
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించనుందని రిపబ్లిక్ టీవీ-సీ ఓటర్ సంస్థలు జరిపిన ఓ సర్వేలో స్పష్టమైంది. ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరిట జరిగిన ఈ సర్వే ఫలితాలు గురువారం రిపబ్లిక్ టీవీ వెల్లడించింది. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి పరాభవం తప్పదని ఈ సర్వే తేల్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగాను వైఎస్సార్‌సీపీకి 19 సీట్లు, టీడీపీకి కేవలం ఆరు సీట్లు వస్తాయని సర్వే తేల్చింది.
అటు జాతీయపార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్క స్థానంలో కూడా గెలవలేవని తెలిపింది. ఇక ఓట్ల శాతం పరంగా చూసినా వైఎస్సార్‌సీపీదే పైచేయిగా కనిపించింది. వైఎస్సార్‌సీపీకి 41.3 శాతం ఓట్లు, టీడీపీకి 33.1 శాతం ఓట్లు పడతాయని సర్వే వెల్లడించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా ఏపీలో టీడీపీకి 15 సీట్లు, బీజేపీకి రెండు సీట్లు రావడం తెలిసిందే. అప్పుడు వైఎస్సార్‌సీపీ ఏపీలో 8 చోట్ల గెలుపొందింది. కాగా, గతంలో సీ ఓటర్ సంస్థ వెల్లడించిన సర్వేలో సైతం వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధిస్తుందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment