Mumbai Police Commissioner
-
ముంబైను పేల్చేస్తాం.. పోలీసులకు హెచ్చరిక
ముంబై: భారత వాణిజ్య రాజధాని ముంబైని పేల్చేస్తామంటూ అందిన హెచ్చరికలతో యంత్రాంగం అప్రమత్తమైంది. మరోసారి 26/11 తరహా దాడులకు పాల్పడతామన్న హెచ్చరిక మెసేజీలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ మెసేజీలు పాకిస్తాన్ కోడ్‌తో ఉన్న ఫోన్ నంబర్ నుంచే వచ్చినట్లు తేలిందని ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ శనివారం మీడియాకు తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీసులు శనివారం విరార్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వర్లిలోని ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూంలోని హెల్ప్‌లైన్ వాట్సాప్ నంబర్‌కు శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో పలు మెసేజీలు అందాయి. ‘ముంబైని పేల్చేస్తాం. 26/11 తరహా దాడులను మరోసారి గుర్తుకుతెచ్చేలా చేస్తాం. భారత్‌లోని మా సహచరులు ఆరుగురు రంగంలోకి దిగారు. ఇందుకోసం ఏర్పాట్లు సాగుతున్నాయి’అని అందులో ఉంది. 26/11 దాడుల్లో పట్టుబడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్, అల్ ఖైదా నేత అయ్మన్ అల్ జవహిరి పేర్లను కూడా ప్రస్తావించారు. చదవండి: భారత్‌తో శాంతినే కోరుకుంటున్నాం కానీ.. కశ్మీర్‌తో ముడిపెట్టిన పాకిస్తాన్ ప్రధాని ఈ మేసేజీలు పాక్ కోడ్‌తో ఉన్న ఫోన్ నంబర్ నుంచే వచ్చినట్లు గుర్తించారు. ముంబై పోలీసులను, తీర ప్రాంత రక్షణ దళాలను అలెర్ట్ చేసి, ఆపరేషన్ కవచ్‌ను ప్రారంభించామని కమిషనర్ వివేక్ పేర్కొన్నారు. ‘మెసేజ్‌లలో పేర్కొన్న నంబర్లు, వ్యక్తులపై కూడా దర్యాప్తు జరుగుతోంది. ఈ నంబర్లు భారతీయులవిని తేలింది. అయితే, మెసేజీలు ఉర్దూలో కాకుండా హిందీలో ఉన్నాయి. పాకిస్తానీ నంబర్ నుంచి ఈ మెసేజీలు వచ్చినట్లు కనిపించేలా నకిలీ ఐపీని సృష్టించే ప్రయత్నం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. లాహోర్‌కు చెందిన తోటమాలి ఫోన్ నంబర్ హ్యాకైందన్న అక్కడి మీడియా కథనాలను కూడా పరిశీలిస్తున్నాం’ అని కమిషనర్ చెప్పారు. ముంబై సమీపంలోని రాయగడ్ వద్ద ఏకే–47 తుపాకులు, మందుగుండు సామగ్రితో కూడిన పడవను బలగాలు స్వాధీనం చేసుకున్న మరునాడే ఈ హెచ్చరికలు రావడంతో యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. 2008 నవంబర్ 26వ తేదీన పాకిస్తాన్‌కు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో జరిపిన దాడుల్లో 166 మంది చనిపోగా 300 మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే. -
రాజ్ కుంద్రా ఒక్కరోజు ఆదాయం రూ. 9 లక్షలు!
Raj Kundra Arrest: అశ్లీల చిత్రాల కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. హాట్ హిట్ యాప్ ద్వారా రాజ్ కుంద్రా రోజుకు లక్షల్లో ఆర్జించేవాడని.. ఒక్కోసారి గరిష్టంగా రోజుకు 8-9 లక్షల రూపాయల వరకు సంపాదించేవాడని తెలిసింది. ఓ సారి ఏకంగా రాజ్ కుంద్రా అకౌంట్లోకి 9.65 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినట్లు వెల్లడయ్యింది. హాట్ హిట్ యాప్ వేదికగా రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్లే స్టోర్‌లో ఈ యాప్ గురించి సర్చ్ చేస్తే.. దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో ‘‘బెస్ట్ ఇండియన్ మూవీస్, వెబ్ సిరీస్ ఈ యాప్‌లో ఉంటాయి. ఈ యాప్‌లో వీడియోలు చూడాలంటే నెలకు 198 రూపాయలు, 45 రోజులకు 249 రూపాయలతో సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫుల్ హెచ్డీ వీడియోలను చూడొచ్చు’’ అని వెల్లడించారు. ఎబౌట్ అస్లో ‘‘హాట్ హిట్ అనేది ఒక ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్. ఇక్కడ మీరు వందల కొద్ది అడల్ట్ సినిమాలు, హిందీ వెబ్‌సిరీస్ ఎంజాయ్ చేయవచ్చు. హాట్‌హిట్ ఒరిజనల్స్ అడల్ట్ కంటెంట్‌ని ప్రసారం చేస్తుంది’’ అని డైరెక్ట్‌గా ప్రకటించుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అశ్లీల చిత్రాల కోసం నగ్న సన్నివేశాలను చిత్రీకరించాలని ఔత్సాహిక నటీమణులను బలవంతం చేసినందుకు గాను ముంబై పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వీరి విచారణ సందర్భంగా రాజ్‌కుంద్రా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇలా చిత్రీకరించిన అశ్లీల చిత్రాలను పెయిడ్ వెబ్సైట్లు, యాప్‌లలో ప్రసారం చేస్తారు. రాజ్ కుంద్రా మొబైల్ రికార్డుల పరిశీలనలో హాట్ హిట్ నుంచి క్రమం తప్పకుండా డబ్బులు వస్తున్నట్లు చూపించింది. ఫిబ్రవరిలో ఈ పోర్న్ రాకెట్ వెలుగు చూడటానికి కొన్ని రోజుల ముందే రాజ్ కుంద్రాకు ఫిబ్రవరి 3 న హాట్ హిట్ నుంచి రూ. 2.7 లక్షలు బదిలీ అయినట్లు తెలిసింది. అదేవిధంగా జనవరి 23 న రూ. 95,000, జనవరి 20 న రూ. 1 లక్ష, జనవరి 13 న రూ. 2 లక్షలు, జనవరి 10 న రూ. 3 లక్షలు రాజ్ కుంద్రా అకౌంట్‌కు మనీ ట్రాన్ఫ్‌ఫర్ జరిగినట్లు వెల్లడయ్యింది. అంతకుముందు, ముంబై జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైమ్) మిలింద్ భరంబే మాట్లాడుతూ, రాజ్ కుంద్రా, అతని బావ ప్రదీప్ బక్షికి చెందిన రెండు కంపెనీలకు కెన్రిన్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన 'హాట్‌షాట్స్ డిజిటల్ ఎంటర్టైన్మెంట్' అనే మొబైల్ యాప్ ఉందని తెలిపారు. ఈ హాట్‌షాట్ యాప్ వివాదానికి కేంద్రంగాఉంది. ఈ యాప్ ద్వారా అశ్లీల చిత్రాలను పంపిణీ చేయడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపణలున్నాయి. -
Raj Kundra: ఈజీ మనీ కోసం కక్కుర్తి!
Raj Kundra Arrest: పెగాసస్ వివాదం కుదిపేస్తున్న టైంలో.. ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ ఫైనాన్సర్ రాజ్ కుంద్ర(46) పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వెబ్ సిరీస్ అవకాశాల పేరుతో యువతులకు గాలం వేసి.. వాళ్లతో అడల్ట్ చిత్రాలు తీస్తున్నాడన్న ఆరోపణలపై రాజ్ కుంద్రాను సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ముంబై పోలీసులు ఇప్పటిదాకా ఆసక్తికరమైన సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ముంబై: లండన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ కావడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెబ్ సిరీస్‌ల పేరుతో పోర్న్, సెమీ పోర్న్ కంటెంట్‌ను తీయడంతో పాటు వాటిని కొన్ని యాప్‌ల ద్వారా జనాల్లోకి తీసుకెళ్తున్నాడంటూ ఆయనపై అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ మేరకు సోమవారం సాయంత్రం విచారణ పేరిట బైకుల్లాలోని తమ ఆఫీస్‌కు రప్పించుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. అటు నుంచి అటే కుంద్రాను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు ఈ మొత్తం పోర్న్ మాఫియాకు రాజ్ కుంద్రానే సూత్రధారి అని ముంబై పోలీస్ కమిషనర్ హేమంత నగ్రాలే నిర్ధారించారు. ఆ లింక్‌తో.. ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఉత్తర ముంబై మలాద్‌లో మదా ఐల్యాండ్‌లోని ఓ భవనంలో బూతు సినిమాలు తీస్తున్న ఓ ముఠాను ముంబై ప్రాపర్టీ సెల్(స్పెషల్ పోలీస్) అరెస్ట్ చేసింది. మొత్తం 9 మందిలో నటి కమ్ మోడల్స్ గెహానా వశిష్ఠ్, రోవా ఖాన్ కూడా ఉన్నారు. అయితే ఈ వ్యవహారం మొత్తంలో యూకే ప్రొడక్షన్ కంపెనీ కెన్రిన్ ఉండడం, దానికి ఉమేశ్ కామత్ హెడ్ కావడం, ఉమేశ్ ఇదివరకు కుంద్రా దగ్గర పని చేయడంతో ప్రాపర్టీ సెల్ విభాగం ఇన్స్పెక్టర్ కేదార్ పవార్, కుంద్రాపై దృష్టిసారించాడు. ఈ క్రమంలో గతంలో ఓసారి కుంద్రాని పోలీసులు ప్రశ్నించారు కూడా. ఈ మేరకు పక్కా ఆధారాలు సేకరించాకే రాజ్ కుంద్రాని సోమవారం అరెస్ట్ చేసినట్లు ముంబై కమిషనర్ తెలిపారు. మంగళవారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం కుంద్రాను జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. Actress Shilpa Shetty's husband & businessman Raj Kundra has been taken for medical examination at JJ hospital by Property Cell of Mumbai Police's Crime Branch.He was later taken to Mumbai Police Commissioner's office.#shilpashettykundra #RajKundraArrest pic.twitter.com/KeM346ZUzd — MBC TV ODISHA (@MBCTVODISHA) July 20, 2021 ఈజీ మనీ కోసం.. లైవ్ స్రీ్టమింగ్ యాప్‌లు, ఐపీఎల్‌లు పెద్దగాకలిసి రాకపోవడంతో తప్పుడు దారిలో సంపాదన కోసమే ఆయన ఈ పని చేసినట్లు ముంబై పోలీసులు నిర్ధారించుకున్నారు. సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి రాజ్ కుంద్రా యువతులను తన మీడియేటర్ల ద్వారా ట్రాప్‌లోకి దించాడని తెలుస్తోంది. ఈ మేరకు తమతో అగ్రిమెంట్లు చేయించుకున్నాక బలవంతంగా పోర్న్ సినిమాలు తీయించినట్లు బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు. హాట్‌షాట్స్, హాట్హిట్మూవీస్ లాంటి బీ, సీ గ్రేడ్ యాప్స్ కొన్నింటిలో ఆ వీడియోలను అప్లోడ్ చేయడం, సోషల్ మీడియా అకౌంట్లలో సైతం వాటిని పోస్ట్ చేయాలని సదరు నటీమణులను ఒత్తిడి చేయడం, ట్విటర్ పేజీలతో ప్రమోట్ చేయడం ద్వారా భారీగా డబ్బు సంపాదించినట్లు పోలీసులు నిర్ధారించారు. శాలువా బిజినెస్ నుంచి.. పంజాబీ కుటుంబానికి చెందిన రాజ్ కుంద్రా స్వస్థలం లూథియానా. చిన్నతనంలోనే అతని ఫ్యామిలీ లండన్‌కు వలస వెళ్లింది. కుంద్రా తండ్రి అక్కడ బస్సు కండక్టర్‌గా, తల్లి ఓ చిన్నషాపులో పని చేసేది. 18 వయసులో దుబాయ్ అక్కడి నుంచి నేపాల్ వెళ్లిన కుంద్రా.. శాలువాల బిజినెస్ చేశాడు. అయితే కొన్నేళ్ల తర్వాత తెలివిగా వాటిని బ్రిటన్‌కు చెందిన ఫ్యాషన్ హౌజ్ కంపెనీలకు విక్రయించి కోట్లు సంపాదించాడు. 2004లో బ్రిటిష్-ఏషియన్ రిచ్చెస్ట్ పర్సన్ లిస్ట్‌లో 198వ ర్యాంక్ దక్కించుకున్నాడు కూడా. 2007కి తిరిగి దుబాయ్‌కు వెళ్లి.. కన్ స్ట్రక్షన్ ట్రేడింగ్‌లో అడుగుపెట్టాడు. ఆ టైంలోనే బాలీవుడ్ సినిమాలకు ఫైనాన్సింగ్ మొదలుపెట్టాడు. సంజయ్ దత్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ల పరిచయాలతో పలు స్పోర్ట్స్ బిజినెస్, లైవ్-బ్రాడ్కాస్ట్, గేమింగ్ సంబంధిత వ్యవహారాలతో లెక్కలేనంత సంపాదించాడు. 2009లో నటి శిల్పాశెట్టిని వివాహం చేసుకున్నాడు(కుంద్రాకు రెండో వివాహం). ఆపై ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ, అటుపై బెట్టింగ్-వివాదాల వ్యహారంతో కుదేలు అయ్యాడు. 2019లో రాజ్ కుంద్రాకు స్వచ్ఛ భారత్ మిషన్ కింద అవార్డు కూడా దక్కింది. ఇక తనకు సంబంధించిన న్యూడ్ ఫొటోలు, వీడియోలను తన అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారంటూ నటి, మోడల్ పూనమ్ పాండే సైతం రాజ్ కుంద్రాపై ఓ దావా వేయగా, ఆ కేసు బాంబే హైకోర్టులో నడుస్తోంది కూడా. -
పొర్నోగ్రఫీ కేసులో శిల్పా శెట్టి భర్త అరెస్ట్
Raj Kundra: ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు పొర్నోగ్రఫీకి సంబంధించిన కేసులో అరెస్ట్ చేశారు. అశ్లీల చిత్రాల నిర్మాణానికి సంబంధించి ఫిబ్రవరిలో నమోదైన ఒక కేసులో ప్రధాన కుట్రదారుగా రాజ్ కుంద్రాను సోమవారం అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలె తెలిపారు. కుంద్రాకు వ్యతిరేకంగా స్పష్టమైన సాక్ష్యాధారాలున్నాయని, దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. నటీ నటులను బలవంతపెట్టి నగ్న చిత్రాలను చిత్రీకరించి, వాటిని పెయిడ్ మొబైల్ యాప్స్‌కు అమ్మే ముఠాకు సంబంధించి 9 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. -
'అద్దాల మేడల్లో నివసించేవాళ్లు ఎదుటివాళ్లపై రాళ్లు విసరకూడదు'
న్యూఢిల్లీ: ‘‘అద్దాల మేడల్లో నివసించేవాళ్లు ఎదుటివాళ్లపై రాళ్లు విసరకూడదు’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ముంబై పోలీస్ మాజీ కమిషనర్ పరబ్ బీర్ సింగ్ కేసుపై విచారణ జరిపిన కోర్టు, 30 సంవత్సరాలు సర్వీసులో ఉన్న వ్యక్తి ప్రస్తుతం రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదనడం విస్మయాన్ని కలిగిస్తోందని పేర్కొంది. తనపై మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన ఎంక్వైరీలన్నింటినీ మహారాష్ట్ర వెలుపల స్వతంత్ర ఏజెన్సీతో దర్యాప్తు చేయించాలని పరమ్‌బీర్ సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై కోర్టు విచారణ జరిపింది. తాను పనిచేసిన శాఖపై అపనమ్మకం కూడదని సింగ్‌కు హితవు పలికింది. ఈ సందర్భంగా పైన పేర్కొన్న వ్యాఖ్యలు చేయగా, తన క్లయింట్‌పై తప్పుడు కేసులు పెట్టి ఎంక్వైరీలు నిర్వహిస్తున్నారని సింగ్ న్యాయవాది వాదించారు. చివరకు ఈ పిటీషన్‌ను డిస్మిస్ చేయాలని కోర్టు భావించగా, పిటీషన్ ఉపసంహరణకు అనుమతినివ్వాలని న్యాయవాది కోరగా, కోర్టు అనుమతించింది. ఎన్సీపీ నేత అనీల్ దేశ్‌ముఖ్‌పై ఆరోపణలతో సింగ్ వార్తల్లో నిలిచారు. అనంతరం ఆయన్ను మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై కమిషనర్ పదవి నుంచి తొలగించింది. అనంతరం ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వాదనల సందర్భంగా తన క్లయింట్‌కు రాష్ట్ర పోలీసులపై అనుమానం లేదని, కానీ ఒకదాని వెంట మరో కేసు వచ్చిపడుతోందని సింగ్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దేశ్‌ముఖ్‌పై ఆరోపణల వల్లే తన క్లయిట్‌ను వేధిస్తున్నారన్నారు. కోర్టుకు చెప్పకుండా సింగ్‌పై కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుండా చూడాలని కోరారు. కానీ ఇది తమ పని కాదని కోర్టు వ్యాఖ్యానించింది. అనీల్‌పై ఆరోపణలు వెనక్కు తీసుకోవాలని సింగ్‌ను వేధిస్తున్నారని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కానీ ఇవి రెండూ వేర్వేరు అంశాలని కోర్టు తెలిపింది. ఇదే అంశంపై సింగ్ బొంబై హైకోర్టులో మూడు పిటీషన్లు వేశారని, తిరిగి ఇక్కడ ఈ పిటీషన్ అవసరమేంటని కోర్టు ప్రశ్నించింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. -
‘ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు.. చట్టానికి అతీతులా?’
ముంబై: మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ ముంబై పోలీసు కమిషనర్ పరంవీర్ సింగ్‌పై బాంబే హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా.. సీబీఐ విచారణ కోరుతున్నారు మీరు చట్టానికి అతీతులా’’ అని ప్రశ్నించింది. అనిల్ దేశ్‌ముఖపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ పరంవీర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ని బాంబే హైకోర్టు బుధవారం విచారించింది. ఈ సందర్భంగా కోర్టు ‘‘ మీరు ఓ పోలీసు కమిషనర్. మీ కోసం చట్టాన్ని పక్కకు పెట్టాలా. మంత్రులు, రాజకీయ నాయకులు, పోలీసులు చట్టానికి అతీతులా.. మాకు ఏ చట్టాలు వర్తించవని మీ అభిప్రాయమా’’ అంటూ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. అంతేకాక ‘‘పోలీసు డిపార్ట్మెంట్లో అత్యున్నత స్థానంలో ఉండి.. 30 ఏళ్లకు పైగా ఈ నగరానికి సేవలందించిన మీలాంటి ఓ వ్యక్తి వద్ద నుంచి ఇలాంటి కఠిన నిజాలు వెలువడటం శోచనీయం. అనిల్ దేశ్‌ముఖ్ అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసును సీబీఐకి అప్పగించాలని మీరు కోరుతున్నారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఎలాంటి విచారణ జరపలేం అనే విషయం మీకు తెలియదా.. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు. నేరం జరుగుతుందని తెలిసినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అది మీ బాధ్యత కాదా’’ అని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది ముకేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు కలిగిన వాహనం కలకలం కేసుకు సంబంధించి పోలీసు సహచరుల తప్పిదాలకు కమిషనర్ పరంవీర్ సింగ్‌ను బాధ్యుడిగా చేస్తూ మహారాష్ట్ర హోంమంత్రి బదిలీ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరంవీర్ సింగ్ అనిల్ దేశ్‌ముఖ్ బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు 100 కోట్ల రూపాలయు వసూలు చేయాలని వజేకు టార్గెట్ విధించాడని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు రాసిన లేఖలో ఆరోపించాడు. ఇందుకు సంబంధించి సీబీఐ విచారణ చేపట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు. చదవండి: వాజే టార్గెట్ వంద కోట్లు -
అంబానీ ఇంటి వద్ద కలకలం: ‘అందుకే తనని బదిలీ చేశాం’
ముంబై: గత కొద్దిరోజులుగా నగరంలో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా పోలీసులు తీవ్రమైన తప్పిదాలు చేశారని ప్రాథమిక నిర్ధరణకు వచ్చి.. వారిని బాధ్యులను బదిలీ చేశామని హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. అంతేకాకుండా ఎన్ఐఏ కేసులో సచిన్ వజేపై దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలనే ఉద్ధేశంతో పలువురిపై బదిలీ వేటు వేశామని స్పష్టం చేశారు. దక్షిణముంబైలోని ముకేష్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలు లభించడం, వ్యాపారవేత్త హిరానీ మరణించడం, పోలీస్ అధికారి సచిన్ వజే అరెస్టు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ముంబై వార్తల్లో నిలిచింది. అయితే పోలీసు సహచరుల తప్పిదాలకు కమిషనర్ పరం వీర్‌సింగ్‌ను బాధ్యుడిగా చేస్తూ బుధవారం హోంమంత్రి బదిలీ ఉత్తర్వులు జారీచేశారు. కొత్తగా ముంబై కమిషనర్‌గా హేమంత్ నాగ్రలే నియమితులయ్యారు. దీంతో హోం మంత్రి బదిలీపై ఓ ఛానెల్‌తో మాట్లాడారు. ఆయా కేసులపై ఏటీఎస్, ఎన్ఐఏ దర్యాప్తు నిష్పక్షపాతం గా జరుపుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే ఏటీఎస్, ఎన్ఐఏ విచారణలో కొన్ని విషయాలు బయటపడటమూ బదిలీలకు కారణమని హోం మంత్రి స్పష్టంచేశారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. చదవండి: ముంబై పోలీసు కమిషనర్‌పై బదిలీ వేటు -
ముంబై పోలీసు కమిషనర్‌పై బదిలీ వేటు
ముంబై: ముంబైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడుపదార్థాలున్న కారు నిలిపిన కేసుకు సంబంధించి సర్వత్రా విమర్శల పాలైన మహారాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ముంబై నగర పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్‌ను హోంగార్డ్స్ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేసింది. అదనపు డీజీపీ అయిన హేమంత్ నగ్రాలెను ముంబై నగర పోలీసు కమిషనర్‌గా నియమిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది. అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న∙కారు పార్కు చేసి ఉండడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పోలీసు అధికారి సచిన్ వాజేని అరెస్ట్ చేసింది. అయితే దీని వెనుక ఇంకా చాలా మంది ఉన్నారని తమ దర్యాప్తులో తేలిందని త్వరలోనే ఈ కుట్ర కోణాన్ని బయట పెడతామని చెప్పింది. ఈ నేపథ్యంలోనే సీఎం ఠాక్రేను హోంశాఖ మంత్రి అనిల్ కలిశారు. -
ముంబైలో టీఆర్పీ స్కామ్
ముంబై: ముంబైలో ఒక టెలివిజన్ రేటింగ్స్ పాయింట్స్(టీఆర్పీ) స్కామ్ వెలుగు చూసింది. టీవీ కార్యక్రమాల ప్రజాదరణను గణాంకాలతో వివరించే టీఆర్పీ ఆధారంగా ఆయా కార్యక్రమాలకు ప్రకటనలు వస్తాయి. ముంబైలో కొన్ని టీవీ చానళ్లు అక్రమ మార్గాల ద్వారా టీఆర్పీలను పెంచుకుంటున్న విషయాన్ని పోలీసులు గురువారం బట్టబయలు చేశారు. ఇందుకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. రిపబ్లిక్ టీవీకి కూడా ఈ కుంభకోణంలో భాగం ఉందని ముంబై పోలీస్ కమిషనర్ పరమ్‌వీర్ సింగ్ వెల్లడించారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో మహరాష్ట్ర ప్రభుత్వంపై, ముంబై పోలీసులపై ఆ న్యూస్ చానల్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆ వార్తాచానల్ పాత్రకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశామని పరమ్‌వీర్ సింగ్ తెలిపారు. సుశాంత్ మృతి కేసులో ప్రశ్నించినందువల్ల ముంబై పోలీస్ కమిషనర్ తమపై తప్పుడు అభియోగాలు మోపారని ఆ చానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి ఆరోపించారు. రెండు మరాఠీ చానళ్లు కూడా రెండు మరాఠీ చానళ్లు అయిన ఫాస్ట్ మరాఠీ, బాక్స్ సినిమాల యజమానులను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చానళ్లకు చెందిన బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్నామన్నారు. ‘టీఆర్పీల ఆధారంగా∙చానళ్లకు ప్రకటనలు వస్తాయి. తద్వారా ఆదాయం వస్తుంది. ఇదంతా వేల కోట్ల వ్యవహారం. తప్పుడు విధానాలతో టీఆర్పీలను పెంచుకుని చూపించి ఆయా చానళ్లు ఆదాయం పెంచుకున్నాయి’ అని వివరించారు. ‘కొంతమంది ఎంపిక చేసిన వినియోగదారుల ఇళ్లల్లో బారోమీటర్లను ఏర్పాటు చేసి, ఆయా కుటుంబాలు చూస్తున్న చానళ్లను గుర్తిస్తారు. తద్వారా టీఆర్పీలను గణిస్తారు. అయితే, అక్రమంగా టీఆర్పీలను పెంచుకుని చూపాలనుకునే చానల్.. ఆయా వినియోగదారులకు డబ్బులు ఆశ చూపి, తమ చానల్నే ఎక్కువ సేపు చూడాలని, లేదా చూడకపోయినా తమ చానల్నే ఆన్ చేసి ఉంచాలని కోరుతాయి’ అని తెలిపారు. బారోమీటర్లు ఉన్న వినియోగదారుల్లో చాలామంది తాము డబ్బు తీసుకున్నట్లు విచారణలో అంగీకరించారన్నారు. టీఆర్పీలను ప్రతీవారం విడుదల చేసే బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బార్క్) అధికారులను కూడా విచారిస్తామన్నారు. ‘టీఆర్పీలను లెక్కించేందుకు ముంబైలో 2 వేల బారోమీటర్లు ఉన్నాయి. వాటి నిర్వహణను హంస అనే ఏజెన్సీకి బార్క్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ ఏజెన్సీ వారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఈ కుంభకోణాన్ని వెలికితీశాం’ అని వివరించారు. హంస ఏజెన్సీ మాజీ ఉద్యోగులు కొందరికి ఇందులో పాత్ర ఉందని పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు. మంబైలోనే కాకుండా ఈ తరహా మోసం దేశంలోని ఇతర నగరాల్లోనూ జరగుతుండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. -
నొప్పిలేని మరణం ఎలా?
ముంబై/పట్నా: బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణించే సమయంలో తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడినట్లు ముంబై పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ తెలిపారు. ఆత్మహత్యకు ముందు ‘నొప్పి లేకుండా ఎలా చనిపోవాలి? మెంటల్ డిజార్డర్ అంటే ఏమిటి?’ అనే అంశాలపై గూగుల్‌లో పదే పదే సెర్చ్ చేశాడని చెప్పారు. మాజీ మేనేజర్ దిశా షాలియన్ మరణంతో తనకు సంబంధం ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలతో సుశాంత్ కలత చెందాడని వివరించారు. అతడు మరణించిన వెంటనే కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 56 మంది సాక్షుల స్టేట్మెంట్ను రికార్డు చేసినట్లు వెల్లడించారు. విచారణలో భాగంగా ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడి ప్రస్తావన రాలేదన్నారు. సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి ఆయన స్నేహితురాలు రియా చక్రవర్తి ఖాతాలోకి నేరుగా నగదు బదిలీ అయినట్లు ఇంకా తేలలేదన్నారు. సుశాంత్ ఆత్మహత్యపై విచారణ నిమిత్తం బిహార్ ఐపీఎస్ అధికారి ఆదివారం ముంబై చేరుకున్నారు. అయితే ముంబై పోలీసులు ఆయనను బలవంతంగా క్వారంటైన్‌కు పంపించారు. ఈ ఘటనను బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఖండించారు. -
'బాధగా ఉంది.. కానీ రాజీనామా చేయడం లేదు'
ముంబయి: తన బదిలీ చాలా బాధగా అనిపించిందని అయితే రాజీనామా చేసే ఆలోచనేది లేదని షీనా బోరా హత్య కేసును విచారించిన మాజీ ముంబయి పోలీస్ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి రాకేశ్ మారియా అన్నారు. తన బదిలీ విషయంలో తాను రాజీనామా చేస్తున్నానని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేశారు. షీనా హత్య కేసును విచారిస్తున్న ఆయనను మహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నపళంగా బదిలీ చేసి, డీజీపీ(హోంగార్డ్స్)గా పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలోకి డీజీపీ ర్యాంక్ అధికారి అహ్మద్ జావెద్ ముంబై నూతన పోలీసు కమిషనర్‌గా నియమించారు. అయితే, ఈ నియామకం వెనుక రాజకీయ ప్రమేయం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. పరోక్షంగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు కూడా ఆయన నచ్చలేదని అందుకే ఆయనను వేరే శాఖకు బదిలీచేశారని కూడా విమర్శలు వినిపించాయి. ఆ నిర్ణయం హత్యకేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకేననే విమర్శలు వెల్లువెత్తడంతో దిద్దుబాటుకు దిగి బదిలీతో సంబంధం లేకుండా ఈ కేసు దర్యాప్తును మారియానే పర్యవేక్షిస్తారని ప్రకటించింది. కానీ, బదిలీపై తీవ్ర ఆందోళనతో ఉన్న మారియా రాజీనామా చేసే ఆలోచన చేస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన బుధవారం ఈ వివరణ ఇచ్చారు. -
లలిత్ మోదీని కలిసిన ముంబై పోలీసు కమిషనర్
ముంబై: మనీ లాండరింగ్ సహా ఇతర ఆర్థిక ఆరోపణలు ఎదుర్కొంటూ లండన్‌కు పరారైన ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ వివాదం మరో కొత్త మలుపు తిరిగింది. మోదీని ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మరియా గతేడాది లండన్‌లో కలిశారని వెలుగు చూసింది. లండన్‌లోని మాఫియా వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని, ఆ విషయంలో సాయం చేయాలంటూ ముంబై పోలీసులను కోరిన నేపథ్యంలో మోదీని రాకేశ్ కలిశారు. మోదీ న్యాయవాది పట్టుబట్టడంతో తాను లలిత్ మోదీని కలిసింది వాస్తవమేనని రాకేశ్ అంగీకరించారు. అయితే, తాను లండన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే హోం మంత్రికి ఆ విషయం తెలియజేశానని తెలిపారు. లలిత్ మోదీ, రాకేశ్ మరియా కలిసి ఉన్న ఫొటోను శనివారం తొలుత ఓ టీవీ చానెల్ ప్రసారం చేయడంతో దుమారం రేగింది. దీంతో రాకేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు. గతేడాది జూలైలో అధికారికంగా ఓ సదస్సులో పాల్గొనేందుకు తాను లండన్ వెళ్లానని, ఆ సందర్భంగా మోదీ తరఫున ఓ న్యాయవాది పట్టుబట్టడంతో ఆయనను కలిశానని వివరించారు. అయితే, లండన్‌లో ముంబై పోలీసులు చేసేదేమీ ఉండదని, ముంబైకి వచ్చే ఫిర్యాదు చేయాలని మోదీకి సూచించానని చెప్పారు. -
బాయ్‌ఫ్రెండ్సే రేపిస్టులు
మంబై: ముంబై మహానగరంలో బాయ్‌ఫ్రెండ్స్ చేతిలో అత్యాచారానికి గురవుతున్న యువతుల సంఖ్య నానాటికి అధికమవుతుందని నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ నెల వరకు నగరంలో చోటు చేసుకున్న అత్యాచార ఘటనపై ఆయన తాజా గణాంకాలను ముంబైలో విడుదల చేశారు. ఈ సందర్భంగా రాకేశ్ మాట్లాడుతూ... నగరంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 542 అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. వాటిలో 389 కేసులు బాయ్‌ఫ్రెండ్ చేతిలో యువతులు అత్యాచారానికి గురైయ్యారని చెప్పారు. బాయ్ఫ్రెండ్లు చెప్పే మాయ మాటలను యువతలు వెంటనే నమ్మడం వల్ల ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని రాకేశ్ మారియా విశ్లేషించారు. మరో ఆరు శాతం మంది యువతులు ఆగంతకుల చేతిలో అత్యాచారానికి గురైయ్యారని తెలిపారు. మిగిలిన యువతులు మాత్రం బంధువులు లేక పరిచయస్థుల చేతిలో అత్యాచారానికి గురైనవారని ఆయన చెప్పారు. అయితే మొత్తం 542 అత్యాచార కేసుల్లో ఇప్పటివరకు 477 కేసులను ఛేదించినట్లు తెలిపారు. గత ఏడాదిలో ఇదే సమయంలో 333 అత్యాచార కేసులు నమోదయ్యాయని రాకేశ్ మారియా వివరించారు. -
లోక్‌సభ ఎన్నికల బరిలో పోలీసు కమిషనర్ !
ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ తన పదవికి రాజీనామా చేయనున్నారా ? అంటే అవుననే అంటున్నాయి మహారాష్ట్ర పోలీసు వర్గాలు. రానున్న లోక్ సభ ఎన్నికలలో ముంబై లేదా ఉత్తరప్రదేశ్ నుంచి బరిలో దిగేందుకు ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నారని ఆ రాష్ట్ర పోలీసు శాఖలో అంతర్గతంగా ప్రచారం జరుగుతుంది. సత్యాపాల్ సింగ్ తన రాజీనామా లేఖను ఇప్పటికే ఆ హోంశాఖకు పంపారని, ఆ శాఖ ఉన్నతాధికారులు ఆ లేఖను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు. అక్కడ సత్యపాల్ రాజీనామాను సీఎం కార్యాలయం పచ్చ జెండా ఊపిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా సత్యపాల్ తన రాజకీయ రంగ ప్రవేశంపై మాత్రం ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. అయితే సత్యపాల్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్గీలు తమ పార్టీలలో చేరాలని ఇప్పటికే ఆహ్వానించాయి. సత్యపాల్ సింగ్ 1980 బ్యాచ్ ఐపీఎస్ చెందిన అధికారి.