ముంబైలో టీఆర్‌పీ స్కామ్‌ | Mumbai Police Busts Fake TRP Scam | Sakshi
Sakshi News home page

ముంబైలో టీఆర్‌పీ స్కామ్‌

Published Fri, Oct 9 2020 3:42 AM | Last Updated on Fri, Oct 9 2020 3:46 AM

Mumbai Police Busts Fake TRP Scam - Sakshi

మీడియాతో ముంబై పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌వీర్‌

ముంబై: ముంబైలో ఒక టెలివిజన్‌ రేటింగ్స్‌ పాయింట్స్‌(టీఆర్‌పీ) స్కామ్‌ వెలుగు చూసింది. టీవీ కార్యక్రమాల ప్రజాదరణను గణాంకాలతో వివరించే టీఆర్‌పీ ఆధారంగా ఆయా కార్యక్రమాలకు ప్రకటనలు వస్తాయి. ముంబైలో కొన్ని టీవీ చానళ్లు అక్రమ మార్గాల ద్వారా టీఆర్‌పీలను పెంచుకుంటున్న విషయాన్ని పోలీసులు గురువారం బట్టబయలు చేశారు. ఇందుకు సంబంధించి నలుగురిని అరెస్ట్‌ చేశామని పోలీసులు తెలిపారు.

రిపబ్లిక్‌ టీవీకి  కూడా ఈ కుంభకోణంలో భాగం ఉందని ముంబై పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌వీర్‌ సింగ్‌ వెల్లడించారు. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసులో మహరాష్ట్ర ప్రభుత్వంపై, ముంబై  పోలీసులపై ఆ న్యూస్‌ చానల్‌ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆ వార్తాచానల్‌ పాత్రకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్‌ చేశామని పరమ్‌వీర్‌ సింగ్‌ తెలిపారు. సుశాంత్‌ మృతి కేసులో ప్రశ్నించినందువల్ల ముంబై పోలీస్‌ కమిషనర్‌ తమపై తప్పుడు అభియోగాలు మోపారని ఆ చానల్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నాబ్‌ గోస్వామి ఆరోపించారు.

రెండు మరాఠీ చానళ్లు కూడా
రెండు మరాఠీ చానళ్లు అయిన ఫాస్ట్‌ మరాఠీ, బాక్స్‌ సినిమాల యజమానులను  ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ చానళ్లకు చెందిన బ్యాంక్‌ అకౌంట్లను పరిశీలిస్తున్నామన్నారు. ‘టీఆర్‌పీల ఆధారంగా∙చానళ్లకు ప్రకటనలు వస్తాయి. తద్వారా ఆదాయం వస్తుంది. ఇదంతా వేల కోట్ల వ్యవహారం. తప్పుడు విధానాలతో టీఆర్‌పీలను పెంచుకుని చూపించి ఆయా చానళ్లు ఆదాయం పెంచుకున్నాయి’ అని వివరించారు. ‘కొంతమంది ఎంపిక చేసిన వినియోగదారుల ఇళ్లల్లో  బారోమీటర్లను ఏర్పాటు చేసి, ఆయా కుటుంబాలు చూస్తున్న చానళ్లను గుర్తిస్తారు.

తద్వారా టీఆర్‌పీలను గణిస్తారు. అయితే, అక్రమంగా టీఆర్‌పీలను పెంచుకుని చూపాలనుకునే చానల్‌.. ఆయా వినియోగదారులకు డబ్బులు ఆశ చూపి, తమ చానల్‌నే ఎక్కువ సేపు చూడాలని, లేదా చూడకపోయినా తమ చానల్‌నే ఆన్‌ చేసి ఉంచాలని కోరుతాయి’ అని తెలిపారు. బారోమీటర్లు ఉన్న వినియోగదారుల్లో చాలామంది తాము డబ్బు తీసుకున్నట్లు విచారణలో అంగీకరించారన్నారు.

టీఆర్‌పీలను ప్రతీవారం విడుదల చేసే బ్రాడ్‌కాస్ట్‌ ఆడియెన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌(బార్క్‌) అధికారులను కూడా విచారిస్తామన్నారు. ‘టీఆర్‌పీలను లెక్కించేందుకు ముంబైలో 2 వేల బారోమీటర్లు ఉన్నాయి. వాటి నిర్వహణను హంస అనే ఏజెన్సీకి బార్క్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చింది. ఆ ఏజెన్సీ వారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఈ కుంభకోణాన్ని వెలికితీశాం’ అని వివరించారు. హంస ఏజెన్సీ మాజీ ఉద్యోగులు కొందరికి ఇందులో పాత్ర ఉందని పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు. మంబైలోనే కాకుండా ఈ తరహా మోసం దేశంలోని ఇతర నగరాల్లోనూ జరగుతుండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement