంగంలోని 17వ అధికరణం ప్రకారం అది అక్రమం’ అని చంద్రచూడ్ తన 165 పేజీల తీర్పులో పేర్కొన్నారు. పునః సమీక్ష కోరతాం: అయ్యప్ప ధర్మసేన సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరమనీ, త్వరలోనే ఈ తీర్పుపై తాము పునఃసమీక్ష కోరతామని అయ్యప్ప ధర్మసేన అధ్యక్షుడు రాహుల్ ఈశ్వర్ చెప్పారు. శబరిమల ఆలయ మాజీ పూజారి మనవడైన రాహుల్ మాట్లాడుతూ ‘మేం తప్పకుండా సుప్రీంకోర్టులో మా పోరాటం కొనసాగిస్తాం. అక్టోబరు 16 వరకు ఆలయం మూసే ఉంటుంది. కాబట్టి అప్పటివరకు మాకు సమయం ఉంది’ అని వెల్లడించారు. మహిళలు సహా పలువురు భక్తులు కూడా తాము విశ్వాసాలను నమ్ముతామనీ, సుప్రీంకోర్టు తీర్పు విచారకరమన్నారు. శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడు తాంత్రి కందరారు రాజీవారు మాట్లాడుతూ తీర్పు తనను నిరాశకు గురిచేసినప్పటికీ, కోర్టు ఆదేశాలను అమలు చేయాలని దేవస్థానం నిర్ణయించిందన్నారు. తీర్పును కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ స్వాగతించారు. ఇదొక అద్భుత తీర్పు అనీ, హిందూ మతాన్ని మరింత మందికి చేరువ చేసేందుకు ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమని కేరళ మత సంస్థల శాఖ మంత్రి సురేంద్రన్ అన్నారు. మహారాష్ట్రలోని శని శింగ్నాపూర్ ఆలయంలోకి కూడా మహిళల ప్రవేశం కోసం గతంలో ఉద్యమం చేపట్టిన తృప్తీ దేశాయ్ తాజా సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. స్త్రీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు అభించిన విజయంగా ఆమె సుప్రీం తీర్పును అభివర్ణించారు. పురుషాధిక్య, అహంకార ఆలయ పాలక మండలికి ఈ తీర్పు చెంపపెట్టు అన్నారు. త్వరలోనే తాను శబరిమల ఆలయాన్ని సందర్శిస్తానని ఆమె చెప్పారు. అవి రెండు పరస్పర విరుద్ధ హక్కులు జస్టిస్ ఇందు మల్హోత్రా దేశంలో లౌకిక వాతావరణం ఉండేలా చేసేందుకు పురాతన విశ్వాసాలను రద్దు చేయాలనుకోవడం సమంజసం కాదని జస్టిస్ ఇందు మల్హోత్రా తన తీర్పులో పేర్కొన్నారు. సమానత్వ హక్కు, అయ్యప్ప స్వామిని పూజించడానికి మహిళలకు ఉన్న హక్కు.. ఈ రెండు పరస్పర విరుద్ధమైనవని ఆమె అన్నారు. ‘ఈ అంశం శబరిమలకే పరిమితంకాదు. ఇతర ఆలయాలపై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. శబరిమలలో పూజలు చేయడం ఒక మత సంప్రదాయం. దానిని కాపాడాలి. హేతుబద్ధ భావనలను మతపరమైన విషయాల్లోకి తీసుకురాకూడదు. మత సంప్రదాయాలపై న్యాయసమీక్ష జరగడం సరికాదు. కోర్టులు హేతుబద్ధతను, నైతికతను దేవుణ్ని పూజించే విధానంపై రుద్దలేవు. కొందరిని అనుమతించడం లేదంటే దాని అర్థం వారంతా అంటరానివారని కాదు. ఆలయ సంప్రదాయాలు, నమ్మకాలపై అది ఆధారపడి ఉంటుంది. భారత్‌లో భిన్న మత విధానాలు ఉన్నాయి. ప్రార్థించేందుకు ఉన్న ప్రాథమిక హక్కును సమానత్వ సిద్ధాంతం ఉల్లంఘించజాలదు’ అని ఆమె తన తీర్పులో వెల్లడించారు. సామాజిక రుగ్మతలైన సతీసహగమనం వంటి అంశాల్లో తప్ప, మతపరమైన విశ్వాసాల్ని తొలగించే అధికారం కోర్టులకు లేదని ఆమె అన్నారు. ఈ ఆలయాల్లోనూ నో ఎంట్రీ హరియాణలోని కార్తికేయ ఆలయం, రాజస్తాన్‌లోని రణక్పూర్ గుడి తదితరాల్లోనూ మహిళలను అనుమతించరు. క్రీ.పూ ఐదో శతాబ్దానికి చెందిన కార్తికేయుడి ఆలయం హరియాణాలోని కురుక్షేత్ర జిల్లా పెహోవాలో ఉంది. కార్తికేయుడు బ్రహ్మచారి. అందుకే ఈ ఆలయంలోకి మహిళలు ప్రవేశిస్తే వారిని దేవుడు శపిస్తాడని భక్తుల నమ్మకం. రాజస్తాన్‌లోని పాలి జిల్లాలో ఉన్న జైన ఆలయం రణక్పూర్ గుడిలోకి మహిళలకు ప్రవేశం లేదు. క్రీ.శ. 15వ శతాబ్దంలో నిర్మాణమైన దేవాలయాల సమూహ ప్రాంతమిది. ఈ ఆలయ సముదాయంలోకి రుతుస్రావం అయ్యే వయసులో ఉన్న మహిళల ప్రవేశం నిషిద్ధం. అసోంలోని బార్పెటా పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూ ఆలయం పట్బౌసి సత్రాలోకి రుతుస్రావమయ్యే స్త్రీలు రాకూడదనే నిబంధన ఉంది. 2010లో అప్పటి అసోం గవర్నర్ జేబీ పట్నాయక్ ఈ ఆలయ అధికారులను ఒప్పించి 20 మంది మహిళలకి ఆలయ ప్రవేశం కల్పించారు. అయితే, ఆ తర్వాత కొన్నాళ్ల పాటు మహిళల్ని అనుమతించినా మళ్లీ నిషేధం విధించారు. తిరువనంతపురంలోని ప్రఖ్యాత పద్మనాభస్వామి ఆలయంలో మహిళలకు ప్రవేశంపై కొన్ని పరిమితులున్నాయి. స్త్రీలు పద్మనాభుడికి పూజలు చేయవచ్చు. కానీ గర్భగుడిలోకి వెళ్లరాదు. వివాదం ఇలా ప్రారంభం 2006లో జ్యోతిష్కుడు ఒకరు ఆలయంలో దేవప్రశ్నం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఎవరో మహిళ ఆలయంలోకి ప్రవేశించిందన్నారు. వెంటనే కన్నడ నటి, ప్రస్తుత కర్ణాటక మంత్రివర్గంలో సభ్యురాలు జయమాల తాను శబరిమల ఆలయంలోకి వెళ్లి అయ్యప్పస్వామి విగ్రహాన్ని తాకినట్లు చెప్పారు.దీంతో శబరిమలలో మహిళల ఆలయ ప్రవేశంపై వివాదం ముదిరింది. ఆ తర్వాత మహిళలకు ప్రవేశం నిరాకరణను సవాల్ చేస్తూ సీనియర్ అడ్వకేట్ ఇందిర జైసింగ్ ఆధ్వర్యంలో మహిళా లాయర్లు కోర్టుకెక్కారు. వందల ఏళ్ల సంప్రదాయాల్ని కాదనే హక్కు కోర్టుకి ఉండదనీ, అలాంటి అంశాల్లో పూజారులదే తుది నిర్ణయమంటూ కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పుని లాయర్ల బృందం సుప్రీం కోర్టులో సవాల్‌చేసింది. శబరిమల ఆలయానికి ప్రాముఖ్యత ఉందనీ, ప్రభుత్వాలు, కోర్టులు జోక్యం చేసుకోకూడదని ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు వాదించింది. అయ్యప్పస్వామి నైష్టిక బ్రహ్మచారి, అందుకే రుతుస్రావ వయసులో మహిళల్ని రానివ్వడం లేదని చెప్పింది. దీన్ని మహిళలపై వివక్షగా చూడకూడదంది. హిందూమతంలోని వైవి«ధ్యాన్ని అర్థం చేసుకోలేక పిటిషినర్లు దానిని వివక్షగా చూస్తున్నాయని బోర్డు ఆరోపించింది. కొందరు మహిళా భక్తులు బోర్డుకు మద్దతుగా నిలిచారు. శబరిమల కేసు పూర్వాపరాలు... ► 1990: శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశంపై నిషేధాన్ని తొలగించాలంటూ ఎస్.మహేంద్రన్ అనే వ్యక్తి కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. ► 1991, ఏప్రిల్ 5: కొన్ని వయస్సుల మహిళలపై తరాలుగా కొనసాగుతున్న నిషేధాన్ని సమర్ధిస్తూ కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. ► 2006 ఆగస్టు 4: శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ పిటిషన్ వేసింది. ► 2007 నవంబర్: పిటిషన్‌కు మద్దతుగా కేరళలోని ఎల్డీఎఫ్ సర్కారు అఫిడవిట్ దాఖలు. ► 2016 ఫిబ్రవరి 6: కేరళ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. మతాచారాన్ని పాటించే భక్తుల హక్కును పరిరక్షిస్తామని తెలిపింది. ► 2016 ఏప్రిల్ 11: మహిళల ప్రవేశంపై నిషేధం వల్ల స్త్రీ, పురుష సమ న్యాయ భావనకు ప్రమాదం ఏర్పడిందని కోర్టు వ్యాఖ్య. ► 2016 ఏప్రిల్ 13: ఆలయ సంప్రదాయం పేరుతో ప్రవేశాలను అడ్డుకోవడంలో హేతుబద్ధత లేదన్న సుప్రీంకోర్టు. ► 2016 ఏప్రిల్ 21: మహిళలను అనుమతించాలంటూ హింద్ నవోత్థాన ప్రతిష్టాన్, నారాయణాశ్రమ తపోవనమ్ పిటిషన్లు. ► 2016 నవంబర్ 7: అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలనే వాదనకు మద్దతు తెలుపుతూ కేరళ అఫిడవిట్ వేసింది. ► 2017 అక్టోబర్ 13: ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. -
వ్యతిరేకించిన మహిళా న్యాయమూర్తి
న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి అనుమతి కల్పిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు 4 - 1 మెజారిటీతో వెలువడింది. అయితే ఈ నలుగురు న్యాయమూర్తుల తీర్పుతో అంగీకరించని ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా. ధర్మాసనం తీర్పును ఆమె వ్యతిరేకించారు. మతపరమైన మనోభావాలను న్యాయస్థానాలు అడ్డుకోకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆమె ట్రిపుల్ తలాక్ కేసుకు, శబరిమల కేసుకు మధ్య ఉన్న తేడాను చెప్పారు. ట్రిపుల్ తలాక్, సెక్షన్ 377 కేసుల్లో నిజమైన బాధితలతో పాటు ఇతర సామాజిక సంస్థలు కూడా పిటిషన్ దాఖలు చేయడంతో అవి ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని పేర్కొన్నారు. కానీ శబరిమల ఆలయం ప్రవేశం నిషేధం గురించి ఆ రాష్ట్రానికి చెందిన మహిళలు ఎవరూ కోర్టును ఆశ్రయించలేదని గుర్తు చేశారు. అంతేకాక కేరళలో మహిళలు వారి విద్యాభ్యాసం కారణంగా సామాజికంగా పురోభివృద్ధి సాధించారని.. వీరిలో ఎక్కువ మంది శబరిమలలో ఆచరించే పద్ధతులకు వ్యతిరేకంగా లేరని తెలిపారు. ‘భారతదేశం విభిన్న మతపరమైన ఆచారాలను కలిగి ఉంది. ఒక మతాన్ని గౌరవించటానికి, పాటించటానికి మాత్రమే రాజ్యాంగం అనుమతిస్తుంది. అంతేతప్ప అతడు లేదా ఆమె నమ్మి ఆచరించే మతపరమైన ఆచారాలలో జోక్యం చేసుకోవటానికి కాద’ని జస్టిస్ ఇందూ మల్హోత్రా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
‘కేసుల కేటాయింపు’పై తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ: కేసుల కేటాయింపు (రోస్టర్)పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉన్న ప్రత్యేక అధికారాలను తొలగించాలన్న పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. కేసుల కేటాయింపు బాధ్యతను ఐదుగురు జడ్జీల కొలీజియంకు అప్పగించాలని కేంద్ర మాజీ మంత్రి శాంతి భూషణ్ వేసిన పిటిషన్ ను శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. ఫలానా కేసు తనకు కేటాయించలేదని లేదా ఎందుకు కేటాయించరంటూ కొందరు జడ్జీలు అసంతృప్తికి గురయిన సందర్భాలు కూడా హైకోర్టుల్లో ఉన్నాయని విచారణ సందర్భంగా జడ్జి సిక్రి అన్నారు. పిటిషనర్ తరఫున దుశ్యంత్ దవే, ప్రశాంత్ భూషణ్ వాదిస్తూ.. సున్నితమైన కొన్ని కేసుల బాధ్యతను కొన్ని బెంచ్‌లకే అప్పగించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ‘మాస్టర్ రోస్టర్’గా సీజేఐకు అపరిమిత అధికారం ఉన్నట్లు కాదని తెలిపారు. సుప్రీంజడ్జిగా ఇందూ ప్రమాణం సీనియర్ న్యాయవాది ఇందూ మల్హోత్రా(61) సుప్రీం న్యాయమూర్తిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా ఆమెతో ప్రమాణం చేయించారు. ఈమె రాకతో సుప్రీంజడ్జీల సంఖ్య 25కు చేరుకుంది. దీంతో న్యాయవాది నుంచి నేరుగా సుప్రీం కోర్టు జడ్జిగా ఎన్నికైన తొలి మహిళగా ఆమె నిలిచారు. సుప్రీం చరిత్రలో ఒకేసారి ఇద్దరు మహిళా జడ్జీలు పనిచేయడం ఇది మూడోసారి. -
కొలీజియం సిఫార్సులు తిరస్కరణ
న్యూఢిల్లీ: దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు, కేంద్రప్రభుత్వానికి మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్(59)ను నియమించాలని సీజేఐ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫార్సుల్ని కేంద్రం తిప్పిపంపుతూ వాటిని పునఃపరిశీలించాలని సుప్రీంను కోరింది. కొలీజియం ప్రతిపాదనలు సుప్రీంకోర్టు విధించిన పరిమితులకు లోబడి లేవని, సుప్రీంకోర్టులో కేరళ నుంచి ప్రాతినిధ్యం ఉందని స్పష్టం చేసింది. జస్టిస్ జోసెఫ్ కన్నా అనేకమంది హైకోర్టు సీజేలు, సీనియర్ జడ్జీలు సీనియారిటీలో ముందున్నారని, కొలీజియం సిఫార్సులు సముచితం కాదని పేర్కొంది. సిఫార్సుల్ని తిప్పిపంపడానికి కారణాల్ని కొలీజియంకు తెలియచేస్తూ సీజేఐ జస్టిస్ మిశ్రాకు న్యాయ శాఖ నోట్ పంపింది. జస్టిస్ జోసెఫ్ పేరును పునః పరిశీలించాలన్న ప్రతిపాదనను రాష్ట్రపతి, ప్రధాని ఆమోదించారని పేర్కొంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కొలీజియం చీఫ్‌గా ఉన్న సీజేఐ జస్టిస్ మిశ్రా మద్దతు లభించింది. ఇద్దరి పేర్లను సిఫార్సు చేసినప్పటికీ జోసెఫ్ పేరును తిరస్కరించేందుకు కార్యనిర్వాహక వ్యవస్థకు హక్కు ఉందన్నారు. కేంద్రం నిర్ణయంపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తూ.. జస్టిస్ జోసెఫ్ పేరును మరోసారి పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు, సుప్రీం న్యాయమూర్తిగా సీనియర్ న్యాయవాది ఇందూ మల్హోత్రా నియామకాన్ని ఖరారు చేస్తూ గురువారం ఉదయం న్యాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ న్యాయవాది ఇందూ మల్హోత్రా, జస్టిస్ జోసెఫ్‌లను సుప్రీం న్యాయమూర్తులుగా నియమించాలంటూ కొలీజియం జనవరిలో కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. జస్టిస్ జోసెఫ్ పేరును ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో.. మరోసారి ఆయన పేరును కొలీజియం న్యాయ శాఖకు సిఫార్సు చేయవచ్చు. ప్రమాణాల మేరకే తిరస్కరించాం: కేంద్రం కొలీజియం సిఫార్సు చేసిన పేర్లలో ఒకరికి మాత్రమే ఆమోద ముద్ర వేయడంపై కేంద్ర ప్రభుత్వం వివరణిస్తూ.. ‘సుప్రీం సిఫార్సుల్ని వేరు చేసి చూసేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంది. వివిధ హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకాల సమయంలోను, ఇతర కేసుల్లోను అలాంటి ఉదంతాలు చోటుచేసుకున్నాయి. జస్టిస్ జోసెఫ్‌ను సుప్రీం జడ్జిగా నియామకానికి చేసిన సిఫార్సులు సుప్రీం నిర్దేశించిన ప్రమాణాలకు లోబడి లేవు. న్యాయవ్యవస్థ జారీ చేసిన ఉత్తర్వుల్లోనే జడ్జీల నియామకానికి నిబంధనలు, ఇతర ప్రమాణాల్ని ఏర్పాటు చేశారు. వాటిని మేం పరిగణనలోకి తీసుకున్నాం’ అని సీజేఐకు పంపిన ఆరు పేజీల లేఖలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. కొలీజియం అనుమతి లేకుండా సిఫార్సుల్ని వేరు చేయకూడదని 2014లో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోథా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ సమయంలో మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రమణియంను సుప్రీం న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం చేసిన సిఫార్సుల్ని మోదీ ప్రభుత్వం తిరస్కరిస్తూ మిగతా పేర్లకు ఆమోదం తెలిపింది. సీనియారిటీది ప్రధాన పాత్ర.. సుప్రీం న్యాయమూర్తి పదవికి జస్టిస్ జోసెఫ్ కంటే అర్హులైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, సీనియర్ న్యాయమూర్తులు ఉన్నారని కేంద్రం స్పష్టం చేసింది. సుప్రీం న్యాయమూర్తుల నియామకంలో సీనియారిటీ ప్రధాన పాత్ర పోషిస్తుందని, హైకోర్టు జడ్జీల నియామకంలోను సీనియారిటీని తప్పకుండా పాటిస్తున్నారని తెలిపింది. ‘దేశంలోని అన్ని హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ జాబితాను పరిశీలిస్తే.. జస్టిస్ జోసెఫ్ 42వ స్థానంలో ఉన్నారు. జస్టిస్ జోసెఫ్ కంటే వివిధ హైకోర్టుల్లో 11 మంది ప్రధాన న్యాయమూర్తులు సీనియారిటీలో ముందున్నారు. జస్టిస్ జోసెఫ్ సొంత హైకోర్టు కేరళ. ఆ రాష్ట్రం నుంచి సుప్రీం కోర్టు, ఇతర హైకోర్టుల్లో తగిన ప్రాతినిధ్యం ఉంది. సుప్రీంలో కేరళ నుంచి కురియన్ జోసెఫ్ జడ్జీగా ఉన్నారు. కేరళకే చెందిన జస్టిస్ రాధాకృష్ణన్ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సీజేగా, ఆంటోనీ డొమినిక్ కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ సమయంలో కేరళ హైకోర్టు నుంచి వచ్చిన మరొకరిని సుప్రీం జడ్జిగా నియమించడం సమర్ధనీయం కాదు’ అని తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. సుప్రీం చరిత్రలో తొలిసారిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా సీనియర్ న్యాయవాది ఇందూ మల్హోత్రా నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. నేడు ఆమె ప్రమాణ స్వీకారం చేస్తారు. అత్యున్నత న్యాయస్థానం చరిత్రలోనే ఒక మహిళా న్యాయవాది నేరుగా సుప్రీంకు ఎంపికవడం ఇదే మొదటిసారి. అలాగే స్వాతంత్య్రం అనంతరం సుప్రీంకోర్టులో పనిచేసిన ఏడో మహిళా న్యాయమూర్తి ఇందూ మల్హోత్రా.. 1989లో జస్టిస్ ఫాతిమా బీవీ సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం జస్టిస్ ఆర్.భానుమతి ఒక్కరే సుప్రీంలో మహిళా న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. 2007లో మల్హోత్రా సీనియర్ న్యాయవాది హోదా పొందారు. 1956, మార్చి 14న ఆమె బెంగళూరులో జన్మించారు. న్యాయ వ్యవస్థ ఏకంకావాలి: కాంగ్రెస్ కేంద్రం నిర్ణయాన్ని విపక్షాలతో పాటు సీనియర్ న్యాయవాదులు, సుప్రీం బార్ అసోసియేషన్ తప్పుపట్టింది. ‘భారతదేశ న్యాయవ్యవస్థ ప్రమాదంలో ఉంది. తన స్వతంత్రతను కాపాడుకునేందుకు న్యాయ వ్యవస్థ ఏకం కాకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రత కోసం ఎవరు పోరాడతారు. ఇంతవరకూ జరిగింది వదిలేసి న్యాయవ్యవస్థ ఒకే మాటపై నిలబడుతుందా?’ అని కాంగ్రెస్ నేత సిబల్ ప్రశ్నించారు.మోదీ ప్రభుత్వం న్యాయవ్యవస్థకు అతీతమా? అని మరో కాంగ్రెస్ నేత చిదంబరం ప్రశ్నించారు. ‘జస్టిస్ జోసెఫ్ నియామకం నిలుపుదల వెనుక కారణమేంటి.. ఆయన రాష్ట్రమా లేక మతమా లేక ఉత్తరాఖండ్ కేసులో తీర్పా?’ అని కేంద్రాన్ని పరోక్షంగా విమర్శించారు. జస్టిస్ జోసెఫ్ నియామకంపై ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు బార్ అసోíసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ తప్పుపట్టారు. ‘కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి ఈ రకమైన జోక్యం అనుచితం’ అని పేర్కొన్నారు. కొలీజియం జస్టిస్ జోసెఫ్ పేరును ఏకగ్రీవంగా ఖరారు చేసినా.. ఉత్తరాఖండ్ కేసులో కేంద్రానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చినందుకే తిరస్కరించారని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తప్పుపట్టారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పందిస్తూ..‘ఒకవైపు సీజేఐ బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆయన్ని నిరక్ష్యం చేస్తున్నామంటున్నారు. కాంగ్రెస్ పూర్తి నిరాశలో ఉంది’ అని విమర్శించారు. చాలా రాష్ట్రాలకు సుప్రీంలో ప్రాతినిధ్యం లేదు: కేంద్రం ‘దేశంలోని కలకత్తా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్తాన్, జార్ఖండ్, కశ్మీర్, ఉత్తరాఖండ్, సిక్కిం, మణిపూర్, మేఘాలయ నుంచి సుప్రీంకోర్టులో ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. చాలా కాలం నుంచి సుప్రీం కోర్టులో ఎస్సీ, ఎస్టీల నుంచి ఎలాంటి ప్రాతినిధ్యం లేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం’ అని లేఖలో కేంద్రం తెలిపింది. జస్టిస్ జోసెఫ్ పేరును సుప్రీంకోర్టు జడ్జిగా సిఫార్సు చేస్తూ రూపొందించిన తీర్మానాన్ని ఫిబ్రవరిలో కొలీజియం బహిర్గతం చేస్తూ.. ‘ఇతర హైకోర్టు సీజేలు, సీనియర్ జడ్జీల కంటే సుప్రీంకోర్టు జడ్జిగా నియమించడానికి జస్టిస్ జోసెఫ్ అర్హుడు’ అని పేర్కొంది. 2016లో ఉత్తరాఖండ్‌లో కేంద్రం విధించిన రాష్ట్రపతి పాలనను ఆ రాష్ట్ర హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ జోసెఫ్ రద్దు చేశారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగేలా ఉత్తర్వులిచ్చారు. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా అందరూ భావించారు. న్యాయ వ్యవస్థతో అనుచితంగా వ్యవహరించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని న్యాయ మంత్రి రవిశంకర్ విమర్శించారు. ‘తమకు అనుకూలంగా లేని జడ్జీల్ని కాంగ్రెస్ పార్టీ పక్కనపెట్టింది. ఎమర్జెన్సీ సమయంలో ప్రజల స్వేచ్ఛను సమర్ధిస్తూ జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా తన అభిప్రాయం చెప్పినందుకు ఆయనను పక్కన పెట్టి జూనియర్‌ను సీజేఐగా నియమించారు’ అని పేర్కొన్నారు. -
దేశ చరిత్రలో ఇదే తొలిసారి
-
సుప్రీం న్యాయమూర్తిగా మహిళా న్యాయవాది
సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్ మహిళా న్యాయవాది ఇందూ మల్హోత్రా నేరుగా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దేశ చరిత్రలో ఓ మహిళ నేరుగా అత్యున్నత న్యాయస్థాన న్యాయమూర్తిగా నియామకం కావడం ఇదే తొలిసారి. ఈ మేరకు భారత ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు నెలల కిందట ఐదుగురు సభ్యులు గల కొలీజియం న్యాయవాది ఇందూ పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానానికి ప్రతిపాదించింది. అక్కడి నుంచి న్యాయశాఖకు, ఆ తర్వాత ఇంటిలిజెన్స్ బ్యూరో(ఐబీ)కు ఇందూ వివరాలు చేరాయి. తాజాగా ఐబీ నుంచి కేంద్రానికి సమాచారం రావడంతో ఇందూను న్యాయమూర్తిగా నియమిస్తున్నట్లు కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందూ పాటు కొలిజీయం సూచించిన మరో పేరు ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి కేఎమ్ జోసెఫ్. ఈయన నియామకంపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. కొలీజియం నుంచి న్యాయ శాఖ వద్దకు వెళ్లిన జోసెఫ్ ఫైల్ ఇంకా అక్కడే ఉన్నట్లు సమాచారం. దీనిపై సుప్రీం కోర్టు న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు కూడా. కొలీజియం సూచించిన పేర్లపై స్పందించకుండా ప్రభుత్వం మిన్నకుండటం వెనుక ఆంతర్యం ఏంటిని ఆయన లేఖలో ప్రశ్నించారు. రోజు రోజుకూ అత్యున్నత న్యాయస్థానానికి ఉన్న గౌరవం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. -
సుప్రీం కోర్టులోనూ మహిళల పట్ల వివక్ష!
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా సీనియర్ న్యాయవాది ఇందూ మల్హోత్రాను నియమించాల్సిందిగా సుప్రీం కోర్టు కొలీజియం గురువారం నాడు సిఫార్సు చేసిన విషయం తెల్సిందే. ఇలా సుప్రీం కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న ఓ మహిళను నేరుగా అదే కోర్టు న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేయడం దేశంలో ఇదే మొదటిసారి. పురుషులైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించిన సందర్భాలు గతంలో ఉన్నాయిగానీ ఓ మహిళా న్యాయవాదిని నియమించడం ఇదే తొలి అవుతుంది. హైకోర్టుల్లో జడ్జీలుగా పనిచేసిన మహిళా న్యాయవాదులే సుప్రీం కోర్టుకు న్యాయవాదులుగా పదోన్నతులై వచ్చారు తప్ప నేరుగా రాలేదు. దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సాక్షాత్తు సుప్రీం కోర్టులో మహిళా న్యాయమూర్తులకు తగిన ప్రాతినిధ్యం లేదంటే ఇక్కడ కూడా మహిళల పట్ల వివక్షత కొనసాగుతోందని అర్థం అవుతోంది. సుప్రీం కోర్టు పాలనా వ్యవహారాలు కూడా సవ్యంగా లేవన్న విషయం శుక్రవారం మధ్యాహ్నం జస్టిస్ చలమేశ్వర్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో సహా నలుగురు జస్టిస్‌లు వెలుగులోకి తెచ్చారు. సుప్రీం కోర్టు రుజువర్తన నేడు ప్రశ్నార్థకమైందని, సకాలంలో సరైన చర్యలు తీసుకోలేకపోతే వ్యవస్థ మరింత భ్రష్టుపట్టి పోతుందని కూడా వారు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను హెచ్చరించినప్పటికీ ఆయన పట్టించుకోలేదట. ఈ వ్యవస్థ తీరుతెన్నుల గురించి మరిన్ని దిగ్భ్రాంతికరమైన అంశాలు వెలుగులోకి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇందూ మల్హోత్రా నియామక సిఫార్సును ఆమోదించినట్లయితే ఆమె సుప్రీం కోర్టుకు ఏడవ మహిళా న్యాయమూర్తి అవుతారు. మొత్తం సుప్రీం కోర్టులోని 27మంది జడ్జీల్లో ప్రస్తుతం పనిచేస్తున్న రెండవ మహిళా న్యాయమూర్తి అవుతారు. ఆమెతోపాటు జస్టిస్ భానుమతి ప్రస్తుతం సర్వీసులో ఉన్నారు. సుప్రీం కోర్టుకు 1989లో మొదటిసారి ఓ మహిళా న్యాయమూర్తి నియమితులుకాగా, రెండోసారి మరో మహిళా న్యాయమూర్తి 1994లో నియమితులయ్యారు. 1950 నుంచి ఇప్పటి వరకు (సిఫార్సు దశలోనే ఉన్న ఇందూ మల్హోత్రా, మరో న్యాయవాది జస్టిస్ జోసెఫ్‌లు కాకుండా) సుప్రీం కోర్టుకు 229 మంది న్యాయమూర్తులు నియమితులు కాగా, వారిలో ఆరుగురు మాత్రమే మహిళలు ఉన్నారు. అంటే మొత్తం నియామకాల్లో మహిళల ప్రాతినిథ్యం రెండు శాతం మాత్రమే. హైకోర్టుల్లో మహిళల ప్రాతినిధ్యం చూసినట్లయితే ఇంతకంటే కాస్త బెటరే. ప్రతిష్టాకరమైన బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, మద్రాస్ హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాల్లో మహిళల ప్రాతినిథ్యం దాదాపు పది శాతం ఉంది. దిగువ స్థాయి కోర్టుల్లో మహిళల ప్రాతినిథ్యం 28 శాతం ఉంది. లా చదువుతున్న విద్యార్థుల్లో స్త్రీ, పురుషుల సంఖ్య దాదాపు సమంగానే ఉన్నా, న్యాయవాది వృత్తిలో పది శాతం మహిళలే కొనసాగుతున్నారు. ఫలితంగా వివాహేతర సంబంధాలు, ట్రిపుల్ తలాక్, భార్యలపై బలత్కారం లాంటి మహిళా సంబంధిత అంశాలపై మగవాళ్ల బెంచీలే తీర్పులు వెలువరిస్తున్నాయి. మగవాళ్లు తీర్పుల్లో లింగ వివక్ష చూపిస్తారనికాదు, మహిళల సమస్యల పట్ల వారికే ఎక్కువగా నమ్మకం ఉంటుందన్న అభిప్రాయం ఉంది కనుక. ఇక ముందు అత్యున్నత న్యాయస్థానాల్లో మహిళల ప్రాతినిథ్యం పెంచేందుకు సుప్రీం కొలీజియం ఎంతో కృషి చేయాల్సి ఉంది.