కొలీజియం సిఫార్సులు తిరస్కరణ | Govt asks collegium to reconsider recommendation to elevate KM Joseph to Supreme Court | Sakshi
Sakshi News home page

కొలీజియం సిఫార్సులు తిరస్కరణ

Published Fri, Apr 27 2018 1:26 AM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

Govt asks collegium to reconsider recommendation to elevate KM Joseph to Supreme Court - Sakshi

ఇందూ మల్హోత్రా, సుప్రీం కోర్టు, జస్టిస్‌ జోసెఫ్‌

న్యూఢిల్లీ: దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు, కేంద్రప్రభుత్వానికి మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కేఎం జోసెఫ్‌(59)ను నియమించాలని సీజేఐ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫార్సుల్ని కేంద్రం తిప్పిపంపుతూ వాటిని పునఃపరిశీలించాలని సుప్రీంను కోరింది. కొలీజియం ప్రతిపాదనలు సుప్రీంకోర్టు విధించిన పరిమితులకు లోబడి లేవని, సుప్రీంకోర్టులో కేరళ నుంచి ప్రాతినిధ్యం ఉందని స్పష్టం చేసింది.

జస్టిస్‌ జోసెఫ్‌ కన్నా అనేకమంది హైకోర్టు సీజేలు, సీనియర్‌ జడ్జీలు సీనియారిటీలో ముందున్నారని, కొలీజియం సిఫార్సులు సముచితం కాదని పేర్కొంది. సిఫార్సుల్ని తిప్పిపంపడానికి కారణాల్ని కొలీజియంకు తెలియచేస్తూ సీజేఐ జస్టిస్‌ మిశ్రాకు న్యాయ శాఖ నోట్‌ పంపింది. జస్టిస్‌ జోసెఫ్‌ పేరును పునః పరిశీలించాలన్న ప్రతిపాదనను రాష్ట్రపతి, ప్రధాని ఆమోదించారని పేర్కొంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కొలీజియం చీఫ్‌గా ఉన్న సీజేఐ జస్టిస్‌ మిశ్రా  మద్దతు లభించింది. ఇద్దరి పేర్లను సిఫార్సు చేసినప్పటికీ జోసెఫ్‌ పేరును తిరస్కరించేందుకు కార్యనిర్వాహక వ్యవస్థకు హక్కు ఉందన్నారు.

కేంద్రం నిర్ణయంపై సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆందోళన వ్యక్తం చేస్తూ.. జస్టిస్‌ జోసెఫ్‌ పేరును మరోసారి పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు, సుప్రీం న్యాయమూర్తిగా సీనియర్‌ న్యాయవాది ఇందూ మల్హోత్రా నియామకాన్ని ఖరారు చేస్తూ గురువారం ఉదయం న్యాయ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సీనియర్‌ న్యాయవాది ఇందూ మల్హోత్రా, జస్టిస్‌ జోసెఫ్‌లను సుప్రీం న్యాయమూర్తులుగా నియమించాలంటూ కొలీజియం జనవరిలో కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. జస్టిస్‌ జోసెఫ్‌ పేరును ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో.. మరోసారి ఆయన పేరును కొలీజియం న్యాయ శాఖకు సిఫార్సు చేయవచ్చు.  

ప్రమాణాల మేరకే తిరస్కరించాం: కేంద్రం  
కొలీజియం సిఫార్సు చేసిన పేర్లలో ఒకరికి మాత్రమే ఆమోద ముద్ర వేయడంపై కేంద్ర ప్రభుత్వం వివరణిస్తూ.. ‘సుప్రీం సిఫార్సుల్ని వేరు చేసి చూసేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంది. వివిధ హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకాల సమయంలోను, ఇతర కేసుల్లోను అలాంటి ఉదంతాలు చోటుచేసుకున్నాయి. జస్టిస్‌ జోసెఫ్‌ను సుప్రీం జడ్జిగా నియామకానికి చేసిన సిఫార్సులు సుప్రీం నిర్దేశించిన ప్రమాణాలకు లోబడి లేవు. న్యాయవ్యవస్థ జారీ చేసిన ఉత్తర్వుల్లోనే జడ్జీల నియామకానికి నిబంధనలు, ఇతర ప్రమాణాల్ని ఏర్పాటు చేశారు.

వాటిని మేం పరిగణనలోకి తీసుకున్నాం’ అని సీజేఐకు పంపిన ఆరు పేజీల లేఖలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. కొలీజియం అనుమతి లేకుండా సిఫార్సుల్ని వేరు చేయకూడదని 2014లో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం లోథా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ సమయంలో మాజీ సొలిసిటర్‌ జనరల్‌ గోపాల సుబ్రమణియంను సుప్రీం న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం చేసిన సిఫార్సుల్ని మోదీ ప్రభుత్వం తిరస్కరిస్తూ మిగతా పేర్లకు ఆమోదం తెలిపింది.  

సీనియారిటీది ప్రధాన పాత్ర..
సుప్రీం న్యాయమూర్తి పదవికి జస్టిస్‌ జోసెఫ్‌ కంటే అర్హులైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, సీనియర్‌ న్యాయమూర్తులు ఉన్నారని కేంద్రం స్పష్టం చేసింది.  సుప్రీం న్యాయమూర్తుల నియామకంలో సీనియారిటీ ప్రధాన పాత్ర పోషిస్తుందని, హైకోర్టు జడ్జీల నియామకంలోను సీనియారిటీని తప్పకుండా పాటిస్తున్నారని తెలిపింది. ‘దేశంలోని అన్ని హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ జాబితాను పరిశీలిస్తే.. జస్టిస్‌ జోసెఫ్‌ 42వ స్థానంలో ఉన్నారు.

జస్టిస్‌ జోసెఫ్‌ కంటే వివిధ హైకోర్టుల్లో 11 మంది ప్రధాన న్యాయమూర్తులు సీనియారిటీలో ముందున్నారు. జస్టిస్‌ జోసెఫ్‌ సొంత హైకోర్టు కేరళ. ఆ రాష్ట్రం నుంచి సుప్రీం కోర్టు, ఇతర హైకోర్టుల్లో తగిన ప్రాతినిధ్యం ఉంది. సుప్రీంలో కేరళ నుంచి కురియన్‌ జోసెఫ్‌ జడ్జీగా ఉన్నారు. కేరళకే చెందిన జస్టిస్‌ రాధాకృష్ణన్‌ ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు సీజేగా, ఆంటోనీ డొమినిక్‌ కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ సమయంలో కేరళ హైకోర్టు నుంచి వచ్చిన మరొకరిని సుప్రీం జడ్జిగా నియమించడం సమర్ధనీయం కాదు’ అని తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.

సుప్రీం చరిత్రలో తొలిసారిగా
సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా సీనియర్‌ న్యాయవాది ఇందూ మల్హోత్రా నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. నేడు ఆమె ప్రమాణ స్వీకారం చేస్తారు. అత్యున్నత న్యాయస్థానం చరిత్రలోనే ఒక మహిళా న్యాయవాది నేరుగా సుప్రీంకు ఎంపికవడం ఇదే మొదటిసారి. అలాగే స్వాతంత్య్రం అనంతరం సుప్రీంకోర్టులో పనిచేసిన ఏడో మహిళా న్యాయమూర్తి ఇందూ మల్హోత్రా.. 1989లో జస్టిస్‌ ఫాతిమా బీవీ సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం జస్టిస్‌ ఆర్‌.భానుమతి ఒక్కరే సుప్రీంలో మహిళా న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.  2007లో మల్హోత్రా సీనియర్‌ న్యాయవాది హోదా పొందారు. 1956, మార్చి 14న ఆమె బెంగళూరులో జన్మించారు.   

న్యాయ వ్యవస్థ ఏకంకావాలి: కాంగ్రెస్‌
కేంద్రం నిర్ణయాన్ని విపక్షాలతో పాటు సీనియర్‌ న్యాయవాదులు, సుప్రీం బార్‌ అసోసియేషన్‌ తప్పుపట్టింది. ‘భారతదేశ న్యాయవ్యవస్థ ప్రమాదంలో ఉంది. తన స్వతంత్రతను కాపాడుకునేందుకు న్యాయ వ్యవస్థ ఏకం కాకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది.  న్యాయవ్యవస్థ స్వతంత్రత కోసం ఎవరు పోరాడతారు. ఇంతవరకూ జరిగింది వదిలేసి న్యాయవ్యవస్థ ఒకే మాటపై నిలబడుతుందా?’ అని కాంగ్రెస్‌ నేత సిబల్‌ ప్రశ్నించారు.మోదీ ప్రభుత్వం న్యాయవ్యవస్థకు అతీతమా? అని మరో కాంగ్రెస్‌ నేత చిదంబరం ప్రశ్నించారు.

‘జస్టిస్‌ జోసెఫ్‌ నియామకం నిలుపుదల వెనుక కారణమేంటి.. ఆయన రాష్ట్రమా లేక మతమా లేక ఉత్తరాఖండ్‌ కేసులో తీర్పా?’ అని కేంద్రాన్ని పరోక్షంగా విమర్శించారు.  జస్టిస్‌ జోసెఫ్‌ నియామకంపై ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు బార్‌ అసోíసియేషన్‌ అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌ తప్పుపట్టారు. ‘కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి ఈ రకమైన జోక్యం అనుచితం’ అని పేర్కొన్నారు.  కొలీజియం జస్టిస్‌ జోసెఫ్‌ పేరును ఏకగ్రీవంగా ఖరారు చేసినా.. ఉత్తరాఖండ్‌  కేసులో కేంద్రానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చినందుకే తిరస్కరించారని సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌  తప్పుపట్టారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పందిస్తూ..‘ఒకవైపు సీజేఐ బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆయన్ని నిరక్ష్యం చేస్తున్నామంటున్నారు. కాంగ్రెస్‌ పూర్తి నిరాశలో ఉంది’ అని విమర్శించారు.  

చాలా రాష్ట్రాలకు సుప్రీంలో ప్రాతినిధ్యం లేదు: కేంద్రం
‘దేశంలోని కలకత్తా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్తాన్, జార్ఖండ్, కశ్మీర్, ఉత్తరాఖండ్, సిక్కిం, మణిపూర్, మేఘాలయ నుంచి సుప్రీంకోర్టులో ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. చాలా కాలం నుంచి సుప్రీం కోర్టులో ఎస్సీ, ఎస్టీల నుంచి ఎలాంటి ప్రాతినిధ్యం లేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం’ అని లేఖలో కేంద్రం తెలిపింది.   జస్టిస్‌ జోసెఫ్‌ పేరును సుప్రీంకోర్టు జడ్జిగా సిఫార్సు చేస్తూ రూపొందించిన తీర్మానాన్ని ఫిబ్రవరిలో కొలీజియం బహిర్గతం చేస్తూ.. ‘ఇతర హైకోర్టు సీజేలు, సీనియర్‌ జడ్జీల కంటే సుప్రీంకోర్టు జడ్జిగా నియమించడానికి జస్టిస్‌ జోసెఫ్‌ అర్హుడు’ అని పేర్కొంది.

2016లో ఉత్తరాఖండ్‌లో కేంద్రం విధించిన రాష్ట్రపతి పాలనను ఆ రాష్ట్ర హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ జోసెఫ్‌ రద్దు చేశారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగేలా ఉత్తర్వులిచ్చారు. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా అందరూ భావించారు. న్యాయ వ్యవస్థతో అనుచితంగా వ్యవహరించిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదేనని న్యాయ మంత్రి రవిశంకర్‌ విమర్శించారు. ‘తమకు అనుకూలంగా లేని జడ్జీల్ని కాంగ్రెస్‌ పార్టీ పక్కనపెట్టింది. ఎమర్జెన్సీ సమయంలో ప్రజల స్వేచ్ఛను సమర్ధిస్తూ జస్టిస్‌ హెచ్‌ఆర్‌ ఖన్నా తన అభిప్రాయం చెప్పినందుకు ఆయనను పక్కన పెట్టి జూనియర్‌ను సీజేఐగా నియమించారు’ అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement