దర్యాప్తు కన్నా ముందే తప్పెవరిదో చెప్పేసేటంతటి పరస్పర విరుద్ధ అభిప్రాయాలతో ఇరువర్గాలు ఉంటే ఏం చేయాలి? పరస్పర నేరారోపణల నడుమ నిజానిజాలు ఎవరు తేల్చాలి? సాక్షాత్తూ దేశ ప్రధాని పంజాబ్ పర్యటన సందర్భంగా జనవరి 5న భద్రతా ఏర్పాట్లలో వైఫల్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర విరుద్ధ భావాలతో, విడివిడిగా విచారణ చేపట్టేసరికి ఇలాంటి పరిస్థితే తలెత్తింది. చివరకు సర్వోన్నత న్యాయస్థానం ఆ రెండు వేర్వేరు విచారణలకూ బ్రేకులు వేయాల్సి వచ్చింది. ప్రధాని భద్రతలో తలెత్తిన వైఫల్యంపై విచారణకు గాను రిటైర్డ్ సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి ఇందూ మల్హోత్రా సారథ్యంలో మరో నలుగురు సభ్యులతో ఉన్నత స్థాయి విచారణ సంఘాన్ని ఏర్పాటుచేసింది. సత్యాన్వేషకులు అందరూ స్వాగతించాల్సిన పరిణామం ఇది.
జనవరి 5న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో హుస్సేనీవాలా సమీపంలో ఓ వంతెన మీద ప్రధాని మోదీ తన కాన్వాయ్‌తో సహా 20 నిమిషాల సేపు ప్రదర్శనకారుల మధ్య ఉండిపోవాల్సి వచ్చిన ఘటన ఏ రకంగా చూసినా దిగ్భ్రాంతికరమే. పంజాబ్ ఎన్నికల వేళ ఇది ప్రచార విన్యాసమనే వాదన నుంచి ప్రధాని ప్రాణాలకే రక్షణ లేనంతటి రైతుల నిరసన ఏమిటనే విమర్శల దాకా రక రకాల కథనాలు వినిపిస్తున్నాయి. దేనిలో నిజం ఎంతనేది పక్కనపెడితే, దేశంలోకెల్లా అత్యున్నత రాజకీయ పదవిలో ఉన్న వ్యక్తి భద్రతలో లోపమనేది సున్నితమైన అంశం. అందుకే, దాన్ని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్న అటు కేంద్రం, ఇటు పంజాబ్ ప్రభుత్వాల ఏకపక్ష విచారణలకు వదిలేయడం సరికాదు. సరిగ్గా సుప్రీమ్ కూడా అదే అభిప్రాయపడింది. మాటల యుద్ధంతో పరిష్కారం రాదని కుండబద్దలు కొట్టింది. తనదైన స్వతంత్ర ప్యానెల్‌తో విచారణకు ఆదేశించింది.
ఈ స్వతంత్ర ఉన్నత స్థాయి విచారణ సంఘం దేశ ప్రధాని భద్రతా వైఫల్యానికి కారణాలేమిటి, ఆ లోపానికి బాధ్యులు ఎవరు, భవిష్యత్తులో వీవీఐపీల భద్రతలో లోపాలు తలెత్తకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి లాంటి వివిధ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించనుంది. విచారణ ఫలితాలను కోర్టుకు రహస్య నివేదికగా అందించనుంది. ఈ విచారణ కమిటీలో జాతీయ దర్యాప్తు సంఘం (ఎన్‌ఐఏ) డీజీ, చండీగఢ్ డీజీపీ, పంజాబ్ ఏడీజీపీ (సెక్యూరిటీ), పంజాబ్ – హరియాణా హైకోర్డ్ రిజిస్ట్రార్ జనరల్ లాంటి బాధ్యతాయుత పదవుల్లోని ఉన్నతాధికారులను సభ్యులుగా వేసింది కోర్టు. దాంతో విచారణ నిష్పాక్షికంగా, నిజాయతీగా సాగుతుందని సామా న్యులకు భరోసా! కేంద్ర, రాష్ట్ర సర్కార్లు రెండూ విచారణకు పూర్తిగా సహకరించడమే ఇక బాకీ!
జరిగిన ఘటనలో జవాబు లేని ప్రశ్నలెన్నో. ఏటా రూ. 600 కోట్ల (2020 నాటికి) ఖర్చుతో, 3 వేల మందితో కూడిన ప్రత్యేక భద్రతా దళం (ఎస్పీజీ)దే ప్రధానమంత్రి భద్రత బాధ్యత. దానికి కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం, స్థానిక పోలీసులు, గూఢచర్యా విభాగం (ఐబీ) అండగా నిలుస్తాయి. ప్రధాని పర్యటనంటే తోడ్పడాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు, కార్యనిర్వాహక వ్యవస్థలే. ప్రధాని ఏదైనా రాష్ట్రంలో పర్యటిస్తే ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ లాంటి వారు స్వాగతించడం, రాజకీయేతర కార్యక్రమాలకు వెంట ఉండడం సర్వసాధారణం. కారణాలేమైనా, తాజా పంజాబ్ ఘటనలో వారెవరూ ఆయనతో లేరు. అలాగని నిరసనకారులు రోడ్డు మీద ప్రధానిని అడ్డగిస్తారనే సమాచారం వారి వద్ద ముందే ఉందని అనలేం. ప్రజాస్వామ్యంలో నిరసన ప్రదర్శన చట్టబద్ధమే గనక రైతులను తప్పుపట్టలేం. కానీ, వారి నిరసన వల్ల ప్రధాని ప్రయాణానికి ఇబ్బంది తలెత్తే పరిస్థితి రాకుండా చూడాల్సింది పంజాబ్ ప్రభుత్వమే. ఆ బాధ్యత నుంచి అక్కడి పాలకులు తప్పించుకోలేరు.
జాతీయ ప్రాధాన్యం ఉన్న ఇలాంటి సంఘటనల్ని కూడా రాజకీయం చేయాలని ఎవరు ప్రయత్నించినా అది సరికాదు. సుప్రీమ్ తానే స్వతంత్ర విచారణకు దిగడానికి ముందు... కేంద్ర దర్యాప్తు బృందం అసలు విచారణైనా చేయకుండానే, ఏకంగా తప్పంతా రాష్ట్రప్రభుత్వ అధికారులదే అన్నట్టు వారికి నోటీసులివ్వడం విచిత్రం. ప్రధాని భద్రతా వైఫల్యానికి కారణాలు కనిపెట్టాల్సి ఉండగా, ఆ భద్రతకు బాధ్యుడైన ఎస్పీజీలోని సీనియర్ అధికారినే తీసుకెళ్ళి కేంద్రం దర్యాప్తు బృందంలో పెట్టడం మరీ విడ్డూరం. ఇక రాష్ట్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటైనా చేయక ముందే, తమ ప్రభుత్వాధికారుల తప్పేమీ లేదని ఘటన జరిగిననాడే పంజాబ్ సీఎం క్లీన్‌చిట్ ఇచ్చేసుకోవడం మరో వింత. ఇవి చాలదన్నట్టు ప్రతిపక్షాలు కావాలని ప్రధానికి హాని తలపెట్టాయన్నట్టుగా కేంద్రంలోని అధికార పార్టీ ప్రవర్తించడం విస్మయం రేపుతోంది. పంజాబ్, పొరుగునే ఉన్న యూపీ సహా మొత్తం 5 రాష్ట్రాల్లో ఎన్నికల వేళ ఈ ప్రవర్తనలన్నీ రాజకీయ కోణం నుంచి చూడాల్సిందే.
అయితే, దేశ సరిహద్దుకు కిలోమీటర్ల దూరంలో, డ్రోన్ దాడులను కొట్టిపారేయలేని చోట... దేశనాయకుడికి జరగరానిది ఏదైనా జరిగితే ఏమిటన్నది ప్రశ్న. ఇరవై ఏళ్ళ క్రితం 2001 డిసెంబర్ 13న పార్లమెంట్ భవనంపై తీవ్రవాదుల దాడి దృశ్యాల్ని మర్చిపోలేం. ఇక జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేళ ఘాతుకచర్యలకు పాల్పడతామంటూ తీవ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు వస్తున్నా యని వార్త. ఈ పరిస్థితుల్లో పార్టీలకు అతీతంగా పౌరులు, నేతలందరికీ దేశ సమైక్యత, సమగ్రతే ప్రథమ ప్రాధాన్యం కావాలి. ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా సరే, ప్రధాని అంటే దేశమనే ఈ కుటుంబం అంతటికీ పెద్ద తలకాయేనని గుర్తించాలి, గౌరవించాలి. సుప్రీమ్ విచారణతో పంజాబ్ ఘటనలో తప్పెవరిదో తేలేదాకా ఆగాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి.
Comments
Please login to add a commentAdd a comment