సదస్సులో మోదీ, పుతిన్, జిన్‌పింగ్, పాక్ ప్రధాని షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి
న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలను కఠినంగా అణచివేసే విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హితవు పలికారు. పాకిస్తాన్‌కు పరోక్షంగా చురకలు అంటించారు. కొన్ని దేశాలు ప్రభుత్వ విధానాల్లో భాగంగానే సీమాంతర ఉగ్రవాదానికి నిస్సిగ్గుగా మద్దతిస్తున్నాయని, అలాంటి దేశాలను విమర్శించడానికి ఎవరూ సంకోచించవద్దని సూచించారు.
మంగళవారం షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) వర్చువల్ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చే శక్తులను అణచివేయడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి ఉగ్రవాదం ఒక పెనుముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ముప్పు తొలగిపోవాలంటే ఎస్సీఓ సభ్యదేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని, పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నప్పటికీ అంతం చేయాల్సిందేనని మోదీ స్పష్టం చేశారు.
ఎస్సీఓలో సంస్కరణలకు మద్దతు
ప్రపంచ దేశాలన్నీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంటున్నాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఆహారం, ఇంధనం, ఎరువుల కొరత పెద్ద సవాలుగా మారిందన్నారు. పొరుగు దేశాలతో వివాదాలు, అంతర్గతంగా ఉద్రిక్తతలు, మహమ్మారులతో ఎన్నో దేశాలు అల్లాడిపోతున్నాయని చెప్పారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఉమ్మడి ప్రయత్నాలు అవసరమని తెలిపారు. ఆసియా, ఐరోపా ఖండాల్లో శాంతికి, సౌభాగ్యానికి, అభివృద్ధికి ఎస్సీఓ అనేది ఒక కీలకమైన వేదికగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీఓ సభ్య దేశాలతో సహకారం మరింత పెంపొందించుకుంటామని అన్నారు.
స్టార్టప్‌లు, నవీన ఆవిష్కరణలు, సంప్రదాయ వైద్యం, యువజనం సాధికారత, డిజిటలీకరణ వంటి రంగాల్లో ఇతర దేశాలతో సంబంధాలు పెంచుకుంటామని వెల్లడించారు. ఎస్సీఓలో సంస్కరణలు, ఆధునీకరణ ప్రతిపాదనకు తమ మద్దతు ఉంటుందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. షాంఘై సహకార సంస్థలో ఇరాన్ సైతం సభ్యదేశంగా చేరుతుండడం ఆనందంగా ఉందన్నారు. ఎస్సీఓ వర్చువల్ సదస్సులో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధినేత పుతిన్‌తోపాటు కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాల నాయకులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఎస్సీఓ 2001లో షాంఘైలో ఏర్పాటయ్యింది. భారత్ 2005లో ఈ సంస్థలో పరిశీలక దేశంగా చేరింది. 2017లో పూర్తిస్థాయి సభ్యదేశంగా మారింది.
ఆసియాలో కొత్త ప్రచ్ఛన్న యుద్ధం వద్దు: జిన్‌పింగ్
బీజింగ్: ఆసియా ప్రాంతంలో కొత్తగా ప్రచ్ఛన్న యుద్ధాన్ని సృష్టించేందుకు బయటి శక్తులు కుట్ర పన్నుతున్నాయని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పరోక్షంగా అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎస్సీఓ వర్చువల్ సదస్సులో మాట్లాడారు. ప్రాంతీయంగా శాంతిని కాపాడుకోవడానికి ఎస్సీఓ సభ్యదేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. ఉగ్రవాదంపై కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ... ఇటీవల జరిగిన సాయుధ తిరుగుబాటును రష్యా సమాజం మొత్తం ఒక్కటై వ్యతిరేకించిందని చెప్పారు. మాతృదేశాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా కంకణబద్ధులై ఉన్నారని తెలిపారు. వాగ్నర్ గ్రూప్ యత్నాలను ఆయన ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment