ఛత్రపతి రైల్వేస్టేషన్‌లో పోలీసుల తనిఖీలు
ముంబై: భారత వాణిజ్య రాజధాని ముంబైని పేల్చేస్తామంటూ అందిన హెచ్చరికలతో యంత్రాంగం అప్రమత్తమైంది. మరోసారి 26/11 తరహా దాడులకు పాల్పడతామన్న హెచ్చరిక మెసేజీలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ మెసేజీలు పాకిస్తాన్ కోడ్‌తో ఉన్న ఫోన్ నంబర్ నుంచే వచ్చినట్లు తేలిందని ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ శనివారం మీడియాకు తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీసులు శనివారం విరార్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
వర్లిలోని ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూంలోని హెల్ప్‌లైన్ వాట్సాప్ నంబర్‌కు శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో పలు మెసేజీలు అందాయి. ‘ముంబైని పేల్చేస్తాం. 26/11 తరహా దాడులను మరోసారి గుర్తుకుతెచ్చేలా చేస్తాం. భారత్‌లోని మా సహచరులు ఆరుగురు రంగంలోకి దిగారు. ఇందుకోసం ఏర్పాట్లు సాగుతున్నాయి’అని అందులో ఉంది. 26/11 దాడుల్లో పట్టుబడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్, అల్ ఖైదా నేత అయ్‌మన్ అల్ జవహిరి పేర్లను కూడా ప్రస్తావించారు.
చదవండి: భారత్‌తో శాంతినే కోరుకుంటున్నాం కానీ.. కశ్మీర్‌తో ముడిపెట్టిన పాకిస్తాన్ ప్రధాని
ఈ మేసేజీలు పాక్ కోడ్‌తో ఉన్న ఫోన్ నంబర్ నుంచే వచ్చినట్లు గుర్తించారు. ముంబై పోలీసులను, తీర ప్రాంత రక్షణ దళాలను అలెర్ట్ చేసి, ఆపరేషన్ కవచ్‌ను ప్రారంభించామని కమిషనర్ వివేక్ పేర్కొన్నారు. ‘మెసేజ్‌లలో పేర్కొన్న నంబర్లు, వ్యక్తులపై కూడా దర్యాప్తు జరుగుతోంది. ఈ నంబర్లు భారతీయులవిని తేలింది. అయితే, మెసేజీలు ఉర్దూలో కాకుండా హిందీలో ఉన్నాయి. పాకిస్తానీ నంబర్ నుంచి ఈ మెసేజీలు వచ్చినట్లు కనిపించేలా నకిలీ ఐపీని సృష్టించే ప్రయత్నం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం.
లాహోర్‌కు చెందిన తోటమాలి ఫోన్ నంబర్ హ్యాకైందన్న అక్కడి మీడియా కథనాలను కూడా పరిశీలిస్తున్నాం’ అని కమిషనర్ చెప్పారు. ముంబై సమీపంలోని రాయగడ్ వద్ద ఏకే–47 తుపాకులు, మందుగుండు సామగ్రితో కూడిన పడవను బలగాలు స్వాధీనం చేసుకున్న మరునాడే ఈ హెచ్చరికలు రావడంతో యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. 2008 నవంబర్ 26వ తేదీన పాకిస్తాన్‌కు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో జరిపిన దాడుల్లో 166 మంది చనిపోగా 300 మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment