
శబరిమల తీర్పును వ్యతిరేకించిన ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా
న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి అనుమతి కల్పిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు 4 - 1 మెజారిటీతో వెలువడింది. అయితే ఈ నలుగురు న్యాయమూర్తుల తీర్పుతో అంగీకరించని ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా. ధర్మాసనం తీర్పును ఆమె వ్యతిరేకించారు. మతపరమైన మనోభావాలను న్యాయస్థానాలు అడ్డుకోకూడదని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ఆమె ట్రిపుల్ తలాక్ కేసుకు, శబరిమల కేసుకు మధ్య ఉన్న తేడాను చెప్పారు. ట్రిపుల్ తలాక్, సెక్షన్ 377 కేసుల్లో నిజమైన బాధితలతో పాటు ఇతర సామాజిక సంస్థలు కూడా పిటిషన్ దాఖలు చేయడంతో అవి ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని పేర్కొన్నారు. కానీ శబరిమల ఆలయం ప్రవేశం నిషేధం గురించి ఆ రాష్ట్రానికి చెందిన మహిళలు ఎవరూ కోర్టును ఆశ్రయించలేదని గుర్తు చేశారు. అంతేకాక కేరళలో మహిళలు వారి విద్యాభ్యాసం కారణంగా సామాజికంగా పురోభివృద్ధి సాధించారని.. వీరిలో ఎక్కువ మంది శబరిమలలో ఆచరించే పద్ధతులకు వ్యతిరేకంగా లేరని తెలిపారు.
‘భారతదేశం విభిన్న మతపరమైన ఆచారాలను కలిగి ఉంది. ఒక మతాన్ని గౌరవించటానికి, పాటించటానికి మాత్రమే రాజ్యాంగం అనుమతిస్తుంది. అంతేతప్ప అతడు లేదా ఆమె నమ్మి ఆచరించే మతపరమైన ఆచారాలలో జోక్యం చేసుకోవటానికి కాద’ని జస్టిస్ ఇందూ మల్హోత్రా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment