mumbai blasts
-
ఆస్పత్రిలో దావూద్!
మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో అతన్ని రెండు రోజుల క్రితం పాకిస్తాన్‌లోని కరాచీలో హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఒక ఫ్లోర్ మొత్తాన్నీ ఖాళీ చేయించి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ చికిత్స అందిస్తున్నట్టు చెబుతున్నారు. ఆస్పత్రి వర్గాలు, కుటుంబీకులకు తప్ప మరెవరికీ ప్రవేశం లేకుండా పోలీసులు భారీ సంఖ్యలో పహారా కాస్తున్నారట. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియా సంస్థలు ఈ మేరకు వార్తా కథనాలు ప్రసారం చేశాయి. అంతేగాక 67 ఏళ్ల దావూద్‌కు విషప్రయోగం జరిగిందని, అందుకే ఉన్నపళాన ఆస్పత్రికి తరలించారని సోమవారమంతా జోరుగా పుకార్లు షికారు చేశాయి. చికిత్స పొందుతూ ఆదివారమే అతను మరణించినట్టు కూడా వార్తలొచ్చాయి! అయితే దావూద్‌పై విషప్రయోగం, అతని మృతి వార్తలు పూర్తిగా అవాస్తవమని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలవడం మాత్రం నిజమేనని నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. దావూద్ చాలా ఏళ్లుగా కుటుంబంతో పాటుగా పాకిస్తాన్‌లోనే నివసిస్తున్నట్టు ఇప్పటికే తేలింది. అతను కరాచీలోనే ఉంటున్నట్టు పక్కా ఆధారాలున్నాయని భారత్ వెల్లడించింది కూడా. భారత్‌తో పాటు ఐరాస భద్రతా మండలి కూడా 2003లోనే దావూద్‌ను మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం తెలిసిందే. అతని తలపై ఏకంగా 2.5 కోట్ల డాలర్ల రివార్డు ఉంది! రోజంతా కలకలం దావూద్‌పై విషప్రయోగం, మృతి వార్తలు సోమవారం ఉదయం నుంచే కలకలం రేపాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఓ యూట్యూబర్ వీటిని తొలుత బయట పెట్టాడు. పలు సోషల్ మీడియా వార్తలను ఉటంకిస్తూ ఈ మేరకు కథనం ప్రసారం చేసి దుమారం రేపాడు. ఆది, సోమవారాల్లో పాకిస్థాన్ అంతటా గంటల తరబడి ఇంటర్నెట్ మూగబోవడానికి, దావూద్ మృతికి లింకుందని చెప్పుకొచ్చాడు. ‘‘దేశంలో ఏదో పెద్ద ఉదంతమే జరిగింది. దాన్ని దాచేందుకే నెట్‌పై ఆంక్షలు విధించారు’’ అంటూ ప్రముఖ పాక్ జర్నలిస్టులు ఎక్స్ పోస్టుల్లో అనుమానాలు వెలిబుచ్చడంతో మరింత అలజడి రేగింది. దావూద్ విషమ పరిస్థితుల్లో కరాచీ ఆస్పత్రిలో చేరినట్టు పాక్ జర్నలిస్టు అర్జూ కాజ్మీ ఎక్స్ పోస్టులో నిర్ధారించారు. తొలిసారేమీ కాదు... దావూద్‌పై విషప్రయోగం జరిగిందని, అతను మరణించాడని వార్తలు రావడం ఇది తొలిసారేమీ కాదు. ఏటా కనీసం ఒకట్రెండుసార్లు ఇలాంటి వార్తలు రావడం, అవన్నీ పుకార్లేనని తేలడం పరిపాటిగా మారింది. కరాచీలోనే దావూద్: అల్లుడు పాక్ ఖండిస్తున్నా, దావూద్ కరాచీలో ఉండటం వాస్తవమేనని అతని అల్లుడు అలీ షా పార్కర్ గత జనవరిలో ధ్రువీకరించాడు. కరాచీలోని అబ్దుల్లా గాజీ బాబా దర్గా వెనక రహీం ఫకీ సమీపంలోని డిఫెన్స్ ఏరియాలో దుర్భేద్యమైన ఇంట్లో కొన్నేళ్లుగా దావూద్ నివాసముంటున్నట్టు తెలిపాడు. దావూద్ చెల్లెలు హసీనా పార్కర్ కొడుకైన అలీ షా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు ఇచి్చన స్టేట్మెంట్లో ఇంకా పలు విషయాలు వెల్లడించాడు. ‘‘దావూద్ ఓ పాక్ పఠాన్ స్త్రీని రెండో పెళ్లి చేసుకున్నాడు. దావూద్‌కు ముగ్గురు సోదరులు, నలుగురు అక్కచెల్లెళ్లు, ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లున్నారు. ఒక కూతురును పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ కుమారునికిచ్చి పెళ్లి చేశాడు’’ అని అలీ షా తెలిపాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ముంబైను పేల్చేస్తాం.. పోలీసులకు హెచ్చరిక
ముంబై: భారత వాణిజ్య రాజధాని ముంబైని పేల్చేస్తామంటూ అందిన హెచ్చరికలతో యంత్రాంగం అప్రమత్తమైంది. మరోసారి 26/11 తరహా దాడులకు పాల్పడతామన్న హెచ్చరిక మెసేజీలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ మెసేజీలు పాకిస్తాన్ కోడ్‌తో ఉన్న ఫోన్ నంబర్ నుంచే వచ్చినట్లు తేలిందని ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ శనివారం మీడియాకు తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీసులు శనివారం విరార్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వర్లిలోని ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూంలోని హెల్ప్‌లైన్ వాట్సాప్ నంబర్‌కు శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో పలు మెసేజీలు అందాయి. ‘ముంబైని పేల్చేస్తాం. 26/11 తరహా దాడులను మరోసారి గుర్తుకుతెచ్చేలా చేస్తాం. భారత్‌లోని మా సహచరులు ఆరుగురు రంగంలోకి దిగారు. ఇందుకోసం ఏర్పాట్లు సాగుతున్నాయి’అని అందులో ఉంది. 26/11 దాడుల్లో పట్టుబడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్, అల్ ఖైదా నేత అయ్మన్ అల్ జవహిరి పేర్లను కూడా ప్రస్తావించారు. చదవండి: భారత్‌తో శాంతినే కోరుకుంటున్నాం కానీ.. కశ్మీర్‌తో ముడిపెట్టిన పాకిస్తాన్ ప్రధాని ఈ మేసేజీలు పాక్ కోడ్‌తో ఉన్న ఫోన్ నంబర్ నుంచే వచ్చినట్లు గుర్తించారు. ముంబై పోలీసులను, తీర ప్రాంత రక్షణ దళాలను అలెర్ట్ చేసి, ఆపరేషన్ కవచ్‌ను ప్రారంభించామని కమిషనర్ వివేక్ పేర్కొన్నారు. ‘మెసేజ్‌లలో పేర్కొన్న నంబర్లు, వ్యక్తులపై కూడా దర్యాప్తు జరుగుతోంది. ఈ నంబర్లు భారతీయులవిని తేలింది. అయితే, మెసేజీలు ఉర్దూలో కాకుండా హిందీలో ఉన్నాయి. పాకిస్తానీ నంబర్ నుంచి ఈ మెసేజీలు వచ్చినట్లు కనిపించేలా నకిలీ ఐపీని సృష్టించే ప్రయత్నం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. లాహోర్‌కు చెందిన తోటమాలి ఫోన్ నంబర్ హ్యాకైందన్న అక్కడి మీడియా కథనాలను కూడా పరిశీలిస్తున్నాం’ అని కమిషనర్ చెప్పారు. ముంబై సమీపంలోని రాయగడ్ వద్ద ఏకే–47 తుపాకులు, మందుగుండు సామగ్రితో కూడిన పడవను బలగాలు స్వాధీనం చేసుకున్న మరునాడే ఈ హెచ్చరికలు రావడంతో యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. 2008 నవంబర్ 26వ తేదీన పాకిస్తాన్‌కు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో జరిపిన దాడుల్లో 166 మంది చనిపోగా 300 మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే. -
ముంబై పేలుళ్ల సూత్రధారికి 32 ఏళ్ల జైలు శిక్ష
లాహోర్: ముంబై పేలుళ్ల సూత్రధారి, నిషేధిత జమాత్ ఉద్ దవా(జేయూడీ) సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్(70)కు ఉగ్రవాద వ్యతిరేక కోర్టు 32 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఉగ్రముఠాలకు ఆర్థిక సాయం అందించిన కేసులో 2019లో ఇతడికి 36 ఏళ్ల జైలు శిక్ష పడగా ప్రస్తుతం లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఉగ్ర సంస్థలకు ఆర్థిక సాయం అందించిన మరో రెండు కేసుల్లో కలిసి 32 ఏళ్లతోపాటు, 3.40 లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానా విధిస్తూ తాజాగా గురువారం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలవుతాయని తెలిపింది. 2008లో సంభవించిన ముంబై బాంబు పేలుళ్లకు జేయూడీకి చెందిన లష్కరే తోయిబా సూత్రధారిగా ఉంది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడిన హఫీజ్‌పై అమెరికా ప్రభుత్వం కోటి రూపాయల రివార్డు ప్రకటించింది. ఇండియాకు చెందిన ఎన్ఐఏ మోస్టు వాంటెడ్ జాబితాలో ఉన్న హఫీజ్ సయీద్ పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతంలోని సర్గోధాలో 1950 జూన్ 5న జన్మించాడు. తొలుత మత గురువుగా పనిచేశాడు. తర్వాత ఉగ్రబాట పట్టాడు. ఐక్యరాజ్యసమితి కూడా అతడిని ఉగ్రవాదిగా అధికారికంగా గుర్తించింది. -
మాజీ సీఎంకు నవాబ్ కౌంటర్: హైడ్రోజన్ బాంబు వేయబోతున్నా కాస్కో!
సాక్షి, ముంబై: బాలీవుడ్ స్టార్హీరో షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నిందితుడుగా ఉన్న ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు రోజుకో పరిణామంతో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ కేసులో బీజేపీ, శివసేన,ఎన్సీపీ ప్రభుత్వం మధ్య రగిలిన వార్ మరింత ముదురుతోంది. తనపై సంచలన ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్. రేపు (బుధవారం) హైడ్రోజన్ బాంబు వేస్తా.. డీ-గ్యాంగ్‌తో ఆయనకున్న అండర్ వరల్డ్ లింకులను తానూ బయటపెడతాను అంటూ నవాబ్ మాలిక్ ప్రకంపనలు సెగ రేపారు. ఫడ్నవిస్ తాజా ఆరోపణలపై విచారణకు తాను సిద్ధమే అంటూ ప్రతిసవాల్ విసిరారు. దీనికి సంబంధించి ఒక వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఇటీవల కాలంలో ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడేను టార్గెట్ చేసిన నవాబ్‌మాలిక్‌పై మరోసారి తీవ్ర విమర్శలకు దిగారు దేవేంద్ర ఫడ్నవిస్. నవాబ్కు, ఆయన కుటుంబ సభ్యులకు దావూద్ గ్యాంగ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. మంగళవారం నిర్వహించిన ప్రెస్మీట్లో దావూద్ గ్యాంగ్ సభ్యుడి మధ్య జరిగిన భూ ఒప్పందానికి సంబంధించిన వివరాలను వెల్లడించడం దుమారాన్ని రేపింది. ముంబై పేలుళ్ల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దోషుల దగ్గరి నుంచి నవాబ్ మాలిక్ చవగ్గా ఆస్తులను కొనుగోలు చేశారని, అసలు వారినుంచి భూమి ఎందుకు కొన్నారని ఫడ్నవిస్‌ను ప్రశ్నించారు. అంతేకాదు దీనిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఎన్సీపీ అధినేత శరద్ పపవార్కు కూడా డాక్యుమెంట్లు అందిస్తానని ఫడ్నవిస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. राष्ट्रवादी काँग्रेसचे राष्ट्रीय प्रवक्ते ना. नवाब मलिक यांच्या पत्रकार परिषदेचे थेट प्रक्षेपण https://t.co/4fHBSM4Lln — Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) November 9, 2021 -
మళ్లీ మాట మార్చిన పాకిస్తాన్
ఇస్లామాబాద్ : అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం విషయంలోదాయాది దేశం పాకిస్తాన్ మరోసారి మాట మార్చింది. దావుద్ కరాచీలో ఉన్నట్లు అంగీకరించి, అతన్ని టెర్రరిస్టుల జాబితాలో చేర్చిన పాక్.. వెంటనే యూటర్న్ తీసుకొని,ఇబ్రహీం కరాచీలో లేడని, అతనికి తమ దేశంలో ప్రవేశం లేదని ప్రకటించింది. భారత్ మీడియా కావాలనే దావుద్ తమ దేశంలో ఉన్నట్లు అంగీకరించినట్లు తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించింది. ప్యారిస్‌కు చెందిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(FATF) జూన్ 2018లో విధించిన గ్రే లిస్ట్ నుంచి తప్పించుకునేందుకు... తాజాగా పాకిస్తాన్ 88 నిషేధిత ఉగ్రవాద సంస్థలు, దాని అధినేతలపై కఠిన ఆంక్షలు విధించింది. ఇందులో దావుద్ ఇబ్రహీంను పేరుకూడా ఉంది. దావుద్ ఇబ్రహీంతో పాటు జమాతుద్ దావా చీఫ్ హఫీజ్ సయీద్, జైషే మహ్మద్ చీఫ్ ముసూద్ అజహర్, జకీర్ రెహమాన్ లఖ్వీ తదితరుల పేర్లను కూడా ఆ జాబితాలో చేర్చింది. వీరి స్థిర, చరస్తులను సీజ్ చేసి, వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తున్నట్లు తెలియజేస్తూ రెండు నోటిఫికేషన్ల విడుదల చేసింది. గ్రే లిస్ట్‌లో దావుద్‌ను చేర్చడంతో మాఫియా డాన్ తమ దేశంలోనే ఉన్నట్లు పాక్ అంగీకరించినట్లయ్యింది. అయితే లిస్ట్ ప్రకటించిన కొన్ని గంటలకే దాయాది దేశం మాట మార్చింది. దావూద్ తమ దేశంలో ఉన్నారని అంగీకరించినట్లు భారత్ మీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తుందని ఆరోపించింది. దావుద్‌కు తమదేశంలో చోటు లేదని పేర్కొంది. ఈ మేరకు పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అది కొత్త నోటిఫికేషన్ ఏం కాదని, ఈ నోటిఫికేషన్ ద్వారా పాక్ ఎలాంటి కొత్త ఆంక్షలు విధించలేదని స్పష్టం చేసింది. (చదవండి : దావూద్ గుట్టువిప్పిన పాకిస్తాన్) ఆగస్టు 18న జారీ అయిన ఒక నోటిఫికేషన్ గురించి స్థానిక విలేకరులతో పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి జాహిద్ చౌధరి మాట్లాడుతూ.. పాకిస్తాన్ 2020 ఆస్టు 18న జారీ చేసిన ఎస్ఆర్ఓ (చట్టబద్ధమైన నోటిఫికేషన్) చాలా పక్కా సమాచారంతో ఉందని, ఇంతకు ముందు జారీ చేసిన ఎస్ఆర్ఓను కూడా ఒక ప్రక్రియ ప్రకారమే ఇచ్చామని తెలిపారు. అందుకే నిషేధిత జాబితా, నిషేధిత చర్యల్లో ఎలాంటి మార్పులూ ఉండవని స్పష్టం చేశారు. ‘ఐక్యరాజ్యసమితి ఆంక్షల జాబితాలో తాలిబాన్, ఐఎస్, అల్‌ఖైదాల ప్రస్తుత స్థితిని చూపించడానికి 2020 ఆగస్టు 18న రెండు సంయుక్త ఎస్ఆర్ఓలు జారీ చేశాం. అప్పుడప్పుడూ ఈ ఎస్ఆర్ఓలు విడుదల అవుతుంటాయి. అలాగే, చట్టపరమైన అవసరాలు, అంతర్జాతీయ బాధ్యతల ప్రకారం విదేశాంగ శాఖ ఈ ఎస్ఆర్ఓలను ప్రచురిస్తుంది. కానీ భారత్ మీడియా మాత్రం ఈ రిపోర్ట్ ద్వారా పాకిస్తాన్ ఏవో కొత్త ఆంక్షలు విధించిందని కథనాలు నడిపిస్తుంది. అది సరికాదు. ఈ ఎస్ఆర్ఓను చూపిస్తూ మా దేశంలో కొందరు ఉన్నట్లు(దావూద్) పాకిస్తాన్ అంగీకరించిందని భారత మీడియాలోని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అవి నిరాధారం, కల్పితం’అని జాహిద్ చౌధరి పేర్కొన్నారు. -
దావూద్ గుట్టువిప్పిన పాకిస్తాన్
ఇస్లామాబాద్ : అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నాడని పాకిస్తాన్ ఎట్టకేలకు అంగీకరించింది. దావూద్ కరాచీలోనే ఉన్నట్టు ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఆ దేశం తాజాగా ప్రకటించిన టెర్రరిస్టుల జాబితాలో ఆయన పేరును కూడా పొందుపరిచింది. తమ గడ్డపై ఉగ్రవాదులను గుర్తిస్తూ పాకిస్థాన్ ఓ జాబితాను విడుదల చేసింది. కరుడుగట్టిన నేరగాళ్లు హాఫిజ్ సయీద్, మొహమ్మద్ అజర్ లాంటి అంతర్జాతీయ ఉగ్రవాదులు కూడా ఈ లిస్టులో ఉన్నారు. అంతేకాకుండా పాకిస్తాన్‌కు చెందిన 88 మంది వివాదాస్పద రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఇకపై వీరందరి మీద ఆంక్షలు విధించనుంది. బ్యాంక్ ఖాతాలను కూడా స్థంభింపచేయనుంది. ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించాలన్న అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి పాకిస్థాన్ ఈ జాబితానును శనివారం విడుదల చేసింది. దీంతో ఉగ్రవాద కార్యక్రమాలను ఊపిరి పోస్తున్న దావూద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాక్ ప్రభుత్వం ఆదేశించింది. ఉగ్రవాద గ్రూపులపై, నాయకులపై ఆర్ధిక ఆంక్షలు విధిస్తున్నామని, స్థిర, చరాస్థులను స్వాధీనం చేసుకోవడమే కాకుండా, వారి బ్యాంకు ఖాతాలను సైతం స్తంభింపజేస్తామని స్పష్టం చేసింది. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. ఇదంతా ప్రపంచ దేశాలను తప్పుదారి పట్టించడానికేనా అన్న అనుమానాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. కాగా, 1993 ముంబై పేలుళ్ల కేసులో కీలక సూత్రదారిగా ఉన్న దావూద్.. అప్పటి నుంచి పాకిస్తాన్‌లోనే తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. -
ఆ చిన్నారే ఈ పెళ్లికూతురు
ముంబై పేలుళ్లు.. ఢిల్లీ పేలుళ్లు దిల్సుఖ్నగర్ పేలుళ్లు.. లుంబినీ పేలుళ్లు! ప్రతి పేలుడూ.. రక్తంతో ఒక డేట్ రాసి పోతుంది.రేపు జూన్ 25 న సిమ్రాన్ పెళ్లి.పసుపు రాసిన ఈ డేట్‌ను కూడామనం గుర్తుంచుకోవాలి.పన్నెండేళ్ల క్రితం ఢిల్లీ పేలుళ్లలో.. తండ్రిని కోల్పోయిన చిన్నారే సిమ్రాన్! జీవితంలోని మంచి విషయాలు మంచి మనుషుల్ని చూసీ చూడనట్లు తప్పుకుని పోవు. సిమ్రాన్ జీవితంలో ఇప్పుడొక మంచి విషయం జరుగుతోంది. రేపు 25న ఆమె వివాహం. వరుడిది పంజాబ్. కండిషన్ పెట్టి మరీ సిమ్రాన్ పెళ్లి చేసుకుంటోంది. పెళ్లయ్యాక కూడా తను చదవాలి. అదీ కండిషన్. పద్దెనిమిదేళ్లు సిమ్రాన్‌కి. అంతా తనకు ఇష్టమైనట్లే జరిపించుకుంటోంది. మారుతండ్రి చెయ్యి పట్టుకుని వెళ్లి, పెళ్లి బట్టల షాపింగ్ చేసుకొచ్చింది. నచ్చిన దుస్తులు, నచ్చిన ఆభరణాలు కొనిపించుకుంది. పెళ్లితేదీని కూడా తనే ఫిక్స్ చేయించుకుంది. డిగ్రీ పరీక్షలు ఉన్నాయి సిమ్రాన్‌కి. వాటికి అడ్డుపడకుండా ముహూర్తం తనే పెట్టించుకుంది. ఇక పెళ్లికి సంప్రదాయంగా ధరించవలసిన ఎరుపు రంగు ‘వెడ్డింగ్ డ్రెస్’ని పక్కన పెట్టి, లేత గులాబీ రంగును ఎంపిక చేసుకుంది. ఎరుపు సిమ్రాన్‌కు ఇష్టం లేదు! ఉగ్రవాదుల బాంబు పేలుళ్లలో తండ్రి అశోక్ మరణించిన రోజు తొలిసారి ఆమె ఎరుపు రంగును దగ్గరగా చూసింది. ఆయన ఒంటి మీదంతా ఎరుపే. భయపడి దూరంగా జరిగింది. హరిశ్చంద్ తాతయ్య ఒంటి మీద ఎరుపు. సరోజ ఆంటీ ఒంటి మీద ఎరుపు. యశోద ఆంటీ ఒంటి మీద ఎరుపు. వాళ్లతోపాటు ఆ రోజు మరో ఏడుగురు కుటుంబ సభ్యులు పేలుళ్లకు తునకలైపోయారు. తల్లి కమలేశ్వతిని రెండు రోజుల వరకు సిమ్రాన్‌ని చూడనివ్వలేదు ఆమె బంధువులు. కోలుకున్నాక, కట్లు కట్టాక, ఇంటికి తెచ్చాక మాత్రమే సిమ్రాన్‌ని అమ్మ మీదకు వదిలి పెట్టారు. తండ్రి చితిమంటల్ని చూసినరోజు.. ఆ రోజంతా సిమ్రాన్ తన తల్లిని గట్టిగా పట్టుకుని వదిలిపెట్టలేదు. అప్పటికి సిమ్రాన్ తల్లి వయసు 27. ఆమెను ఆమె తల్లి (సిమ్రాన్ అమ్మమ్మ) చాలారోజుల వరకు ఒడిసి పట్టుకునే ఉంది. చిన్న చప్పుడైతే సిమ్రాన్, కమలేశ్వతి ఎవరి తల్లుల ఒళ్లోకి వారు వచ్చేస్తున్నారు! కనికరం లేని ఆనాటి రోజు ఏళ్లపాటు వారిని కలవర పెడుతూనే ఉంది. 2008 సెప్టెంబర్ 13 శనివారం సాయంత్రం ఢిల్లీలో 6 గం. 7 ని.లకు మొదలైన వరుస పేలుళ్లు అరగంట వ్యవధిలో నాలుగు చోట్ల రక్తపాతం సృష్టించాయి. మొదట సిమ్రాన్ వాళ్లున్న జాఫర్ మార్కెట్ ప్రాంతంలోనే పేలుడు సంభవించింది. ఆటో రిక్షాలోని సిలిండర్ బాంబు పేలి సిమ్రాన్ తండ్రితోపాటు పదకొండు మంది చనిపోయారు. తండ్రి చితివైపు చూస్తూ తల్లిలో ఒదిగిపోతున్న సిమ్రాన్ (2008) సిమ్రాన్ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. సోమవారం ‘హల్దీ సెర్మనీ’లో పసుపు బట్టల్లో, పసుపు రాసిన ముఖంతో సంతోషంగా ఉంది. తండ్రి చనిపోయిన నాటి నుంచీ.. టెన్త్ పాస్ అయినప్పుడు తప్ప.. ఈ పన్నెండేళ్లలో ఏరోజూ ఇంత ఆనందంగా లేరు సిమ్రాన్, ఆమె తల్లి. కూతుర్ని మెడిసిన్ చదివించాలని అశోక్ కోరిక. ఆయన కోసం ప్రతి క్లాసునూ మెడిసిన్ చదివినట్లే చదివింది సిమ్రాన్. కూతురికి పెళ్లి సంబంధం చూస్తున్నప్పుడు మాత్రం కమలేశ్వతి తట్టుకోలేక వేరే గదిలోకి వచ్చి ఏడ్చేసింది. కూతురే వెళ్లి ఆమె కన్నీళ్లు తుడిచింది. ఎంత లేదన్నా రేపు పెళ్లిరోజు ఆ తల్లిని ఇంకాస్త జాగ్రత్తగా పట్టుకోవలసిన పరిస్థితి రావచ్చు. ప్రస్తుతం పెళ్లికొచ్చిన అతిథులు ఇంట్లో ఉన్నారు. వాళ్లెవరూ ఆనాటి క్రూరమైన రోజును మాటల్లోకి రానీయకుండా జాగ్రత్త పడుతున్నారు. ‘‘సిమ్రాన్.. అన్నీ కొనుక్కున్నావా?’’ అని పెళ్లి కూతుర్ని అడుగుతున్నారు. ‘‘నాన్న నా పెళ్లికి అన్నీ అమర్చారు’’ అని చెబుతోంది సిమ్రాన్. నాన్నంటే మారు తండ్రి. హీరాలాల్ ఆయన పేరు. సిమ్రాన్‌కు పదకొండేళ్ల వయసులో బంధువులంతా ఒత్తిడి తెచ్చి కమలేశ్వతికి మళ్లీ పెళ్లి చేశారు. సిమ్రాన్ ఏడేళ్ల తమ్ముడు ఆయన కొడుకే. వివాహ వేడుకలో పెళ్లి కూతురుగా సిమ్రాన్ (మొన్న సోమవారం) సిమ్రాన్ మాటలు భలే ఉంటాయి. జీవిత సత్యాలను నోటి మాటగా చెప్పేస్తుంటుంది. ‘‘జీవితంలోని మంచి విషయాలు మంచి మనుషులను చూసీ చూడనట్లు తప్పుకుని పోవు’’ అనే మాట సిమ్రాన్దే. ఇంకొక మాట కూడా అంటుంది తను.. ‘‘జీవితం మన నుంచి ఒకటి తీసుకున్నప్పుడు, ఇంకొటి ఇస్తుంది’’ అని. జీవితం ఆమె నుంచి తీసుకున్న ఆ ఒకటి ఆమె తండ్రి అశోక్. జీవితం ఆమెకు ఇచ్చిన ఆ ఇంకొకటి ఆమె మారుతండ్రి హీరాలాల్. -
చిత్తశుద్ధి లేని చర్య
ముంబై మహానగరంపై పన్నెండేళ్లక్రితం జరిగిన ఉగ్రవాద దాడి సూత్రధారి, జమాత్ ఉద్ దవా(జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ కోర్టు బుధవారం 11 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఇది విని అమెరికా హర్షం వ్యక్తంచేసింది గానీ పాకిస్తాన్ న్యాయస్థానాల తీరుతెన్నులు, అక్కడి పాలకుల ఎత్తుగడలు తెలిసినవారికి ఈ పరిణామం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు ముసుగు సంస్థగా రంగంలోకొచ్చిన జేయూడీ మన దేశంలో 173 మందిని పొట్టనబెట్టుకున్న ముంబై ఉగ్రవాద దాడి కేసులో మాత్రమే కాదు... 12 మంది మరణించిన 2001 పార్లమెంటు దాడి, 209 మంది చనిపోయిన 2006 నాటి ముంబై రైలు పేలుళ్ల కేసు వగైరాల్లో ప్రధాన పాత్ర పోషించింది. ఈ కేసుల్లో హఫీజ్‌ను అప్పగించాలని మన దేశం డిమాండ్ చేస్తోంది. ముంబై ఉగ్ర దాడికి సంబంధించి నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు కూడా సమర్పించింది. కానీ ఇచ్చిన సాక్ష్యాలు సరిపోవని, మరిన్ని వివరాలు కావాలని పదే పదే అడగటం తప్ప పాక్ చేసిందేమీ లేదు. ముంబై ఉగ్రదాడి జరిగిన ఏడాది తర్వాత అమెరికా పోలీసులకు చిక్కి ప్రస్తుతం అక్కడే జైలుశిక్ష అను భవిస్తున్న పాకిస్తానీ అమెరికన్ డేవిడ్ హెడ్లీ సైతం ఆ దాడిలో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ప్రమేయం, లష్కర్‌తో దానికున్న సంబంధాలు, హఫీజ్ సయీద్ పోషించిన పాత్ర వగైరాలపై పూస గుచ్చినట్టు చెప్పాడు. అలాంటి హఫీజ్‌కు ఇప్పుడు ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందించిన కేసులో శిక్ష పడింది. అతగాడి పాపాల చిట్టాతో పోలిస్తే ఈ ఆర్థిక సాయం ఆరోపణ చాలా చిన్నది. అంతర్జాతీయంగా ఒత్తిళ్లు వచ్చినప్పుడు హఫీజ్‌ను జైలుకు పంపడం, అవి చల్లారగానే అతన్ని విడుదల చేయడం రివాజుగా మారింది. మధ్యమధ్య గృహ నిర్బంధంలో ఉంచడం కూడా సర్వసాధారణం. గత పదేళ్లుగా ఈ తంతు నడుస్తూనేవుంది. 90వ దశకం చివర లష్కరే సంస్థను నిషేధించినప్పుడు అప్పటికి ఉనికిలో లేని జమాత్ ఉద్ దవావల్ ఇర్షాద్ అనే సంస్థ పంచన చేరిన హఫీజ్ 2002లో దాన్ని జేయూడీగా మార్చుకున్నాడు. అది ధార్మిక సంస్థ అని చెప్పుకున్నాడు. దానిద్వారా భారీయెత్తున నిధులు సేకరించడం, ఆ నిధుల్ని ఖర్చుపెట్టి ఉగ్రవాద మూకలను తయారు చేయడం వంటి చర్యలు కొనసాగిస్తున్నా పాకిస్తాన్ ప్రభుత్వాలు కళ్లు మూసుకున్నాయి. జేయూడీకి సైన్యం అండదండలుండటమే ఇందుకు కారణం. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిరుడు అమెరికా పర్యటనలో వుండగా ఇలాంటి ఉగ్ర మూకల గురించి తీవ్రంగానే మాట్లాడారు. అఫ్ఘానిస్తాన్, కశ్మీర్‌లలో పోరాడిన సాయుధ మిలిటెంట్లు 30,000 నుంచి 40,000 వరకూ పాక్‌లో ఉన్నారని ప్రకటించారు. పాక్‌ను గతంలో ఏలినవారంతా ఈ నిజాన్ని దాచి దేశానికి నష్టం కలగ జేశారని ఆరోపించారు. ఈ మాదిరి మిలిటెంట్లపై తాము చర్యలు తీసుకోవడం మొదలుపెట్టామని కూడా చెప్పారు. కానీ అందులో అర్థసత్యమే ఉందని ప్రపంచానికంతకూ తెలుస్తునే వుంది. అందుకు హఫీజ్ సయీద్ ఉదంతమే పెద్ద ఉదాహరణ. నిజంగా తన దేశంలో సాయుధ మిలిటెంట్ల బెడద వుండకూడదనుకుంటే హఫీజ్పైనా, అలాంటి మరికొందరిపైనా పకడ్బందీ సాక్ష్యాలు సేకరించి, వారందరికీ ఎప్పుడో శిక్ష పడేలా చర్యలు తీసుకునేవారు. కానీ ఆ విషయంలో చిత్తశుద్ధి కనబడటం లేదు. ఇప్పుడైనా శిక్ష పడిన సందర్భమేమిటో గమనిస్తే చివరకు ఈ కేసు ఏమవుతుందో సులభంగానే తెలుస్తుంది. జీ–7 దేశాల చొరవతో 1989లో ఏర్పడి, పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాద లావాదేవీల నిఘా సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) ఉగ్రవాదుల కదలికలను, వారి లావాదేవీలను గమనిస్తూ వుంటుంది. ఏ దేశమైనా ఇలాంటి లావాదేవీలను నిరో ధించలేకపోయినా, వాటిని ప్రోత్సహిస్తున్నట్టు అనుమానం కలిగినా, ఉగ్ర సంస్థల నిధుల వ్యవ హారాన్ని దర్యాప్తు చేయడంలో సహకరించకపోయినా అనుమానిత దేశాల జాబితాలో లేదా కుమ్మక్కయిన దేశాల జాబితాలో చేరుస్తుంది. పర్యవసానంగా ప్రపంచ దేశాలనుంచి వాటికి ఆర్థిక సాయం నిలిచిపోతుంది. బ్లాక్ లిస్టులో చేరిన దేశాలపై ఇతరత్రా ఆంక్షలు కూడా విధిస్తారు. ఇరాన్, ఉత్తర కొరియాలపై ఈ వంకనే ఆంక్షలు అమలవుతున్నాయి. ఆ సంస్థ నిరుడు జూన్‌లో సమావే శమైనప్పుడు పాకిస్తాన్‌ను తీవ్రంగా హెచ్చరించింది. 2020 ఫిబ్రవరి 20కల్లా చర్య తీసుకోకపోతే చర్యలు తప్పవని తెలిపింది. ఉగ్రవాద సంస్థలను నియంత్రించడంలో సమర్థవంతంగా వ్యవహ రించలేకపోతున్నారని చీవాట్లు పెట్టింది. నిజానికి అప్పట్లోనే కఠిన చర్య తీసుకోవాల్సివున్నా చైనా, టర్కీ, మలేసియా, సౌదీ అరేబియా, గల్ఫ్ సహకార మండలి జోక్యం చేసుకుని ఆ దేశానికి మరికొంత సమయం ఇద్దామని నచ్చజెప్పాయి. మరో మూడురోజుల్లో పారిస్‌లో ఎఫ్ఏటీఎఫ్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈసారి హఫీజ్‌పై చర్యకు వెనకాడితే ఎవరూ తనను సమర్థించరన్న భయం పాకిస్తాన్‌కు వుంది. అలాగే అఫ్ఘానిస్తాన్ ఊబిలో కూరుకుపోయిన అమెరికా సాధ్యమైనంత త్వరగా అక్కణ్ణించి బయటపడాలని చూస్తోంది. పాక్ అండ లేకుంటే అది సాధ్యం కాదు గనుక, ఎఫ్ఏటీఎఫ్ బెడద తప్పించుకోవడానికి వెనువెంటనే ఏదో ఒక చర్య తీసుకోమని అమెరికా సలహా ఇచ్చి వుండొచ్చు కూడా. మొత్తానికి ఇలా స్వీయ ప్రయోజనాలను ఆశించి ఉగ్రవాదంపై భిన్న వైఖరులు తీసుకునే దేశాల వల్లే పాకిస్తాన్ ఇష్టానుసారం వ్యవహరించగలుగుతోంది. ఇది అంతిమంగా ఉగ్రవాదులకు ఊతం ఇస్తోంది. ఎఫ్ఏటీఎఫ్ సమావేశాలు ముగిశాక పాక్‌లో మరో న్యాయస్థానం హఫీజ్ నిర్దోషి అని తీర్పి చ్చినా ఆశ్చర్యం లేదు. సంస్థల నిషేధం, వ్యక్తుల అరెస్టులు మించి అదనంగా పాక్ ఏం చేస్తున్నదో నిశితంగా గమనించాల్సిన అవసరం... అది అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడేలా చూడాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలకుంది. ముఖ్యంగా ఉగ్రవాదం రాజ్య విధానంగా లేదా దాని ఉపకరణంగా మారకూడదన్న స్పష్టత అందరికీ ఉండాలి. -
నగరంలోనూ ‘డాక్టర్ బాంబ్’ ఛాయలు!
సాక్షి, సిటీబ్యూరో : అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారంగా తన్జీమ్ ఇస్లా ఉల్ ముస్లమీన్ (టీఐఎం) పేరుతో ఉగ్రవాద సంస్థ ఏర్పాటు చేసి, హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 60 వరకు బాంబు పేలుళ్లకు పాల్పడిన ‘డాక్టర్ బాంబ్’ జలీస్ అన్సారీ శుక్రవారం పోలీసు, నిఘా విభాగాలకు ముచ్చెమటలు పట్టించాడు. ముంబైలోని ఆథర్ రోడ్ జైలు నుంచి నెల రోజుల క్రితం పెరోల్‌పై బయటికి వచి్చన అతను శుక్రవారం తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉండగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో కేంద్ర నిఘా వర్గాలు అలర్ట్ ప్రకటించాయి. మధ్యాహ్నానికి ఉత్తరప్రదేశ్‌లో చిక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన జలీస్ అన్సారీ ముంబై యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత కొందరు అనుచరులతో ముఠా ఏర్పాటు చేసిన ఇతను 1993–94లో రాజస్థాన్, మహారాష్ట్ర, హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడ్డాడు. ఇందులో రైళ్లు, రైల్వేస్టేషన్లే ఎక్కువగా ఉన్నాయి. 1993లో జలీస్ అన్సారీ తన మాడ్యుల్ సాయంతో నగరంలోని ఐదు ప్రాంతాల్లో పేలుళ్లకు ఒడిగట్టాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. తక్కువ ప్రభావం గల బాంబులను తయారు చేయడంలో నిపుణుడైన జలీస్ అన్సారీని పోలీసు, నిఘా వర్గాలు ‘డాక్టర్ బాంబ్’ పేరుతో పిలుస్తుంటాయి. ఇతడు తయారు చేసిన బాంబుల్లో సల్ఫూరిక్ యాసిడ్‌నే టూమర్గా వాడేవాడు. 1994 జనవరి 12న ముంబై పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అక్కడి నుంచి పీటీ వారెంట్‌పై రాజస్థాన్ పోలీసులు అజీ్మర్ తరలించారు. అప్పటి నుంచి అక్కడి జైలులోనే ఉండటంతో కేసుల విచారణ ముగిసి జీవిత ఖైదు కూడా పడింది. కొన్నాళ్ల క్రితం ముంబైలో నమోదైన కేసుల విచారణ కోసం ఆ పోలీసులు ఆథర్ రోడ్ జైలుకు తీసుకువచ్చారు. ఇతడికి సుప్రీం కోర్టు గత నెలలో నెల రోజుల పాటు పెరోల్ మంజూరు చేసింది. దీంతో ముంబైలోని అగ్రిపాడ ప్రాంతంలోని తన ఇంటికి వచ్చాడు. పెరోల్ గడువు శుక్రవారం ఉదయం ముగియడంతో అతను ఆథర్ రోడ్ జైలుకు వెళ్లాల్సి ఉంది. అయితే తెల్లవారుజామున 5 గంటలకు ప్రార్థనల నిమిత్తం బయటికి వెళ్లిన అన్సారీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ విషయం గుర్తించిన మహారాష్ట్ర పోలీసులు అలెర్ట్ ప్రకటించారు. ఓపక్క దేశ వ్యాప్తంగా సీఏఏ, ఎన్నార్సీలపై నిరసనలు జరుగుతుండటంతో అన్సారీ అజ్ఞాతం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ... ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న నిఘా వర్గాలు, ప్రత్యేక విభాగాలు అన్సారీ కోసం ముమ్మరంగా గాలించాయి. శుక్రవారం మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్‌లో చిక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జలీస్ అన్సారీకి ప్రధాన అనుచరుడు, ఆ మాడ్యుల్లో కీలక వ్యక్తిగా ఉన్న ఖాద్రీని 2010 అక్టోబర్‌లో మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు గోల్కొండ ప్రాంతంలో అరెస్టు చేశారు. ముంబైలోని మీరా రోడ్ ప్రాంతానికి చెందిన ఖాద్రీ... 2003లో తన ఇంట్లో ఓ వ్యక్తిని హత్య చేసి, పూర్తిగా కాల్చేసి... తానే చనిపోయినట్లు పోలీసులను నమ్మించాడు. అప్పటి నుంచి హైదరాబాద్‌కు వచ్చి గోల్కొండ ప్రాంతంలో మకాం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పరిణామాలతో జలీస్ మిస్సింగ్ తర్వాత రాష్ట్ర నిఘా వర్గాలు ఉలిక్కిపడ్డాయి. జలీస్ మాడ్యుల్ ఘాతుకాలివీ... ►ఆగస్టు 12న అబిడ్స్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోకి బాంబు విసిరారు. ఇది అక్కడి ట్రాఫిక్ సిగ్నల్ పోస్ట్‌కు తగిలి పేలడంతో సమీపంలోని వివేక్ వాచ్ కంపెనీ కాపలాదారుడు సుబ్బరాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. ► ఇదే రోజు హుమాయున్‌నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోకి బాంబు విసిరారు. అదృష్టవశాత్తు ఎవరికీ, ఎలాంటి హానీ జరుగలేదు. ►సెపె్టంబర్ 12న సికింద్రాబాద్ రైల్వే రిజర్వేషన్ కాంప్లెక్స్ క్యాష్ రూమ్‌లో జ రిగిన బాంబు పేలుడులో క్యాషియర్లు బాలాజీ, బాల సుబ్రహ్మణ్యం మృతి చెందారు. మరో క్యాషియర్ చంద్రశేఖర్ క్షతగాత్రుడయ్యాడు. ►అక్టోబర్ 22న నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషనల్ సెంటర్ ఫుట్‌పాత్‌పై బాంబు పేల్చారు. ఈ ఘటనలో ‘మదీనా’ వంట మనిషి మహ్మద్ పాషా మృతిచెందగా... కాపలాదారు ►యూసుఫుద్దీన్, స్వీపర్ మల్లమ్మ గాయపడ్డారు. ► డిసెంబర్ 6న మౌలాలి రైల్వేట్రాక్‌పై అమర్చిన బాంబులు పేలడంతో ఏపీ ఎక్స్‌ప్రెస్ వెళ్తున్న ఒకరు మృతిచెందగా...పలువురు క్షతగాత్రులయ్యారు. -
తాజ్ నాయిక ఇప్పుడు తాజా నాయిక
పదకొండేళ్ల క్రితం ముంబై పేలుళ్లలో తాజ్ హోటల్లో దిగినవాళ్లను అలెర్ట్ చేసి, ప్రాణాలు కాపాడిన మల్లికా జగద్.. ‘క్రైసిస్ మేనేజర్’గా మళ్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చారు. ‘ముప్పును తప్పించు కోవడం’పై మల్లిక ఇస్తున్న మోటివేషనల్ స్పీచ్‌ల ఆడియోలు, వీడియోల కాపీలను ఇండియాలోని పెద్ద పెద్ద హోటళ్లు బస చేసేందుకు వచ్చే తమ అతిథులకు ఇస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న సున్నితమైన పరిస్థితుల రీత్యా ముందు జాగ్రత్తగా మల్లిక ఇస్తున్న టిప్స్‌ని హోటళ్లు, ట్రావెలర్స్ ఫాలో అవుతున్నారు. 26 /11. ఈ తేదీ భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజు. ఈ తేదీతో పాటు దేశానికంతటికీ ఒక పేరు గుర్తొస్తుంది. అజ్మల్ కసబ్! ఆ రోజు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా టెర్రరిస్టులు దేశంలో చొరబడి ముంబైలో సృష్టించిన నరమేధాన్ని దేశం మర్చిపోవడం కష్టమే. ఉగ్రమూక దాడిలో ప్రాణాలు కోల్పోయిన 174 మంది అభాగ్యుల లెక్క ఉంది. మూడు వందల మంది క్షతగాత్రుల లెక్క ఉంది. అయితే బతికి బయటపడిన వారి ప్రాణాల లెక్క గురించి అప్పట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత కొన్నాళ్లకు మల్లికా జగద్ అనే మహిళ వల్ల ఆ లెక్క తెలిసింది. ఉగ్రదాడి సమయంలో తాజ్ ప్యాలెస్‌లో చిక్కుకున్న అతిథులను కాపాడిన మల్లికా జగద్ ఆ హోటల్లో డైనింగ్ హాల్ నిర్వహణ బాధ్యతలు చూసుకునే అసిస్టెంట్ బాంక్వెట్ మేనేజర్. అప్పుడామె వయసు ఇరవై నాలుగేళ్లు. ఘటన జరిగింది 2008లో. భోజనాలు చేస్తున్నారు ఆ రోజు రాత్రి తొమ్మిదిన్నర. భోజనాల సమయం. ఉన్నట్లుండి తుపాకీ పేలుళ్లు వినిపించాయి. మొదట్లో ఆ శబ్దాలను తుపాకీ పేలుళ్లనుకోలేదామె. ఆమే కాదు, తాజ్ హోటల్లో హెరిటేజ్ వింగ్‌లో ఉన్న అరవైకి పైగా అతిథులు కూడా ఆ శబ్దాలను టపాకాయల శబ్దాలుగానే పొరబడ్డారు. అది పెళ్లిళ్ల సీజన్ కావడం కూడా అందుకు కారణమే. ఆ సంఘటన మల్లిక జ్ఞాపకాల్లో ఇప్పటికీ సజీవంగానే ఉంది. ‘‘హోటల్లో పేలుళ్లు వేగవంతమైన కొద్దిసేపటికి అవి తుపాకీ పేలుళ్లని మాకు సమాచారం వచ్చింది. ఆ వచ్చిన సమాచారం కూడా అంతవరకే. లోపలికి చొరబడిన వ్యక్తి చేతిలో ఉన్నది చిన్న తుపాకీనా, లేక మెషీన్ గన్నా అనే వివరం కూడా తెలియదు. మా డైనింగ్ హాల్లో ఆ క్షణాన అరవైకి పైగా అతిథులున్నారు. వారిని కాపాడడం మా బాధ్యత. ‘ప్రాణాలను ఫణంగా పెట్టి అయినా సరే వాళ్లను కాపాడాలి. అందుకోసం చివరి శ్వాస వరకు పోరాడుదాం’... అని మా సిబ్బందికి చెప్పాను’’ అని ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు మల్లిక. పిల్లల్నీ వదలడం లేదు ‘‘డైనింగ్ హాల్ తలుపులు, కిటికీలన్నీ మూసి, మెయిన్ డోర్ లాక్ చేసి లైట్లాపి, చిన్న చప్పుడు కూడా చేయకుండా జాగ్రత్తపడుతున్నాం. హోటల్ మీద దాడి జరిగిందని వార్తల ప్రసారం మొదలైంది. గెస్ట్‌ల ఫోన్లు ఒక్కొక్కటిగా రింగవుతున్నాయి. టీవీలు చూసిన వాళ్లు తమ వాళ్ల క్షేమ సమాచారం కోసం ఆత్రుతతో చేస్తున్న ఫోన్ కాల్సే అవన్నీ. ఇప్పుడైతే చిక్కుకుపోయిన వాళ్లు తమను తాము ఫొటో తీసుకుని వాట్సప్ చేయవచ్చు. అప్పట్లో ఆ సౌకర్యం లేకపోవడంతో అవతలి వారికి వీరి క్షేమ సమాచారం తెలియాలంటే ఫోన్‌కాల్ ఒక్కటే మార్గం. రింగయితే, సైలెంట్ మోడ్‌లో లైట్ వెలిగినా ఇక్కడ మనుషులున్న సంగతి తెలిసిపోతుందని, ఫోన్లన్నింటినీ ఆఫ్ చేయించి అందరినీ నేల మీద నిశ్శబ్దంగా కూర్చోమని కోరాం. ఇంత జరుగుతున్నా తుపాకీతో కాలుస్తున్న వ్యక్తి టెర్రరిస్ట్ అని కొన్ని గంటల వరకు తెలియలేదు. వచ్చిన వ్యక్తి హోటల్లో దిగిన విఐపీలను టార్గెట్ చేసి షూట్ చేస్తున్నాడని మాత్రం తెలిసింది. ఎవరినీ పట్టుకుని ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ కూడా చేయడం లేదు. పిల్లలు, ఆడవాళ్లు అనే తేడా లేకుండా కనిపించిన వారిని కనిపించినట్లు చంపేస్తున్నారు. ఒక్కొక్క గదిని డోర్ నాక్ చేస్తూ, తలుపు తీసిన వారిని అక్కడే కాల్చేస్తున్నారు. హాల్లో ఉన్న వాళ్లలో సహనం నశిస్తోంది, ఒక్కొక్కరుగా సంయమనం కోల్పోతున్నారు. ఆలస్యమయ్యే కొద్దీ మెడికల్ ఎమర్జెన్సీలు తలెత్తుతాయేమోనని భయం మొదలైంది మాలో. మన మిలటరీ రంగంలోకి దిగిన తరవాత మేము ఊపిరి పీల్చుకున్నాం. అప్పటి వరకు నాకు ఇలాంటి క్లిష్టపరిస్థితిని ఎదుర్కోవడం గురించి ఏ మాత్రం అవగాహన లేదు. ఆ సందర్భం, అతిథులకు కష్టం రాకుండా చూసుకోవడం అనే మా ఉద్యోగ బాధ్యత నన్ను నడిపించాయి’’ అన్నారు మల్లిక జగద్.ముంబయి పేలుళ్లలో మల్లిక సమయస్ఫూర్తికి, ధైర్యానికి లెక్కలేనన్ని ప్రశంసలతోపాటు టాటా ట్రస్ట్ ఆమెను నిర్వహణ స్థాయికి పదోన్నతి కల్పించింది. మోటివేషనల్ స్పీకర్‌గా ఆమె చేత సేవలను కొత్త ఉద్యోగులకు చెప్పిస్తోంది. టెడెక్స్ ప్రోగ్రామ్‌లో మల్లిక ఇచ్చిన ప్రసంగాన్ని శ్రోతలు పిన్‌డ్రాప్ సైలెన్స్‌తో విన్నారు. నాయకత్వం నేర్పిస్తే రాదు, అది మనిషిలో పుట్టుకతో వస్తుంది. సందర్భం వచ్చినప్పుడు నిరూపించుకుంటుంది... అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు. అందులో మల్లిక మాత్రం మానవత్వం నిండిన మల్లిక నిజమైన నాయిక ఆ రోజు తాజ్ హోటల్లో బస చేసి మల్లిక ధైర్యసాహసాలతో ప్రాణాలు నిలుపుకున్న అతిథులు ఇప్పుడు సోషల్ మీడియాలో అప్పటి సంగతులను గుర్తు చేసుకుంటున్నారు. ‘‘మల్లిక గొప్ప లీడర్. ఆ రోజు మేమున్న గదంతా పొగతో నిండిపోయింది. అందరి దగ్గరకు వచ్చి నీళ్లిచ్చి శబ్దం చేయవద్దని గుర్తు చేస్తూ భుజం తట్టి ధైర్యం చెప్పింది. మమ్మల్ని రక్షించడానికి సైన్యం వచ్చారు. వాళ్లు ముందుగా లేడీస్ ఫస్ట్ అని మల్లికనే బయటకు తీసుకెళ్లబోతే ఆమె వెళ్లలేదు. ‘‘ముందు గెస్ట్‌లు, తర్వాత మా సిబ్బంది, ఆ తర్వాతనే నేను’’ అని చెప్పి మమ్మల్ని ఒక్కొక్కరిని జాగ్రత్తగా బయటకు పంపించడానికి సైన్యంతో సహకరించింది. అప్పుడా గదిలో ముప్పైకి పైగా పెద్ద పెద్ద సంస్థలు నడుపుతున్న వ్యాపార దిగ్గజాలున్నారు. మల్లిక వాళ్లందరికంటే పెద్ద లీడర్, ట్రూ లీడర్ అనిపించింది నాకా క్షణంలో. నన్ను బయటకు తీసుకెళ్తున్న క్షణంలో మల్లికతోపాటే ఉండి చివరగా ఆమెతోపాటే బయటపడదాం అనిపించింది. మేమంతా బయటపడి ఆమె చిక్కుకుపోతుందేమోనని కూడా భయం వేసింది. అలా జరగకూడదని, ఆమె క్షేమంగా బయటపడాలని మేమంతా కోరుకున్నాం. ఇప్పుడు టెడెక్స్ ప్రోగ్రామ్‌లో తన స్పీచ్ వింటుంటే ఆ భయంకరమైన క్షణాలు ఆవరించినట్లే అనిపిస్తోంది. మల్లికను ఇలా చూడడం సంతోషంగా ఉంది’’అని లీనా నాయర్ తన బ్లాగ్‌లో రాసుకున్నారు. నాయకత్వానికి ఉదాహరణ. – మంజీర -
సయీద్ అరెస్టుకు సిద్ధం
లాహోర్/న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్ దవా(జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్, అతని ప్రధాన అనుచరులను త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు పాకిస్తాన్‌లోని పంజాబ్ పోలీసులు గురువారం వెల్లడించారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందిస్తున్నారన్న ఆరోపణలపై సయీద్‌తోపాటు మరో 13 మంది జేయూడీ నేతలపై పాక్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ బుధవారం 23 కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి రోజే హఫీజ్ సయీద్‌తోపాటు కేసులు నమోదైన 13 మంది నేతలను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు పాక్ పోలీసులు ప్రకటించడం గమనార్హం. సయీద్‌ను అరెస్టు చేసేందుకు గాను పంజాబ్ పోలీసులు ‘పైస్థాయి’ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలోని ఓ కీలకవ్యక్తి ఒకరు వెల్లడించారు. సయీద్ ప్రస్తుతం లాహోర్ లోని జాహర్ పట్టణంలోని తన ఇంట్లో ఉన్నారని, ప్రభుత్వం నుంచి పచ్చజెండా రాగానే ఏక్షణమైనా పోలీసులు సయీద్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని సదరు వ్యక్తి తెలిపారు. సయీద్ ఈ వారంలోనే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనీ వివరించారు. ఉగ్రవాదాన్ని అదుపులో పెట్టే విషయమై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) పాక్‌కు గతంలో పలుమార్లు చివాట్లు పెట్టింది. జూన్‌లోగా చర్యలు తీసుకోవాలంటూ ఎఫ్ఏటీఎఫ్ గతంలో విధించిన గడువును పాక్ ఉల్లఘించింది. దీంతో గడువును అక్టోబర్ వరకు పొడిగించిన ఎఫ్ఏటీఎఫ్.. ఉగ్రవాదాన్ని అణచివేయాల్సిందేనని పాక్‌కు తేల్చిచెప్పింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే సయీద్ అరెస్టుకు పాకిస్తాన్ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాద గ్రూపులపై నామమాత్రపు చర్యలు మాత్రమే తీసుకుంటూ అంతర్జాతీయ సమాజాన్ని పాకిస్తాన్ మోసగించడానికి ప్రయత్నిస్తోందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రావీష్ కుమార్ గురువారం మీడియాతో అన్నారు. -
నిజంగా అదృష్టవంతుడే..!!
అబుదాబి : భూమి మీద నూకలు ఉంటే చాలు చావు అంచుల దాకా వెళ్లినా సరే తిరిగి రావొచ్చు అన్న మాట అభినవ్ చారి అనే వ్యక్తికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ముష్కరులు జరిపిన దాడుల్లో రెండుసార్లు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఏప్రిల్ 21న శ్రీలంకలో మొదలైన బాంబుల మోత ఇప్పటికీ మోగుతూనే ఉంది. భద్రతా వైఫల్యం కారణంగా ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో వందలాది ప్రాణాలు కోల్పోగా..మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈస్టర్ ఆదివారం రోజున జరిగిన శ్రీలంక పేలుళ్ల నుంచే కాకుండా.. భారత్‌లోని ముంబై ఉగ్రదాడుల(26/11) నుంచి కూడా బయటపడ్డానని చెబుతున్నాడు దుబాయ్‌లో నివసించే ఎన్నారై అభినవ్ చారి. దుబాయ్‌లో నివసిస్తున్న అభినవ్ చారి భార్య నరూప్తో కలిసి బిజినెస్ ట్రిప్‌లో భాగంగా శ్రీలంకకు వెళ్లాడు. ఈ క్రమంలో కొలంబోలోని సినామన్ గ్రాండ్ హోటల్లో బస చేశాడు. ఈస్టర్ సండే సందర్భంగా ఓ చర్చికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి హోటల్‌కు చేరుకునే సరికి అక్కడి బాంబు దాడిలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం చూసి బెంబేలెత్తిపోయాడు. ఈ విషయం గురించి అభినవ్ చారి మాట్లాడుతూ.. ‘ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దాటి బయటి దేశాల్లో బస చేసింది కేవలం రెండే రెండుసార్లు. కానీ ఆ రెండు సందర్భాల్లోనూ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాను. మత విద్వేషం సృష్టించే అరాచకాన్ని చూశాను. మెడిసిన్ చదివేందుకు ముంబై వెళ్లాను. 2008లో అక్కడ ఉన్న సమయంలో ఉగ్రవాదులు దాడి చేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ఐదారు రోజులు వణికిపోయా. ఇప్పుడేమో శ్రీలంకలో. చర్చికి వెళ్లి ప్రార్థనలు చేసిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేద్దామనుకున్నాం. కానీ అప్పటికే రోడ్డుపై అంతా గందరగోళంగా ఉంది. దీంతో హోటల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. అయితే అక్కడికే చేరుకునే కొద్ది నిమిషాల కంటే పేలుడు సంభవించిందని తెలుసుకుని ఆందోళన చెందాను. ఉగ్రదాడుల నుంచి నేను నా భార్య తృటిలో బయటపడ్డాం’ అని చెప్పుకొచ్చాడు. -
సాధ్వి ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలపై ఈసీ ఆరా
భోపాల్ : ముంబై ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్ర పోలీసు అధికారి హేమంత్ కర్కారేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్‌పై ఫిర్యాదు నమోదైంది. ముంబై ఏటీఎస్ మాజీ చీఫ్ కర్కారేపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు గాను ఆమెపై ఫిర్యాదు అందిందని మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిర్దారించారు. ప్రజ్ఞా సింగ్‌పై తాము స్వీకరించిన ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని సీఈఓ స్పష్టం చేశారు. కాగా, 2008 మాలెగావ్ పేలుళ్ల కేసు విచారణలో కర్కారే తనను తీవ్ర వేధింపులకు గురిచేశాడంటూ దర్యాప్తు అధికారి, మాజీ ఎటిఎస్ చీఫ్ హేమంత్ కర్కారేపై అంతకుముందు ఆమె మండిపడ్డారు. తాను శపించిన కారణంగానే కర్కారే దారుణంగా చనిపోయాడంటూ వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది. నిరపరాధిని, సన్యాసిని అయిన తనను వేధించినందుకు భగవంతుడు ఆగ్రహించాడు. అందుకే కర్మ అనుభవించాడని, ఉగ్రవాదులు ఆయనను హతమార్చారని ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
పాక్ ఎన్నికల్లో పోటీకి హఫీజ్ సయీద్ దూరం
లాహోర్: ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్ దవా నాయకుడు హఫీజ్ సయీద్ పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. అయితే, జాతీయ, ప్రావిన్షియల్ అసెంబ్లీ సీట్లకు 200 మందికిపైగా తన మద్దతుదారులను బరిలోకి దించనున్నాడు. తన పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపునివ్వకపోవడంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా(ఎల్ఈటీ)కు అనుబంధ సంస్థ అయిన జమాత్ ఉద్ దవా(జేయూడీ) నాయకుడు హఫీజ్ మిల్లీ ముస్లిం లీగ్(ఎంఎంఎల్) పేరిట రాజకీయ పార్టీని స్థాపించాడు. కానీ, ఎంఎంఎల్‌కు ఎన్నికల కమిషన్ గుర్తింపునివ్వలేదు. దీంతో ఈసీ గుర్తింపు ఉన్న అల్లాహు అక్బర్ తెహ్రీక్(ఏఏటీ)తో ఎంఎంఎల్ జట్టు కట్టింది. సీట్ల పంపకంలో భాగంగా ఎంఎంఎల్ 200 మందికిపైగా అభ్యర్థులను రంగంలోకి దించనుంది. ఎంఎంఎల్ పార్టీలో చేరిన వారికి ఏఏటీ పార్టీ టికెట్లు ఇస్తామని చెప్పారు. -
ముంబై పేలుళ్ల దోషి ముస్తఫా మృతి
ముంబై: 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల ప్రధాన సూత్రధారుల్లో ఒకరైన ముస్తఫా దోసా (60) బుధవారం గుండెపోటుతో మరణించాడు. దావూద్ ఇబ్రహీంకు దోసా అత్యంత సన్నిహితుడు. పేలుళ్ల కేసులో ముస్తఫాతోపాటు మరో నలుగురిని టాడా ప్రత్యేక కోర్టు ఈ నెల 16నే దోషులుగా తేల్చింది. శిక్షలు ఖరారు చేయాల్సి ఉంది. ముంబైలోని జైలులో ఉండగా బుధవారం తెల్లవారుజామున దోసాకు ఛాతీలో నొప్పి మొదలైంది. అధికారులు వెంటనే ముంబైలోని జేజే ఆసుపత్రికి అతణ్ని తరలించారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం రెండున్నర గంటలప్పుడు దోసా ప్రాణాలు విడిచాడని వైద్యులు వెల్లడించారు. ముంబైలో మారణహోమం సృష్టించడానికి అవసరమైన ఆయుధాలు, పేలుడు పదార్థాలను దుబాయ్ నుంచి మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా దిఘీకి, పాకిస్తాన్‌కు సరఫరా చేసింది దోసానే. దోషులు పాకిస్తాన్‌కు వెళ్లి శిక్షణ పొందడానికి కూడా దోసా సోదరులు సహాయం చేశారు. గతంలో ఇదే కేసులో ఉరితీతకు గురైన యాకుబ్ మెమన్ కన్నా దోసా పాత్ర ఎంతో ప్రధానమైనదనీ, దోసాకు కూడా మరణశిక్ష విధించాల్సిందిగా కేసు విచారణ సమయంలో సీబీఐ కోర్టుకు విన్నవించింది. కాగా, ముస్తఫా మరణించినందున శిక్షా కాలం నిర్ణయించడానికి సంబంధించిన విచారణను కోర్టు శుక్రవారం వరకు వాయిదా వేసింది. -
1993 పేలుళ్లు: నిందితుడు రైల్లో భార్యతో ఎంజాయ్
ముంబై: 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంకు సన్నిహితుడు ముస్తఫా దొస్సా రాత్రి రైల్లో భార్యతో ఎంజాయ్ చేస్తూ దొరికిపోయాడు. పేలుళ్లలో దొస్సా పాత్రపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. 2015లో మోడళ్లకు ఆడిషన్ నిర్వహిస్తూ దొస్సా పోలీసులకు దొరికిపోయాడు. ఇదిలా వుండగా పేలుళ్ల కోసం ఉపయోగించిన మందు సామగ్రిని ఎక్కడి నుంచి సేకరించారనే విషయంపై విచారించడానికి దొస్సాను పోలీసులు ముంబై నుంచి పోర్ బందర్ కు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అందుకు రైలు మార్గాన్ని ఎంచుకున్నారు. అయితే, దొస్సా రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో అతని భార్య కూడా వెంటే ఉంది. అహ్మదాబాద్ లో సౌరాష్ట్ర ఎక్స్ ప్రెస్ ఆగిన సమయంలో దొస్సా భార్య షబీనా ఖత్రీ బోగీలోపలికి ప్రవేశించింది. వీరిద్దరు కలిసివున్న ఫోటో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ సమయంలో పోలీసులు కూడా పక్కనే ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయి. కాగా, గతేడాది పేలుళ్లలో మరో నిందితుడైన అబూ సలేం కూడా విచారణకు వేరే ప్రదేశానికి వెళ్లే సమయంలో భార్యతో రైల్లో కనిపించాడు. బిజినెస్ మీటింగ్స్ పోర్ బందర్ కు వెళ్తున్న సమయంలో రైల్లో కొందరితో వ్యాపార విషయాలపై దొస్సా చర్చలు జరిపినట్లు తెలిసింది. దీంతో జైలు నుంచి తన వ్యాపారాలన్నింటిని దొస్సా చక్కబెట్టుకుంటున్న వ్యవహారం బయటపడింది. భార్యతో రైలు అహ్మదాబాద్ చేరుకోగానే.. దొస్సా భార్య ఖత్రీ రైల్లో భర్తను కలిసింది. ఆ తర్వాత పోలీసులు వారిద్దరిని ఒంటరిగా వదిలేసి.. తిరిగి రైలు పోర్ బందర్ చేరుకున్న తర్వాత మాత్రమే తిరిగి దొస్సా వద్దకు వెళ్లినట్లు తెలిసింది. -
దావూద్‌పై 'దేశభక్త' డాన్ ప్రయోగం!
ముంబై/న్యూఢిల్లీ: మాఫియా గ్యాంగ్‌స్టర్ ఛోటారాజన్ అరెస్టుతో చాలా కేసుల్లో మిస్టరీ తొలగిపోతుందని ముంబై పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా మాఫియా చేతిలో హాతమైన 'మిడ్ డే' పత్రిక జర్నలిస్టు జే డే హత్యతోపాటు అనేక నేర, ఉగ్రవాద కేసుల్లో అతని నుంచి కీలక ఆధారాలు రాబట్టాలనే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. అయితే వాస్తవానికి అండర్ వరల్డ్ మాఫియా గురించి ప్రస్తుతం ఛోటారాజన్ వద్ద పెద్దగా సమాచారం ఉండకపోవచ్చునని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. చాలా ఏళ్ల నుంచి మాఫియా ప్రపంచంతో ఏమాత్రం సంబంధాలు లేకుండా ఆయన ఏకాంత జీవితాన్ని గడుపుతున్నాడు. తన అనుచరులకు కూడా అందకుండా అజ్ఞాతవాసంలో ఉన్నాడు. తాను ఎక్కడున్నది బయటపడకుండా వీవోఐపీని వాడుతూ ప్రొక్సీ ఐడీలో వాట్సప్ లో మాత్రమే ఆయన ఫోన్ కాల్స్ చేసేవాడు. ఈ నేపథ్యంలో అనారోగ్యం, ప్రత్యర్థి ఛోటా షకీల్ నుంచి ముప్పు ఉండటంతో ఛోటారాజన్ తిరిగి భారత్ కు వచ్చేందుకు తానే స్వయంగా ముందుకొచ్చి అరెస్టయి ఉంటాడని భావిస్తున్నారు. దేశభక్త డాన్..! నిజానికి 1998లోనే థాయ్‌ల్యాండ్‌లో ఛోటా రాజన్‌ను పట్టుబడ్డాడు. నకిలీ పాస్ పోర్టుతో ప్రయాణిస్తున్న అతను అరెస్టయిన తెల్లారే విడుదలయ్యాడు. అప్పట్లో థాయ్‌లాండ్ నుంచి అతన్ని భారత్ తీసుకువచ్చేందుకు కేంద్ర హోంమంత్రిత్వాశాఖ, భద్రతా సంస్థలు ఆసక్తి చూపలేదు. ఇందుకు కారణం అప్పట్లో మాఫియా డాన్ దావూద్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర నిఘా సంస్థలు ఛోటా రాజన్‌ను ప్రధాన ఆయుధంగా వాడుకున్నాయి. 1993 ముంబై పేలుళ్లతో దావూద్ కు దూరం జరిగిన ఛోటా రాజన్ తనను తాను దేశభక్త హిందూ డాన్‌గా అభివర్ణించుకునేవాడు. ముఖ్యంగా రీసెర్చ్ అనాసిస్ వింగ్ (రా), ఐబీలు రాజన్ ను దావూద్ గ్యాంగ్ కు వ్యతిరేకంగా ఉపయోగించుకున్నాయని అధికార వర్గాలు చెప్తాయి. దీంతో దావూద్, ఐఎస్ఐ అనుచరులను తుదముట్టించడంలో రాజన్ కీలకంగా వ్యవహరించాడు. నేపాల్ లో ఎమ్మెల్యే దిల్షాద్ మీర్జా బైగ్, ఐఎస్ఐ మాస్టర్ మైండ్ ఖలీద్ మసూద్, పర్వెజ్ టాండాలను నిఘావర్గాల మద్దతుతోనే ఛోటా రాజన్ హతమార్చాడు. దావూద్ కీలక అనుచరుడు, ఈస్ట్ వెస్ట్ ఎయిర్ లైన్స్‌కు చెందిన తకివుద్దీన్ వాహిద్ ఖాన్ హత్యలోనూ రాజన్ హస్తమున్నట్టు వార్తలు వచ్చాయి. -
మళ్లీ జైలుకెళ్లిన మున్నాభాయ్
-
మళ్లీ జైలుకెళ్లిన మున్నాభాయ్
ముంబై: బాలీవుడ్ హీరో, 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో శిక్ష పడిన సంజయ్‌దత్ తిరిగి జైలుకు వెళ్లారు. ముఫ్పై రోజుల పెరోల్‌పై బయటకు వచ్చిన అతడు ఆ గడువు ముగియడంతో జైలు గూటికి చేరుకున్నారు.. 1993 ముంబై పేలుళ్లకు సంబంధించి అక్రమంగా ఆయుధాలు సరఫరా చేసిన నేరానికిగాను సంజయ్ దత్‌కు జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో అతడిని దోషిగా నిర్థారించిన సుప్రీంకోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే 1996లో 18 నెలల పాటు శిక్ష అనుభవించిన కాలాన్ని మినహాయించిన కోర్టు మరో 42 నెలల పాటు శిక్ష అనుభవించాలని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో పుణె-ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంజయ్ గత నెలలో పెరోల్‌పై బయటకు వచ్చారు. ఆ గడువు ముగియడంతో మళ్లీ జైలుకు వెళ్లాడు. భార్య మాన్యత, ఇద్దరు కవలలు ఇక్రా, షహరాలు ...సంజయ్ దత్‌కు వీడ్కోలు పలికారు. -
కరాచీలోనే దావూద్
-
కరాచీలోనే దావూద్
నిద్రపోతున్నాడని విలేకరికి ఫోన్లో చెప్పిన భార్య దావూద్‌కు 3 పాక్ పాస్‌పోర్టులు, పాక్‌లో 9 ఇళ్లు, భార్య పేరుతో ఫోన్ బిల్లు.. భారత నిఘా వర్గాల వద్ద గట్టి ఆధారాలు న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల సూత్రధారి, అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడని అంటున్న పాకిస్తాన్ మాటలన్నీ బుకాయింపులేనని తేలిపోయింది. అతడు పాక్‌లోని కరాచీలోనే తిష్ట వేసినట్లు నిరూపించే గట్టి ఆధారాలు వెలుగు చూశాయి. డాన్ కరాచీలో ఉన్నాడని అతని భార్య ఓ టీవీ చానల్ శనివారం చేసిన ఫోన్ కాల్‌కు బదులిచ్చింది. మరోపక్క.. దావూద్‌కు పాక్ ఇచ్చిన పాస్‌పోర్టులు, కరాచీలోని అతని భార్య పేరుతో ఉన్న ఫోన్ బిల్లు కూడా బహిర్గతమయ్యాయి. పాక్ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)తో జరపాలనుకున్న చర్చల్లో భారత ఎన్ఎస్ఏ..ఆయనకు అందివ్వడానికి ఈ ఆధారాలు(డోసియర్) సిద్ధం చేశారు. గడ్డం తీసేసి.. 59 ఏళ్ల దావూద్, అతని కుటుంబం పాక్‌లోని కరాచీలోనే ఉన్నట్లు తెలిపే గట్టి ఆధారాలను భారత నిఘా సంస్థలు సేకరించాయి. వీటిలో పాక్ దావూద్‌కు 1996లో ఇచ్చిన పాస్‌పోర్టు(నం. సీ-267185), ఇతర డాక్యుమెంట్లు ఉన్నాయి. ఈ పాస్‌పోర్టులో దావూద్ గడ్డం లేకుండా, తలపై పల్చని వెంట్రుకలతో ఉన్నాడు. అతనికి మరో రెండు పాక్ పాస్‌పోర్టులూ ఉన్నాయి. వీటితో తరచూ ప్రయాణాలు చేస్తున్నాడు. అతని భార్యాపిల్లలకూ, ఇద్దరు సోదరులకూ పాక్ పాస్‌పోర్టులు ఉన్నాయి. దావూద్ భార్య మెహజబీన్ షేక్ పేరుతో ఉన్న ఏప్రిల్, 2015 నాటి టెలిఫోన్ బిల్లు మరో ఆధారం. అందులో ఫోన్ చిరునామాను ‘డి-13, బ్లాక్-4, కరాచీ డెవలప్మెంట్ అథారిటీ, ఎస్‌సీహెచ్-5, క్లిఫ్టన్’గా పేర్కొన్నారు. దావూద్ దంపతులతోపాటు వారి కొడుకు మొయీన్, కూతుళ్లు మెహ్రుఖ్, మెహ్రీన్, మాజియాలు కూడా పాక్‌లో ఉన్నారని, వారు కరాచీ-దుబాయ్ మధ్య ప్రయాణాలు చేస్తున్నారని కూడా తెలిసింది. మెహ్రుఖ్ను పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ కొడుకు జునాయిద్ పెళ్లి చేసుకున్నాడు. మెహజబీన్, మాజియాలు ఈ ఏడాది జనవరి 4న విమానంలో కరాచీ నుంచి దుబాయ్ వెళ్లారు. దావూద్ సన్నిహితులైన జబీర్ సిద్దిక్, జవైద్ చోటానీ, ముంబై పేలుళ్ల నిందితుడు జావేద్పటేల్ అలియాస్ చిక్నా తదితరులు కూడా పాక్‌లో ఉన్నారని నిఘా వర్గాలు కనిపెట్టాయి. డీ-కంపెనీ పాక్‌లోనే ఉన్నా భారత్‌లో బలవంతపు వసూళ్లు వంటి నేరాలకు పాల్పడుతోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. పాక్‌లో 9 ఇళ్లు.. దావూద్‌కు పాక్‌లో 9 ఇళ్లు ఉన్నట్లు భారత్‌కు ఆధారాలు లభించాయి. డాన్ రెండేళ్ల కిందట కరాచీ క్లిఫ్టన్లో ఒక ఇళ్లు కొన్నాడు. అది పాక్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో తనయుడు బిలావల్ ఇంటికి దగ్గర్లోనే ఉంది. ఈ ఇంటితోపాటు, క్లిఫ్టన్లోనే ఐదు ఇల్లు, నగరంలో ఐఎస్ఐ సురక్షిత స్థావరమైనడిఫెన్స్ హౌసింగ్ ఏరియాలో మరో ఇల్లు, ఇస్లామాబాద్‌లో రెండిళ్లు ఉన్నాయి. అతడు పాక్‌లో చాలా ఆస్తులు కూడబెట్టాడని, పాక్ భద్రతా సంస్థ రక్షణలో ఉన్నాడని భారత డోసియర్‌లో పేర్కొన్నారు. కాగా, తాజా ఆధారాలపై హోం మంత్రి రాజ్‌నాథ్ స్పందిస్తూ.. దావూద్ పాక్‌లో పలుచోట్ల స్థావరాలు మారుస్తున్నా ఆ దేశంలోనే ఉన్నాడని స్పష్టం చేశారు. ‘ఆయన నిద్రపోతున్నారు..’ దావూద్ భార్య మెహజబీన్ షేక్ పేరుతో ఉన్న టెలిఫోన్ నంబర్ ఆధారంగా టైమ్స్ నౌ టీవీ చానల్ విలేకరి శనివారం కరాచీలోని మెహజబీన్కు ఫోన్ చేయగా, డాన్ అక్కడే ఉన్నట్లు తేలింది. ఫోన్ సంభాషణ ఇలా సాగింది. తొలి ఫోన్ కాల్.. విలేకరి: వాలేకుమ్ అస్సలామ్: నేను మెహజబీన్ షేక్‌తో మాట్లాడొచ్చా? మెహజబీన్: ఎస్. నేను మెహజబీన్నే. మీరెవరు? విలేకరి: మేడమ్, మీరు కరాచీ నుంచే మాట్లాడుతున్నారా? మెహజబీన్: ఎస్. విలేకరి: మేడమ్, మీరు దావూద్ ఇబ్రహీమ్ భార్యేనా? మెహజబీన్: అవును, ఆయన నిద్రపోతున్నారు. రెండో ఫోన్ కాల్.. విలేకరి: నేను దావూద్‌తో మాట్లాడాలి, ఆయన అక్కడున్నారా? మెహజబీన్: నాకు తెలియదు. తర్వాత ఫోన్ చేయండి(కాల్ కట్ అయింది) -
జైలుకు బర్త్‌డే కేక్ పంపించారు
ముంబై: ముంబై పేలుళ్ల కేసులో దోషిగా ఉన్న యాకూబ్ మెమన్ పుట్టిన రోజు సందర్భంగా అతని కుటుంబసభ్యులు జైలు అధికారులకు బుధవారం రాత్రి బర్త్‌డే కేక్ పంపించారు. మెమన్ పుట్టినరోజు వేడుక జరపాలని పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. క్షమాబిక్ష పిటిషన్‌పై వారు అప్పటివరకూ ఎన్నో అశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే గతేడాది మెమన్ తొలి పిటిషన్ ను తిరస్కరణను గురైన విషయం తెలిసిందే. మరోవైపు తెల్లవారితే తన 54వ పుట్టిన రోజు.. తెల్లవారితే ఉరి.. ఇలాంటి పరిస్థితుల మధ్య యాకూబ్ మెమన్ ఉద్వేగానికి లోనయ్యాడు. బుధవారం నాడు జైలు అధికారులు పెట్టిన ఆహారాన్ని కూడా అతడు తీసుకోలేదు. తెల్లవారుజామున 1.20 గంటలకే మెమన్ను నిద్రలేపిన అధికారులు, ఆ తర్వాత అతడిని స్నానం చేయమన్నారు. జైలు సూపరింటెండెంట్, జైలు వైద్యాధికారి, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, ఇద్దరు ప్రభుత్వ సాక్షుల సమక్షంలో.. జైలు దుస్తుల్లోనే ఉన్న మెమన్ ను ఉరికంబం వద్దకు తీసుకెళ్లి ఉరి తీశారు. దీంతో 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల కేసుకు సంబంధించి మొట్టమొదటి ఉరి శిక్ష అమలైనట్లయింది. -
నాగపూర్ సెంట్రల్ జైల్లో నేడు మెమన్‌కు ఉరి
-
'అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి'
ముంబై : నేడు యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష విదిస్తున్నందున అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ ఉరి శిక్ష నేపథ్యంలో నాగ్ పూర్, ముంబైలలోమహారాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై తాజా పరిస్థితులపై సమీక్షించారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది. ముంబై, నాగ్‌పూర్‌లో భద్రత కట్టుదిట్టం చేయడంతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని మత పెద్దలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. -
నేరము శిక్ష
► యాకూబ్ మెమన్ను 1994 ఆగస్టు 5న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశామని సీబీఐ చెప్తోంది. కానీ.. తాను 1994 జూలై 28న నేపాల్‌లో పోలీసులకు లొంగిపోయానని అతడన్నాడు. అతడిని అదుపులోకి తీసుకున్నపుడు యాకూబ్ కరాచీలో ఉండగా జరిపిన సంభాషణల ఆడియో రికార్డును కూడా అతడి బ్రీఫ్‌కేసు నుంచి స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్నప్పటి నుంచీ అతడిని తొలుత ఎరవాడ జైలులో ఉంచారు. 2007 ఆగస్టులో నాగ్‌పూర్ సెంట్రల్ జైలుకు బదిలీచేశారు. యాకూబ్ ఆ జైలు నుంచే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ వర్సిటీ నుంచి ఆంగ్ల సాహిత్యంలో, రాజకీయశాస్త్రంలో ఎం.ఎ. పట్టాలు పొందాడు. ► యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్ 1962 జూలై 30న ముంబైలో పుట్టాడు. ముంబైలోనే కామర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశాడు. 1990లో చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సును పూర్తిచేశాడు. 1991లో బాల్య స్నేహితుడు చేతన్ మెహతాతో కలిసి ‘మెహతా అండ్ మెమన్ అసోసియేట్స్’ పేరుతో చార్టర్డ్ అకౌంటెన్సీ సంస్థను నెలకొల్పాడు. ఆ తర్వాతి ఏడాది వారు విడిపోయారు. యాకూబ్ ‘ఏఆర్ అండ్ సన్స్’ పేరుతో అకౌంటెన్సీ సంస్థను ప్రారంభించాడు. మరుసటి ఏడాదే ముంబై మెమన్ సమాజం నుంచి ‘ఈ ఏడాది ఉత్తమ చార్టర్డ్ అకౌంటెంట్’ అవార్డు పొందాడు. మాంస ఉత్పత్తులను ఎగుమతి చేసే ‘తేజ్రాత్ ఇంటర్నేషనల్’ అనే ఎగుమతి సంస్థను యాకూబ్ స్థాపించాడు. ► 1993 ముంబై బాంబు పేలుళ్ల ప్రణాళికారచన, అమలులో దావూద్ ఇబ్రహీంకు, తన సోదరుడైన టైగర్ మెమన్‌కు యాకూబ్ ఆర్థికంగా సాయం చేశాడని దర్యాప్తు సంస్థల అభియోగం. అలాగే.. టైగర్‌మెమన్ నిధుల నిర్వహణతో పాటు.. ఆయుధాలు, పేలుడు పదార్థాల వినియోగంలో 15 మందికి పాకిస్తాన్లో శిక్షణ కార్యక్రమానికి కూడా యాకూబ్ నిధులు సమకూర్చాడని ఆరోపణ. ► యాకూబ్‌ను నేరపూరిత కుట్ర అభియోగం కింద దోషిగా నిర్ధారించిన టాడా కోర్టు అతడికి 2007 జూలై 27న ఉరిశిక్ష విధించింది. ‘ఉగ్ర’దాడికి సాయం చేయటం, ప్రోత్సహించటం; ఆయుధాలలను అక్రమంగా కలిగివుండటం, రవాణా చేయటం; ప్రాణాలు హరించే ఉద్దేశంతో పేలుడు పదార్థాలు కలిగివుండటం అభియోగాల్లో కూడా అతడిని దోషిగా నిర్ధారించిన కోర్టు.. ఆ నేరాలకు గాను జీవిత ఖైదు, 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ► టాడా కోర్టు తీర్పుపై మరో 100 మందితో పాటు యాకూబ్ సుప్రీంకోర్టులో అప్పీలు చేశాడు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అతడికి విధించిన మరణశిక్ష నిర్థరణ కోసం కోర్టులో రిఫరెన్స్ పిటిషన్ వేసింది. వీటిపై 2011 నవంబర్ 1న విచారణ ప్రారంభించిన సుప్రీం కోర్టు 2013 మార్చి 21న తీర్పు ఇస్తూ.. యాకూబ్‌ను నాటి దాడుల వెనుక ‘మాస్టర్‌మైండ్’గా, ‘డ్రైవింగ్ఫోర్స్’గా అభివర్ణిస్తూ.. అతడికి విధించిన ఉరిశిక్ష ఖరారు చేసింది. మరో 10 మందికి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా తగ్గించింది. ఈ ఖైదు పడ్డ 18 మందిలో 16 మంది ఆ శిక్షను ఖరారు చేసింది. ► ఆ తర్వాత.. సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరుతూ యాకూబ్ రివ్యూ పిటిషన్ వేశారు. 2013 జూలై 30వ తేదీన.. సుప్రీం ద్విసభ్య బెంచ్ మౌఖికంగా విచారించాలని కోరిన యాకూబ్ దరఖాస్తును తిరస్కరించింది. రివ్యూపిటిషన్‌ను కొట్టివేసింది. మరణశిక్ష తీర్పులపై రివ్యూ పిటిషన్లను మౌఖికంగా విచారించాలనియాకూబ్ రిట్ పిటిషన్ వేశాడు. ►2013 ఆగస్టు 14న యాకూబ్‌కు మరణశిక్ష అమలు చేయటానికి మహారాష్ట్ర ప్రభుత్వం తొలి డెత్ వారంట్ జారీ చేసింది. ► క్షమాభిక్ష కోసం యాకూబ్ చేసుకున్న దరఖాస్తును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2014 ఏప్రిల్ 11న తిరస్కరించారు. ► మరణశిక్ష తీర్పుల సమీక్షను.. చాంబర్లలో కాకుండా బహిరంగ కోర్టులో విచారించాలని యాకూబ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ విచారిస్తున్నందున.. యాకూబ్‌కు ఉరిశిక్ష అమలును నిలిపి ఉంచాలంటూ 2014 జూన్ 2న సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ► యాకూబ్ రివ్యూ పిటిషన్‌పై 2015 మార్చి 24న కోర్టు హాలులో విచారణ మొదలైంది. అతడి తరఫున సీనియర్ న్యాయవాది జస్పాల్సింగ్ వాదించారు. 2015 ఏప్రిల్ 9న రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత యాకూబ్ క్యురేటివ్ పిటిషన్ వేయగా.. సుప్రీంకోర్టు ఈ నెల 21వ తేదీన దానిని తిరస్కరించింది. ► ఈలోగా.. యాకూబ్‌కు ఉరిశిక్ష అమలు చేయటానికి జూలై 30వ తేదీని నిర్ణయిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం డెత్ వారంట్ జారీ చేసింది. దీంతో యాకూబ్ మహారాష్ట్ర గవర్నర్‌కు క్షమాభిక్ష దరఖాస్తు పెట్టుకున్నాడు. అలాగే.. తనకు చట్టపరంగా గల ప్రత్యామ్నాయాలన్నిటినీ వినియోగించుకోకముందే డెత్ వారంట్ జారీ చేయటం చట్టవ్యతిరేకమని పేర్కొంటూ.. క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం వచ్చే వరకూ తనకు ఉరిశిక్ష అమలు చేయటాన్ని నిలిపివేయాలని కోరుతూ జూలై 23న సుప్రీంలో రిట్ పిటిషన్ వేశాడు. ► జూలై 28: యాకూబ్.. తాను సమర్పించిన క్యూరేటివ్ పిటిషన్‌పై ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. దానిపై నిర్ణయం తీసుకునే విషయంలో సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం అవసరమైన కోరం హాజరు కాలేదని తాజా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తూ.. దీనిపై అత్యవసరంగా విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తిచేశారు. ► జూలై 29: ప్రత్యేకంగా ఏర్పాటైన త్రిసభ్య ధర్మాసనం.. యాకూబ్‌కు మరణశిక్ష అమలుపై స్టే విధించటానికి నిరాకరించింది. యాకూబ్ మహారాష్ట్ర గవర్నర్ సి.విద్యాసాగరరావుకు క్షమాభిక్ష దరఖాస్తు సమర్పించారు. ఆయన దానిని తిరస్కరించారు. దీంతో యాకూబ్ మరోసారి రాష్ట్రపతికి క్షమాభిక్ష దరఖాస్తును సమర్పించారు. -
మెమన్‌కు ఉరి
నాగపూర్ సెంట్రల్ జైల్లో నేడు ఉదయం అమలు ► స్టే పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ►క్షమాభిక్షకు నిరాకరించిన రాష్ట్రపతి, మహారాష్ట్ర గవర్నర్ ►సుప్రీం తీర్పును స్వాగతించిన బీజేపీ, కాంగ్రెస్.. ►ముంబై, నాగపూర్లలో భద్రత కట్టుదిట్టం ►1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో శిక్ష ఉరిపై ఉత్కంఠకు తెరపడింది! చర్చోపచర్చలు, వాదోపవాదాలు ముగిశాయి. 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్‌కు మరణశిక్ష అమలు ఖరారైంది. శిక్షను తప్పించుకునేందుకు అతడు చివరికి వరకూ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ రోజు(గురువారం) ఉదయం నాగ్‌పూర్ జైల్లో మెమన్ను ఉరి తీయనున్నారు. ఇదే రోజు అతడి పుట్టిన రోజు కూడా! శిక్ష అమలుపై స్టే ఇవ్వాలన్న మెమన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు బుధవారం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. మెమన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను సైతం మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు తిరస్కరించారు. ఇక ఆఖరిగా.. క్షమాభిక్ష కోరుతూ బుధవారం మెమన్ మరోసారి రాష్ట్రపతిని ఆశ్రయించారు. రాత్రి 10.45 గంటల సమయంలో.. క్షమాభిక్షను తోసిపుచ్చుతూ రాష్ట్రపతి నిర్ణయం వెలువరించారు. ఇక ఉదయం శిక్ష అమలు కావడమే మిగిలింది!! న్యూఢిల్లీ/నాగపూర్: 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్(53) ఉరిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మరణశిక్ష అమలు ఖరారైంది. మరణశిక్షను తప్పించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ రోజు(గురువారం) ఉదయం నాగపూర్ సెంట్రల్ జైల్లో మెమన్ను ఉరి తీయనున్నారు. ఇదే రోజు మెమన్ పుట్టినరోజు కూడా కావడం విశేషం. ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలన్న మెమన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. ఈ జులై 30న మెమన్ను ఉరితీయాలంటూ ఈ ఏడాది ఏప్రిల్ 30న ముంబైలోని టాడా కోర్టు జారీ చేసిన డెత్ వారంట్లో ఎలాంటి చట్టపరమైన లోపాలు లేవని తేల్చిచెప్పింది. ఆ ఉత్తర్వులను తప్పుబట్టలేమంటూ మెమన్ పిటిషన్‌ను కొట్టేసింది. మరోవైపు, రాజ్యాంగ అధికరణ 161 కింద మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను మహారాష్ట్ర గవర్నర్ తిరస్కరించారు. ఉరిపై స్టే విధించాలన్న మెమన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టేసిన కాసేపటికే గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆ నిర్ణయం తీసుకున్నారు. చివరి ప్రయత్నంగా, క్షమాభిక్ష కోరుతూ బుధవారం మెమన్ మళ్లీ రాష్ట్రపతిని ఆశ్రయించారు. ఈ రెండో పిటి షన్నూ రాష్ట్రపతి బుధవారం రాత్రి పొద్దుపోయాక తిరస్కరించారు. మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ఇప్పటికే ఒకసారి తిరస్కరించారు. 1993 మార్చి 12న, 12 వేర్వేరు చోట్ల జరిగిన వరుస పేలుళ్లతో ముంబై(నాటి బొంబాయి) వణికిపోయింది. ఆ భీకర పేలుళ్లలో 250 మందికి పైగా చనిపోగా, సుమారు 700 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. రాత్రి 10.45 ప్రాంతంలో రాష్ట్రపతి నిర్ణయం మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ తిరస్కరించారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంశాఖ కార్యదర్శి ఎల్సీ గోయల్, సొలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్‌లతో బుధవారం రెండు గంటల సుదీర్ఘ చర్చల అనంతరం రాత్రి 10.45 గంటల సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఈ నిర్ణయం వెలువరించారు. రాష్ట్రపతితో భేటీకి ముందు, ప్రధాని నివాసంలో రాజ్‌నాథ్, గోయల్ ఇతర ఉన్నతాధికారులు ప్రధాని మోదీతో సమావేశమై, మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌పై రాష్ట్రపతికి ప్రభుత్వం తరఫున ఏ సూచన ఇవ్వాలనే విషయంపై చర్చించారు. సాధారణంగా ఈ విషయాల్లో కేంద్ర మంత్రిమండలి సలహా ప్రకారం రాష్ట్రపతి నడుచుకుంటారు. ఉరిని ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేసిన మెమన్ లాయర్లు బుధవారం రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాక అర్ధరాత్రి మళ్లీ సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. క్షమాభిక్ష పిటిషన్ నిరాకరణ తర్వాత ఉరి అమలుకు 14 రోజుల గడువు ఇవ్వాలని సుప్రీం మార్గదర్శకాలు సూచిస్తున్నాయని, అందువల్ల మెమన్‌కు 14 రోజుల సమయం ఇవ్వాలని కోరారు. సుప్రీంలో.. ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలన్న మెమన్ పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు త్రిసభ ధర్మాసనం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ దవేల ద్విసభ్య బెంచ్ మంగళవారం ఉరిని నిలిపేసే అంశంపై విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో.. ఆ అంశపై తుది నిర్ణయం తీసుకునేందుకు జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ రాయ్ సభ్యులుగా త్రిసభ్య బెంచ్‌ను చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు ఏర్పాటుచేయడం తెలిసిందే. విచారణ తర్వాత టాడా కోర్టు జారీ చేసిన డెత్ వారంట్ సక్రమమేనని ఆ త్రిసభ్య బెంచ్ తేల్చింది. అలాగే, మెమన్ దాఖలు చేసుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను గతంలో సుప్రీంకోర్టు కొట్టేయడం సరైన చర్యేనంది. తన వాదనలు వినకుండానే ఉరిశిక్ష ఉత్తర్వులను టాడా కోర్టు జారీ చేసిందని, తన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించిన తరువాత ఉరిశిక్ష అమలు తేదీని తనకు తెలియజేసే విషయంలో పాటించాల్సిన 14 రోజుల గడవు నిబంధనను ఆ కోర్టు పాటించలేదని మెమన్ చేసిన వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. క్షమాభిక్ష పొందే విషయంలో తనకింకా న్యాయపరమైన అవకాశాలున్నాయన్న వాదననూ కొట్టేసింది. తాను దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు 2015, జూలై 21న కొట్టేసిన తరువాతే.. క్షమాభిక్ష కోరుతూ మెమన్ మహారాష్ట్ర గవర్నర్‌ను ఆశ్రయించారని గుర్తు చేసింది. మెమన్ పిటిషన్‌ను ఏప్రిల్ 11, 2014న రాష్ట్రపతి తిరస్కరించారని, ఆ విషయాన్ని మే 26, 2014న మెమన్‌కు తెలియజేశారని పేర్కొంది. మొదటి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేసేందుకు మెమన్ ప్రయత్నించలేదని, అందువల్ల తాజాగా రాష్ట్రపతికి ఆయన పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్.. ఉరిశిక్ష అమలులో అడ్డుకాబోదని స్పష్టం చేసింది. తనకు అనుకూలంగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ (రా) మాజీ అధికారి రాసిన ఒక వ్యాసాన్ని, అలాగే స్కీజోఫ్రీనియాతో బాధపడుతున్నాననే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ మెమన్ రాష్ట్రపతికి పెట్టుకున్న రెండో క్షమాభిక్ష పిటిషన్ గురించి తాము ప్రస్తావించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. మెమన్ దాఖలు చేసుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను కొట్టేసిన సమయంలో ఆ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ జడ్జీలు ముగ్గురు( చీఫ్ జస్టిస్ సహా) నిబంధనల ప్రకారం నడుచుకోలేదన్న జస్టిస్ జోసెఫ్ కురియన్ అభిప్రాయంతో బెంచ్ ఏకీభవించలేదు. మెమన్ క్యూరేటివ్ పిటిషన్‌ను మళ్లీ విచారించాలని జస్టిస్ కురియన్ మంగళవారం అభిప్రాయపడిన విషయం తెలిసిందే. మెమన్ ద్రోహి.. ఏజీ.. విచారణ ముగింపు దశలో అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ చేసిన వ్యాఖ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. మెమన్ను ద్రోహి అని రోహత్గీ పేర్కొనడంపై సీనియర్ న్యాయవాది టీఆర్ అంధ్యార్జున తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసులో జోక్యం చేసుకునే హక్కు మీకు లేదంటూ మెమన్‌కు మద్దతుగా వాదించబోతున్న అంధ్యార్జునను రోహత్గీ అడ్డుకున్నారు. ‘క్షమాభిక్ష పిటిషన్ అనేది గౌరవానికి సంబంధించిన అంశం కాదు. అది దోషుల రాజ్యాంగ హక్కు. న్యాయపరమైన అన్ని అవకాశాలు పూర్తికాకుండా మెమన్ను ఉరితీయడం అన్యాయం’ అని అంధ్యార్జున అన్నారు. దానికి ‘పేలుళ్లలో చనిపోయిన 250 మంది హక్కుల మాటేమిటి? ద్రోహిని సర్థిస్తూ మీరు మాట్లాడుతున్నారు’ అని రోహత్గీ అన్నారు. ‘మరణం అంచున ఉండి, జీవితం కోసం పోరాడుతున్న వ్యక్తిని పరిహసించకూడద’ని అంధ్యార్జున పేర్కొనడంతో.. మెమన్ను ద్రోహి అని సుప్రీంకోర్టే పేర్కొందని రోహత్గీ గుర్తుచేశారు. కలాంకు నివాళిగా.. ఉరిని నిలిపేయండి! సోమవారం మరణించిన మాజీ రాష్ట్రపతి కలాం సిద్ధాంతాలను గౌరవిస్తూ.. మెమన్‌కు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా తగ్గించాలని పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్, మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. మరణ శిక్షను కలాం వ్యతిరేకించేవారని, అందువల్ల మెమన్‌కు విధించిన ఉరిశిక్షను తగ్గించడం కలాంకు సరైన నివాళి ఇవ్వడం అవుతుందన్నారు. సుప్రీం తీర్పును పలువురు న్యాయనిపుణులు తప్పుపట్టారు. సాక్ష్యాలను తీసుకొచ్చి, దర్యాప్తులో సాయపడ్డ వ్యక్తిని ఉరితీస్తున్నారని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ అన్నారు. ఉరి తీయాల్సిందే..మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేయాల్సిందేనని ముంబై పేలుళ్ల బాధితులు పలువురు స్పష్టం చేశారు. వారంతా కలసి బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు వినతి పత్రం సమర్పించారు. దానిపై 1,600 మంది సంతకాలు చేశారు. ‘ఆత్మీయులను కోల్పోయి మా కుటుంబాలు ఎంతో వేదనను అనుభవించాయి. మెమన్‌కు ఉరిశిక్ష విధించాల్సిందే’ అని పేలుళ్లలో తన తల్లిని కోల్పోయిన తుషార్ దేశ్‌ముఖ్ డిమాండ్ చేశారు. పార్టీల స్పందన..ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలన్న మెమన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని బీజేపీ, కాంగ్రెస్ స్వాగతించాయి. ‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ముంబై పేలుళ్ల బాధితులకు న్యాయం జరిగింది. ఈ దేశ ప్రజలకు న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం మరింత పెరిగింది’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ వ్యాఖ్యానించారు. ముంబై పేలుళ్ల బాధితులకు పాక్షిక న్యాయమే అందింది. పేలుళ్ల కీలక సూత్రధారి టైగర్ మెమన్ను పాక్ నుంచి తీసుకువచ్చి శిక్ష విధించిననాడే వారికి పూర్తి న్యాయం జరిగినట్లు అవుతుంది’ అని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జెవాలా పేర్కొన్నారు. మెమన్‌కు క్షమాభిక్ష ప్రసాదించకూడదనేది దేశప్రజలందరి ఆకాంక్ష అని శివసేన పేర్కొంది. న్యాయవర్గాల్లో మాత్రం ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిరుత్సాహపరచింది.. ఒవైసీ: కోర్టు తీర్పు నిరుత్సాహపరచిందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రాజకీయ మద్దతు లేకపోవడం వల్లనే మెమన్‌కు ఉరిశిక్ష విధించారన్నారు. పేలుళ్లలో మెమన్ పాత్ర ఉందని, అయితే, అందుకు ఉరిశిక్ష విధించడం మాత్రం సరికాదన్నారు. ‘అప్పటి పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెమన్ను మోసం చేయడం వల్లనే మెమన్‌కు ఉరి శిక్ష పడింది. రాజీవ్ హంతకులు, పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ హంతకులకు ఉన్నట్లుగా మెమన్‌కు రాజకీయపరమైన మద్దతు లేకపోవడం కూడా ఒక కారణం’ అని వ్యాఖ్యానించారు. బాబ్రీమసీదు కూల్చివేతదారులకు కూడా ఉరిశిక్ష విధించాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఉరి అమలు ఎలా..! జైలు మాన్యువల్ ప్రకారం.. యాకూబ్ మెమన్ను గురువారం వేకుజామున నిద్ర లేపుతారు. స్నానాదికాలు పూర్తయ్యాక తేలిగ్గా ఉండే ఆహారం అందిస్తారు. తర్వాత ప్రార్థన చేసుకునేందుకు అవసరమైన పుస్తకాలు ఇస్తారు. మరణశిక్ష అమలు చేసే ముందు వైద్యులు మెమన్ను పరీక్షిస్తారు. ఆ తరువాత ఉరికంబం వద్దకు తీసుకువెళ్తారు. చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎంఎం దేశ్‌పాండే టాడా కోర్టు ఉత్తర్వుల్లోని ఉరిశిక్ష అమలు భాగాన్ని మెమన్‌కు చదివి వినిపిస్తారు. మెజిస్ట్రేట్ నుంచి ఆదేశాలు రాగానే తలారి తన చేతిలో ఉన్న లివర్‌ను లాగి, ఉరిశిక్ష అమలు చేస్తాడు. అరగంట పాటు ఆ శరీరం అలాగే ఉరికంబంపై వేలాడుతూ ఉండాలని జైలు మాన్యువల్ స్పష్టం చేస్తోంది. ఆ తరువాత వైద్యుడు పరీక్షించి, చనిపోయినట్లుగా నిర్ధారిస్తారు. ఆ తరువాత పోస్ట్‌మార్టం నిర్వహిస్తారు. ఉరి అమలు చేసే ముందు, మెమన్ బరువును ఉరికంబం, ఉరితాడు తట్టుకోగలదా? లేదా? అనే విషయాన్ని పరీక్షిస్తారు. మెమన్ బరువుకు ఒకటిన్నర బరువున్న వస్తువుతో ప్రయోగం చేసి ఆ విషయాన్ని నిర్ధారిస్తారు. ఎరవాడ జైల్లో అఫ్జల్ కసబ్‌ను ఉరితీసిన బృందాన్ని మెమన్ ఉరి ప్రక్రియను పర్యవేక్షించేందుకు నాగపూర్ జైలుకు రప్పిస్తున్నారు. జైలు వద్ద పటిష్ట భద్రత యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేసేందుకు అవసరమైన సన్నాహాలన్నీ పూర్తయ్యాయని నాగపూర్ జైలు వర్గాలు వెల్లడించాయి. అదనపు డీజీపీ(జైళ్లు) మీరా బోర్వాంకర్ ఆ సన్నాహాలను పర్యవేక్షించారు. ఆమెకు డీఐజీ(జైళ్లు) రాజేంద్ర దామ్నె, జైలు సూపరింటెండెంట్ యోగేశ్ దేశాయి సహకరించారు. పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను పుణేలోని ఎరవాడ జైల్లో ఉరితీసిన సమయంలో కూడా యోగేశ్ దేశాయి అక్కడే విధుల్లో ఉన్నారు. జైళ్లో భద్రతను పోలీసు ఉన్నతాధికారులు సమీక్షించారు. యాకూబ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చగానే బుధవారం మధ్యాహ్నం నాగ్‌పూర్ జైలు వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ముంబై పోలీసు విభాగానికి చెందిన సుశిక్షిత ‘క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్టీ)’ను రంగంలోకి దింపారు. యాకూబ్‌ను ఉంచిన సెల్ వద్ద కూడా పహారా బాధ్యతలను ఈ టీమ్‌కే అప్పగించారు. జైలు పరిసరాల్లో జనం గుమిగూడకుండా 144 సెక్షన్‌ను విధించారు. ఉరిఅనంతరం, మెమన్ మృతదేహాన్ని జైళ్లోనే ఖననం చేస్తారా? లేక బంధువులకు అప్పగిస్తారా? అనే విషయంపై జైలు సూపరింటెండెంట్ నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. ఒకవేళ, మృతదేహాన్ని బంధువులకు అప్పగించాలని నిర్ణయిస్తే.. పోస్ట్‌మార్టమ్ పూర్తిచేసి యాకూబ్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగిస్తారు. ఆ తర్వాత నాగ్‌పూర్ నుంచి విమానంలో మృతదేహాన్ని ముంబైకి తరలిస్తారు. ముందు జాగ్రత్తగా, ముంబైలోని మెమన్‌ల నివాసం వద్ద ఏకంగా ఐదువేల మంది పోలీసులను నియమించారు. నేరచరిత్ర కలిగిన వారిని ముందస్తు అదుపులోకి తీసుకున్నారు. శాంతిని కాపాడాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేయాలని ఇదివరకే పోలీసులు మతపెద్దలను కోరారు. కాగా, చట్టం తనపని తాను చేసుకుపోతుందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు. సంయమనం పాటించాలని ప్రజలను కోరారు. యాకూబ్ వీలునామా రాయలేదు యాకూబ్ మెమన్ ఎలాంటి వీలునామానూ రాయ లేదని ఆయన న్యాయవాది అనిల్ గెదామ్ తెలిపారు. సుప్రీంకోర్టు నుంచి కానీ, రాష్ట్రపతికి సమర్పించిన క్షమాభిక్ష పిటిషన్ ద్వారా కానీ తనకు ఏదో ఊరట లభిస్తుందని యాకూబ్ ఆశిస్తున్నట్లు చెప్పారు. అందుకే వీలునామా రాయలేదని అన్నారు. మరణశిక్ష అమలు చేసిన తర్వాత అతడి మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు కోరే అవకాశముందని అభిప్రాయపడ్డారు. -
'రాష్ట్రపతి గారూ.. క్షమాభిక్ష ప్రసాదించండి'
న్యూఢిల్లీ: ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి యాకూబ్ మెమెన్ ఉరిశిక్ష అమలుపై ఉత్కంఠ ఏర్పడింది. ఉరిశిక్ష రద్దు చేయాలంటూ యాకూబ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారిస్తోంది. బుధవారం త్రిసభ్య ధర్మాసనం విచారణ చేస్తోంది. కాగా తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని యాకూబ్ ఇదే రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విన్నివించాడు. యాకూబ్ గతంలో కూడా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. ఈ నెల 30న యాకూబ్‌ను ఉరితీయాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. రేపు నాగ్‌పూర్ జైల్లో యాకూబ్‌ను ఉరితీసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో యాకూబ్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు స్టే ఇస్తుందా? లేక రాష్ట్రపతి జోక్యం చేసుకుంటారా అన్న విషయంపై ఉత్కంఠ ఏర్పడింది. -
మెమన్ ఉరిపై ఉత్కంఠ
నేడు విచారించనున్న సుప్రీం త్రిసభ్య ధర్మాసనం స్టే అభ్యర్థనపై విభేదించిన ఇద్దరు న్యాయమూర్తులు న్యూఢిల్లీ: 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్‌కు విధించిన ఉరి శిక్ష అమలుపై ఉత్కంఠ నెలకొంది. ఉరిశిక్షను రేపు(జూలై 30) అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో.. మరణశిక్ష అమలుపై స్టే విధించాలంటూ మెమన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై నిర్ణయం తీసుకునేందుకు మంగళవారం ఒక త్రిసభ్య ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు ఏర్పాటు చేశారు. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ్ రాయ్‌లతో కూడిన ఆ ధర్మాసనం నేడు(బుధవారం) మెమన్ భవితవ్యాన్ని తేల్చనుంది. అంతకుముందు, మెమన్ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన ద్విసభ్య బెంచ్‌లోని ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఉరిశిక్ష అమలుపై స్టే ఇచ్చే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. తుది నిర్ణయం కోసం విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి, బుధవారమే విచారణకు అవకాశం కల్పించాల్సిందిగా చీఫ జస్టిస్‌ను కోరారు. ద్విసభ్య బెంచ్ విచారణ సందర్భంగా మెమన్ స్టే పిటిషన్‌ను జస్టిస్ దవే నిర్ద్వంద్వంగా తోసిపుచ్చగా, జస్టిస్ కురియన్ స్టేపై సానుకూలత వ్యక్తం చేశారు. దాంతో వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించడమే సరైనదని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, మెమన్ తరఫు న్యాయవాది రాజు రామచంద్రన్ బెంచ్‌కు సూచించారు. మెమన్ తన పిటిషన్లో పేర్కొననప్పటికీ.. మెమన్ గతంలో దాఖలు చేసుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను కొట్టేయడంలో లోపాలున్నాయని జస్టిస్ కురియన్ అభిప్రాయపడ్డారు. రివ్యూ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనంలో తనతో పాటు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ దవే సభ్యులని, అందువల్ల క్యూరేటివ్ పిటిషన్‌ను విచారించిన బెంచ్‌లో తామూ ఉండాలనేది నిబంధన అన్నారు. కానీ క్యూరేటివ్ పిటిషన్‌ను విచారించిన బెంచ్‌లో తమ ముగ్గురిలో ఒక్క దవేనే ఉన్నందున అది నిబంధనల ఉల్లంఘనే కాక, జీవించే హక్కును కాలరాయడమూ అవుతుందన్నారు. లోపాలను సరిచేసి, మళ్లీ పిటిషన్‌ను విచారించాలన్నారు. ఉరి అమలుపై స్టే విధించడం అవసరమేనన్నారు. శిక్ష అమలుపై స్టే విధిస్తున్నట్లు స్పష్టం చేయాలన్న మెమన్ లాయర్ అభ్యర్థనను జస్టిస్ కురియన్ తోసిపుచ్చారు. అయితే జస్టిస్ దవే.. పిటిషన్ కొట్టివేత నిబంధనల ప్రకారమే జరిగిందన్నారు. మెమన్ గత రివ్యూ పిటిషన్‌ను, క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసి, ఉరిని నిర్ధారించిన విషయాన్ని.. రాష్ట్రపతి, మహారాష్ట్ర గవర్నర్ క్షమాభిక్షను తిరస్కరించిన అంశాన్ని గుర్తు చేశారు. అయితే, మెమన్ మరోసారి దాఖలు చేసుకున్న క్షమాభిక్ష అభ్యర్థనపై మహారాష్ట్ర గవర్నర్ ఉరిశిక్ష అమలు జరిగేలోపు నిర్ణయం తీసుకోవచ్చన్నారు. -
సూత్రధారిని పట్టూకోలేరా?
-
ఆపరేషన్ ‘ఆమ్లా’ ఆరంభం
సాక్షి, చెన్నై: ముంబైలో పేలుళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఈ పేలుళ్లకు పాల్పడిన తీవ్రవాదులు సముద్రమార్గం గుండానే దేశంలోకి చొరబడినట్లు నిర్ధారణ అయింది. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా సముద్ర తీరాల్లో భద్రతను పెంచారు. రాష్ట్రంలో పదమూడు జిల్లాలు సముద్ర తీరాల్లోనే ఉన్నాయి. దీంతో భారత కోస్టు గార్డ్, నావికాదళంతోపాటుగా మెరైన్ పోలీసులు, హార్బర్ పోలీసులు, కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వీరి పని తీరుకు సవాల్ విసిరే రీతిలో, ఏ మేరకు అప్రమత్తంగా ఉన్నారో పసిగట్టేందుకు ఆపరేషన్ ఆమ్లా మాక్ డ్రిల్‌ను నిర్వహిస్తున్నారు.ఆపరేషన్ ఆరంభం : 36 గంటల పాటు సాగే ఈ ఆపరేషన్ ఆమ్లా మాక్ డ్రిల్ బుధవారం ఉదయం ఆరు గంటలకు ఆరంభం అయిం ది. మరుసటి రోజు రాత్రి వరకు సముద్ర తీరాల్లో గస్తీ కట్టుదిట్టంగా ఉంటుంది. ఆదిశగా రాష్ట్రంలోని చెన్నై, కాంచీపురం, కడలూరు, తూత్తుకుడి, నాగపట్నం, రామనాధపురం, కన్యాకుమారి తదితర 13 సముద్ర తీర జిల్లాల్లో నిఘాను పటిష్ట వంతం చేశారు. ఓ వైపు భారత కోస్ట్ గార్డ్, మరో వైపు రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలోని సముద్ర తీర భద్రతా విభాగం, కేంద్ర బలగాలు, మెరైన్ పోలీసులు డేగ క ళ్లతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలోకి సముద్ర తీరం గుండా తీవ్రవాదులు గుంపులు గుంపులుగా బయలు దేరినట్టు ఏక కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సముద్ర తీర జిల్లాల పోలీసు స్టేషన్లకు, ప్రత్యేక భద్రతా విభాగాలు, అధికారులకు పోలీసు హెడ్ క్వార్టర్స్ నుంచి సమాచారం చేర వేశారు. పరుగో పరుగు: తీవ్రవాదుల చొరబాటు సమాచారంతో సముద్ర తీర జిల్లాల్లో భద్ర తా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. మఫ్టీలో చొరబడే పోలీసుల(తీవ్రవాదుల)ను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాల్ని తనిఖీలు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసినానంతరం అనుమతించారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో నూ భద్రతను కట్టుదిట్టం చేశారు. పడవల్లో సముద్రంలోకి దూసుకెళ్లారు. చేపల వేట నుంచి వస్తున్న జాలర్లను తనిఖీల అనంత రం అనుమతించారు. కాశిమేడు హార్బర్లోకి ఆరున్నర గంటల సమయంలో వేర్వురుగా రెండు పడవల్లో చెన్నైలోకి చొరబడేందుకు యత్నించిన ఆరుగురిని అరెస్టు చేశారు. నీలాంకరైలో మరో ముగ్గురిని అరెస్టు చేశా రు. ఇంకా మరి కొంత మంది జట్టులు జట్టులుగా సముద్ర తీర జిల్లాల్లో చొరబడనుండడంతో వారి కోసం వేట కొనసాగుతోంది. ఆమ్లా ఆపరేషన్ గురువారం రాత్రి వరకు కొనసాగుతుండడంతో పోలీసులకు విశ్రాంతి లేనట్టే. మఫ్టీలో ఉన్న వాళ్లను వదలి పెట్టిన పక్షంలో ఎక్కడ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందోనన్న ఆందోళనలతో సముద్ర తీరాల్లో కళ్లు కాయలు కాచేలా భద్ర తా విధుల్లో సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. ఈ సారి ఆమ్లా ఆపరేషన్‌లో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరినిసైతం కలుపుకున్నారు. బంగారం పట్టి వేత: ఆపరేషన్ ఆమ్లాలో భాగంగా తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ సమయంలో ఓ యువకుడు కోయంబేడులోకి రావడం, అతడి వద్ద జరిపిన తనిఖీల్లో బంగారం బిస్కెట్లు పట్టుబడ్డాయి. నగదు సైతం లభించడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో భువనేశ్వర్‌కు చెందిన రాహుల్ అగర్వాల్‌గా తేలింది. కోయంబత్తూరులోని ఓ బంగారం దుకాణానికి వీటిని తీసుకెళ్తున్న ట్టు పేర్కొన్నా, అందుకు తగ్గ రశీదులు అతడి వద్ద లేవు. పట్టుబడిన 8 కిలోల బంగారం, రూ.8 లక్షల నగదును వాణిజ్య పన్నుల విభాగం అధికారులకు అప్పగించారు. -
'ముంబై పేలుళ్లపై విచారణ వేగవంతం చేయండి'
-
'ముంబై పేలుళ్లపై విచారణ వేగవంతం చేయండి'
న్యూడిల్లీ: 2008 ముంబై పేలుళ్లకు సూత్రధారులైన పాకిస్థానీ ఉగ్రవాదులపై విచారణను వేగవంతం చేయాలని ఆదేశ ప్రధాని నవాజ్ షరీఫ్ దృష్టికి భారత ప్రధాని నరేంద్రమోడీ తీసుకువచ్చారు. నవాజ్ షరీఫ్, మోడీల మధ్య జరిగిన సమావేశంలో పెరుగుతున్న ఉగ్రవాదంపై భారత ప్రధాని ఆందోళన వ్యక్తం చేసినట్టు విదేశాంగ కార్యదర్శి సుజాత సింగ్ మీడియాకు వెల్లడించారు. భారత దేశానికి వ్యతిరేకంగా నడుపుతున్న ఉగ్రవాద కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని షరీఫ్ కు మోడీ సూచించారు. -
‘భత్కల్ పోలీసు వ్యాన్‌ను పేల్చాలనుకున్నాడు’
ముంబై: 2011, జూలై 13 బాంబు పేలుళ్ల కేసుల్లో అరెస్టయి జైలు శిక్ష అనుభవిస్తున్న ఇండియన్ ముజాహిదీన్ సహా వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ జనసంచారం అధికంగా ఉన్న దాదర్‌లో పోలీసు వ్యాన్‌ను పేల్చేందుకు కుట్ర పన్నాడు. అయితే అతను ఆ ప్రాంతానికి చేరుకునే సమయానికి పోలీసు వ్యాన్ అక్కడి నుంచి వెళ్లిపోయిందని రాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్) వర్గాలు శుక్రవారం తెలిపాయి. వ్యాన్‌లోని పోలీసులను చంపాలనుకున్నాడని వివరించాయి. చెత్తకుండీకి సమీపంలో నాలుగో పేలుడు పదార్థాన్ని పెట్టిన భత్కల్ పథకం వేసిన రోజు పోలీసు వ్యాన్ లేకపోవడంతో ఆ బాంబును పేల్చలేదని చెప్పాయి. 2011, జూలై 13న ముంబైలో జనసంచారం ఉన్న ప్రాంతాల్లో మూడు వరుస బాంబు పేలుళ్లు జరగడంతో 21 మంది మృతి చెందగా, 141 మంది గాయపడ్డారు. సాయంత్రం 6.50 గంటలకు జావేరి బజార్‌లోమొదటిది, నిమిషం తర్వాత ఓపెరా హౌస్, 7.04 నిమిషాలకు సెంట్రల్ ముంబైలోని పశ్చిమ దాదర్‌లో పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో అరెస్టయిన భత్కల్ను విచారించగా మొత్తం నాలుగు పేలుడు పదార్థాలను అమర్చామని, అయితే నాలుగో బాంబును మాత్రం పేల్చలేదని అంగీకరించాడు. తూర్పు దాదర్‌లోని పూల మార్కెట్‌కు సమీపంలో సహచరుడు తహసీన్ అక్తర్ షేక్‌తో కలిసి రెండు పేలుడు పదార్థాలు నాటామని తెలిపాడు. అయితే పోలీసు వ్యాన్‌ను లక్ష్యంగా చేసుకున్నామని, ఆ రోజు అనుకున్న సమయంలో ఆ వాహనం లేకపోవడంతో ఆలోచనను విరమించుకున్నామని వివరించాడు. 2011 బాంబు పేలుళ్ల కేసులో భత్కల్, అక్తర్లను విచారించేందుకు న్యూఢిల్లీ నుంచి తీసుకొచ్చిన పోలీసులు విచారించారు. వీరిని గురువారం మోకా కోర్టు ముందు హాజరుపరచగా ఈ నెల 18 వరకు పోలీసు కస్టడీకి ఆదేశించింది. -
ముంబైలో 11 చోట్ల ఉగ్రదాడులకు ఇండియన్ ముజాహిదీన్ రెక్కీ
ఇండియన్ ముజాహిదీన్.. ఈ పేరు వింటే చాలు ముంబై ఉగ్రదాడులు కళ్ల ముందు కదలాడతాయి. అలాంటి ఉగ్రవాద సంస్థ గత నెలలో ముంబై మహానగరంలో 11 చోట్ల మళ్లీ ఉగ్రదాడులు చేసేందుకు రెక్కీ నిర్వహించింది!! ఈ విషయాన్ని ఇటీవలే అరెస్టయిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది యాసీన్ భత్కల్ వెల్లడించాడు. దాంతో మహారాష్ట్ర పోలీసులు ముంబైలో ఒక్కసారిగా భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ రాకేష్ మారియా సంతకం చేసిన ఓ రహస్య నివేదికలోని విషయాలు వెల్లడయ్యాయి. ఆగస్టు మొదటివారంలో నాలుగు సైనేజిలు సహా మొత్తం 11 ప్రాంతాల్లో వీళ్లు రెక్కీలు చేసిన విషయం ఆ నివేదికలో ఉంది. భత్కల్‌తో పాటు అతడి సహచరుడు అసదుల్లా అఖ్తర్‌ను నిఘా సంస్థలు విచారించినప్పుడు వాళ్లు ఈ వివరాలు వెల్లడించారు. ముంబై పోలీసు కమిషనరేట్, జవేరీ బజార్, కల్బాదేవి, మంగళ్‌దాస్ మార్కెట్, లోహార్ చాల్, క్రాఫోర్డ్ మార్కెట్, ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్, ముంబై సెంట్రల్ బస్ డిపో, ముంబాదేవీ ఆలయం, నాగ్‌పడ ప్రాంతంలో ఏటీఎస్ ప్రధాన కార్యాలయం పక్కనే ఉన్న మాగెన్ డేవిడ్ సైనేజి, అగ్రిపడ ప్రాంతంలోని హసిదిమ్ సైనేజి, డోంగ్రీలోని షేర్ రాసన్ సైనేజి, పైధోని ప్రాంతంలోని హరహమీమ్ సైనేజి... ఈ అన్ని ప్రాంతాల మీద దాడులు చేయాలని వారు తలపెట్టి రెక్కీలు చేశారు.