
సీనియర్ జర్నలిస్టుపై పరువునష్టం దావా
సీనియర్ జర్నలిస్టు అర్ణబ్ గోస్వామి పైన, ఆయన కొత్తగా ప్రారంభించిన రిపబ్లిక్ టీవీపైన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ రూ. 2 కోట్లకు పరువునష్టం దావా దాఖలు చేశారు. తన భార్య సునందా పుష్కర్ మృతికి సంబంధించిన కథనాలు ప్రసారం చేసే సందర్భంలో తన పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. ఢిల్లీ పోలీసుల విచారణ ముగిసేవరకు తన భార్య మృతి గురించి ఎలాంటి కథనాలు ప్రసారం చేయకుండా ఆ టీవీ చానల్‌ను నిరోధించాలని కూడా హైకోర్టును ఆయన కోరారు. ఈ కేసులో అర్ణబ్ గోస్వామితో పాటు రిపబ్లిక్ టీవీ యాజమాన్యం అయిన ఆర్గ్ ఔట్లియర్ మీడియా ఏషియానెట్ న్యూస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కూడా ప్రతివాదిగా చేర్చారు.
ఈనెల 8 నుంచి 13వ తేదీ వరకు ఆ చానల్‌లో ప్రసారం చేసిన కథనాల్లో తన భార్య మృతికి సంబంధించి కొన్ని విషయాలు బయటపెట్టినట్లు థరూర్ చెబుతున్నారు. ఏమీ లేనిచోట ఏదో ఉందన్నట్లుగా చూపించడం ద్వారా తన ప్రజా జీవితానికి, తన ఇమేజికి భంగం కలిగేలా ఆ టీవీచానల్ ప్రవర్తించిందని అన్నారు. వాళ్లు ప్రసారం చేసిన కథనాలను చూసినవాళ్లకు.. తానే తన భార్యను హతమార్చినట్లుగా అర్థం అవుతోందని శశి థరూర్ చెప్పారు. ఇలాంటి కథనాల వల్ల పోలీసుల దర్యాప్తుపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. తన పరువుకు కలిగిన నష్టానికి గాను రూ. 2 కోట్లు పరిహారంగా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు ఈ కేసు విచారిస్తున్నారని, ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశారని చెప్పారు. 2014 జనవరి 17వ తేదీన దక్షిణ ఢిల్లీలోని ఒక ఫైవ్‌స్టార్ హోటల్ సూట్‌లో సునంద అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే.