మెమన్‌కు ఉరి | Memon hanging on the today | Sakshi
Sakshi News home page

మెమన్‌కు ఉరి

Published Thu, Jul 30 2015 2:07 AM | Last Updated on Mon, Aug 27 2018 8:24 PM

మెమన్‌కు ఉరి - Sakshi

మెమన్‌కు ఉరి

నాగపూర్ సెంట్రల్ జైల్లో నేడు ఉదయం అమలు
 
స్టే పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
క్షమాభిక్షకు నిరాకరించిన రాష్ట్రపతి, మహారాష్ట్ర గవర్నర్
సుప్రీం తీర్పును స్వాగతించిన బీజేపీ, కాంగ్రెస్..
ముంబై, నాగపూర్‌లలో భద్రత కట్టుదిట్టం
1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో శిక్ష

 
ఉరిపై ఉత్కంఠకు తెరపడింది! చర్చోపచర్చలు, వాదోపవాదాలు ముగిశాయి. 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్‌కు మరణశిక్ష అమలు ఖరారైంది. శిక్షను తప్పించుకునేందుకు అతడు చివరికి వరకూ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ రోజు(గురువారం) ఉదయం నాగ్‌పూర్ జైల్లో మెమన్‌ను ఉరి తీయనున్నారు. ఇదే రోజు అతడి పుట్టిన రోజు కూడా! శిక్ష అమలుపై స్టే ఇవ్వాలన్న మెమన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు బుధవారం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. మెమన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను సైతం మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు తిరస్కరించారు. ఇక ఆఖరిగా.. క్షమాభిక్ష కోరుతూ బుధవారం మెమన్ మరోసారి రాష్ట్రపతిని ఆశ్రయించారు. రాత్రి 10.45 గంటల సమయంలో.. క్షమాభిక్షను తోసిపుచ్చుతూ రాష్ట్రపతి నిర్ణయం వెలువరించారు. ఇక ఉదయం శిక్ష అమలు కావడమే మిగిలింది!!
 
న్యూఢిల్లీ/నాగపూర్: 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్(53) ఉరిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మరణశిక్ష అమలు ఖరారైంది. మరణశిక్షను తప్పించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ రోజు(గురువారం) ఉదయం నాగపూర్ సెంట్రల్ జైల్లో మెమన్‌ను ఉరి తీయనున్నారు. ఇదే రోజు మెమన్ పుట్టినరోజు కూడా కావడం విశేషం. ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలన్న మెమన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. ఈ జులై 30న మెమన్‌ను ఉరితీయాలంటూ ఈ ఏడాది ఏప్రిల్ 30న ముంబైలోని టాడా కోర్టు జారీ చేసిన డెత్ వారంట్లో ఎలాంటి చట్టపరమైన లోపాలు లేవని తేల్చిచెప్పింది. ఆ ఉత్తర్వులను తప్పుబట్టలేమంటూ మెమన్ పిటిషన్‌ను కొట్టేసింది. మరోవైపు, రాజ్యాంగ అధికరణ 161 కింద మెమన్  క్షమాభిక్ష పిటిషన్‌ను మహారాష్ట్ర గవర్నర్ తిరస్కరించారు. ఉరిపై స్టే విధించాలన్న మెమన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టేసిన కాసేపటికే గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆ నిర్ణయం తీసుకున్నారు. చివరి ప్రయత్నంగా, క్షమాభిక్ష కోరుతూ బుధవారం మెమన్ మళ్లీ రాష్ట్రపతిని ఆశ్రయించారు. ఈ రెండో పిటి షన్‌నూ రాష్ట్రపతి బుధవారం రాత్రి పొద్దుపోయాక తిరస్కరించారు.  మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ఇప్పటికే ఒకసారి తిరస్కరించారు. 1993 మార్చి 12న, 12 వేర్వేరు చోట్ల జరిగిన వరుస పేలుళ్లతో ముంబై(నాటి బొంబాయి) వణికిపోయింది. ఆ భీకర పేలుళ్లలో 250 మందికి పైగా చనిపోగా, సుమారు 700 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.

రాత్రి 10.45 ప్రాంతంలో రాష్ట్రపతి నిర్ణయం
మెమన్  క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ తిరస్కరించారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంశాఖ కార్యదర్శి ఎల్‌సీ గోయల్, సొలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్‌లతో బుధవారం రెండు గంటల సుదీర్ఘ చర్చల అనంతరం రాత్రి 10.45 గంటల సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఈ నిర్ణయం వెలువరించారు. రాష్ట్రపతితో భేటీకి ముందు, ప్రధాని నివాసంలో రాజ్‌నాథ్, గోయల్ ఇతర ఉన్నతాధికారులు ప్రధాని మోదీతో సమావేశమై, మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌పై రాష్ట్రపతికి ప్రభుత్వం తరఫున ఏ సూచన ఇవ్వాలనే విషయంపై చర్చించారు. సాధారణంగా ఈ విషయాల్లో కేంద్ర మంత్రిమండలి సలహా ప్రకారం రాష్ట్రపతి నడుచుకుంటారు. ఉరిని ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేసిన మెమన్ లాయర్లు బుధవారం రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాక అర్ధరాత్రి మళ్లీ సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. క్షమాభిక్ష  పిటిషన్ నిరాకరణ తర్వాత ఉరి అమలుకు 14 రోజుల గడువు ఇవ్వాలని సుప్రీం మార్గదర్శకాలు సూచిస్తున్నాయని, అందువల్ల మెమన్‌కు 14 రోజుల సమయం ఇవ్వాలని కోరారు.

సుప్రీంలో.. ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలన్న మెమన్ పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు త్రిసభ ధర్మాసనం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ దవేల ద్విసభ్య బెంచ్ మంగళవారం ఉరిని నిలిపేసే అంశంపై విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో.. ఆ అంశపై తుది నిర్ణయం తీసుకునేందుకు జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ రాయ్ సభ్యులుగా త్రిసభ్య బెంచ్‌ను చీఫ్ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు ఏర్పాటుచేయడం తెలిసిందే. విచారణ తర్వాత టాడా కోర్టు జారీ చేసిన డెత్ వారంట్ సక్రమమేనని ఆ త్రిసభ్య బెంచ్ తేల్చింది. అలాగే, మెమన్ దాఖలు చేసుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను గతంలో సుప్రీంకోర్టు కొట్టేయడం సరైన చర్యేనంది. తన వాదనలు వినకుండానే ఉరిశిక్ష ఉత్తర్వులను టాడా కోర్టు జారీ చేసిందని, తన  క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించిన తరువాత ఉరిశిక్ష అమలు తేదీని తనకు తెలియజేసే విషయంలో పాటించాల్సిన 14 రోజుల గడవు నిబంధనను ఆ కోర్టు పాటించలేదని మెమన్ చేసిన వాదనను ధర్మాసనం  తోసిపుచ్చింది. క్షమాభిక్ష పొందే విషయంలో తనకింకా న్యాయపరమైన అవకాశాలున్నాయన్న వాదననూ కొట్టేసింది. తాను దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు 2015, జూలై 21న కొట్టేసిన తరువాతే.. క్షమాభిక్ష కోరుతూ మెమన్ మహారాష్ట్ర గవర్నర్‌ను ఆశ్రయించారని గుర్తు చేసింది. మెమన్ పిటిషన్‌ను ఏప్రిల్ 11, 2014న రాష్ట్రపతి తిరస్కరించారని, ఆ విషయాన్ని మే 26, 2014న మెమన్‌కు తెలియజేశారని పేర్కొంది. మొదటి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేసేందుకు మెమన్ ప్రయత్నించలేదని, అందువల్ల తాజాగా రాష్ట్రపతికి ఆయన పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్.. ఉరిశిక్ష అమలులో అడ్డుకాబోదని స్పష్టం చేసింది. తనకు అనుకూలంగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ (రా) మాజీ అధికారి రాసిన ఒక వ్యాసాన్ని, అలాగే స్కీజోఫ్రీనియాతో బాధపడుతున్నాననే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ మెమన్ రాష్ట్రపతికి పెట్టుకున్న రెండో క్షమాభిక్ష పిటిషన్ గురించి తాము ప్రస్తావించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. మెమన్ దాఖలు చేసుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను కొట్టేసిన సమయంలో ఆ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ జడ్జీలు ముగ్గురు( చీఫ్ జస్టిస్ సహా) నిబంధనల ప్రకారం నడుచుకోలేదన్న జస్టిస్ జోసెఫ్ కురియన్ అభిప్రాయంతో బెంచ్ ఏకీభవించలేదు. మెమన్ క్యూరేటివ్ పిటిషన్‌ను మళ్లీ విచారించాలని జస్టిస్ కురియన్ మంగళవారం అభిప్రాయపడిన విషయం తెలిసిందే.

మెమన్ ద్రోహి.. ఏజీ.. విచారణ ముగింపు దశలో అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ చేసిన వ్యాఖ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. మెమన్‌ను ద్రోహి అని రోహత్గీ పేర్కొనడంపై సీనియర్ న్యాయవాది టీఆర్ అంధ్యార్జున తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసులో జోక్యం చేసుకునే హక్కు మీకు లేదంటూ మెమన్‌కు మద్దతుగా వాదించబోతున్న అంధ్యార్జునను రోహత్గీ అడ్డుకున్నారు. ‘క్షమాభిక్ష పిటిషన్ అనేది గౌరవానికి సంబంధించిన అంశం కాదు. అది దోషుల రాజ్యాంగ హక్కు. న్యాయపరమైన అన్ని అవకాశాలు పూర్తికాకుండా మెమన్‌ను ఉరితీయడం అన్యాయం’ అని అంధ్యార్జున అన్నారు. దానికి ‘పేలుళ్లలో చనిపోయిన 250 మంది హక్కుల మాటేమిటి? ద్రోహిని సర్థిస్తూ మీరు మాట్లాడుతున్నారు’ అని రోహత్గీ అన్నారు. ‘మరణం అంచున ఉండి, జీవితం కోసం పోరాడుతున్న వ్యక్తిని పరిహసించకూడద’ని అంధ్యార్జున పేర్కొనడంతో.. మెమన్‌ను ద్రోహి అని సుప్రీంకోర్టే పేర్కొందని రోహత్గీ గుర్తుచేశారు.

కలాంకు నివాళిగా.. ఉరిని నిలిపేయండి!
 సోమవారం మరణించిన మాజీ రాష్ట్రపతి కలాం సిద్ధాంతాలను గౌరవిస్తూ.. మెమన్‌కు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా తగ్గించాలని పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్, మహాత్మాగాంధీ మనవడు  గోపాలకృష్ణ గాంధీ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. మరణ శిక్షను కలాం  వ్యతిరేకించేవారని, అందువల్ల మెమన్‌కు విధించిన ఉరిశిక్షను తగ్గించడం కలాంకు సరైన నివాళి ఇవ్వడం అవుతుందన్నారు.  సుప్రీం తీర్పును పలువురు న్యాయనిపుణులు తప్పుపట్టారు. సాక్ష్యాలను తీసుకొచ్చి, దర్యాప్తులో సాయపడ్డ వ్యక్తిని ఉరితీస్తున్నారని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ అన్నారు.

ఉరి తీయాల్సిందే..మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేయాల్సిందేనని ముంబై పేలుళ్ల బాధితులు పలువురు స్పష్టం చేశారు. వారంతా కలసి బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు వినతి పత్రం సమర్పించారు. దానిపై 1,600 మంది సంతకాలు చేశారు. ‘ఆత్మీయులను కోల్పోయి మా కుటుంబాలు ఎంతో వేదనను అనుభవించాయి.  మెమన్‌కు ఉరిశిక్ష విధించాల్సిందే’ అని పేలుళ్లలో తన తల్లిని కోల్పోయిన తుషార్ దేశ్‌ముఖ్ డిమాండ్ చేశారు.

 పార్టీల స్పందన..ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలన్న మెమన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని బీజేపీ, కాంగ్రెస్ స్వాగతించాయి. ‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ముంబై పేలుళ్ల బాధితులకు న్యాయం జరిగింది. ఈ దేశ ప్రజలకు న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం మరింత పెరిగింది’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ వ్యాఖ్యానించారు. ముంబై పేలుళ్ల బాధితులకు పాక్షిక న్యాయమే అందింది. పేలుళ్ల కీలక సూత్రధారి టైగర్ మెమన్‌ను పాక్ నుంచి తీసుకువచ్చి శిక్ష విధించిననాడే వారికి పూర్తి న్యాయం జరిగినట్లు అవుతుంది’ అని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జెవాలా పేర్కొన్నారు. మెమన్‌కు క్షమాభిక్ష ప్రసాదించకూడదనేది దేశప్రజలందరి ఆకాంక్ష అని శివసేన పేర్కొంది. న్యాయవర్గాల్లో మాత్రం ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

నిరుత్సాహపరచింది.. ఒవైసీ: కోర్టు తీర్పు నిరుత్సాహపరచిందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రాజకీయ మద్దతు లేకపోవడం వల్లనే మెమన్‌కు ఉరిశిక్ష విధించారన్నారు. పేలుళ్లలో మెమన్ పాత్ర ఉందని, అయితే, అందుకు ఉరిశిక్ష విధించడం మాత్రం సరికాదన్నారు. ‘అప్పటి పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెమన్‌ను మోసం చేయడం వల్లనే మెమన్‌కు ఉరి శిక్ష పడింది. రాజీవ్ హంతకులు, పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ హంతకులకు ఉన్నట్లుగా మెమన్‌కు రాజకీయపరమైన మద్దతు లేకపోవడం కూడా ఒక కారణం’ అని వ్యాఖ్యానించారు.  బాబ్రీమసీదు కూల్చివేతదారులకు కూడా ఉరిశిక్ష విధించాలని ఒవైసీ డిమాండ్ చేశారు.
 
 
ఉరి అమలు ఎలా..!
జైలు మాన్యువల్ ప్రకారం.. యాకూబ్ మెమన్‌ను గురువారం వేకుజామున నిద్ర లేపుతారు. స్నానాదికాలు పూర్తయ్యాక తేలిగ్గా ఉండే ఆహారం అందిస్తారు. తర్వాత ప్రార్థన చేసుకునేందుకు అవసరమైన పుస్తకాలు ఇస్తారు. మరణశిక్ష అమలు చేసే ముందు వైద్యులు మెమన్‌ను పరీక్షిస్తారు. ఆ తరువాత ఉరికంబం వద్దకు తీసుకువెళ్తారు. చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎంఎం దేశ్‌పాండే టాడా కోర్టు ఉత్తర్వుల్లోని ఉరిశిక్ష అమలు భాగాన్ని మెమన్‌కు చదివి వినిపిస్తారు. మెజిస్ట్రేట్ నుంచి ఆదేశాలు రాగానే తలారి తన చేతిలో ఉన్న లివర్‌ను లాగి, ఉరిశిక్ష అమలు చేస్తాడు. అరగంట పాటు ఆ శరీరం అలాగే ఉరికంబంపై వేలాడుతూ ఉండాలని జైలు మాన్యువల్ స్పష్టం చేస్తోంది. ఆ తరువాత వైద్యుడు పరీక్షించి, చనిపోయినట్లుగా నిర్ధారిస్తారు. ఆ తరువాత పోస్ట్‌మార్టం నిర్వహిస్తారు. ఉరి అమలు చేసే ముందు, మెమన్ బరువును ఉరికంబం, ఉరితాడు తట్టుకోగలదా? లేదా? అనే విషయాన్ని పరీక్షిస్తారు. మెమన్ బరువుకు ఒకటిన్నర బరువున్న వస్తువుతో ప్రయోగం చేసి ఆ విషయాన్ని నిర్ధారిస్తారు. ఎరవాడ జైల్లో అఫ్జల్ కసబ్‌ను ఉరితీసిన బృందాన్ని మెమన్ ఉరి ప్రక్రియను పర్యవేక్షించేందుకు నాగపూర్ జైలుకు రప్పిస్తున్నారు.
 
జైలు వద్ద పటిష్ట భద్రత

యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేసేందుకు అవసరమైన సన్నాహాలన్నీ పూర్తయ్యాయని నాగపూర్ జైలు వర్గాలు వెల్లడించాయి. అదనపు డీజీపీ(జైళ్లు) మీరా బోర్వాంకర్ ఆ సన్నాహాలను పర్యవేక్షించారు. ఆమెకు డీఐజీ(జైళ్లు) రాజేంద్ర దామ్నె, జైలు సూపరింటెండెంట్ యోగేశ్ దేశాయి సహకరించారు. పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను పుణేలోని ఎరవాడ జైల్లో ఉరితీసిన సమయంలో కూడా యోగేశ్ దేశాయి అక్కడే విధుల్లో ఉన్నారు.  జైళ్లో భద్రతను పోలీసు ఉన్నతాధికారులు సమీక్షించారు. యాకూబ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చగానే బుధవారం మధ్యాహ్నం నాగ్‌పూర్ జైలు వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ముంబై పోలీసు విభాగానికి చెందిన సుశిక్షిత ‘క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్‌టీ)’ను రంగంలోకి దింపారు. యాకూబ్‌ను ఉంచిన సెల్ వద్ద కూడా పహారా బాధ్యతలను ఈ టీమ్‌కే అప్పగించారు. జైలు పరిసరాల్లో జనం గుమిగూడకుండా 144 సెక్షన్‌ను విధించారు. ఉరిఅనంతరం, మెమన్ మృతదేహాన్ని జైళ్లోనే ఖననం చేస్తారా? లేక బంధువులకు అప్పగిస్తారా? అనే విషయంపై జైలు సూపరింటెండెంట్ నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. ఒకవేళ, మృతదేహాన్ని బంధువులకు అప్పగించాలని నిర్ణయిస్తే.. పోస్ట్‌మార్టమ్ పూర్తిచేసి యాకూబ్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగిస్తారు. ఆ తర్వాత నాగ్‌పూర్ నుంచి విమానంలో మృతదేహాన్ని ముంబైకి తరలిస్తారు. ముందు జాగ్రత్తగా, ముంబైలోని మెమన్‌ల నివాసం వద్ద ఏకంగా ఐదువేల మంది పోలీసులను నియమించారు. నేరచరిత్ర కలిగిన వారిని ముందస్తు అదుపులోకి తీసుకున్నారు. శాంతిని కాపాడాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేయాలని ఇదివరకే పోలీసులు మతపెద్దలను కోరారు. కాగా, చట్టం తనపని తాను చేసుకుపోతుందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు. సంయమనం పాటించాలని ప్రజలను కోరారు.
 
 యాకూబ్ వీలునామా రాయలేదు
 యాకూబ్ మెమన్ ఎలాంటి వీలునామానూ రాయ లేదని ఆయన న్యాయవాది అనిల్ గెదామ్ తెలిపారు. సుప్రీంకోర్టు నుంచి కానీ, రాష్ట్రపతికి సమర్పించిన క్షమాభిక్ష పిటిషన్ ద్వారా కానీ తనకు ఏదో ఊరట లభిస్తుందని యాకూబ్ ఆశిస్తున్నట్లు  చెప్పారు. అందుకే వీలునామా రాయలేదని అన్నారు. మరణశిక్ష అమలు చేసిన తర్వాత అతడి మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు కోరే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement