సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఇందూ మల్హోత్రా
సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్ మహిళా న్యాయవాది ఇందూ మల్హోత్రా నేరుగా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దేశ చరిత్రలో ఓ మహిళ నేరుగా అత్యున్నత న్యాయస్థాన న్యాయమూర్తిగా నియామకం కావడం ఇదే తొలిసారి. ఈ మేరకు భారత ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు నెలల కిందట ఐదుగురు సభ్యులు గల కొలీజియం న్యాయవాది ఇందూ పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానానికి ప్రతిపాదించింది.
అక్కడి నుంచి న్యాయశాఖకు, ఆ తర్వాత ఇంటిలిజెన్స్ బ్యూరో(ఐబీ)కు ఇందూ వివరాలు చేరాయి. తాజాగా ఐబీ నుంచి కేంద్రానికి సమాచారం రావడంతో ఇందూను న్యాయమూర్తిగా నియమిస్తున్నట్లు కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందూ పాటు కొలిజీయం సూచించిన మరో పేరు ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి కేఎమ్ జోసెఫ్. ఈయన నియామకంపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.
కొలీజియం నుంచి న్యాయ శాఖ వద్దకు వెళ్లిన జోసెఫ్ ఫైల్ ఇంకా అక్కడే ఉన్నట్లు సమాచారం. దీనిపై సుప్రీం కోర్టు న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు కూడా. కొలీజియం సూచించిన పేర్లపై స్పందించకుండా ప్రభుత్వం మిన్నకుండటం వెనుక ఆంతర్యం ఏంటిని ఆయన లేఖలో ప్రశ్నించారు. రోజు రోజుకూ అత్యున్నత న్యాయస్థానానికి ఉన్న గౌరవం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment