
సాక్షి, ముంబై: రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నారు. 2018లో మూసివేసిన ఆత్మహత్య కేసుకు సంబంధించి తన 'అక్రమ అరెస్టు' ను సవాలు చేస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహారాష్ట్ర అలీబాగ్ పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరారు. ఉద్దేశపూర్వకంగానే తనను టార్గెట్ చేశారని, తన ఇంట్లోకి చొరబడి మరీ పోలీసులు తనపైనా,తన కుటుంబంపైనా దాడిచేశారని అర్నాబ్ పిటిషన్‌లో ఆరోపించారు. తనను అక్రమంగా, చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారన్నారు. తన వ్యక్తిగత స్వేచ్ఛను హరించి, గౌరవానికి భంగం కలిగించడమే కాకుండా, తన కుమారుడిపై దాడిచేశారన్నారు.
తన ఛానెల్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో ఇది మరో ప్రయత్నమని విమర్శించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను వేటాడుతున్నారని(విచ్–హంట్ చేస్తున్నారని) తన పిటిషన్‌లో అర్నాబ్ పేర్కొన్నారు. జస్టిస్ ఎస్ఎస్ షిండే, ఎంఎస్ కార్నిక్‌తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం మధ్యాహ్నం ఈ పిటిషన్‌ను విచారించనుంది. కాగా ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్యకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గోస్వామిని బుధవారం అరెస్టు చేసిన పోలీసులు రాయ్‌గడ్ జిల్లాలోని అలీబాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. తరువాత ఆయనను అలీబాగ్‌లోని మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపరచగా, నవంబర్ 18 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. (అర్నబ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు)
Comments
Please login to add a commentAdd a comment