republic tv
-
మీడియా ట్రేడ్ మార్క్ వివాదం: ఆర్టీవీకి భారీ ఊరట
మీడియాలో ట్రేడ్ మార్క్ వివాదంలో తెలుగు న్యూస్ ఛానల్ ఆర్టీవీకి ఊరట లభించింది. రిపబ్లిక్ టీవీ లోగో, 'R'ను వినియోగించి RTV న్యూస్ ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు పాల్పడిందన్న ఆరోపణలను కోర్టు బాంబే హైకోర్టు శుక్రవారం తోసి పుచ్చింది. ఈ వ్యాజ్యాన్ని విచారించే వరకు ఆర్టీవీ న్యూస్ లోగో వినియోగంపై అత్యవసర స్టే విధించాలని కోరుతూ రిపబ్లిక్ టీవీ వేసిన మధ్యంతర దరఖాస్తును జస్టిస్ మనీష్ పితలే తోసిపుచ్చారు. జాతీయ ఛానెల్ రిపబ్లిక్ టీవీ, రవిప్రకాష్ నేతృత్వంలోని R TV న్యూస్‌పై ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు రూ.100 కోట్ల నష్ట పరిహారం కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. RTV తన ట్రేడ్‌మార్క్‌ను కాపీ కొట్టి, మోసపూరితంగా వ్యవరించిందని ఆరోపించింది. ఈ ఉల్లంఘనకు గాను ఆర్టీవీపై శాశ్వత నిషేధాన్ని విధించాలని కోరుతూ రిపబ్లిక్ TV మాతృ సంస్థ ARG Outlier మార్చి 2023లో దావా వేసింది. తాజాగా ఈ విషయంలో రిపబ్లిక్ టీవీకి భారీ షాక్ తగిలింది. -
నారా వారి మాట.. ఒకటోస్సారి.. రెండోస్సారి
సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్రమోదీ అంత దుర్మార్గమైన రాజకీయ నాయకుణ్ణి చరిత్రలో చూడలేదని గతంలో నిప్పులు చెరిగిన చంద్రబాబు.. ఇప్పుడు హఠాత్తుగా నాలుక మడతపెట్టి మోదీ అంత గొప్ప నాయకుడు లేరని.. మోదీ వల్లే దేశానికి గుర్తింపు వచ్చిందని, ఆయనకే తన సంపూర్ణ మద్దతు అని చంద్రబాబు పేర్కొనటంపై సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు వైరల్ అవుతున్నాయి. రోజుకో వేషం.. పూటకో మాటతో ప్రజలను మభ్యపెట్టడం చంద్రబాబుకు అలవాటేనని పలువురు పేర్కొంటున్నారు. మాట మార్చటం.. ప్రజలను ఏమార్చటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొంటున్నారు. గతంలో ప్రధాని మోదీపై చేసిన విమర్శలు.. తాజాగా రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటల్ని చూసి నవ్వుకుంటున్నారు. నాడు మోదీని ఉద్దేశించి చంద్రబాబు ఏమన్నారంటే.. మోదీ హార్డ్‌కోర్ టెర్రరిస్ట్ ‘ప్రధాని నరేంద్రమోదీ హార్డ్‌కోర్ టెర్రరిస్ట్. ఆయన మంచి వ్యక్తి కాదు. 2002లో గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు మోదీ రాజీనామా చేయాలని మొదట నేనే డిమాండ్ చేశా. ఆ తర్వాత చాలా దేశాలు ఆయనను తమ దేశంలోకి రావడంపై నిషేధం విధించాయి. ప్రధాని అయ్యాక మైనారిటీలపై మరోసారి దాడి చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు.’ (ఏప్రిల్ 3, 2019న చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన మైనారిటీల సభలో చంద్రబాబు) పెళ్లాన్ని చూసుకోలేని వాడు.. దేశాన్ని ఏం చూసుకుంటాడు ‘నువ్వు భార్యను వదిలేశావు. కుటుంబ వ్యవస్థపై నమ్మకం ఉందా? ప్రధానికి కుటుంబం లేదు. కొడుకు లేడు. దేశంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేశాడు. పెళా్లన్ని చూసుకోలేని వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు?’ (ఫిబ్రవరి 10, 2019న గుంటూరు సభలో..) ఇడ్లీ తిన్నా పన్ను కట్టించుకుంటున్నారు ‘దేశానికి ఏం చేశారో చెప్పే దమ్ము కేంద్రానికి ఉందా? నల్లధనం నియంత్రణ కోసం నోట్ల రద్దు అని చెప్పి ప్రజల డబ్బును బ్యాంకు నుంచి తీసుకోవడానికి ఇబ్బందులు పెడుతున్నారు. జీఎస్టీ అని కొత్త చట్టాన్ని తెచ్చారు. ఇడ్లీ తిన్నా పన్ను కట్టించుకుంటున్నారు. దేశంలో రైతులు దివాళా తీసే పరిస్థితి తీసుకువచ్చారు.’ (జూన్ 19, 2018న కర్నూలు జిల్లా నాయుడుపేట మహాసంకల్ప సభలో..) బోఫోర్స్ కంటే అతిపెద్ద కుంభకోణం రాఫెల్ ‘కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అన్నివిధాలా ఘోరంగా విఫలమైంది. నోట్ల రద్దుతో కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు చేశారు. ఈ చర్యతో బ్యాంకులన్నీ దివాళా తీశాయి. అభివృద్ధి ఆగిపోయింది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. రూపాయి విలువ పడిపోయింది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుదేలయ్యాయి. రక్షణ శాఖలో భారీ అవినీతి జరిగింది. బోఫోర్స్ కంటే అతిపెద్ద కుంభకోణం రాఫెల్ డీల్. దీనిపై సమగ్ర విచారణ చేయాలి.’ (అక్టోబర్ 11, 2018న కళ్యాణదుర్గం బహిరంగ సభలో..) మోదీవన్నీ విఫల కార్యక్రమాలు ‘ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానికి, బ్రిటిష్ వాళ్లకి తేడా ఏమీ లేదు. అమిత్‌షాకు నాయకుడికి ఉండాల్సిన లక్షణాలేమీ లేవు. బీజేపీ నేతల్ని కృష్ణా నదిలో ముంచితే వారి పాపపు ఆలోచనలన్నీ పోతాయి. ప్రధాని నరేంద్ర మోదీవన్నీ విఫల కార్యక్రమాలు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి వాటిని సరైన పరిష్కారం చూపకుండానే తీసుకువచ్చారు. దీనివల్ల దేశంలో అభివృద్ధి రేటు తగ్గిపోయింది. అదృష్టం కలిసి వచ్చి నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు. ఆయన కంటే నేనే సీనియర్.’ (సెప్టెంబర్ 12, 2018న అసెంబ్లీలో..) మోదీ వచ్చాక అభివృద్ధి ఆగిపోయింది ‘ప్రధాని మోదీ రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేశారు. మోదీ వచ్చాక దేశంలో అభివృద్ధి ఆగిపోయింది. రూపాయి విలువ పడిపోయింది. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిపోయాయి. నోట్ల రద్దుతో ప్రజలంతా ఇబ్బందులు పడ్డారు.’ (సెప్టెంబర్ 21, 2018న విజయవాడ జ్ఞాన భేరి సభలో..) సిగ్గు, లజ్జ, గౌరవం లేని వ్యక్తి మోదీ ‘ప్రధాని నరేంద్ర మోదీకి సిగ్గు కూడా లేదు. సిగ్గు, లజ్జ, ఒక గౌరవం లేని వ్యక్తి. నా జీవితంలో చాలామంది వ్యక్తుల్ని చూశాను. ఇలాంటి వ్యక్తిని చూడలేదు. గ్రామాల్లో ఉండే చిన్న కార్యకర్త నరేంద్ర మోదీ కంటే వెయ్యి రెట్లు బెటర్. అది ఆయన స్తోమత.’ (ఏప్రిల్, 2, 2019వ తేదీన) నేడు రిపబ్లిక్ టీవీ చర్చా వేదికలో.. ‘మోదీ వల్లే దేశానికి గుర్తింపు.. ఆయనకే నా సంపూర్ణ మద్దతు పధాని నరేంద్ర మోదీ వల్లే ప్రపంచంలో భారతదేశానికి గుర్తింపు వచ్చిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. రిపబ్లిక్ టీవీ మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన చర్చా వేదికలో మంగళగిరి నుంచి ఆయన వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ విధానాలు, కార్యక్రమాలను తాను పూర్తిగా సమర్థిస్తున్నట్టు చెప్పారు. ఆయన చెప్పిన ‘విజన్ 2047’తో తాను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. దాన్ని అమలు చేసేందుకు తాను, తన ప్రజలు ఆయనతో కలిసి పనిచేస్తామన్నారు. మోదీ వల్లే భారతదేశ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయన్నారు. గతంలో కూడా తాను ఎప్పుడూ మోదీ విధానాలను వ్యతిరేకించలేదన్నారు. కేవలం ప్రత్యేక హోదా, విభజన అంశాలు వంటి రాష్ట్ర ప్రజల మనోభావాల అంశాలపైనే కేంద్రంపై పోరాడాను తప్ప వారి విధానాలను విమర్శించ లేదన్నారు. మోదీ ప్రపంచంలోని అన్ని దేశాలు తిరిగి భారత్‌ను బ్రాండింగ్ చేస్తున్నారని, ప్రస్తుతం అది చాలా అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. ఇందుకు ఆయన్ను తాను పూర్తిగా అభినందిస్తున్నట్టు తెలిపారు. ఆయనకు పూర్తిగా మద్దతు ఇస్తానన్నారు. మోదీ నెట్వర్కింగ్ ద్వారా ప్రపంచ స్థాయిలో దేశానికి గుర్తింపు తెచ్చారని, ఆయన విజన్‌తో పూర్తిగా ఏకీభవిస్తున్నానని తెలిపారు. అభివృద్ధి విషయంలో ప్రధాని ఆలోచనే తన ఆలోచన కూడానన్నారు. ఎన్డీఏకు మద్దతిచ్చే విషయంపై సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రధాని చేసే పనులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. -
మణిపూర్‌లో ఆ పార్టీదే గెలుపు.. ఎందుకంటే?
ఇంఫాల్: మణిపూర్‌లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని రిపబ్లిక్ టీవీ- పీఎంఏఆర్‌క్యూ ప్రిపోల్ సర్వే అంచనా వేసింది. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీ 31-37 సీట్లు (39.2 శాతం ఓట్లు) గెల్చుకునే అవకాశం ఉందని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి ఈసారి 13-19 సీట్లు (28.7 శాతం ఓట్లు) దక్కుతాయని తెలిపింది. నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) 3 నుంచి 9, నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) ఒకటి నుంచి 5 స్థానాలను కైవసం చేసుకుంటాయని సర్వేలో వెల్లడైంది. ఎన్పీపీకి 14.2, ఎన్పీఎఫ్ 6.4, ఇతరులు 11.5 శాతం ఓట్లు దక్కించుకుంటారని అంచనా కట్టింది. 2017లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 28 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున ఫిరాయింపులు ప్రోత్సహించి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాలు మాత్రమే నెగ్గిన బీజేపీ బలం ఈ ఐదేళ్ల కాలంలో 29కి పెరిగింది. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలున్నాయి. (చదవండి: పశ్చిమ యూపీ బీజేపీకి కత్తిమీద సామే!) నిరుద్యోగమే అతిపెద్ద సమస్య మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వ పనితీరు బాగుందని 59 శాతం మంది, ఫర్వాలేదని 29 శాతం, బాలేదని 12 శాతం మంది సర్వేలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద సమస్య ఉపాధిలేమి అని ఎక్కుమంది(29 శాతం) తెలిపారు. తాగునీటి కొరత(24 శాతం), అస్తవ్యస్థ రహదారులు(17 శాతం), అవినీతి(5 శాతం) వంటి సమస్యలు కూడా ఉన్నాయని వాపోయారు. తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరిని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు ఎన్ బైరాన్ సింగ్ పేరును ఎక్కువ మంది(36 శాతం) చెప్పారు. ఇబోబి సింగ్(17 శాతం), యుమ్నం జోయ్‌కుమార్ సింగ్(11 శాతం), గైఖేంగమ్(10 శాతం), బిశ్వజిత్(5 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. (చదవండి: ఆ రోజు వద్దు.. మరో రోజు పోలింగ్ పెట్టండి ప్లీజ్) మార్చి 10న ఎన్నికల ఫలితాలు మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా జరగనున్నాయి. ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 27, మార్చి 3న పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, తొలి విడత పోలింగ్ తేదీని మార్చాలని ఆల్ మణిపూర్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ (ఏఎంసీఓ) కోరుతోంది. (చదవండి: ఎన్నికల రాష్ట్రంలో వరుస గ్రెనేడ్ దాడులు.. కలకలం) -
సీఎం జగన్‌పై తప్పుడు కథనాలా.. అర్నాబ్ జాగ్రత్త
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జాతీయ మీడియా సంస్థ అయిన రిపబ్లిక్ టీవీలో తప్పుడు కథనాలు ప్రసారం కావడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఏపీలో సీఎం జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతోందని తప్పుడు కథనం ప్రచారం చేయడంపై ఆయన ఫైరయ్యారు. మార్చి 4న జగన్ సన్నిహితుడిపై ఫేక్ వార్తను ప్రసారం చేయడంపై ధ్వజమెత్తారు. నేషనల్ మీడియా ముసుగులో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఫేక్ న్యూస్‌పై న్యాయపరంగా ప్రొసీడ్ అవుతామని పేర్కొన్నారు. 5 కోట్ల మంది ఆదరాభిమానాలున్న వైఎస్సార్సీపీపై తప్పుడు కధనాలు బాధాకరమన్నారు. వైఎస్సార్సీపీలో ఎలాంటి సంక్షోభం కానీ గందరగోళం కానీ లేవని స్పష్టం చేశారు. చంద్రబాబు కోసం రిపబ్లిక్ టీవీలో ఇలాంటి కథనాలు వండి వార్చారన్న అనుమానం కలుగుతోందని ఆయన ప్రకటించారు. నంద్యాల ఉపఎన్నిక సందర్భంలోనూ రిపబ్లిక్ టీవీ ఫేక్ కథనాలు ప్రసారం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలపై చంద్రబాబు ఆక్రోశం, అశోక్‌గజపతిరాజు మహిళా కార్యకర్తపై చేయి చేసుకోవడం వంటి అంశాలను వదిలి పెట్టి ఫేక్ కథనాలను వండి వారుస్తున్నారని మండిపడ్డారు. ఈ కథనాల వెనక ఎవరున్నారో తెలుగు ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. నిత్యం వివాదాల్లో ఉండే అర్నాబ్ జాతికి పట్టిన పీడ అని ధ్వజమెత్తారు. -
కార్టూనిస్ట్ తనేజపై కోర్టు ధిక్కార చర్యలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా రచితా తనేజ కార్టూనిస్ట్ వ్యవహరించారని అటర్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అన్నారు. ఇది కోర్టు ధిక్కార చర్యని, సర్వోన్నత న్యాయవ్యవస్థను అవమానించడమేనని తెలిపారు. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామికి బెయిల్ మంజూరు చేసిన విషయమై రచిత సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా ఒక కార్టూన్‌ను ట్వీట్ చేశారు. దీంతో ఆమెపై కోర్టు ధిక్కార చర్యలకు అటర్ని జనరల్ అనుమతించారు. (చదవండి: కోవిడ్ పేషెంట్లను అంటరాని వారిగా చూస్తున్నారు) 2018లో ఆర్కిటెక్ అన్వే నాయక్, అతని తల్లి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయమై అర్నబ్ గోస్వామి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అరెస్ట్ అయిన వారం రోజులకే మధ్యంతర బెయిల్‌పై అర్నబ్ బయటకు వచ్చారు. ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ డివై చంద్రచూడ్, ఇందిరా బెనర్టీలతో కూడిన ధర్మాసనం జర్నలిస్ట్‌కు బెయిల్ మంజూరు చేసింది. భారతీయ హస్య నటుడు కునాల్ కమ్రా సుప్రీం కోర్టుపై చేసిన వ్యాఖ్యలపై విచారణ ప్రారంభించారు. గోస్వామికి మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై కునాల్ కమ్రా సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. అతడి కోర్టు ధిక్కార చర్యలకు అనుమతించాలని 8 మంది కోరగా అటర్నీ జనరల్ అనుమతించారు. 'ప్రస్తుతం ప్రజలు ధైర్యంగా ఏది పడితే అది సుప్రీంకోర్టును, న్యాయమూర్తులను అంటున్నారు. అది వాక్ స్వాతంత్ర్యంగా వారు భావిస్తున్నారు. సుప్రీం కోర్టుపై ఈ రకంగా దాడి చేసిన వారికి శిక్ష పడుతుందని మరిచిపోతున్నార'ని కేకే వేణుగోపాల్ అన్నారు. (చదవండి: లైంగిక వేధింపులు..ఆపై కాల్పులు) -
అర్నాబ్‌కు బెయిల్
న్యూఢిల్లీ: వివాదాస్పద టెలివిజన్ వ్యాఖ్యాత అర్నాబ్ గోస్వామికి ఎట్టకేలకు బెయిల్ దక్కింది. 2018 నాటి ఓ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం, బెయిల్ దరఖాస్తును బాంబే హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో అర్నాబ్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన బెంచ్ బుధవారం ఈ అంశంపై విచారణ జరిపి అర్నాబ్‌తోపాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నితీశ్ సర్దా, ప్రవీణ్ రాజేశ్ సింగ్‌లకు రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుపై ఇంటెరిమ్ బెయిల్ మంజూరు చేసింది. తనపై మోసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని, కేసు విచారణను నిలిపివేయాలన్న అర్నాబ్ వినతులను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అర్నాబ్ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బాంబే హైకోర్టు తీరును తీవ్రంగా తప్పుపట్టింది. ‘‘బెయిళ్లు ఇవ్వకుండా..వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదు’’ అని వ్యాఖ్యానించింది. -
'రిపబ్లిక్ టీవీ'కి మరో షాక్
ముంబై : టీఆర్పీ స్కామ్‌కు సంబంధించి ‘రిపబ్లిక్ టీవీ’ డిస్స్ర్టిబ్యూషన్ హెడ్ ఘన్‌శ్యామ్ సింగ్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన పోలీసులు తాజాగా సింగ్‌ను 12వ నిందితుడిగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మంగళవారం ఆయన్ను కోర్టులో హాజరుపరుస్తారని పోలీసు అధికారులు తెలిపారు. కాగా రిపబ్లిక్ టీవీ సెట్స్‌లోపని చేసిన వేతనాలు చెల్లించనందుకు 2018లో ఆర్కిటెక్ట్ అన్వే నాయక్ మరియు అతని తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి అర్నాబ్ గోస్వామి సహా మరో ఇద్దరిని నవంబర్ 4న ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రోజుల వ్యవధిలోనే రిపబ్లిక్ టీవీ డిస్స్ర్టిబ్యూషన్ హెడ్‌ను అరెస్ట్ చేశారు. ముంబైలో టీఆర్పీల నిర్వహణను హంస అనే ఎజెన్సీ చూస్తోంది. అయితే ఆ సంస్థ మాజీ ఉద్యోగుల సాయంతో, వినియోగదారులకు డబ్బులు ఇచ్చి, తమ చానళ్లనే చూడాలని, చూడకపోయినా తమ చానెళ్లనే ఆన్‌లో ఉంచాలని ఒప్పందం కుదుర్చుకుంటారు. అలా ఎంపిక చేసిన చానళ్లను నిర్ధిష్ట సమయంలో చూసినందుకు నెలవారీ కొంత డబ్బు ఇస్తామని చెప్పడం వల్ల ఒప్పుకున్నానని ఒక వినియోగదారుడు చెప్పారు. ఇందులో రిపబ్లిక్ చానల్‌తో పాటు ఫక్త్ మరాఠీ, బాక్స్ సినిమా వంటి రెండు మరాఠీ చానెళ్లు కూడా ఉన్నాయి. (అర్నాబ్‌కు భద్రత కల్పించండి : గవర్నర్ ) టీఆర్పీ రేటింగ్‌లు పెంచుకునేందుకు రిపబ్లిక్ టీవీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ముంబై పోలీసులు ఆరోపించారు. మరో వైపు టీఆర్పీ రేటింగ్ పెంచుకునేందుకు చానళ్లు అక్రమ మార్గాలను ఎంచుకున్నా యనే ఆరోపణల నేపథ్యంలో టెలివిజన్ చానళ్ల వారపు రేటింగ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) ప్రకటించింన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతులను సమీక్షించేందుకు 12 వారాలు పట్టొచ్చని, అప్పటిదాకా నిషేధం ఉంటుందని బార్క్ తెలిపింది. టీఆర్పీ స్కామ్‌కు సంబంధించి ముంబై పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బార్క్ రేటింగ్‌ల ఆధారంగానే టీవీ ఛానళ్లకు ప్రకటనలు అందుతాయి. టీఆర్పీ రేటింగ్‌లు పెంచుకునేందుకు రిపబ్లిక్ టీవీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ముంబై పోలీసులు కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసుకు సంబంధించి రిపబ్లిక్ టీవీ సీఎఫ్‌వో సుందరంను విచారించారు. అయితే ముంబై పోలీసులు చేస్తోన్న ఆరోపణల్ని రిపబ్లిక్ టీవీ యాజమాన్యం ఖండించింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణంపై పోలీసుల దర్యాప్తును ప్రశ్నించినందుకే తమ ఛానల్‌పై కేసులు పెట్టారని ఆరోపించారు. (అర్నాబ్‌కు బెయిల్ నో ) -
అర్నాబ్‌కు బెయిల్ నో
ముంబై/న్యూఢిల్లీ: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి బాంబే హైకోర్టులో నిరాశే ఎదురైంది. మధ్యంతర బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. సోమవారం అర్నాబ్ బెయిల్ అర్జీని పరిశీలించిన డివిజన్ బెంచ్..బెయిల్ కోసం దిగువ కోర్టుకు వెళ్లాలని సూచించింది. సెషన్స్ కోర్టు దీనిపై నాలుగు రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. ఓ ఇంటీరియర్ డిజైనర్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారన్న 2018నాటి కేసులో ఆయన్ను ఈ నెల 4న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాయిగఢ్ జిల్లా కోర్టు అర్నాబ్‌కు 18 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. రిపబ్లిక్ టీవీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించే అంశాలను టీవీ చానళ్లలో చూపడం, సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడం ఆపివేస్తున్నామంటూ హామీ ఇవ్వాలని ఏజీఆర్ మీడియా, బెన్నెట్ కోల్మన్ కంపెనీలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తమపై బాధ్యతరాహితంగా వ్యాఖ్యలు చేస్తున్నాయంటూ ఈ సంస్థలపై బాలీవుడ్ నిర్మాతలు వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. సామాజిక మాధ్యమాలైన గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్లకు కూడా నోటీసులిచ్చింది. -
అర్నాబ్‌కు భద్రత కల్పించండి : గవర్నర్
సాక్షి, ముంబై : ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్న రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి పోలీసులు పలు ఆరోపణలు చేశారు. తనపై జైలు అధికారులు దాడికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులను సైతం కలవడానికి అనుమతి ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యుల ద్వారా మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్‌కోశ్యారీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారు. అర్నాబ్ గోస్వామి అరెస్ట్‌పై రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముక్‌కు ఫోన్ చేశారు. వెంటనే అర్నాబ్‌కు తగిన భద్రతను కల్పించాలని కోరారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఇవ్వాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బాంబే హైకోర్టులో అర్నాబ్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రస్తుతం కేసు ఉన్న దశలో తాము మధ్యంతర బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. అయితే తమను సంప్రదించే ముందు అలీబాగ్ సెషన్స్ కోర్టును ఆశ్రయించాల్సిందిగా న్యాయస్థానం అర్నాబ్‌కు సూచించింది. దీనిపై నాలుగు రోజుల్లోనే నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. రిపబ్లిక్ టీవీ సెట్స్‌లోపని చేసిన వేతనాలు చెల్లించనందుకు 2018లో ఆర్కిటెక్ట్ అన్వే నాయక్ మరియు అతని తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి గోస్వామి మరో ఇద్దరిని నవంబర్ 4న ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురినీ నవంబర్ 18 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. గోస్వామి అరెస్టును ఖండిస్తూ పలువురు కేంద్ర మంత్రులు అధికార మహా వికాస్ఆఘాడీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. -
అర్నబ్‌కు దక్కని ఊరట
ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్–ఇన్–చీఫ్ అర్నబ్ గోస్వామికి న్యాయస్థానం నుంచి ఊరట దక్కలేదు. 2018 నాటి కేసులో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. అయితే, ఈ విచారణ అసంపూర్తిగా ముగియడంలో అర్నబ్‌కు బెయిల్ లభించలేదు. శనివారం విచారణ కొనసాగిస్తామని బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చిచెప్పింది. ఆర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యల కేసులో అర్నబ్‌ను బుధవారం ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య విషయంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ను కించపర్చేలా టీవీలో చర్చ నిర్వహించారని, అందుకే సభా హక్కుల ఉల్లంఘన చర్యలు ప్రారంభిస్తామంటూ అర్నబ్‌కి మహారాష్ట్ర శాసనసభ గతంలో నోటీసిచ్చింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టుకెక్కారు. నోటీసుపై కోర్టుకు వెళ్లడం చెల్లదని, జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ అసెంబ్లీ సెక్రెటరీ గతంలో అర్నబ్‌కి లేఖ రాశారు. విచారణ సందర్భంగా కోర్టు.. ‘పిటిషనర్‌ను బెదిరించేలా లేఖ ఎందుకు రాశారు? రెండు వారాల్లోగా వివరణ ఇవ్వండి’ అని అసెంబ్లీ సెక్రెటరీకి షోకాజ్ నోటీసు ఇచ్చింది. -
అర్నబ్ గోస్వామికి సుప్రీంకోర్టులో ఊరట
ఢిల్లీ : రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామికి శుక్రవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అక్టోబర్ 13న మహారాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి అర్నబ్‌కు లేఖ రాసి బెదిరింపులకు పాల్పడ్డారని గోస్వామి తరపు న్యాయవాది హరీష్ సాల్వే సుప్రీంలో ఆరోపించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి రాసిన లేఖను సుప్రీం కోర్టులో సమర్పించారు. కాగా అర్నబ్ గోస్వామికి లేఖ రాయడం తప్పుబట్టిన సుప్రీం మహారాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శికి ధిక్కార నోటీసులు జారీ చేసింది. రెండు వారాల తరువాత జరగనున్న విచారణ సందర్భంగా మహారాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శిని హాజరుకావాలని ఉన్నత న్యాయస్థానం కోరింది. అప్పటి వరకు అర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. (చదవండి : అర్నబ్‌కు దొరకని బెయిల్) ఈ విషయంలో సహకరించడానికి సీనియర్ న్యాయవాది అరవింద్ దాతర్‌ను అమికస్‌గా నిమమించినట్లు భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఐ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అర్నబ్ గోస్వామి తనను అక్రమంగా అరెస్ట్ చేశారన్న కారణంతో కోర్టును సంప్రదించనందుకే లేఖను రాసి బెదిరించడం ద్వారా న్యాయ పరిపాలనలో తీవ్రంగా జోక్యం చేసుకుందని సుప్రీంకోర్టు ఆరోపించింది. 'అసెంబ్లీ కార్యదర్శి రాసిన లేఖలో ఉద్దేశం ప్రకారమే పిటిషనర్‌ను బెదిరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం కోర్టును ఎవరైనా సంప్రదిచ్చవచ్చు. అర్నబ్ విషయంలో మహారాష్ట్ర అసెంబ్లీ దీనిని ఇది ఒక ప్రాథమిక హక్కుగా భావించాలని' సుప్రీంకోర్టు తెలిపింది. (చదవండి : అర్నాబ్ న్యాయ పోరాటం) కాగా ఈ లేఖ విషయంలో సహకరించాలని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్‌కు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముదిని ఆత్మహత్యకు అర్నబ్ కారణమంటూ వచ్చిన 2018 నాటి ఆరోపణలపై బుధవారం ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అర్నబ్‌ను అలీబాగ్ నగర్ పరిషత్ స్కూల్లో కోవిడ్ సెంటర్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచారు. -
అర్నబ్‌కు దొరకని బెయిల్
ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను గురువారం బాంబే హైకోర్టు తిరస్కరించింది. అరెస్టు అక్రమమనీ, తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలనీ, ముంబై పోలీసుల దర్యాప్తుపై స్టే విధించాలని బెయిల్ పిటిషన్లో అర్నబ్ కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా కక్ష సాధింపునకు పాల్పడుతోందని అర్నబ్ తరఫు లాయర్ హరీశ్ సాల్వే ఆరోపించారు. వాదనలు విన్న బాంబే హైకోర్టు.. వాదనలు వినిపించాలని ప్రతివాదులుగా ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం, అన్వయ్ నాయక్ భార్య అక్షతను కోరింది. శుక్రవారం వాదనలు వింటామని తెలిపింది. అర్నబ్ అరెస్టు చట్ట విరుద్ధం అర్నబ్‌ను అరెస్టు చేయడం ప్రాథమికంగా చట్ట విరుద్ధమని మహారాష్ట్రలోని ఓ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముదిని ఆత్మహత్యకు అర్నబ్ కారణమంటూ వచ్చిన 2018 నాటి ఆరోపణలపై బుధవారం ముంబై పోలీసులు అర్నబ్‌ను అరెస్టుచేశారు. అర్నబ్‌తోపాటు అరెస్టు చేసిన ఫిరోజ్ షేక్, నితేశ్ సర్దాలను పోలీసులు రాయగఢ్ జిల్లా అలీబాగ్ కోర్టులో బుధవారం రాత్రి హాజరు పరిచారు. ఈ కేసులో అర్నబ్‌ను 18వరకు అలీబాగ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించింది. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ సునయన.. మృతులకు, నిందితులకు మధ్య ఉన్న సంబంధాన్ని రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్నారు. అర్నబ్‌ను పోలీస్ కస్టడీకి అప్పగించేందుకు రుజువులు లేవన్నారు. తీర్పును సవాల్ చేస్తూ పోలీసులు అలీబాగ్ సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ వేశారు. ప్రస్తుతం అర్నబ్‌ను అలీబాగ్ నగర్ పరిషత్ స్కూల్లో కోవిడ్ సెంటర్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచారు. -
అర్నాబ్ జైలు జీవితంలో మొదటిరోజు అలా..
ముంబై : ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ ఆత్మహత్య కేసులో అరెస్టయిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి మొదటిరోజు అలీభాగ్‌లోని ఓ పాఠశాలలో గడిపారు. ప్రస్తుతం దీన్ని తాత్కాలిక జైలుగా ఉపయోగిస్తున్నారు. ప్రధాన జైలుకు పంపేముందు మందు జాగ్రత్త చర్యగా 14 రోజుల పాటు నిందితులను జైలు అధికారులు క్వారంటైన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అర్నాబ్‌ను తాత్కాలిక జైళ్లో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. అలీభాగ్ జైలులో మొత్తం సామర్థ్యం 82 మందికి కాగా, ప్రస్తుతం అక్కడ 99మంది ఖైదీలున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జైళ్లలో వైరస్ తీవ్రత పెరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని 23 నగరాల్లో 30కి పైగా తాత్కాలిక జైళ్లను ఏర్పాటుచేశారు. (మహిళా కానిస్టేబుల్‌పై దాడి..అర్నాబ్‌పై మరో కేసు! ) ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలు, హాస్టళ్లు , కాలేజీలలో తాత్కాలికంగా ఖైధీలను ఉంచుతున్నారు. దీని వల్ల జైళ్లలో కరోనా వ్యాప్తి చెందకుండా సహాయపడుతుందని జైలు అధికారి ఒకరు తెలిపారు. 14 రోజులపాటు క్వారంటైన్ అనంతరం వైద్య పరీక్షల తర్వాత సాధారణ జైళ్లకు తరలిస్తామని పేర్కొన్నారు. చుట్టూ పోలీసుల నడుమ తగిన భద్రత ఏర్పాటు చేశామని వివరించారు. ఈ ఏడాది మే నెలలో అలీభాగ్ జైళ్లో 158 మంది ఖైధీలకు కరోనా నిర్ధారణ కాగా, ఆర్థర్ జైలులో 28 మంది ఖైధీలకు కరోనా సోకింది. (అర్నాబ్ వివాదం :‘సామ్నా’ సంచలన వ్యాఖ్యలు) -
అర్నాబ్ వివాదం : ‘సామ్నా’ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి అరెస్టు వ్యవహారం మరింత ముదురుతోంది. శివసేన, బీజేపీ మధ్య వివాదానికి మరింత ఆజ్యం పోస్తోంది. అర్నాబ్ అరెస్టును "బ్లాక్ డే" గా అభివర్ణించిన బీజేపీ నేతలపై శివసేన మండిపడింది. బీజేపీ మహారాష్ట్ర ప్రభుత్వంపై దాడి చేస్తున్ననేపథ్యంలో శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో కౌంటర్ ఎటాక్ చేసింది. ముఖ్యంగా "పత్రికా స్వేచ్ఛపై దాడి, "అత్యవసర పరిస్థితులు" అంటున్న పలువురు కేంద్రమంత్రుల వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా ఉన్నాయంటూ ఎద్దేవా చేసింది. ఈ సందర్బంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను, హత్యలను ప్రస్తావించింది. (మంత్రగత్తె వేట : అర్నాబ్ న్యాయ పోరాటం) మహారాష్ట్ర ప్రభుత్వంలో మీడియాపై దాడి అనే ప్రశ్నే లేదని, ఇలా అరోపిస్తున్నా వారే ప్రజాస్వామ్యం మొదటి స్థంభమైన శాసనసభను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండి పడింది. గోస్వామిని రక్షించడానికే గత రాష్ట్ర ప్రభుత్వం నాయక్ ఆత్మహత్య కేసును కప్పిపుచ్చిందని సామ్నా సంపాదకీయంలో ఆరోపించింది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు గుజరాత్లో ఒక జర్నలిస్టును అరెస్టు చేశారు, యూపీలో జర్నలిస్టులు హత్యకు గురవుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక అమాయక వ్యక్తి తన వృద్ధాప్య తల్లితో పాటు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య న్యాయం కోసం పోరాడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు బాధిత నాయక్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేయాలని సూచించింది. అలాగే ప్రధానమంత్రితో సహా అందరూ చట్టం ముందు సమానమేనని సంపాదకీయం వ్యాఖ్యానించింది -
అర్నాబ్ న్యాయ పోరాటం
సాక్షి, ముంబై: రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నారు. 2018లో మూసివేసిన ఆత్మహత్య కేసుకు సంబంధించి తన 'అక్రమ అరెస్టు' ను సవాలు చేస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహారాష్ట్ర అలీబాగ్ పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరారు. ఉద్దేశపూర్వకంగానే తనను టార్గెట్ చేశారని, తన ఇంట్లోకి చొరబడి మరీ పోలీసులు తనపైనా,తన కుటుంబంపైనా దాడిచేశారని అర్నాబ్ పిటిషన్లో ఆరోపించారు. తనను అక్రమంగా, చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారన్నారు. తన వ్యక్తిగత స్వేచ్ఛను హరించి, గౌరవానికి భంగం కలిగించడమే కాకుండా, తన కుమారుడిపై దాడిచేశారన్నారు. తన ఛానెల్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో ఇది మరో ప్రయత్నమని విమర్శించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను వేటాడుతున్నారని(విచ్–హంట్ చేస్తున్నారని) తన పిటిషన్లో అర్నాబ్ పేర్కొన్నారు. జస్టిస్ ఎస్ఎస్ షిండే, ఎంఎస్ కార్నిక్‌తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం మధ్యాహ్నం ఈ పిటిషన్‌ను విచారించనుంది. కాగా ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్యకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గోస్వామిని బుధవారం అరెస్టు చేసిన పోలీసులు రాయ్‌గడ్ జిల్లాలోని అలీబాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. తరువాత ఆయనను అలీబాగ్‌లోని మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపరచగా, నవంబర్ 18 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. (అర్నబ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు) -
అర్నబ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
సాక్షి ముంబై : రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామి అప్పడే బకాయిలు చెల్లిస్తే ఈ రోజు తన భర్త బతికి ఉండేవారని అన్వయ్ నాయిక్ (53) భార్య అక్షత వ్యాఖ్యానించారు. అర్నబ్ గోస్వామిని అలీబాగ్ పోలీసులు అరెస్టు చేయడంతో తన భర్త, అత్తకు న్యాయం జరిగే దిశగా అడుగులు పడ్డాయన్నారు. బుధవారం అర్నబ్ అరెస్టు అనంతరం ఆమెతోపాటు ఆమె కూతురు ఆద్న్యా నాయిక్ సైతం విలేకరులతో మాట్లాడారు. టీవీ స్టూడియో పనులు చేయించుకున్న అర్నబ్ పూర్తి డబ్బులు చెల్లించలేదని అక్షత ఆరోపించారు. దీంతోనే అప్పుల్లో కూరుకుపోయిన ఆయన కొత్త పనులు చేయలేకపోయారని తెలిపారు. అందుకే తీవ్ర ఒత్తిడికి గురైన తన భర్త అన్వయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని దీంతో ఆయన తల్లి కూడా ఆత్మహత్య చేసుకుందని విలపించారు. ఈ విషయానికి సంబంధించి అన్వయ్ సుసైడ్ నోట్ కూడా రాశారని గుర్తు చేశారు. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయలేదన్నారు. దీనికి సంబంధించి చాలాసార్లు ముఖ్యంగా అర్నబ్ బెదిరించాడని ఆరోపించారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అర్నబ్ గోస్వామిని అరెస్టు చేయడంతో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలుగుతుందని ఆమె అన్నారు. (అర్నబ్ గోస్వామి అరెస్ట్) అసలు ఏం జరిగింది? ముంబైలో రిపబ్లిక్ టీవీ స్టూడియోకు సంబంధించిన ఇంటీరియర్ పనులు అలీబాగ్‌కు చెందిన డిజైనర్ అన్వయ్ నాయిక్(53) చేశాడు. అయితే కొద్దిరోజుల తర్వాత అలీబాగ్‌లోని తన ఇంట్లో 2018 మే 5వ తేదీన ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనతోపాటు అన్వయ్ తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. అయితే రిపబ్లిక్ చానెల్లో పనులు చేసిన అనంతరం అర్నబ్ డబ్బులు ఇవ్వలేదని సుమారు రూ. 83 లక్షలు బకాయిలు రావాల్సి ఉందని.. కానీ, ఆ డబ్బులు ఇవ్వకపోవడంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు వారి కుటుంబీకులు ఆరోపించారు. కాగా, అన్వయ్ నాయిక్ సుసైడ్ నోట్లో కూడా అర్నబ్ గోస్వామి పేరుతోపాటు మరో ఇద్దరి పేర్లు రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేçసినప్పటికీ అనంతరం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఈ విషయంపై మళ్లీ అన్వయ్ నాయిక్ భార్య, కుమార్తెల ఫిర్యాదు మేరకు ఈ కేసుకు సంబంధించి అర్నబ్ గోస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎమర్జెన్సీని తలపిస్తోంది: ఫడ్నవిస్ రిపబ్లిక్ టీవి చీఫ్ ఎడిటర్ అర్నబ్ గో స్వామిని బుధవారం అరెస్టు చేయడంపై ఉద్దర్ ఠాక్రే నేతృత్వంలోని ఎంవీఎం ప్రభుత్వంపై బీజేపీ విరుచుకుపడింది. అర్నబ్ గొంతును మూగబోయేలా చేస్తున్నారని పేర్కొంది. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. 1977లో ఎమర్జెన్సీ విధించారనీ, కానీ అది ప్రస్తుతం కూడా కొనసాగుతోందని ట్విట్టర్ ద్వారా విమర్శించారు. ఎమర్జెన్సీ మద్దతుదారులు కాంగ్రెస్, శివసేనలపై గొంతెత్తి ప్రశ్నించేవారి స్వేచ్చకి భంగం కలిగిస్తున్నారని, ఇలాంటి వారితో దేశం పోరాటం చేస్తూ ఇబ్బందులను ఎదుర్కొంటుందని ఫడ్నవిస్ ధ్వజమెత్తారు. ముంభైలో బీజేపీ ఎమ్మెల్యే ఆశీష్ శెలార్ విలేకరులతో మాట్లాడుతూ.. అర్నబ్ వంటి జర్నలిస్టులు ప్రశ్నిస్తారని, సొంత ప్రయోజనాల కోసం ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం వీరి గొంతును కట్టిపడేస్తూ, వారి స్వేచ్చకి భంగం కలిగిస్తుందని ఆరోపించారు. శివసేన నేతృత్వంలోని ఎంవీఎం ప్రభుత్వం జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తోందని, అర్నబ్ విషయంలోనూ ఇదే విధంగా ప్రవర్తిస్తూ, ఆత్మహత్య కేసు ఇప్పటికే పూర్తయిన, దానిని తిరిగి లేవనెత్తిందని అన్నారు. ప్రజాస్వామ్యానికి ఇదొక బ్లాక్ డే అని ఆశీష్ వ్యాఖ్యానించారు. అర్నబ్‌పై దాడి చేశారు : న్యాయవాది రిపబ్లిక్ టీవీ ఛానెల్ ఎడిటర్ అర్నబ్ గోస్వామిని అరెస్టు చేసే సమయంలో ముంబైలోని ఆయన ఇంట్లో పోలీసులు చేయి చేసుకున్నట్లు అర్నబ్‌తోపాటు ఆయన న్యాయవాది గౌరవ్ పార్కర్లు ఆరోపించారు. పార్కర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆయన అరెస్టుకు సంబంధించి ఆయన భార్యకు కూడా తెలియపరచలేదని, ఇద్దరు పోలీసులు ఆయనపై భౌతికంగా దాడి చేశారని ఆరోపించారు. అంతేకాకుండా పోలీసులు కుటుంబ సభ్యులతో తోపులాటకు దిగినట్టు పేర్కొన్నారు. అర్నబ్ ఎడమ చేతికి గాయమైందని, వెన్నుపై చేయిచేసుకున్నారని గౌరవ్ ఆరోపించారు. ఇక ఎలాంటి పత్రాలు లేకుండా మూసి వేసిన కేసుకు సంబంధించి అరెస్టు చేయడాన్ని రిపబ్లిక్ టీవీ తప్పు బట్టింది. అర్నబ్ అరెస్టుతో శివసేన, బీజేపీ నాయకుల మధ్య రాజకీయ రగడ మొదలైంది. బీజేపీ నేతలు అర్నబ్ అరెస్ట్ అన్యాయమని, కక్ష పూరిత చర్యేనని శివసేన ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదు తప్పు ఎవరు చేసినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని శివసేన నేత, ఎంపీ సంజయ్ రావుత్ పేర్కొన్నారు. అర్నబ్ గోస్వామిని ఆలీబాగ్ పోలీసుల అరెస్టు చేయడాన్ని సంజయ్ సమర్థించారు. ఆధారాలు లభించాయి కావచ్చు అందుకే అరెస్టు చేశారని, పోలీసులు ఎవరినీ ఊరికే అరెస్టు చేయరన్నారు. అలాగే తప్పు తను చేసినా చట్టం తనను విడిచిపెట్టదని తెలిపారు. ఇది రాజకీయపార్టీలు, ప్రభుత్వానికి సంబంధించి కాదని, ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛకు సంబంధించి కూడా కాదని ఇది అన్వయ్ నాయిక్ ఆత్మహత్యకు సంబంధించిన కేసుగా పేర్కొన్నారు. శివసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్కరిని ఉద్ధేశపూర్వకంగా అరెస్టు చేయలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. -
అర్నబ్ గోస్వామి అరెస్ట్
ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామిని రాయగఢ్ జిల్లా అలీబాగ్ పోలీసులు బుధవారం ఉదయం అరెస్టు చేశారు. 2018లో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయిక్ (53) ఆత్మహత్యకు సంబంధించి అర్నబ్‌ను అరెస్టు చేసినట్టు అలీబాగ్ పోలీసులు పేర్కొ న్నారు. తననెందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నిస్తూ, అరెస్టువారెంటు చూపాలని అర్నబ్ వాదించారని పోలీసులు తెలిపారు. అరెస్టు వారంటును చూపించబోగా, అర్నబ్ భార్య ఆయా పేపర్లను చించేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత అర్నబ్‌ను అలీబాగ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచారు. గోస్వామిని అలీబాగ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. వైద్య పరీక్షల అనంతరం మళ్లీ ఆయనను కోర్టులో హాజరుపరచాలని చెబుతూ ఈనెల 18 వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధించింది. గోస్వామి ని పోలీసులు అరెస్టు చేసే సమయంలో పోలీసులు అర్నబ్‌పై చేయి చేసుకున్నారని, అర్నబ్‌తోపాటు ఆయన న్యాయవాది గౌరవ్ పార్కర్లు ఆరోపించారు. ఇదిలా ఉండగా, ఆయన్ను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసుల బృందంలో ఉన్న మహిళా పోలీసుపై అర్నబ్ చేయి చేసుకున్నారన్న అభియోగాలతో ఆయనపై మరో ఎఫ్ఐఆర్ దాఖలైంది. మహిళా పోలీసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు. తన భర్తకు ఇవ్వాల్సిన బకాయిలు ఇచ్చి ఉంటే నేడు తన భర్త బతికి ఉండేవారని అన్వయ్ నాయక్ భార్య అక్షతా పేర్కొన్నారు. చట్టం ముందు అంతా ఒక్కటే.. చట్టం ముందు ఎవరూ గొప్పవారు కాదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పేర్కొన్నారు. అన్వయ్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకే ఈ కేసును తిరిగి విచారణ చేపట్టేందుకు కోర్టులో దరఖాస్తు చేసినట్టు చెప్పారు. అనంతరం కోర్టు అనుమతితోనే ఈ అరెస్టు జరిగిందని చట్టప్రకారం పోలీసులు తమ పని తాము చేస్తున్నారన్నారని అనిల్ దేశ్‌ముఖ్ స్పష్టం చేశారు. తప్పు ఎవరు చేసినా పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. -
‘అందుకే నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు’
ముంబై : ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిని అరెస్ట్ చేయడాన్ని ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ కుటుంబ సభ్యులు స్వాగతించారు. అర్నాబ్‌ని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేశారని అన్వే నాయక్ భార్య అక్షత, కూతురు అద్య్నా నాయక్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర ఆడపడుచుకు ఇచ్చిన మాటను పోలీసులు నిలబెట్టుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. అర్నాబ్‌పై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. (చదవండి : రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్టు) కాగా, రిపబ్లిక్ టీవీ స్టూడియోలను రూపొందించిన డిజైనర్ అన్వే నాయక్.. 2018లో తన తల్లి కుముద్ నాయక్‌తో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. బిల్లులు చెల్లించకపోవడంతోనే వారు ఆత్మహత్యకు పాల్పడ్డారన్న కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో అర్నాబ్‌పై రాయ్‌గడ్‌లో కేసు నమోదైంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్థానిక రాయ్‌గడ్ పోలీసులు గోస్వామితో సహా సూసైడ్ నోట్లో పేర్కొన్న నిందితులపై తమకు ఆధారాలు దొరకలేదని 2019 ఏప్రిల్‌లో కేసును మూసివేశారు. అయితే, ఈ ఏడాది మేలో, అన్వే కుమార్తె ఈ కేసుపై తిరిగి దర్యాప్తు చేయాలని కోరుతూ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్‌ను ఆశ్రయించడంతో మళ్లీ ఈ కేసు తెరపైకి వచ్చింది. అయితే మన విజ్ఞప్తికి స్పందించి అర్నాబ్‌ను అరెస్ట్ చేసినందుకు మహారాష్ట్ర పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి : ఎమర్జెన్సీని గుర్తు చేసింది : అమిత్‌షా) ‘ నా భర్త సూడైడ్ నోట్లో ముగ్గురి పేర్లు ఉన్నాయి. ఆ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని 2018 నుంచి మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. నా భర్త ఆత్మహత్య వెనుక అర్నాబ్ గోస్వామి హస్తం ఉంది. అతనిపై చర్యలు తీసుకోని మాకు న్యాయం చేయాలి. అర్నాబ్‌కు ఒక్కరు కూడా సహాయం చేయొద్దని భారతీయులందరికి విజ్ఞప్తి చేస్తునా. మహారాష్ట్ర పోలీసులు మాకు న్యాయం చేశారు. అర్నబ్‌ని అరెస్ట్ చేసిన పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం’ అని అన్వే నాయక్ భార్య అక్షత మీడీయాతో పేర్కొన్నారు. ‘ మా నాన్న తన డబ్బు, శ్రమను రిపబ్లిక్ టీవీ స్టూడియో ప్రాజెక్టు కోసం ఖర్చు చేశాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ, గోస్వామి నా తండ్రికి బకాయిలు అందకుండా చూసుకున్నాడు. డబ్బులు అడిగితే మా నాన్న కెరీర్‌తో పాటు నా కెరీర్‌ను నాశనం చేస్తాని బెదిరించాడు. అందుకే మా నాన్న చనిపోయాడు’ అని అన్వే నాయక్ కూతురు అద్న్యా అన్నారు. అర్నాబ్‌పై మరో కేసు ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ ఆత్మహత్య కేసులో అరెస్టయిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి మరో కేసు నమోదైంది. అరెస్ట్ సమయంలో అర్నాబ్ ఇంటికి వచ్చిన మహిళా కానిస్టేబుల్‌పై ఆయన దాడికి పాల్పాడ్డారని మహారాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
అర్నబ్ గోస్వామి అరెస్ట్
-
ఎమర్జెన్సీని గుర్తు చేసింది : అమిత్‌షా
సాక్షి, న్యూఢిల్లీ : రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్, ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి అరెస్ట్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్రంగా ఖండించారు. అర్నాబ్ అరెస్ట్ పత్రికా స్వేచ్ఛను హరించడమేనని మండిపడ్డారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు కలిసి మరోసారి ప్రజాస్వామ్యాని అవమానించాయని విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్విటర్ వేదికగా మహారాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. (చదవండి : రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్టు) ‘కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు కలిసి ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నాయి. అర్నబ్ గోస్వామి, రిపబ్లిక్ టీవీని అణిచివేయడానికి అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ దాడిని వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి నాల్గో స్తంభమైన పత్రికపై దాడిగా భావించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ తీరును చూస్తుంటే ఎమర్జెన్సీ కాలంనాటి పరిస్థితులు మరోసారి గుర్తుకు వస్తున్నాయి. మీడియా స్వేచ్ఛపై జరిగిన ఈ దాడిని మనమందరం ఖండించాలి’ అని అమిత్ షా ట్వీట్ చేశారు. కాగా, 2018లో డిజైనర్ ఆత్మహత్యకు పురికొల్పాలరనే ఆరోపణల నేపథ్యంలో అర్నబ్ గోస్వామిని ముంబై పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్టు
సాక్షి,ముంబై: ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై, రాయ్‌గడ్ పోలీసులు అరెస్టు చేశారు. 2018లో డిజైనర్ ఆత్మహత్యకు పురికొల్పాలరనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను కస్టడీలోకి తీసుకున్నామని ముంబై పోలీసులు ప్రకటించారు. ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ ఆత్మహత్యకు సంబంధించి బుధవారం అర్నాబ్‌ను అదుపులోకి తీసుకున్నారని రిపబ్లిక్ టీవీ నివేదించింది. ఐపీసీ సెక్షన్ 306 కింద గోస్వామిపై అభియోగాలు మోపారని తెలిపింది. కనీసం 20మంది పోలీసులు అర్నాబ్‌పై దాడి చేశారని, ఆపై బలవంతంగా మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌కు తీసుకెళ్లారని ఆరోపించింది. అర్నాబ్ గోస్వామిని అరెస్టు చేయడానికి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజ్‌ను పంపినట్లు రిపబ్లిక్ టీవీ తెలిపింది. ఏకే 47, సెమీ ఆటోమేటిక్ ఆయుధాలతో సాయుధ గార్డులు ఆయనపై దాడి చేశారని వ్యాఖ్యానించింది. జుట్టు పట్టుకొని లాక్కెళ్లారు ఉదయమే తమ ఇంటిపై దాడి చేసిన పోలీసులు ఆర్నాబ్‌ను కొట్టి, జుట్టు పట్టి లాక్కెళ్లారని అర్నాబ్ భార్య సమ్యబ్రాతా రే ఆరోపించారు, కొద్ది సమయం అడిగినా ఇవ్వకుండా, లాయర్ వచ్చేంతవరకు వేచి చూడాలని కోరినా వినకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీళ్లు అడిగినా ఇవ్వకుండా తీసుకెళ్లారని మండిపడ్డారు. ఛానెల్లోని విజువల్స్ ప్రకారం అర్నాబ్‌ను మొదట కారులో ఉంచి, ఆపై వ్యాన్‌లోకి నెట్టారు. అతన్ని వ్యాన్‌లోకి తీసుకెళ్తుండగా, తన ఇంటి లోపల తనపై, తన కుటుంబ సభ్యులపై దాడి జరిగిందని ఆర్నాబ్ మీడియాకు చెప్పారు. కాగా ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్, అతని తల్లి కుముద్ నాయక్‌తో కలిసి మే, 2018లో అలీబాగ్‌లోని వారి బంగ్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. రిపబ్లిక్ టీవీ స్టూడియోలను రూపొందించిన డిజైనర్ అన్వే నాయక్‌కు బిల్లులు చెల్లించకపోవడంతోనే వారు ఆత్మహత్యకు పాల్పడ్డారన్న కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో అర్నాబ్‌పై రాయ్‌గడ్‌లో కేసు నమోదైంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్థానిక రాయ్‌గడ్ పోలీసులు గోస్వామితో సహా సూసైడ్ నోట్లో పేర్కొన్న నిందితులపై తమకు ఆధారాలు దొరకలేదని 2019 ఏప్రిల్‌లో కేసును మూసివేశారు. అయితే, ఈ ఏడాది మేలో, అన్వే కుమార్తె ఈ కేసుపై తిరిగి దర్యాప్తు చేయాలని కోరుతూ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్‌ను ఆశ్రయించారు. -
రిపబ్లిక్ టీవీకి సుప్రీంలో చుక్కెదురు
న్యూఢిల్లీ: టీఆర్పీ స్కామ్‌లో చిక్కుకున్న రిపబ్లిక్ టెలివిజన్ చానల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆ కేసుకు సంబంధించి రిపబ్లిక్ టీవీ బాంబే హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ‘హైకోర్టులపై విశ్వాసం కలిగి ఉండాలి’ అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోవిడ్ కాలంలోనూ పనిచేసిన బాంబే హైకోర్టును ఆశ్రయించాలని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం రిపబ్లిక్ టీవీ తరఫు న్యాయవాది హరీష్ సాల్వేకు తెలిపింది. అయితే కేసు విచారణపై హరీష్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. రిపబ్లిక్ టీవీ ఆఫీసు వొర్లి ప్రాంతంలో ఉంటుంది కదా? హైకోర్టు విచారించకుండానే ఇలాంటి పిటిషన్లను చేపట్టడం తప్పుడు సంకేతాలను పంపుతుందని ‘ఈ మధ్య కమిషనర్లు ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు’అని వ్యాఖ్యానించింది. టీఆర్పీ రేటింగ్‌లు పెంచుకునేందుకు రిపబ్లిక్ టీవీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ముంబై పోలీసులు కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసుకు సంబంధించి రిపబ్లిక్ టీవీ సీఎఫ్‌వో సుందరంను విచారణకు పిలిచారు. ఇప్పటికే ఫక్త్ మరాఠీ, బాక్స్ సినిమా చానళ్లపై కేసులు నమోదయ్యాయి. టీఆర్పీ రేటింగ్‌ల నిలిపివేత టీఆర్పీ రేటింగ్ పెంచుకునేందుకు చానళ్లు అక్రమ మార్గాలను ఎంచుకున్నా యనే ఆరోపణల నేపథ్యంలో టెలివిజన్ చానళ్ల వారపు రేటింగ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) గురువారం ప్రకటించింది. ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతులను సమీక్షించేందుకు 12 వారాలు పట్టొచ్చని, అప్పటిదాకా నిషేధం ఉంటుందని బార్క్ తెలిపింది. టీఆర్పీ స్కామ్‌కు సంబంధించి ముంబై పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బార్క్ రేటింగ్‌ల ఆధారంగానే టీవీ ఛానళ్లకు ప్రకటనలు అందుతాయి. -
పోలీసుల విచారణకు రిపబ్లిక్ టీవీ సీఈఓ, సీఓఓ
ముంబై: టీఆర్పీ స్కామ్‌కు సంబంధించి ‘రిపబ్లిక్ టీవీ’ సీఈఓ వికాస్ ఖాన్‌చందానీ, సీఓఓ హర్‡్ష భండారి ఆదివారం ముంబై పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. వారిలో సీఈఓ వికాస్‌ను 9 గంటల పాటు, హర్‡్షను 5 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. పత్రికా స్వేచ్ఛను అడ్డుకునే ఏ విధమైన ఒత్తిడికైనా తలొగ్గబోమని ఈ సందర్బంగా రిపబ్లిక్ టీవీ ప్రకటించింది. ‘ఈ రోజు మా సీఈఓ, సీఓఓ, డిస్ట్రిబ్యూషన్ టీమ్ సీనియర్ సభ్యుడిని పోలీసులు సుమారు 20 గంటల పాటు ప్రశ్నించారు. ఈ స్కామ్‌కు సంబంధించి హంస ఏజెన్సీ ఇచ్చిన ఫిర్యాదు కాపీని రిపబ్లిక్ టీవీ ఎప్పుడు, ఎలా, ఎవరి నుంచి సంపాదించిందనే ప్రశ్ననే వారు అడిగారు’ అని పేర్కొంది. అది ఎడిటోరియల్ విషయమని వారికి సీఈఓ జవాబిచ్చారని తెలిపింది. ‘హంస ఏజెన్సీ ఇచ్చిన ఫిర్యాదులో తమపై ఎలాంటి ఆరోపణ లేదు. ఇండియా టుడే చానెల్ పేరునే ఆ ఫిర్యాదులో హంస ఏజెన్సీ ప్రస్తావించింది. ఫిర్యాదు కాపీ లో ఉన్న విషయాన్ని అక్టోబర్ 10 వ తేదీననే రిపబ్లిక్ టీవీ బయటపెట్టింది’ అని వివరించింది. -
రిపబ్లిక్ టీవీ సీఎఫ్ఓకు సమన్లు
ముంబై: ముంబైలో వెలుగు చూసిన టెలివిజన్ రేటింగ్ పాయింట్స్(టీఆర్పీ) స్కామ్‌కు సంబంధించి ‘రిపబ్లిక్ టీవీ’ సీఎఫ్ఓ సుందరానికి పోలీసులు శుక్రవారం సమన్లు జారీ చేశారు. అక్టోబర్ 10న విచారణకు హాజరు కావాలన్నారు. ఈ స్కామ్‌లో రిపబ్లిక్‌తో పాటు మరో 2 మరాఠీ చానళ్ల పాత్రపై దర్యాప్తు జరుపుతున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. వినియోగదారులతో ఒప్పందాలు ముంబైలో టీఆర్పీల నిర్వహణను హంస అనే ఎజెన్సీ చూస్తోంది. ఆ సంస్థ మాజీ ఉద్యోగుల సాయంతో, వినియోగదారులకు డబ్బులు ఇచ్చి, తమ చానళ్లనే చూడాలని, చూడకపోయినా తమ చానెళ్లనే ఆన్‌లో ఉంచాలని ఒప్పందం కుదుర్చుకుంటారు. అలా ఎంపిక చేసిన చానళ్లను నిర్ధిష్ట సమయంలో చూసినందుకు నెలవారీ కొంత డబ్బు ఇస్తామని చెప్పడం వల్ల ఒప్పుకున్నానని ఒక వినియోగదారుడు చెప్పారు. ఇందులో రిపబ్లిక్ చానల్‌తో పాటు రెండు మరాఠీ చానెళ్లు కూడా ఉన్నాయి స్టాండింగ్ కమిటీ ముందుకు! టీఆర్పీ స్కామ్ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం.. పార్లమెంటరీ కమిటీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చీఫ్ శశి థరూర్‌కు లేఖ రాశారు. ఒక జాతీయ వార్తా చానల్ సహా 3 చానళ్లు ఈ స్కామ్‌లో ఉన్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారని, అందువల్ల తదుపరి కమిటీ మీటింగ్‌లో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కార్తి చిదంబరం ఆ లేఖలో కోరారు. -
ముంబైలో టీఆర్పీ స్కామ్
ముంబై: ముంబైలో ఒక టెలివిజన్ రేటింగ్స్ పాయింట్స్(టీఆర్పీ) స్కామ్ వెలుగు చూసింది. టీవీ కార్యక్రమాల ప్రజాదరణను గణాంకాలతో వివరించే టీఆర్పీ ఆధారంగా ఆయా కార్యక్రమాలకు ప్రకటనలు వస్తాయి. ముంబైలో కొన్ని టీవీ చానళ్లు అక్రమ మార్గాల ద్వారా టీఆర్పీలను పెంచుకుంటున్న విషయాన్ని పోలీసులు గురువారం బట్టబయలు చేశారు. ఇందుకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. రిపబ్లిక్ టీవీకి కూడా ఈ కుంభకోణంలో భాగం ఉందని ముంబై పోలీస్ కమిషనర్ పరమ్‌వీర్ సింగ్ వెల్లడించారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో మహరాష్ట్ర ప్రభుత్వంపై, ముంబై పోలీసులపై ఆ న్యూస్ చానల్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆ వార్తాచానల్ పాత్రకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశామని పరమ్‌వీర్ సింగ్ తెలిపారు. సుశాంత్ మృతి కేసులో ప్రశ్నించినందువల్ల ముంబై పోలీస్ కమిషనర్ తమపై తప్పుడు అభియోగాలు మోపారని ఆ చానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి ఆరోపించారు. రెండు మరాఠీ చానళ్లు కూడా రెండు మరాఠీ చానళ్లు అయిన ఫాస్ట్ మరాఠీ, బాక్స్ సినిమాల యజమానులను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చానళ్లకు చెందిన బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్నామన్నారు. ‘టీఆర్పీల ఆధారంగా∙చానళ్లకు ప్రకటనలు వస్తాయి. తద్వారా ఆదాయం వస్తుంది. ఇదంతా వేల కోట్ల వ్యవహారం. తప్పుడు విధానాలతో టీఆర్పీలను పెంచుకుని చూపించి ఆయా చానళ్లు ఆదాయం పెంచుకున్నాయి’ అని వివరించారు. ‘కొంతమంది ఎంపిక చేసిన వినియోగదారుల ఇళ్లల్లో బారోమీటర్లను ఏర్పాటు చేసి, ఆయా కుటుంబాలు చూస్తున్న చానళ్లను గుర్తిస్తారు. తద్వారా టీఆర్పీలను గణిస్తారు. అయితే, అక్రమంగా టీఆర్పీలను పెంచుకుని చూపాలనుకునే చానల్.. ఆయా వినియోగదారులకు డబ్బులు ఆశ చూపి, తమ చానల్నే ఎక్కువ సేపు చూడాలని, లేదా చూడకపోయినా తమ చానల్నే ఆన్ చేసి ఉంచాలని కోరుతాయి’ అని తెలిపారు. బారోమీటర్లు ఉన్న వినియోగదారుల్లో చాలామంది తాము డబ్బు తీసుకున్నట్లు విచారణలో అంగీకరించారన్నారు. టీఆర్పీలను ప్రతీవారం విడుదల చేసే బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బార్క్) అధికారులను కూడా విచారిస్తామన్నారు. ‘టీఆర్పీలను లెక్కించేందుకు ముంబైలో 2 వేల బారోమీటర్లు ఉన్నాయి. వాటి నిర్వహణను హంస అనే ఏజెన్సీకి బార్క్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ ఏజెన్సీ వారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఈ కుంభకోణాన్ని వెలికితీశాం’ అని వివరించారు. హంస ఏజెన్సీ మాజీ ఉద్యోగులు కొందరికి ఇందులో పాత్ర ఉందని పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు. మంబైలోనే కాకుండా ఈ తరహా మోసం దేశంలోని ఇతర నగరాల్లోనూ జరగుతుండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. -
సుప్రీంలో అర్నాబ్‌కు చుక్కెదురు..
న్యూఢిల్లీ : రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామికి సుప్రీం కోర్టులో చుక్కెదురయింది. తనపై నమోదైన ఓ కేసుకు సంబంధించిన విచారణను సీబీఐకి బదిలీ చేయాలనే అర్నాబ్ అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగించడానికి అనుమతించింది. అయితే అర్నాబ్‌కు మరో మూడు వారాల పాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని ముంబై పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. పాల్ఘర్ మూకదాడికి సంబంధించి అర్నాబ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని దేశవ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్లో కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గతంలో అర్నాబ్ సుప్రీంను ఆశ్రయించగా అన్ని కేసులపైనా స్టే విధించిన ధర్మాసనం.. ఒక్క నాగ్‌పూర్‌లో దాఖలైన కేసుపై స్టే విధించకుండా ముంబైకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే మూడు వారాల పాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది. (చదవండి : అర్నాబ్ గోస్వామిపై కేసు నమోదు ) అయితే తాజాగా ఈ కేసు విచారణ సందర్భంగా అర్నాబ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనపై రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనపై దాఖలైన కేసుకు సంబంధించి ముంబై పోలీసులు 12 గంటలపాటు విచారించారని తెలిపారు. తనను విచారించిన ఇద్దరు అధికారులకు కరోనా పాజిటివ్‌గా తేలిందని అన్నారు. మరోవైపు ఇందుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంను ఆశ్రయించింది. అర్నాబ్ తనకు సుప్రీం ఇచ్చిన రక్షణను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపింది. పోలీసుల్లో భయాందోళన కలిగించేలా అర్నాబ్ తీరు ఉందని.. కేసుపై అతని ప్రభావం పడకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరింది. మరోవైపు బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద వలస కూలీలు గుమిగూడటంపై ప్రసారం చేసిన కథనానికి సంబంధించి దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని వేసిన క్వాష్ పిటిషన్ కూడా సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. -
అర్నాబ్‌కు పోలీసుల నోటీసులు
ముంబై : రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామికి ముంబై పోలీసులు నోటీసులు ఇచ్చారు. అర్నాబ్ తన టీవీ షోలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతిష్టకు భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని మహారాష్ట్ర మంత్రి నితిన్ రౌత్(కాంగ్రెస్) పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు సీఆర్పీసీ 41ఏ కింద విచారణకు హాజరు కావాలని అర్నాబ్‌కు నోటీసులు ఇచ్చారు. కాగా, కొద్ది రోజుల కిందట సోనియా గాంధీ ప్రతిష్టకు భంగం కలిగించేలా అర్నాబ్ తన టీవీ షోలో వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంతేకాకుండా అర్నాబ్‌పై దేశంలోని పలుచోట్ల కాంగ్రెస్ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై అర్నాబ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అర్నాబ్ అభ్యర్థనపై విచారణ జరిపిన న్యాయస్థానం.. మూడు వారాల పాటు అతనిపై అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అర్నాబ్‌తోపాటు, రిపబ్లిక్ టీవీ కార్యాలయానికి భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. అయితే నాగ్‌పూర్‌లో నితిన్ రౌత్ చేసిన ఫిర్యాదుకు సంబంధించి మాత్రం కోర్టు స్టే విధించలేదు. దానిని ముంబైకి బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలోనే పోలీసులు అర్నాబ్‌కు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇదే సమయంలో అర్నాబ్‌పై ఇద్దరు వ్యక్తులు దాడి చేయడం కలకలం రేపింది. ఈ దాడికి కాంగ్రెస్ నాయకులే కారణమని అర్నాబ్ ఆరోపించారు. చదవండి : అర్నాబ్ గోస్వామికి సుప్రీంలో ఊరట -
ఆర్నాబ్ గోస్వామికి సుప్రీంలో ఊరట
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ దాఖలైన కేసుల్లో రిపబ్లిక్ టీవీ చీఫ్ ఆర్నాబ్ గోస్వామికి ఊరట లభించింది. మూడు వారాల పాటు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ కోసం మూడు వారాల్లోపు దరఖాస్తు చేసుకునేందుకు కూడా ఆయనకు అవకాశం ఇచ్చింది. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఎలాంటి చర్యలూ తీసుకోకుండా స్టే విధించాలని కోరుతూ గోస్వామి పెట్టుకున్న పిటిషన్ మేరకు సర్వోన్నత ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం గోస్వామి పిటిషన్‌పై వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణ జరిపింది. గోస్వామి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. గోస్వామిపై దాఖలైన అన్ని కేసులపైనా స్టే విధించిన ధర్మాసనం.. ఒక్క నాగ్‌పూర్‌లో దాఖలైన కేసుపై మాత్రం స్టే విధించలేదు. ప్రస్తుతం ఈ కేసును ముంబైకి బదిలీ చేశారు. కాగా ఆర్నాబ్ గోస్వామి, రిపబ్లిక్ టీవీకి పూర్తి భద్రత కల్పించాలంటూ సుప్రీంకోర్టు ముంబై పోలీస్ కమిషనర్‌కి ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల పాల్గఢ్లో చోటుచేసుకున్న మూకహత్యకు సంబంధించి సోనియా గాంధీపై గోస్వామి తన టీవీలో చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా పలుచోట్ల ఎఫ్ఐఆర్లు దాఖలైన సంగతి తెలిసిందే. కాగా, ఆర్నాబ్ గోస్వామి దంపతులపై ఈనెల 22న అర్ధరాత్రి దాడి జరిగింది. ముంబైలోని స్టూడియో నుంచి ఆర్నాబ్ గోస్వామి, అతని భార్య ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
అర్నాబ్ వాహనంపై దాడి
ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి వాహనంపై దాడి జరిగింది. బుధవారం అర్ధరాత్రి ముంబైలోని స్టూడియో నుంచి అర్నాబ్ గోస్వామి తన భార్యతో కలిసి ఇంటికి వెళ్తున్న సమయంలో గణపత్రావ్ కాడమ్ మార్గ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై దూసుకొచ్చి అర్నాబ్ వాహనం అద్దంపై బాదుతూ దాడికి యత్నించారు. ఈ దాడిలో అర్నాబ్ దంపతులకు ఎటువంటి గాయాలు కాలేదు. నిందితులు వారు వెంట తెచ్చుకున్న ఇంక్ బాటిల్‌ను కారుపై విసిరారు. అర్నాబ్ కారు వెనుకే వస్తున్న అతడి సిబ్బంది ఆ ఇద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. -
అర్నాబ్ గోస్వామి దంపతులపై దాడి...
ముంబై : రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి దంపతులపై బుధవారం అర్ధరాత్రి దాడి జరిగింది. ముంబైలోని స్టూడియో నుంచి ఆర్నాబ్ గోస్వామి, అతని భార్య ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వారిపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. బైక్‌పై దూసుకొచ్చిన వ్యక్తులు అర్నాబ్ వాహనం దాడికి యత్నించారు. తనపై దాడికి సంబంధించి అర్నాబ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దాడిలో అర్నాబ్ దంపతులకు ఎటువంటి గాయాలు కాలేదు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఆర్నాబ్ వీడియో సందేశాన్ని రిపబ్లిక్ టీవీ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో.. తనపై దాడికి పాల్పడింది కాంగ్రెస్ యూత్ నాయకులేనని అర్నాబ్ ఆరోపించారు. ఆఫీసు నుంచి తిరిగివస్తున్న తమపై రాత్రి 12.15 గంటలకు దాడి జరిగిందని చెప్పారు. బైక్ వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారు అద్దాలు పగలకొట్టడానికి యత్నించారని తెలిపారు. తనకు ఏదైనా జరిగితే కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుటుంబమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, తనపై జరిగిన దాడిని వ్యక్తిగతంగా ఎదుర్కొంటానని.. దీనిపై ఎంత దూరమైనా వెళ్తానని తెలిపారు. తాను, తన టీవీ చానెల్ నిజం కోసమే పనిచేస్తుందని అన్నారు. #BREAKING | Arnab's message after being physically attacked by Congress goons #SoniaGoonsAttackArnab https://t.co/RZHKU3fdmK pic.twitter.com/SdAvoerhIH — Republic (@republic) April 22, 2020 -
2019 హంగ్!
-
రిపబ్లిక్ టీవీ సర్వే: లోకసభ ఎన్నికల్లో కారు జోరు..
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగించనుందని రిపబ్లిక్-సీ ఓటర్ సర్వే తెలిపింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగాను టీఆర్ఎస్ 16 స్థానాలు, ఎంఐఎం ఒక్క స్థానం సాధిస్తాయని సర్వే స్పష్టం చేసింది. ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరిట జరిగిన ఈ సర్వే ఫలితాలు గురువారం రిపబ్లిక్ టీవీ వెల్లడించింది. గత కొంతకాలంగా సీఎం కేసీఆర్ కూడా లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ 16 స్థానాలు సాధిస్తుందని చెబుతున్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 19 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా గెలిచే అవకాశం లేదని సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. బీజేపీతో పాటు ఇతర పార్టీలు కూడా తెలంగాణలో తమ ఖాతాను తెరవవని సర్వే పేర్కొంది. ఇక ఓట్ల శాతం విషయానికి వస్తే.. టీఆర్ఎస్ 42.4 శాతం, కాంగ్రెస్ 29 శాతం, బీజేపీ 12.7 శాతం, ఎంఐఎం 7.7 శాతం, ఇతరులు 8.2 శాతం ఓట్లు సాధిస్తాయని పేర్కొంది. గతేడాది అక్టోబర్‌లో సర్వే వివరాలు వెల్లడించిన సీ-ఓటర్ సంస్థ.. టీఆర్ఎస్ 9 స్థానాల్లో, కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలుపొందుతాయని తెలిపింది. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన అనంతరం పరిస్థితుల్లో భారీ మార్పు వచ్చినట్టుగా తెలుస్తోంది. కాగా, 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 2 స్థానాలు సాధించిన సంగతి తెలిసిందే. -
కర్ణాటకలో హోరాహోరీ
న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఇప్పటికిప్పడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ, యూపీఏ సమవుజ్జీలుగా నిలుస్తాయని రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. 28 సీట్లు ఉన్న కర్ణాటకలో ఎన్డీఏ 14, యూపీఏ 14 స్థానాలు గెలిచే అవకాశముందని సర్వేలో తేలింది. (ఏపీలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం) ఓట్ల శాతంలో ఎన్డీఏపై యూపీఏ పైచేయి సాధిస్తుందని వెల్లడించింది. యూపీఏకు 47.9 శాతం, ఎన్డీఏకు 44 శాతం, ఇతరులు 8.1 శాతం ఓట్లు దక్కించుకోనున్నారు. గత డిసెంబర్లో జరిపిన సర్వేతో పోలిస్తే ఇప్పుడు ఎన్డీఏకు 4 సీట్లు తగ్గాయి. యూపీఏ తన ఓట్ల శాతాన్ని 37.6 నుంచి 47.9 శాతానికి పెంచుకుంది. (మోదీకి భారీ షాక్) -
లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం
-
లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించనుందని రిపబ్లిక్ టీవీ-సీ ఓటర్ సంస్థలు జరిపిన ఓ సర్వేలో స్పష్టమైంది. ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరిట జరిగిన ఈ సర్వే ఫలితాలు గురువారం రిపబ్లిక్ టీవీ వెల్లడించింది. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి పరాభవం తప్పదని ఈ సర్వే తేల్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగాను వైఎస్సార్సీపీకి 19 సీట్లు, టీడీపీకి కేవలం ఆరు సీట్లు వస్తాయని సర్వే తేల్చింది. అటు జాతీయపార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్క స్థానంలో కూడా గెలవలేవని తెలిపింది. ఇక ఓట్ల శాతం పరంగా చూసినా వైఎస్సార్సీపీదే పైచేయిగా కనిపించింది. వైఎస్సార్సీపీకి 41.3 శాతం ఓట్లు, టీడీపీకి 33.1 శాతం ఓట్లు పడతాయని సర్వే వెల్లడించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా ఏపీలో టీడీపీకి 15 సీట్లు, బీజేపీకి రెండు సీట్లు రావడం తెలిసిందే. అప్పుడు వైఎస్సార్సీపీ ఏపీలో 8 చోట్ల గెలుపొందింది. కాగా, గతంలో సీ ఓటర్ సంస్థ వెల్లడించిన సర్వేలో సైతం వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధిస్తుందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
రిపబ్లిక్ చానల్‌పై చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: సర్వేల పేరుతో ఓటర్లను ప్రభావితం చేస్తున్న రిపబ్లిక్ తెలుగు చానల్‌పై అదనపు సీఈఓ జ్యోతి బుద్ధప్రకాశ్‌కు టీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి దండే విఠల్ శనివారం ఫిర్యాదు చేశారు. స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని సర్వే పేరుతో జరుగుతున్న ప్రచారంపై కూడా ఫిర్యాదు చేశారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు విఠల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం కేసీఆర్, ఎంపీ కవితపై మహబూబాబాద్‌లో రేవంత్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని, ప్రాణహాని ఉందంటున్న రేవంత్ తనకు తాను ఏమైనా చేసుకుని ఇతరు లపై నిందలు వేసే అవకాశం ఉందన్నారు. దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పడం ఎన్నికల నియమావళికి విరుద్ధమన్నారు. తమ ఫిర్యాదుకు స్పం దించిన అదనపు సీఈఓ వెంటనే చర్యలు తీసుకుం టామని హామీయిచ్చారన్నారు. టీ న్యూస్‌పై సీఈవోకు ఫిర్యాదు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్టను భంగం కలిగించే విధంగా ప్రసారాలు చేసిన టీ న్యూస్ చానల్‌పై చర్యలు తీసుకోవాలని టీటీడీపీ శనివారం ఇక్కడ సీఈవో రజత్ కుమార్‌కు ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వ్యక్తిగత దూషణలతో ప్రసారాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. -
వైఎస్సార్సీపీకి 21 ఎంపీ సీట్లు
-
అత్యధిక ఎంపీ సీట్లు టీఆర్ఎస్కే
-
ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభంజనం
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించనుందని సీ ఓటర్ సంస్థ జరిపిన ఓ సర్వేలో స్పష్టమైంది. ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరిట జరిగిన ఈ సర్వే ఫలితాలు గురువారం రిపబ్లిక్ టీవీలో ప్రసారమయ్యాయి. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం తప్పదని సెప్టెంబర్ నెలలో జరిపిన ఈ సర్వే తేల్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లు ఎలాంటి పొత్తులూ లేకుండా పోటీలో నిలిస్తే.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగాను వైఎస్సార్సీపీకి 21 సీట్లు, టీడీపీకి కేవలం నాలుగు సీట్లు వస్తాయని సర్వే తేల్చింది. (చదవండి: మళ్లీ ఎన్డీయేనే.. కానీ..!) అటు జాతీయపార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్క స్థానంలో కూడా గెలవలేవంది. ఇక ఓట్ల శాతం పరంగా చూసినా సీ ఓటర్ సర్వేలో వైఎస్సార్సీపీదే పైచేయిగా కనిపించింది. వైఎస్సార్సీపీకి 41.9 శాతం ఓట్లు, టీడీపీకి 31.4 శాతం ఓట్లు పడతాయనీ, 2014తో పోలిస్తే టీడీపీకి 9 శాతానికిపైగా ఓట్లు తగ్గుతాయని సర్వే వెల్లడించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా ఏపీలో టీడీపీకి 15 సీట్లు, బీజేపీకి రెండు సీట్లు రావడం తెలిసిందే. నాడు వైఎస్సార్సీపీ ఏపీలో 8 చోట్ల గెలుపొందింది. -
మళ్లీ ఎన్డీయేనే.. కానీ..!
న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేనే అధికారంలోకి రానుందని తేలింది. అయితే 2014 లాగా ఈసారి కమలం పార్టీకి సొంతగా మెజారిటీ రాదని స్పష్టమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై రిపబ్లిక్ టీవీ, సీ–వోటర్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో మొత్తం 543 స్థానాలకు గానూ ఎన్డీయే కూటమికి 276 చోట్ల గెలుపొందనుందని వెల్లడైంది. అటు కాంగ్రెస్ కాస్త పుంజుకున్నప్పటికీ యూపీఏ 112 స్థానాలకే పరిమితం కానుందని సర్వే పేర్కొంది. అయితే ప్రాంతీయ పార్టీలే ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించనున్నాయి. ఈ పార్టీలన్నీ కలిసి 155 స్థానాల్లో విజయం సాధించి కీలకభూమిక నిర్వహించవచ్చని సర్వేలో వెల్లడైంది. గత ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 335 స్థానాలు రాగా.. ఒక్క బీజేపీయే 282 చోట్ల విజయం సాధించింది. అయితే.. ఈసారి బీజేపీ సొంతంగా 230–240 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని సర్వే ద్వారా వెల్లడైంది. కీలకమైన రాష్ట్రాల వారిగా పార్టీల విజయావకాశాలను ఓసారి గమనిస్తే.. ఉత్తరప్రదేశ్: ఈ రాష్ట్రంలో మొత్తం 80 లోక్‌సభ సీట్లున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 71 చోట్ల విజయదుందుభి మోగించింది. ఇదే బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టింది. అయితే ఈసారి ఎన్డీయే కూటమికి ఇక్కడ ఎదురుగాలి వీయనుందని సర్వేలో వెల్లడైంది. మహాఘట్బంధన్ పేరుతో ఎస్పీ, బీఎస్పీ ఏకమైతే బీజేపీ సీట్లకు గండికొట్టడం ఖాయంగా కనబడుతోంది. రిపబ్లిక్ టీవీ–సీ వోటర్ సర్వే ప్రకారం, ఈసారి బీజేపీ 36 చోట్ల విజయం సాధించేందుకు అవకాశాలుండగా.. ఎస్పీ, బీఎస్పీ కూటమికి (కాంగ్రెస్ లేకుండా) 42 స్థానాల్లో గెలవొచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్ కేవలం 3 చోట్ల గెలిచే అవకాశం ఉంది. అయితే మహాకూటమి నుంచి బీఎస్పీ విడిపోయి ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీ మళ్లీ 70 చోట్ల గెలుపొందేందుకు అనుకూల వాతావరణం ఏర్పడనుందని పేర్కొంది. రాజస్తాన్: ఇక్కడ మొత్తం 25 సీట్లున్నాయి. 2014లో మొత్తం సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. అయితే సీఎం వసుంధరా రాజేపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత కారణంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో కమలానికి కాస్తంత ఎదురుగాలి వీయడం ఖాయమని వెల్లడైంది. ఈసారి బీజేపీ 18 చోట్ల, కాంగ్రెస్ 7 స్థానాల్లో గెలిచేందుకు అవకాశమున్నట్లు సర్వే తెలిపింది. మధ్యప్రదేశ్: ఇక్కడ మొత్తం 29 సీట్లున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 27, కాంగ్రెస్ 2 చోట్ల గెలిచాయి. అయితే ఈసారి బీజేపీకి కాస్తంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సర్వేలో వెల్లడైంది. దీని ప్రకారం బీజేపీ 23 చోట్ల, కాంగ్రెస్ 6 చోట్ల గెలవనున్నట్లు తెలిసింది. వచ్చే నెలలో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. బిహార్: బిహార్ ఎన్డీయేకు కీలక రాష్ట్రంగా మారింది. ఇక్కడ నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో పొత్తు నేపథ్యంలో బీజేపీ ఎక్కువ సీట్లను వదులుకునేందుకు సిద్ధమైంది. ఇది బీజేపీకి కలిసొచ్చే అవకాశాలున్నాయి. ఇక్కడ మొత్తం 40 అసెంబ్లీ స్థానాలుండగా.. 2014లో బీజేపీ 22చోట్ల, ఎల్జేపీ 6 చోట్ల గెలవడంతో ఎన్డీయే కూటమికి 28 సీట్లు వచ్చాయి. అయితే అప్పుడు జేడీయూ రెండు సీట్లలో మాత్రమే గెలిచింది. అయితే ఈసారి జేడీయూ చేరికతో ఎన్డీయే బలం 31కి పెరుగుతుందని సర్వే పేర్కొంది. ఆర్జేడీ, కాంగ్రెస్, ఇతర పార్టీలన్నీ కలిసి 9 చోట్ల గెలిచే అవకాశం ఉంది. కర్ణాటక: కర్ణాటక (28 సీట్లలో)లో కాంగ్రెస్, జేడీఎస్‌లు వేర్వేరుగా పోటీ చేస్తే.. సంయుక్తంగా 10 సీట్లు గెలుస్తాయని సర్వే పేర్కొంది. బీజేపీ 18 చోట్ల, కాంగ్రెస్ 7 స్థానాల్లో, జేడీఎస్ 3 చోట్ల గెలుస్తాయని వెల్లడైంది. ఇది కూటమి పార్టీలు వేర్వేరుగా కలిసి పోటీచేస్తే.. 15 స్థానాలు గెలవొచ్చనే ప్రజాభిప్రాయం వ్యక్తమైంది. పశ్చిమబెంగాల్: మమత పోరాటగడ్డపై ఈసారి బీజేపీ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురుకానుందని సర్వే తెలిపింది. మొత్తం 42 సీట్లలో బీజేపీ 16 చోట్ల గెలిచేందుకు వీలుందని తేలింది. 2014లో 34చోట్ల విజయం సాధించిన మమత ఈసారి 25 చోట్ల గెలుస్తారని వెల్లడైంది. యూపీలో జరిగే నష్టానికి ఇక్కడినుంచి కాస్తైనా ఉపశమనం పొందాలనే బీజేపీ వ్యూహం ఫలించే అవకాశం ఉందని తెలుస్తోంది. తమిళనాడు: ఎప్పుడూ ఏకపక్షంగా ఒక పార్టీకి ఓట్లు వేసే తమిళ ఓటర్లు ఈసారి కూడా అదే పంథాను అనుసరించనున్నారు. గత ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవని డీఎంకేకు అత్యధికంగా 28 చోట్ల గెలిపించనున్నారని సర్వే తెలిపింది. బీజేపీ రెండుస్థానాల్లో అన్నాడీఎంకే 9 చోట్ల విజయం సాధించొచ్చని పేర్కొంది. గుజరాత్: ఈ రాష్ట్రంలోని మొత్తం 26 స్థానాలనూ 2014లో బీజేపీ గెలుచుకుంది. అయితే ఈసారి ఎదురుగాలి వీస్తుంది. కాంగ్రెస్‌తోపాటు పటేళ్ల ఉద్యమ నాయకుడి పోరాటం కారణంగా రెండు చోట్ల బీజేపీకి ఓటమి తప్పదని సర్వే వెల్లడించింది. ఈ రెండు చోట్ల కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నాయని తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీకి ఎదురేలేదని ఉన్న 11 చోట్ల బీజేపీ ఘన విజయం సాధిస్తుందని పేర్కొంది. మహారాష్ట్ర: బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారిన ప్రాంతం మహారాష్ట్ర. ఇక్కడున్న 48 స్థానాల్లో 2014లో బీజేపీ 23 చోట్ల గెలిచింది. శివసేన 18, యూపీఏ (కాంగ్రెస్+ఎన్సీపీ) 6 చోట్ల గెలిచాయి. అయితే ఈసారి ఒంటరిపోరు తప్పదని శివసేన ప్రకటించిన కాంగ్రెస్, ఎన్సీపీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. బీజేపీ 22 చోట్ల గెలుస్తుందని తెలిపింది. కూటమి నుంచి విడిపోతే శివసేన (7 చోట్ల మాత్రమే)కు నష్టం తప్పదని పేర్కొంది. ఇది కాంగ్రెస్, ఎన్సీపీలకు కలిపి 19 సీట్లు కట్టబెట్టే అవకాశం ఉంది. అయితే శివసేన ఓట్లను బీజేపీ రాబట్టుకోగలిగితే మరో ఐదారు చోట్ల గెలిచేందుకు వీలుంది. ఒడిశా: నవీన్ పట్నాయక్ గడ్డపై ఈసారి బీజేపీ ఎక్కువసీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని రిపబ్లిక్ టీవీ సర్వే పేర్కొంది. మొత్తం 21 స్థానాల్లో బీజేపీ 12 చోట్ల, బీజేడీ 6 చోట్ల గెలవనుండగా.. కాంగ్రెస్ 2 స్థానాల్లో పాగా వేయొచ్చని వెల్లడించింది. ఇక్కడ గెలవడం బీజేపీకి అత్యంత ఆవశ్యకంగా మారింది. ఉత్తరభారతంలో కోల్పోయే సీట్లకు పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో విజయంతో ఉపశమనం పొందనుంది. పంజాబ్‌లో మాత్రం ఎన్డీయేకే ఘోర పరాజయం తప్పదని స్పష్టమైంది. అకాలీదళ్‌పై ఉన్న వ్యతిరేకత బీజేపీకి పెనునష్టాన్ని మిగిల్చనుంది. ఈ సారి సిక్కుల గడ్డపై ఎన్డీయే ఒకే ఒక సీటు గెలుస్తుందని సర్వే తెలిపింది. కేంద్ర పాలిత ప్రాంతాల విషయానికొస్తే.. అండమాన్, దాద్రానగర్ హవేలీ, చండీగఢ్, డయ్యూడమన్‌లలో ఉన్న ఒక్కో సీటును, ఢిల్లీలోని 7 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోనుండగా.. పుదుచ్చేరి, లక్షద్వీప్‌లలోని ఒక్కో స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోనుందని సర్వే పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాలు: ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక ఎంపీ సీట్లున్న (13) అస్సాంలో బీజేపీ తన స్థానాన్ని మెరుగుపరుచుకోనుంది. 2014లో ఏడు సీట్లలో గెలిస్తే ఈసారి 9 చోట్ల విజయం సాధించొచ్చని సర్వే పేర్కొంది. కాంగ్రెస్ 4, స్వంతంత్రులు ఒక చోట గెలిచే వీలుందని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లోని మిగిలిన 11 స్థానాల్లో ఎన్డీయే 9 చోట్ల, యూపీఏ 2 చోట్ల గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. -
వైఎస్సార్సీపీ ప్రభంజనం.. రిపబ్లిక్ టీవీ సర్వే
రిపబ్లిక్ టీవీ–సీ ఓటర్ తాజా సర్వే అంచనాల ప్రకారం... వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ 21 ఎంపీ సీట్లు గెలుచుకుని విజయఢంకా మోగించబోతోంది. అధికార టీడీపీ కేవలం నాలుగు సీట్లతో ఘోరపరాజయం మూటగట్టుకోబోతోంది. కాంగ్రెస్, బీజేపీలకు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రిపబ్లిక్ టీవీ–సీ ఓటర్ ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరిట జరిపిన సర్వే ఫలితాలను గురువారం రాత్రి వెల్లడించింది. ఏపీలో 25 లోక్‌సభస్థానాలకు జరగనున్న ఎన్నికల్లో చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీపై వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించబోతున్నట్టు పేర్కొంది. 2014 ఎన్నికల్లో టీడీపీ 15 సీట్లు, మిత్రపక్షం బీజేపీకి రెండు సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలిగిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఈ రెండుపార్టీలు విడివిడిగానే పోటీ చేయనున్నాయి. కేవలం 4 ఎంపీ స్థానాలకే పరిమితం కావడం ద్వారా టీడీపీకి రాజకీయంగా తీవ్ర నష్టం వాటిల్లనున్నట్టు ఈ సర్వే అంచనా వేస్తోంది. టీడీపీ ఓట్ల శాతం దాదాపు పదిశాతం వరకు భారీగా తగ్గిపోయి 31.4 శాతానికి (గతంలోని 40.8 శాతం) పరిమితం కానున్నట్టు వెల్లడైంది. రిపబ్లిక్ టీవీ–సీ ఓటర్ ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ అంచనాల ప్రకారం... గెలుచుకునే సీట్ల అంచనాలు– మొత్తం ఎంపీ సీట్లు=25 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ=21 టీడీపీ = 4 పార్టీలు సాధించే ఓట్ల శాతంపై అంచనాలు... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ = 41.9 శాతం టీడీపీ = 31.4 శాతం -
రిపబ్లిక్ టీవీ సర్వే అంచనాలు...
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రిపబ్లిక్ టీవీ–సీ ఓటర్ ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరిట జరిపిన తాజా సర్వే అంచనాల ప్రకారం... వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్కు 9 సీట్లు, కాంగ్రెస్‌కు 6 సీట్లు, బీజేపీకి ఒకటి, ఏఐఎంఐఎంకు ఒక సీటు చొప్పున దక్కనున్నాయి. రిపబ్లిక్ టీవీ ఈ సర్వే ఫలితాలను గురువారం రాత్రి వెల్లడించింది. ఈ ఎన్నికల్లో దాదాపు 35 శాతం ఓట్లతో టీఆర్ఎస్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందని చెబుతున్నా 2014 ఎన్నికల్లో తెలంగాణలో 17 సీట్లకు గాను 11 సీట్లు గెలుచుకున్న టీఆర్ఎస్ రెండుసీట్ల మేర నష్టపోనున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం రెండు ఎంపీ సీట్లు రాగా ఇప్పుడు ఆ సంఖ్య ఆరుకు పెరగనున్నట్టు వెల్లడించింది. టీడీపీకి ఒక్క ఎంపీ సీటు కూడా దక్కే అవకాశాలు లేవు. అయితే కాంగ్రెస్, టీడీపీ, ఇతర పక్షాలు కూటమిగా ఏర్పడడం వల్ల కాంగ్రెస్‌పార్టీ ప్రయోజనం పొందినట్టుగా అంచనావేస్తున్నారు. బీజేపీ గతంలో గెలిచిన ఒక్క సీటును నిలబెట్టుకోనుంది. అదేసమయంలో మజ్లీస్ పార్టీ ప్రభావం రాష్ట్రంలో మరి కాస్తా పెరగడంతో పాటు ఓటుశాతాన్ని కూడా పెంచుకున్నట్టుగా వెల్లడైంది. రిపబ్లిక్ టీవీ–సీ ఓటర్ ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ అంచనాల ప్రకారం... తెలంగాణలో గెలుచుకునే సీట్ల అంచనాలు– మొత్తం ఎంపీ సీట్లు=17 టీఆర్ఎస్ = 09 కాంగ్రెస్ = 06 బీజేపీ = 01 ఎంఐఎం = 01 ఇతరులు = 00 పార్టీలు సాధించే ఓట్ల శాతంపై అంచనాలు... టీఆర్ఎస్ = 34.9 శాతం కాంగ్రెస్ కూటమి = 30.3 శాతం బీజేపీ = 19.5 శాతం ఏఐఎంఐఎం=3.6 శాతం ఇతరులు = 11.7 శాతం -
రిపబ్లిక్ టీవీ అర్ణబ్ గోస్వామిపై కేసు
ముంబై: ఇద్దరిని ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై రిపబ్లిక్ టీవీ ఎడిటర్–ఇన్–చీఫ్ అర్ణబ్ గోస్వామి సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ ఎండీ అయిన అన్వయ్ నాయక్, ఆయన తల్లి శనివారం ముంబై సమీపంలోని వారి ఫాం హౌస్‌లో ఆత్మహత్య చేసకుని చనిపోయారు. అన్వయ్ సూసైడ్ నోట్ రాస్తూ అర్ణబ్ గోస్వామితోపాటు ఫెరోజ్ షేక్, నితీశ్ సర్దా అనే వ్యక్తులు తనకు రూ. 5.4 కోట్లు చెల్లించాలనీ, కానీ వాళ్లు ఆ డబ్బు ఇవ్వకుండా వేధిస్తూ తమ ఆత్మహత్యలకు కారణమయ్యారని పేర్కొన్నారు. అన్వయ్ ఆరోపణలు అవాస్తవాలంటూ ఆదివారం రిపబ్లిక్ టీవీ ఓ ప్రకటన విడుదల చేసింది. -
అర్నాబ్ గోస్వామిపై కేసు నమోదు
ముంబై: ఓ వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రఖ్యాత టీవీ వ్యాఖ్యాత, రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై ముంబైలోని అలీభాగ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదయింది. ఇటీరియర్ డిజైనర్‌గా పరిచేస్తున్న అన్వాయ్ నాయక్ తనకు అర్నాబ్ గోస్వామి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదని, శనివారం అలీభాగ్‌లోని తన బంగ్లాలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాయక్ వద్ద లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా ఆయన భార్య అలీభాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. నాయక్ భార్య అక్షత ఫిర్యాదు మేరకు గోస్వామితో సహా మరో ఇద్దరు ఫిరోజ్ షేక్, నితీష్ సార్థాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అడిషనల్ సూపరింటెండెంట్ పోలీస్ అధికారి సంజయ్ పాటిల్ తెలిపారు. రిపబ్లిక్ టీవీ నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని నాయక్ భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు. రిపబ్లిక్ టీవీ మాత్రం అక్షత ఆరోపణలను ఖండించింది. నాయక్‌కు చెల్లించాల్సిన బకాయిలను వాయిదా పద్దతిలో మొత్తం చెల్లించామని, తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఆధారాలను తగిన సమయంలో అధికారుల ముందు ఉంచుతామని పేర్కొంది. నాయక్ ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో తమ వద్ద పూర్తి ఆధారాలు లేవని, పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చిన తర్వాతనే నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నాయక్ భార్య చేస్తున్న ఆరోపణలపై స్పష్టత లేదని, పూర్తి ఆధారాలు లభ్యమయేవరకు ఎవ్వరిని అరెస్ట్ చేయమని పోలీస్ అధికారులు తెలిపారు. -
అర్నబ్ దొరికితే..ఆడుకోరా!
అబద్ధం ఆడితే అతికినట్లు ఉండాలి... అనేది సామెత. కానీ అలాకాకుండా అబద్ధం ఆడి అడ్డంగా (ససాక్ష్యంగా) దొరికిపోతే.. ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఊహించండి. తన టీవీ షోలో అందర్నీ ఆడేసుకునే విఖ్యాత జర్నలిస్టు, రిపబ్లిక్ టీవీ ఎడిటర్–ఇన్–చీఫ్ అర్నబ్ గోస్వామి పరిస్థితి ఇదే! మరి నెటిజన్లు ఊరుకుంటారా? అసలే అవతలున్నది అర్నబ్... అంతే రెచ్చిపోయారు. తమలోని సృజనకు సానబెట్టి ఒక ఆట ఆడుకున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ ‘వావ్... గుజరాత్ అల్లర్ల సమయంలో ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో తన కారుపై దాడి జరిగిందని నా మిత్రుడు అర్నబ్ చెబుతున్నాడు. నిజమేమిటంటే... అతనసలు అహ్మదాబాద్ అల్లర్ల కవరేజీలో పాల్గొననేలేదు’ ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ ఈనెల 19న చేసిన ట్వీట్. ట్వీట్‌తో పాటు యూట్యూబ్‌లో అర్నబ్ ప్రసంగం తాలూకు లింక్‌ను కూడా రాజ్‌దీప్ షేర్ చేశారు. వీడియోలో అర్నబ్ ఏమన్నాడంటే... ‘‘అది 2002. అహ్మదాబాద్‌లో సీఎం నివాసానికి 50 మీటర్ల దూరంలో ఉండగా... చేతుల్లో త్రిశూలాలతో ఒక గుంపు మా అంబాసిడర్ కారును చుట్టుముట్టింది. జర్నలిస్టులమని ఎంత చెబుతున్నా.. మతమేమిటని రెట్టించి అడిగారు. అదృష్టవశాత్తు ఆ రోజు మా కారులో మైనారిటీలు ఎవరూ లేరు. మా ఐడీ కార్డులపై పేర్లు చూసి వదిలిపెట్టారు. అయితే కారు డ్రైవర్‌కు ఎలాంటి ఐడీ కార్డు లేదు. భయంతో వణికిపోయాడు. చివరకు చేతిపైనున్న ‘హే రామ్’అని రాసున్న పచ్చబొట్టు లాంటి దాన్ని చూపించి బయటపడ్డాడు’’ నిజమేమిటంటే ఈ దాడి జరిగింది రాజ్‌దీప్ సర్దేశాయ్ బృందంపై. అప్పుడు రాజ్‌దీప్, అర్నబ్లు ఇద్దరూ ఎన్డీటీవీలో పనిచేసేవారు. గుజరాత్ అల్లర్లను కవర్ చేసిన బృందంలో తొలుత అర్నబ్ లేడు. తర్వాతి దశలో వెళ్లాడు. రాజ్దీప్తోపాటు నాడు కవరేజీలో పాల్గొన్న తోటి జర్నలిస్టులు కూడా దీన్ని ధ్రువీకరించారు. రిపబ్లిక్ టీవీ న్యూస్, స్పెషల్ ప్రాజెక్ట్ ఎడిటర్ ప్రేమా శ్రీదేవి... నాటి కవరేజీలో పాల్గొన్న బృందం గ్రూపు ఫొటోను ట్వీట్ చేశారు. దీనిపై మరో సీనియర్ జర్నలిస్టు మాయా మీర్చందానీ స్పందిస్తూ.. ‘అల్లర్ల తర్వాత వారం రోజులకు తీసిన ఫొటో ఇది. అర్నబ్ రెండు రోజుల కోసం ఖేడాకు వెళ్లారు. అప్పటిదీ ఫొటో. కాబట్టి ఈ ఫొటో అర్నబ్ అబద్ధాన్ని నిజం చేయలేదు’అని పేర్కొన్నారు. ఏ చిన్న ఆధారం దొరికినా... ఇంతెత్తున లేచే అర్నబ్ మాత్రం తన వ్యాఖ్యలపై ఇంత వివాదం జరిగినా ఇప్పటిదాకా స్పందించలేదు. ‘‘గొప్పలు చెప్పుకోవడానికి కూడా ఓ హద్దుండాలి. నా వృత్తి ఈ స్థితికి వచ్చినందుకు చింతిస్తున్నాను’’అని రాజ్‌దీప్ సర్దేశాయ్ మరో ట్వీట్ చేశారు. అర్నబ్ క్షమాపణ చెప్పాలన్నారు. అంతే నెటిజన్లు విరుచుకుపడ్డారు. తమలోని సృజన బయటికి తీస్తూ ప్రముఖుల పాత ఫొటోలను ఫొటోషాప్ ద్వారా మార్ఫింగ్ చేసి... ‘అర్నబ్ డిడ్ ఇట్’అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీటర్లో పోస్ట్‌చేశారు. ఇది బాగా వైరల్ అయ్యింది. నెటిజన్లు పెట్టిన కొన్ని పోస్టుల్లో మచ్చుకు కొన్ని... - ‘‘ఎవరికీ తెలియని విషయమేమిటంటే.. చంద్రుడిపై తొలుత కాలుమోపిన వ్యక్తి అర్నబ్ గోస్వామియే. స్పేస్ సూట్లో ఉంది అతనే. కానీ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఆ క్రెడిట్ తీసేసుకున్నాడు’’ - ‘‘మహాత్మాగాంధీని అహింసామార్గంలో నడిపిస్తున్న అర్నబ్’’’ - ‘‘ఇండియన్ నేషనల్ ఆర్మీని పరిశీలిస్తున్న అర్నబ్’’ - ‘‘ఎడ్వినా మౌంట్‌బాటెన్ సిగరెట్‌ను వెలిగిస్తున్న అర్నబ్’’ - ‘‘1857లో బీఫ్ తినడానికి నిరాకరించి సిఫాయి తిరుగుబాటును లేవదీసిన అర్నబ్’’ - ‘‘క్విట్ ఇండియా పిలుపునకు ముందు గాంధీ కోసం తాను రాసిన ప్రసంగ పాఠాన్ని మహాత్మునికి అందజేస్తున్న బాల అర్నబ్’’ - ‘‘అర్నబ్ కారును అడ్డగిస్తున్న డైనోసార్’’ - ‘‘అర్నబ్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు నెహ్రూకు ధన్యవాదాలు తెలుపుతున్న ఐన్‌స్టీన్. ఐన్‌స్టీన్‌కు సాపేక్ష సిద్ధాంతాన్ని అర్నబ్ బోధించేందుకే ఈ భేటీ.’’ - ‘‘జార్జ్ ఫోర్మన్తో తలపడటానికి ముందు మహ్మద్ అలీకి శిక్షణ ఇస్తున్న అర్నబ్’’ - ‘‘1893లో దక్షిణాఫ్రికాలోని పీటర్‌మార్టిజ్‌బర్గ్ రైల్వేస్టేషన్లో తెల్లవారి కోసమే ప్రత్యేకించిన ఫస్ట్‌క్లాస్ బోగీలో కూర్చున్నందుకు రైలు నుంచి బయటకు తోసివేయబడ్డ అర్నబ్’’ -
సీనియర్ జర్నలిస్టుపై పరువునష్టం దావా
సీనియర్ జర్నలిస్టు అర్ణబ్ గోస్వామి పైన, ఆయన కొత్తగా ప్రారంభించిన రిపబ్లిక్ టీవీపైన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ రూ. 2 కోట్లకు పరువునష్టం దావా దాఖలు చేశారు. తన భార్య సునందా పుష్కర్ మృతికి సంబంధించిన కథనాలు ప్రసారం చేసే సందర్భంలో తన పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. ఢిల్లీ పోలీసుల విచారణ ముగిసేవరకు తన భార్య మృతి గురించి ఎలాంటి కథనాలు ప్రసారం చేయకుండా ఆ టీవీ చానల్‌ను నిరోధించాలని కూడా హైకోర్టును ఆయన కోరారు. ఈ కేసులో అర్ణబ్ గోస్వామితో పాటు రిపబ్లిక్ టీవీ యాజమాన్యం అయిన ఆర్గ్ ఔట్లియర్ మీడియా ఏషియానెట్ న్యూస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కూడా ప్రతివాదిగా చేర్చారు. ఈనెల 8 నుంచి 13వ తేదీ వరకు ఆ చానల్లో ప్రసారం చేసిన కథనాల్లో తన భార్య మృతికి సంబంధించి కొన్ని విషయాలు బయటపెట్టినట్లు థరూర్ చెబుతున్నారు. ఏమీ లేనిచోట ఏదో ఉందన్నట్లుగా చూపించడం ద్వారా తన ప్రజా జీవితానికి, తన ఇమేజికి భంగం కలిగేలా ఆ టీవీచానల్ ప్రవర్తించిందని అన్నారు. వాళ్లు ప్రసారం చేసిన కథనాలను చూసినవాళ్లకు.. తానే తన భార్యను హతమార్చినట్లుగా అర్థం అవుతోందని శశి థరూర్ చెప్పారు. ఇలాంటి కథనాల వల్ల పోలీసుల దర్యాప్తుపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. తన పరువుకు కలిగిన నష్టానికి గాను రూ. 2 కోట్లు పరిహారంగా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు ఈ కేసు విచారిస్తున్నారని, ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశారని చెప్పారు. 2014 జనవరి 17వ తేదీన దక్షిణ ఢిల్లీలోని ఒక ఫైవ్‌స్టార్ హోటల్ సూట్లో సునంద అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. -
రిపబ్లిక్ టీవీ: లాలూకు ఆడియో టేపు షాక్
తన చానెల్ రిపబ్లిక్ టీవీని శనివారం ప్రారంభించిన అర్ణబ్ గోస్వామి బాంబు పేల్చారు. రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, తీహార్ జైల్లో జీవితఖైదులో అనుభవిస్తున్న షహబుద్దీన్‌తో మాట్లాడుతున్న ఆడియో టేప్‌ను రిపబ్లిక్ టీవీ బయటపెట్టింది. జైలు నుంచి లాలూకు, షహబుద్దీన్ సూచనలు ఇస్తున్నట్లు అందులో ఉంది. లాలూ తనయుడు తేజ్ ప్రతాప్‌యాదవ్‌కు పాట్నాలో ఓ పెట్రోల్ పంపును 2011లో అక్రమంగా కేటాయించారని బీహార్‌కు చెందిన బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ ఆరోపణలు చేసిన కొద్ది గంటలకే ఆడియో క్లిప్పింగ్ బయటకు రావడంతో విపక్షాలు లాలూ, అధికార బీజేడీలపై దుమ్మెత్తిపోస్తున్నాయి. క్లిప్పింగ్‌పై మాట్లాడిన సుశీల్.. లాలూ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. క్లిప్పింగ్‌పై మాట్లాడిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆడియో టేపును విన్న దేశం నివ్వెరవపోయిందని అన్నారు. ప్రారంభంతోనే నాయకుల అక్రమాలను బయటపెట్టడం మొదలుపెట్టిన అర్ణబ్‌ను పలువురు నాయకులు ప్రశంసించారు. కాగా, ఆడియో క్లిప్పింగ్‌పై ఆర్జేడీగానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నితీశ్ కుమార్ ఇంకా స్పందించలేదు.