సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టానికి సర్వోన్నత న్యాయస్ధానం మద్దతు పలుకుతూ ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. ఈ చట్టానికి రాజ్యాంగబద్ధత ఉందని స్పష్టం చేసింది. ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు నమోదు చేసే ముందు ప్రాథమిక దర్యాప్తు తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు సోమవారం తేల్చిచెప్పింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది. ఎఫ్‌ఐఆర్ నమోదుకు సీనియర్ పోలీస్ అధికారి అనుమతి అవసరం లేదని, ప్రత్యేక పరిస్ధితుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే అధికారం ఉండేలా చట్ట సవరణలో వెసులుబాటు కల్పించారు. ఎస్సీఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేయరాదంటూ దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తడంతో ఆ చట్టానికి కోరలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం సవరణలు ప్రతిపాదించింది.
శబరిమల వివాదంపై..
శబరిమల వివాదంపై తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఒకరి మతం, విశ్వాసాల విషయంలో మరొక మతస్తులు ఫిర్యాదు చేయవచ్చా అనే అంశం సహా పలు కోణాల్లో విచారణను సర్వోన్నత న్యాయస్ధానం చేపట్టనుంది. ఈ వివాదాన్ని త్వరితగతిన పరిష్కరించేలా సుప్రీంకోర్టు రోజువారీ విచారణ జరిపించనుంది. ఈ విచారణలో పిటిషనర్లకు ఏడు రోజులు, ప్రతివాదులకు ఏడు రోజుల పాటు సుప్రీంకోర్టు సమయాన్ని కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment