The death penalty
-
పోక్సో చట్టంతో బాలురకూ రక్షణ!
న్యూఢిల్లీ: లైంగిక దాడులకు గురవుతున్న బాలురకూ రక్షణ కల్పించేలా పోక్సో (లైంగిక అత్యాచార ఘటనల నుంచి పిల్లలను రక్షించే చట్టం) చట్టానికి సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కఠువా, ఉన్నావ్ ఘటనల నేపథ్యంలో 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డ వారికి గరిష్టంగా మరణశిక్ష విధించేలా కేంద్రం ప్రతిపాదించిన పోక్సో చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు ఇటీవల రాష్ట్రపతి ఓకే చెప్పడం తెల్సిందే. ఈ నేపథ్యంలో స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పోక్సోకు తాజాగా మరో సవరణ తెచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. బాలురపై లైంగిక వేధింపులను పట్టించుకోవడం లేదని నిర్మాత, సామాజిక కార్యకర్త ఇన్సియా దరివాలా ఆన్లైన్లో చేసిన ఫిర్యాదుకు మంత్రి మేనకా గాంధీ మద్దతు పలికారు. -
హజారే డిమాండ్లకు అంగీకరించిన కేంద్రం
-
హజారే డిమాండ్లకు కేంద్రం ఓకే
న్యూఢిల్లీ: ఆమరణ దీక్ష చేస్తున్న అన్నా హజారే డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్రం అంగీకరించింది. లోక్‌పాల్ ఏర్పాటు సహా 11 డిమాండ్లపై స్పష్టత ఇచ్చినందున ఆమరణ దీక్షను విరమించాలని కోరింది. సోమవారం మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పక్షాన ఢిల్లీలో దీక్ష చేస్తున్న హజారేను కలిసి చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘హజారేతో జరిగిన చర్చల్లో ఆయన డిమాండ్లను అంగీకరిస్తామని చెప్పాం. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ఈ విషయంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో చాలా అంశాలను పేర్కొన్నాం. మంగళవారం హజారే దీక్ష విరమిస్తారని అనుకుంటున్నాం’ అని మహాజన్ తెలిపారు. -
యూపీలో ‘కల్తీ సారా’కు మరణశిక్షే!
లక్నో: కల్తీ సారా అమ్మి అమాయక ప్రజల మరణానికి కారకులయ్యేవారికి మరణశిక్ష విధించే బిల్లును ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ శుక్రవారం ఆమోదించింది. యూపీ ఎక్సైజ్(సవరణ) చట్టం–2017 ప్రకారం కల్తీ సారా వల్ల మరణాలు సంభవిస్తే దాని తయారీతో సంబంధమున్న వారికి మరణశిక్ష లేదా యావజ్జీవంతో పాటు రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ జరిమానా విధించవచ్చు. కల్తీ సారాతో అంగవైకల్యం సంభవిస్తే సారా తయారీదారుకు గరిష్టంగా పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. రూ.5 లక్షల వరకూ జరిమానా విధించవచ్చు. ఇటీవలి కాలంలో కల్తీసారాతో వరుస మరణాలు సంభవించడంతో సెప్టెంబర్‌లో ఎక్సైజ్ చట్టానికి సవరణలు చేసి యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. -
పన్నీరొకచోట... కన్నీరొకచోట!
ఆ నేడు 5 నవంబర్, 2006 ఇటు ఇరాక్, అటు అమెరికాలతో పాటు యావత్ ప్రపంచం సద్దాంపై వచ్చే తీర్పు గురించి ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సద్దాంకు అనుకూలంగా ఒకవైపు, వ్యతిరేకంగా మరోవైపు ఎంతో చర్చ నడుస్తోంది. ఈ చర్చ నేపథ్యంలో ‘తీర్పు’ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ‘మానత్వాన్ని మంటగలిపాడు...’ అంటూ ఇరాకీ స్పెషల్ ట్రిబ్యునల్ సద్దాం హుసేన్‌కు 2006 నవంబర్ 5న మరణశిక్ష విధించింది. చీఫ్ జడ్జి రషీద్ అబ్దుల్ రెహమాన్ తన తీర్పును గట్టిగా చదివి వినిపించాడు. తీర్పునకు స్పందనగా... ‘‘లాంగ్ లివ్ ది పీపుల్. లాంగ్ లివ్ ది అరబ్ నేషన్’’ అంటూ గర్జించాడు సద్దాం. ‘‘గాడ్ ఈజ్ గ్రేట్’’ అనే వాక్యాన్ని పదే పదే వల్లెవేయసాగాడు. తీర్పును హర్షిస్తూ సద్దాం వ్యతిరేకులు ఇరాక్ వీధుల్లో పండగ చేసుకున్నారు. సద్దాం వీరాభిమానులు మాత్రం ‘వెన్నుముక లేని తీర్పు’, ‘సామ్రాజ్యవాద ప్రేరేపిత తీర్పు’ అని మండిపడ్డారు. భిన్నస్పందనల విషయం ఎలా ఉన్నప్పటికీ, ఇరాకీ స్పెషల్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు చారిత్రక తీర్పుగా చరిత్రపుటల్లో నిలిచిపోయింది. తీర్పు వెలువడిన ముప్పై నాలుగు రోజులకు 2006 డిసెంబర్ 30న సద్దాంకు మరణశిక్ష విధించారు. -
నాగపూర్ సెంట్రల్ జైల్లో నేడు మెమన్‌కు ఉరి
-
మెమన్‌కు ఉరి
నాగపూర్ సెంట్రల్ జైల్లో నేడు ఉదయం అమలు ► స్టే పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ►క్షమాభిక్షకు నిరాకరించిన రాష్ట్రపతి, మహారాష్ట్ర గవర్నర్ ►సుప్రీం తీర్పును స్వాగతించిన బీజేపీ, కాంగ్రెస్.. ►ముంబై, నాగపూర్లలో భద్రత కట్టుదిట్టం ►1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో శిక్ష ఉరిపై ఉత్కంఠకు తెరపడింది! చర్చోపచర్చలు, వాదోపవాదాలు ముగిశాయి. 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్‌కు మరణశిక్ష అమలు ఖరారైంది. శిక్షను తప్పించుకునేందుకు అతడు చివరికి వరకూ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ రోజు(గురువారం) ఉదయం నాగ్‌పూర్ జైల్లో మెమన్ను ఉరి తీయనున్నారు. ఇదే రోజు అతడి పుట్టిన రోజు కూడా! శిక్ష అమలుపై స్టే ఇవ్వాలన్న మెమన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు బుధవారం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. మెమన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను సైతం మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు తిరస్కరించారు. ఇక ఆఖరిగా.. క్షమాభిక్ష కోరుతూ బుధవారం మెమన్ మరోసారి రాష్ట్రపతిని ఆశ్రయించారు. రాత్రి 10.45 గంటల సమయంలో.. క్షమాభిక్షను తోసిపుచ్చుతూ రాష్ట్రపతి నిర్ణయం వెలువరించారు. ఇక ఉదయం శిక్ష అమలు కావడమే మిగిలింది!! న్యూఢిల్లీ/నాగపూర్: 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్(53) ఉరిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మరణశిక్ష అమలు ఖరారైంది. మరణశిక్షను తప్పించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ రోజు(గురువారం) ఉదయం నాగపూర్ సెంట్రల్ జైల్లో మెమన్ను ఉరి తీయనున్నారు. ఇదే రోజు మెమన్ పుట్టినరోజు కూడా కావడం విశేషం. ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలన్న మెమన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. ఈ జులై 30న మెమన్ను ఉరితీయాలంటూ ఈ ఏడాది ఏప్రిల్ 30న ముంబైలోని టాడా కోర్టు జారీ చేసిన డెత్ వారంట్లో ఎలాంటి చట్టపరమైన లోపాలు లేవని తేల్చిచెప్పింది. ఆ ఉత్తర్వులను తప్పుబట్టలేమంటూ మెమన్ పిటిషన్‌ను కొట్టేసింది. మరోవైపు, రాజ్యాంగ అధికరణ 161 కింద మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను మహారాష్ట్ర గవర్నర్ తిరస్కరించారు. ఉరిపై స్టే విధించాలన్న మెమన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టేసిన కాసేపటికే గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆ నిర్ణయం తీసుకున్నారు. చివరి ప్రయత్నంగా, క్షమాభిక్ష కోరుతూ బుధవారం మెమన్ మళ్లీ రాష్ట్రపతిని ఆశ్రయించారు. ఈ రెండో పిటి షన్నూ రాష్ట్రపతి బుధవారం రాత్రి పొద్దుపోయాక తిరస్కరించారు. మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ఇప్పటికే ఒకసారి తిరస్కరించారు. 1993 మార్చి 12న, 12 వేర్వేరు చోట్ల జరిగిన వరుస పేలుళ్లతో ముంబై(నాటి బొంబాయి) వణికిపోయింది. ఆ భీకర పేలుళ్లలో 250 మందికి పైగా చనిపోగా, సుమారు 700 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. రాత్రి 10.45 ప్రాంతంలో రాష్ట్రపతి నిర్ణయం మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ తిరస్కరించారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంశాఖ కార్యదర్శి ఎల్సీ గోయల్, సొలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్‌లతో బుధవారం రెండు గంటల సుదీర్ఘ చర్చల అనంతరం రాత్రి 10.45 గంటల సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఈ నిర్ణయం వెలువరించారు. రాష్ట్రపతితో భేటీకి ముందు, ప్రధాని నివాసంలో రాజ్‌నాథ్, గోయల్ ఇతర ఉన్నతాధికారులు ప్రధాని మోదీతో సమావేశమై, మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌పై రాష్ట్రపతికి ప్రభుత్వం తరఫున ఏ సూచన ఇవ్వాలనే విషయంపై చర్చించారు. సాధారణంగా ఈ విషయాల్లో కేంద్ర మంత్రిమండలి సలహా ప్రకారం రాష్ట్రపతి నడుచుకుంటారు. ఉరిని ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేసిన మెమన్ లాయర్లు బుధవారం రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాక అర్ధరాత్రి మళ్లీ సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. క్షమాభిక్ష పిటిషన్ నిరాకరణ తర్వాత ఉరి అమలుకు 14 రోజుల గడువు ఇవ్వాలని సుప్రీం మార్గదర్శకాలు సూచిస్తున్నాయని, అందువల్ల మెమన్‌కు 14 రోజుల సమయం ఇవ్వాలని కోరారు. సుప్రీంలో.. ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలన్న మెమన్ పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు త్రిసభ ధర్మాసనం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ దవేల ద్విసభ్య బెంచ్ మంగళవారం ఉరిని నిలిపేసే అంశంపై విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో.. ఆ అంశపై తుది నిర్ణయం తీసుకునేందుకు జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ రాయ్ సభ్యులుగా త్రిసభ్య బెంచ్‌ను చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు ఏర్పాటుచేయడం తెలిసిందే. విచారణ తర్వాత టాడా కోర్టు జారీ చేసిన డెత్ వారంట్ సక్రమమేనని ఆ త్రిసభ్య బెంచ్ తేల్చింది. అలాగే, మెమన్ దాఖలు చేసుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను గతంలో సుప్రీంకోర్టు కొట్టేయడం సరైన చర్యేనంది. తన వాదనలు వినకుండానే ఉరిశిక్ష ఉత్తర్వులను టాడా కోర్టు జారీ చేసిందని, తన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించిన తరువాత ఉరిశిక్ష అమలు తేదీని తనకు తెలియజేసే విషయంలో పాటించాల్సిన 14 రోజుల గడవు నిబంధనను ఆ కోర్టు పాటించలేదని మెమన్ చేసిన వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. క్షమాభిక్ష పొందే విషయంలో తనకింకా న్యాయపరమైన అవకాశాలున్నాయన్న వాదననూ కొట్టేసింది. తాను దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు 2015, జూలై 21న కొట్టేసిన తరువాతే.. క్షమాభిక్ష కోరుతూ మెమన్ మహారాష్ట్ర గవర్నర్‌ను ఆశ్రయించారని గుర్తు చేసింది. మెమన్ పిటిషన్‌ను ఏప్రిల్ 11, 2014న రాష్ట్రపతి తిరస్కరించారని, ఆ విషయాన్ని మే 26, 2014న మెమన్‌కు తెలియజేశారని పేర్కొంది. మొదటి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేసేందుకు మెమన్ ప్రయత్నించలేదని, అందువల్ల తాజాగా రాష్ట్రపతికి ఆయన పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్.. ఉరిశిక్ష అమలులో అడ్డుకాబోదని స్పష్టం చేసింది. తనకు అనుకూలంగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ (రా) మాజీ అధికారి రాసిన ఒక వ్యాసాన్ని, అలాగే స్కీజోఫ్రీనియాతో బాధపడుతున్నాననే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ మెమన్ రాష్ట్రపతికి పెట్టుకున్న రెండో క్షమాభిక్ష పిటిషన్ గురించి తాము ప్రస్తావించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. మెమన్ దాఖలు చేసుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను కొట్టేసిన సమయంలో ఆ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ జడ్జీలు ముగ్గురు( చీఫ్ జస్టిస్ సహా) నిబంధనల ప్రకారం నడుచుకోలేదన్న జస్టిస్ జోసెఫ్ కురియన్ అభిప్రాయంతో బెంచ్ ఏకీభవించలేదు. మెమన్ క్యూరేటివ్ పిటిషన్‌ను మళ్లీ విచారించాలని జస్టిస్ కురియన్ మంగళవారం అభిప్రాయపడిన విషయం తెలిసిందే. మెమన్ ద్రోహి.. ఏజీ.. విచారణ ముగింపు దశలో అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ చేసిన వ్యాఖ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. మెమన్ను ద్రోహి అని రోహత్గీ పేర్కొనడంపై సీనియర్ న్యాయవాది టీఆర్ అంధ్యార్జున తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసులో జోక్యం చేసుకునే హక్కు మీకు లేదంటూ మెమన్‌కు మద్దతుగా వాదించబోతున్న అంధ్యార్జునను రోహత్గీ అడ్డుకున్నారు. ‘క్షమాభిక్ష పిటిషన్ అనేది గౌరవానికి సంబంధించిన అంశం కాదు. అది దోషుల రాజ్యాంగ హక్కు. న్యాయపరమైన అన్ని అవకాశాలు పూర్తికాకుండా మెమన్ను ఉరితీయడం అన్యాయం’ అని అంధ్యార్జున అన్నారు. దానికి ‘పేలుళ్లలో చనిపోయిన 250 మంది హక్కుల మాటేమిటి? ద్రోహిని సర్థిస్తూ మీరు మాట్లాడుతున్నారు’ అని రోహత్గీ అన్నారు. ‘మరణం అంచున ఉండి, జీవితం కోసం పోరాడుతున్న వ్యక్తిని పరిహసించకూడద’ని అంధ్యార్జున పేర్కొనడంతో.. మెమన్ను ద్రోహి అని సుప్రీంకోర్టే పేర్కొందని రోహత్గీ గుర్తుచేశారు. కలాంకు నివాళిగా.. ఉరిని నిలిపేయండి! సోమవారం మరణించిన మాజీ రాష్ట్రపతి కలాం సిద్ధాంతాలను గౌరవిస్తూ.. మెమన్‌కు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా తగ్గించాలని పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్, మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. మరణ శిక్షను కలాం వ్యతిరేకించేవారని, అందువల్ల మెమన్‌కు విధించిన ఉరిశిక్షను తగ్గించడం కలాంకు సరైన నివాళి ఇవ్వడం అవుతుందన్నారు. సుప్రీం తీర్పును పలువురు న్యాయనిపుణులు తప్పుపట్టారు. సాక్ష్యాలను తీసుకొచ్చి, దర్యాప్తులో సాయపడ్డ వ్యక్తిని ఉరితీస్తున్నారని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ అన్నారు. ఉరి తీయాల్సిందే..మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేయాల్సిందేనని ముంబై పేలుళ్ల బాధితులు పలువురు స్పష్టం చేశారు. వారంతా కలసి బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు వినతి పత్రం సమర్పించారు. దానిపై 1,600 మంది సంతకాలు చేశారు. ‘ఆత్మీయులను కోల్పోయి మా కుటుంబాలు ఎంతో వేదనను అనుభవించాయి. మెమన్‌కు ఉరిశిక్ష విధించాల్సిందే’ అని పేలుళ్లలో తన తల్లిని కోల్పోయిన తుషార్ దేశ్‌ముఖ్ డిమాండ్ చేశారు. పార్టీల స్పందన..ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలన్న మెమన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని బీజేపీ, కాంగ్రెస్ స్వాగతించాయి. ‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ముంబై పేలుళ్ల బాధితులకు న్యాయం జరిగింది. ఈ దేశ ప్రజలకు న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం మరింత పెరిగింది’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ వ్యాఖ్యానించారు. ముంబై పేలుళ్ల బాధితులకు పాక్షిక న్యాయమే అందింది. పేలుళ్ల కీలక సూత్రధారి టైగర్ మెమన్ను పాక్ నుంచి తీసుకువచ్చి శిక్ష విధించిననాడే వారికి పూర్తి న్యాయం జరిగినట్లు అవుతుంది’ అని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జెవాలా పేర్కొన్నారు. మెమన్‌కు క్షమాభిక్ష ప్రసాదించకూడదనేది దేశప్రజలందరి ఆకాంక్ష అని శివసేన పేర్కొంది. న్యాయవర్గాల్లో మాత్రం ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిరుత్సాహపరచింది.. ఒవైసీ: కోర్టు తీర్పు నిరుత్సాహపరచిందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రాజకీయ మద్దతు లేకపోవడం వల్లనే మెమన్‌కు ఉరిశిక్ష విధించారన్నారు. పేలుళ్లలో మెమన్ పాత్ర ఉందని, అయితే, అందుకు ఉరిశిక్ష విధించడం మాత్రం సరికాదన్నారు. ‘అప్పటి పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెమన్ను మోసం చేయడం వల్లనే మెమన్‌కు ఉరి శిక్ష పడింది. రాజీవ్ హంతకులు, పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ హంతకులకు ఉన్నట్లుగా మెమన్‌కు రాజకీయపరమైన మద్దతు లేకపోవడం కూడా ఒక కారణం’ అని వ్యాఖ్యానించారు. బాబ్రీమసీదు కూల్చివేతదారులకు కూడా ఉరిశిక్ష విధించాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఉరి అమలు ఎలా..! జైలు మాన్యువల్ ప్రకారం.. యాకూబ్ మెమన్ను గురువారం వేకుజామున నిద్ర లేపుతారు. స్నానాదికాలు పూర్తయ్యాక తేలిగ్గా ఉండే ఆహారం అందిస్తారు. తర్వాత ప్రార్థన చేసుకునేందుకు అవసరమైన పుస్తకాలు ఇస్తారు. మరణశిక్ష అమలు చేసే ముందు వైద్యులు మెమన్ను పరీక్షిస్తారు. ఆ తరువాత ఉరికంబం వద్దకు తీసుకువెళ్తారు. చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎంఎం దేశ్‌పాండే టాడా కోర్టు ఉత్తర్వుల్లోని ఉరిశిక్ష అమలు భాగాన్ని మెమన్‌కు చదివి వినిపిస్తారు. మెజిస్ట్రేట్ నుంచి ఆదేశాలు రాగానే తలారి తన చేతిలో ఉన్న లివర్‌ను లాగి, ఉరిశిక్ష అమలు చేస్తాడు. అరగంట పాటు ఆ శరీరం అలాగే ఉరికంబంపై వేలాడుతూ ఉండాలని జైలు మాన్యువల్ స్పష్టం చేస్తోంది. ఆ తరువాత వైద్యుడు పరీక్షించి, చనిపోయినట్లుగా నిర్ధారిస్తారు. ఆ తరువాత పోస్ట్‌మార్టం నిర్వహిస్తారు. ఉరి అమలు చేసే ముందు, మెమన్ బరువును ఉరికంబం, ఉరితాడు తట్టుకోగలదా? లేదా? అనే విషయాన్ని పరీక్షిస్తారు. మెమన్ బరువుకు ఒకటిన్నర బరువున్న వస్తువుతో ప్రయోగం చేసి ఆ విషయాన్ని నిర్ధారిస్తారు. ఎరవాడ జైల్లో అఫ్జల్ కసబ్‌ను ఉరితీసిన బృందాన్ని మెమన్ ఉరి ప్రక్రియను పర్యవేక్షించేందుకు నాగపూర్ జైలుకు రప్పిస్తున్నారు. జైలు వద్ద పటిష్ట భద్రత యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేసేందుకు అవసరమైన సన్నాహాలన్నీ పూర్తయ్యాయని నాగపూర్ జైలు వర్గాలు వెల్లడించాయి. అదనపు డీజీపీ(జైళ్లు) మీరా బోర్వాంకర్ ఆ సన్నాహాలను పర్యవేక్షించారు. ఆమెకు డీఐజీ(జైళ్లు) రాజేంద్ర దామ్నె, జైలు సూపరింటెండెంట్ యోగేశ్ దేశాయి సహకరించారు. పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను పుణేలోని ఎరవాడ జైల్లో ఉరితీసిన సమయంలో కూడా యోగేశ్ దేశాయి అక్కడే విధుల్లో ఉన్నారు. జైళ్లో భద్రతను పోలీసు ఉన్నతాధికారులు సమీక్షించారు. యాకూబ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చగానే బుధవారం మధ్యాహ్నం నాగ్‌పూర్ జైలు వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ముంబై పోలీసు విభాగానికి చెందిన సుశిక్షిత ‘క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్టీ)’ను రంగంలోకి దింపారు. యాకూబ్‌ను ఉంచిన సెల్ వద్ద కూడా పహారా బాధ్యతలను ఈ టీమ్‌కే అప్పగించారు. జైలు పరిసరాల్లో జనం గుమిగూడకుండా 144 సెక్షన్‌ను విధించారు. ఉరిఅనంతరం, మెమన్ మృతదేహాన్ని జైళ్లోనే ఖననం చేస్తారా? లేక బంధువులకు అప్పగిస్తారా? అనే విషయంపై జైలు సూపరింటెండెంట్ నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. ఒకవేళ, మృతదేహాన్ని బంధువులకు అప్పగించాలని నిర్ణయిస్తే.. పోస్ట్‌మార్టమ్ పూర్తిచేసి యాకూబ్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగిస్తారు. ఆ తర్వాత నాగ్‌పూర్ నుంచి విమానంలో మృతదేహాన్ని ముంబైకి తరలిస్తారు. ముందు జాగ్రత్తగా, ముంబైలోని మెమన్‌ల నివాసం వద్ద ఏకంగా ఐదువేల మంది పోలీసులను నియమించారు. నేరచరిత్ర కలిగిన వారిని ముందస్తు అదుపులోకి తీసుకున్నారు. శాంతిని కాపాడాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేయాలని ఇదివరకే పోలీసులు మతపెద్దలను కోరారు. కాగా, చట్టం తనపని తాను చేసుకుపోతుందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు. సంయమనం పాటించాలని ప్రజలను కోరారు. యాకూబ్ వీలునామా రాయలేదు యాకూబ్ మెమన్ ఎలాంటి వీలునామానూ రాయ లేదని ఆయన న్యాయవాది అనిల్ గెదామ్ తెలిపారు. సుప్రీంకోర్టు నుంచి కానీ, రాష్ట్రపతికి సమర్పించిన క్షమాభిక్ష పిటిషన్ ద్వారా కానీ తనకు ఏదో ఊరట లభిస్తుందని యాకూబ్ ఆశిస్తున్నట్లు చెప్పారు. అందుకే వీలునామా రాయలేదని అన్నారు. మరణశిక్ష అమలు చేసిన తర్వాత అతడి మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు కోరే అవకాశముందని అభిప్రాయపడ్డారు. -
ఉరితో యాకూబ్ హోరాహోరీ
ఉరితాడుతో ముంబై బాంబు పేలుళ్ల నేరస్తుడు యాకూబ్ మెమన్ సాగించిన హోరాహోరీ పోరాటం ముగిసింది. 23 ఏళ్లుగా నాగపూర్ జైల్లో... ప్రత్యేకించి ఎనిమిదేళ్లుగా ఉరితాడు నీడలో ఉంటున్న యాకూబ్‌కు గురువారం ఉదయం మరణశిక్ష అమలు చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బుధవారం చకచకా సంభవించిన పరిణామాలన్నీ యాకూబ్కున్న దారుల్ని మూసేశాయి. క్యూరేటివ్ పిటిషన్‌పై విచారణ ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్నాయంటున్న కొన్ని సాంకేతిక లోపాలపైనా, అన్ని అవకాశాలూ ముగియక మునుపే మహారాష్ట్ర ప్రభుత్వం ‘డెత్ వారంట్’ జారీచేయడంపైనా వచ్చిన అభ్యంతరాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చగా... అంతకు కొన్ని గంటలముందు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు అతని క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించారు. ఇక యాకూబ్ తరఫున భిన్న రంగాలకు చెందిన ప్రజాస్వామికవాదులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముందు దాఖలు చేసి ఉన్న క్షమాభిక్ష పిటిషన్ ఒక్కటే మిగిలింది. దాన్ని తోసిపుచ్చాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రణబ్‌కు సలహా ఇచ్చారు. ఆ సలహాకు భిన్నంగా ఆయన వ్యవహరించకపోవడానికే ఆస్కారం ఉంది. మరోపక్క యాకూబ్ న్యాయవాదులు అర్ధరాత్రి రెండోసారి సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టారు. మార్చి 1993లో జరిగిన ముంబై బాంబు పేలుళ్ల వ్యవహారంలో యాకూబ్‌కు, మరో 10మందికి టాడా ప్రత్యేక కోర్టు 2007లో మరణశిక్ష విధించింది. వీరిలో యాకూబ్ మినహా మిగిలినవారి ఉరిశిక్షలను సుప్రీంకోర్టు రెండేళ్లక్రితం యావజ్జీవ శిక్షలుగా మార్చింది. ముంబై మహానగరంలో ఒక హిందూ స్నేహితుడితో కలిసి చార్టెర్డ్ అకౌంటెంట్‌గా గౌరవనీయమైన స్థానంలో ఉన్న యాకూబ్ ఉరిశిక్షకు అర్హమైన నేరంలో దోషిగా రుజువుకావడం...53 ఏళ్ల వయసులో తన పుట్టినరోజునే ఉరికంబం ఎక్కాల్సిరావడం ఒక వైచిత్రి. అయోధ్యలో 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత దేశవ్యాప్తంగా అలుముకున్న ఉద్రిక్త పరిస్థితులు, పరిణామాలే దీనంతటికీ కారణం. ఆ ఏడాది డిసెంబర్ నెలాఖరున, 1993 జనవరి మొదటి వారంలో ముంబైలో చోటుచేసుకున్న మతకలహాల్లో 900మంది మరణించారు. వారిలో అత్యధికులు ముస్లింలు. ఇందుకు ప్రతిగా నగరంలో జనసమ్మర్ధంగా ఉండే 12 ప్రాంతాల్లో పేలుళ్లు జరిగి 257మంది మరణించారు. దేశ చరిత్రలో ఆర్డీఎక్స్ను వినియోగించడం అదే ప్రథమం. ఈ పేలుళ్ల వ్యవహారంలో మెమన్ కుటుంబం పాత్ర వెల్లడై వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించేసరికే అందరూ దేశం దాటి వెళ్లిపోయారు. పెద్దవాడైన టైగర్ మెమన్, ఆయన కుటుంబం ఇప్పటికీ పాకిస్థాన్‌లోని కరాచీలోనే తలదాచుకుంటున్నారు. ఇప్పుడు యాకూబ్ మెమన్ కంఠానికి బిగుసుకుంటున్న ఉరిపై సాగిన వివాదం రెండు దశాబ్దాలక్రితం ఇందిరాగాంధీ హత్య కేసులో మాజీ పోలీస్ అధికారి కేహార్సింగ్కు పడిన ఉరిపైనా...పార్లమెంటుపై దాడి కేసులో రెండేళ్లక్రితం అఫ్జల్ గురుకు అమలైన ఉరి విషయంలోనూ అల్లుకున్న చర్చలు గుర్తొస్తాయి. ఆ రెండు సందర్భాల్లోనూ దోషులుగా నిర్ధారణ అయినవారికి అన్యాయం జరిగిందని ప్రజాస్వామికవాదులు భావించారు. ఇప్పుడు యాకూబ్ కేసులోనూ అలాంటి వాదనలే వినిపిస్తున్నాయి. అయితే శిక్షను వ్యతిరేకిస్తున్నవారిలో రెండు రకాల వారున్నారు. పేలుళ్ల పథకరచన యాకూబ్‌కు తెలియదని వాదిస్తున్నవారు కొందరైతే...ఆయన ఖచ్చితంగా నేరస్తుడేనని, అయినా ఉరి సరికాదని అంటున్నవారు మరికొందరు. నేరస్తుడని విశ్వసించినా ఉరి వద్దని చెప్పినవారిలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) మాజీ ఉన్నతాధికారి రామన్ ముఖ్యులు. యాకూబ్ కరాచీనుంచి భారత్ రావడానికి జరిగిన ఆపరేషన్‌లో ఆయన భాగస్వామి. ఉరి శిక్ష పడదని హామీ ఇచ్చాకే ఆయన పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కళ్లుగప్పి వచ్చాడని రామన్ వెల్లడించారు. వస్తూ ఐఎస్ఐ పాత్రను నిర్ధారించే అనేక పత్రాలనూ, సీడీలనూ, తమకు ఆశ్రయమిచ్చిన ఇంటి పరిసరాల వీడియోలనూ తీసుకొచ్చాడు. మారు పేరుతో తనకు పాక్ ప్రభుత్వం జారీచేసిన పాస్‌పోర్టును ఇచ్చాడు. అతని సహకారం లేకపోతే మన దేశంలో పాక్ సాగిస్తున్న దుశ్చర్యల గురించి బయటి ప్రపంచానికి చూపేందుకు సాక్ష్యాలే ఉండకపోయేవని రామన్ చెప్పారు. రాజ్యం తరఫున ఇచ్చిన హామీని గౌరవించకపోతే రేపన్నరోజున ఏ ఉగ్రవాదీ సహకరించడన్నది ఆయన వాదన. కేసు కోర్టు ముందుకు వెళ్లేసరికే రామన్ రిటైరయ్యారు. ఇప్పుడైతే ఆయన జీవించి లేరు. అసలు యాకూబ్‌కు అలాంటి హామీ ఏమీ ఇవ్వలేదని కొందరు అధికారులు చెబుతున్నారు. రామన్ అత్యంత విశ్వసనీయత కలిగిన అధికారి గనుక ఆయన అబద్ధమాడారని భావించలేం. యాకూబ్ తోడ్పడిన తీరుకు సంబంధించిన అంశాలను ఆ కేసుతో వ్యవ హరించిన సీబీఐ అధికారులు టాడా కోర్టు ముందు ఎందుకు ఉంచలేదో, అతనికిచ్చిన హామీ నుంచి ప్రభుత్వం ఎందుకు వెనక్కి వెళ్లిందో ఎవరికీ తెలియదు. ఈ విషయమై సుప్రీంకోర్టు సైతం తన నిస్సహాయత వ్యక్తంచేసింది. అది కార్యనిర్వాహక వ్యవస్థ చేతుల్లోనే ఉంటుందని చెప్పింది. మరణశిక్ష సరికాదన్న వాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. సోమవారం కన్నుమూసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సైతం ప్రాణం పోయలేని వ్యక్తికి ప్రాణం తీసే హక్కు ఉండరాదని అభిప్రాయపడ్డారు. 139 దేశాలు తమ శిక్షాస్మృతులనుంచి మరణశిక్షలను తొలగించాయి. అందువల్ల ఆ దేశాల్లో నేరాలేమీ పెరగలేదు. ఈ శిక్ష ఉండొద్దని 2000 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. చట్టంలో ఆ శిక్ష ఉన్నంతవరకూ న్యాయమూర్తుల వ్యక్తిగత అభిప్రాయాలు ఏమైనా కోర్టులు కూడా ఏమీ చేయలేవు. యాకూబ్ విషయంలో చెలరేగిన వాదోపవాదాలు, కలాంవంటివారి అభిప్రాయలు కూడా పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం మరణశిక్ష కొనసాగింపుపై సమీక్ష జరపాల్సిన అవసరం ఉంది. -
ఉరికంబానికీ ఉంది వివక్ష
కొత్త కోణం కులంతో పాటు పేదరికం కూడా చాలా మందికి ఉన్నత న్యాయస్థానాల్లో తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశాన్ని నిరాకరిస్తోంది. న్యాయం కోసం హైకోర్టు, సుప్రీం కోర్టుల తలుపులు తట్టడమంటే లక్షల రూపాయలతో పని. ధన బలం ఉన్నవారే ఆ పని చేయగలరు. అలాంటి వారే తమ శిక్షలను తగ్గించుకోగలుగుతున్నారు. దేశంలో గత 15 ఏళ్లలో 1,600 మందికి మరణశిక్ష విధించగా, అందులో 5%కు ఆ శిక్ష ఖరారైంది. వారిలో అత్యధికులు దళితులు, మైనారిటీలేనన్న కఠోర వాస్తవం తెలియజేస్తున్నది అదే. ‘‘మరణశిక్షను ఖరారు చేయడం రాష్ట్రపతిగా నేను ఎదుర్కొన్న అతి కఠిన మైన సమస్య. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కేసులే ఎక్కు వగా పెండింగ్‌లో ఉన్నాయి.’’ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అన్న మాటలివి. మరణశిక్ష విధింపులో ధన, కుల పక్షపాతం కనిపిస్తున్నదని ఆయన సుస్పష్టంగా తెలిపారు. కలాంను వేనోళ్ల కొనియాడుతున్న వాళ్ళు ఆయనలోని ఆ మానవత్వాన్ని పుణికిపుచ్చుకొని, ఎంతవరకు ఆచరణలో పెట్టగలరనేది అనుమానమే. కనీసం ఆలోచించడం మొదలు పెట్టినా అది ఆయనకు ఘన నివాళే. కులం, ధనం కలవారిదే ‘ఉన్నత’ న్యాయం కలాం అభిప్రాయం అక్షర సత్యమని ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యా లయం విద్యార్థులు, అధ్యాపకుల అధ్యయనం రుజువు చేసింది. మరణశిక్ష పడ్డ ఖైదీలలో నాలుగింట మూడువంతులు వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలేనని తేల్చింది (93% దళితులు, మైనారిటీలు). 23% నిరక్షరా స్యులు కాగా, మిగతావారిలో చాలా మంది హైస్కూల్ విద్యకు నోచుకోని వారు. వీరిలో చాలా మందిని న్యాయస్థానం ఎదుట హాజరుపరచనూ లేదు, న్యాయవాదులతో తమ కేసును చర్చించే అవకాశమూ ఇవ్వలేదు. మరీ దుర్మార్గంగా మరణ శిక్షకు గురైనవారిలో చాలా మందిని ప్రత్యేక గదుల్లో బంధించి, ఎవరితో కలవకుండా చేశారు. కులంతో పాటు పేదరికం కూడా చాలా మందికి ఉన్నత న్యాయస్థానాల్లో తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశాన్ని నిరాకరించింది. హైకోర్టు, సుప్రీంకోర్టుల తలుపులు తట్టడ మంటే లక్షల రూపాయలతో పని. ధన బలం ఉన్నవారే ఆ పని చేయగలరు. అలాంటి వారే తమ శిక్షలను తగ్గించుకోగలిగారు. దేశంలో గత 15 ఏళ్లలో 1,600 మందికి మరణశిక్ష విధించగా, అందులో 5%కు ఆ శిక్ష ఖరారైంది. వారిలో అత్యధికులు దళితులు, మైనారిటీలేనన్న కఠోర వాస్తవాన్ని ఈ అధ్య యనం బయటపెట్టింది. భారత న్యాయవ్యవస్థ... బొమ్మా బొరుసు ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరో వైపున ఇంకో కథ ఉంది. దళితులు నిందితులుగా ఉన్న కేసుల్లో శిక్షలు ఖరారై ఉరికంబం ఎక్కితే, దళితులు ఊచ కోతకు గురైన కేసుల్లో నిందితులు నిర్దోషులుగా బయటపడ్డారు. ఇది, నిగ్గు తేలిన నిజాలు చెబుతున్న కథ. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో దళితులపై జరి గిన రెండు ఘోర దురాగతాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి చర్చను రేకెత్తించాయి. అయినా ఆ రెండు కేసుల్లోనూ నిందితులు నిర్దోషులుగానో, లేదా తక్కువ శిక్షలతోనో బయటపడ్డారు. ఒకటి ‘చుండూరు’. 1991 ఆగస్టు 6న గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో అగ్రవర్ణాల వారు దళితవాడపై దాడి చేసి, వేట కొడవళ్ళతో, గొడ్డళ్లతో, బరిసెలతో దళితులను వెంటాడి, వేటాడి చంపారు. ఆ మారణ కాండలో ఎనిమిది మంది దళితులు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికి, గోనెసంచుల్లో మూటగట్టి, రాళ్ళు కట్టి తుంగభద్రలో పడే శారు. ఇద్దరు అన్నదమ్ములను మల్లెతోటలోనే చంపి భూమిలో తొక్కేశారు. ఒకరిని సజీవంగానే సంచులలో కుక్కి కాలువలో పడేశారు. ఈ ఘోరంపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం కారణంగా ఏర్పాటైన ప్రత్యేక కోర్టు 16 ఏళ్ల సుదీర్ఘ విచారణ తదుపరి, 2007లో తీర్పును వెలువరించింది. ఇది అరుదైన వాటిలో కెల్లా అత్యంత అరుదైన కేసు కాదంటూ నిందితులకు మరణశిక్ష గాక, యావ జ్జీవ కారాగార శిక్ష విధించింది. ప్రత్యేక కోర్టు చేసిన ఈ వ్యాఖ్య నేరం తీవ్ర తను తగ్గించేసింది. ఏడేళ్ల తర్వాత ఏపీ హైకోర్టు... అంతా నివ్వెరపోయేలా ప్రాసిక్యూషన్ నేరాన్ని నిరూపించడంలో విఫలమైందంటూ నిందితులందరినీ విడుదల చేయాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో ఉన్నత న్యాయస్థానాల్లో నిరుపేదలకు, దళితులకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం సన్నగిల్లింది. చుండూరు కేసు అరుదైనది కాకపోతే, అరుదైనవిగా పేర్కొన్న చాలా కేసులు కూడా అరుదైనవి కాకపోయే ఉండాలి. జరిగిన ఘోర దురంతం కాదనలేనిదై నప్పుడు... ప్రాసిక్యూషన్ విఫలమైతే, ఆ కేసును తిరిగి పరిశోధించాలని, అవసరమైతే అందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని హైకోర్టు ఆదేశించాల్సింది. కానీ అలా చేయలేదు. దీంతో న్యాయస్థానం తన బాధ్యతను విస్మరించిందని విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి సరిగ్గా విరుద్ధమైన పరిస్థితి విజయవాడ శ్రీలక్ష్మి హత్య కేసు. ఆ విద్యార్థినిని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపినందుకు మనోహర్ అనే యువకుడికి మరణ శిక్ష విధించాలని పలు మహిళా సంఘాలు, పార్టీలు డిమాండ్ చేశాయి. నిందితుడి తరఫున వాదించరాదని న్యాయవాదులు ఏకగ్రీ వంగా తీర్మానించారు. న్యాయస్థానం సైతం మనోహర్‌కు మరణ శిక్ష విధిం చింది. మంచిదే అలాంటి దుర్మార్గుడికి ఆ శిక్ష పడాల్సిందే. కానీ ఈ హత్యతో పోలిస్తే, చుండూరు మారణకాండ కొన్ని వేల రెట్లు అమానుషమైనది. మనో హర్ కేసులో ఏడాదిలోగానే విచారణ పూర్తయింది, శిక్ష పడింది. కానీ చుం డూరు కేసు విచారణకు 16 ఏళ్లు పట్టింది, నలుగురు జడ్జీలు మారారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకానికే తొమ్మిదేళ్ళు పట్టింది! సాక్షులు సైతం చాలా మంది చనిపోయారు. ఈ రెండు కేసుల్లో ఎందుకింత వ్యత్యాసం? ఢిల్లీ అధ్యయనం పేర్కొన్నట్టు న్యాయ ప్రక్రియలో, శిక్షల విధింపులో కులం, ధనం ప్రాబల్యం వహిస్తున్నాయనేది సులభంగానే అర్థమవుతుంది. దళితులపై దురాగతాలు ‘అరుదైనవి’ కాలేవు ఇక మహారాష్ట్రకు వస్తే, నాగపూర్ సమీపంలోని భండార జిల్లా ఖైర్లాంజిలో ఒక భూవివాదం సాకుతో ఆధిపత్య కులాల వారు భూత్ మాంగే అనే ఒక దళితుని కుటుంబంలోని నలుగురిని కిరాతకంగా చంపేశారు. దాదాపు 40 మంది మారణాయుధాలతో చుట్టుముట్టి మాంగే గుడిసెను తగులబెట్టి, ఆయన భార్యను, ఇద్దరు కొడుకులను, కూతురిని చిత్రహింసలకు గురిచేసి, తల్లీ కూతుళ్ళిద్దరిపై నడిబజారులో అత్యాచారం జరిపి అతి అమానుషంగా చం పారు. ఈ ఘోరాన్ని ఆధిపత్య కులాల మహిళలు ప్రోత్సహించడం ఆశ్చర్యం కలిగించింది. ఇదంతా పొదల మాటున దాగి చూసిన భూత్ మాంగే స్వయంగా కేసుపెట్టారు. 2008లో ఆరుగురు నిందితులకు ప్రత్యేక న్యాయ స్థానం మరణ శిక్ష విధించింది. కానీ తర్వాత బొంబాయి హైకోర్టు దీన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది! ఇక ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాలో ఐదుగురు దళిత యువకులు, ఒక జాట్ అమ్మాయిపై అత్యాచారం జరిపి హత్య చేసినట్టు పెట్టిన కేసులో నిందితులకు మరణశిక్ష విధించారు. కాగా, 1999 డిసెంబర్ 31 అర్ధరాత్రి మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలోని ఒక హోటల్లో పనిచేస్తున్న లక్ష్మి (పేరు మార్చాం) అనే దళిత యువతి అత్యాచారానికి గురైంది. ఆమె నిందితులను గుర్తుపట్టి, జరిగిన దురాగతాన్ని కోర్టులో పూసగుచ్చినట్టు వివ రించింది. అయినా ఆ కేసులోని నిందితులంతా నిర్దోషులుగా బయట పడ్డారు! దీన్ని బట్టి మన దేశంలో అమలవుతున్న నేరము-శిక్ష స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. మనుస్మృతి ఆధారంగానే నేరము-శిక్ష ఇలా ఒక్కొక్కటొక్కటిగా చూస్తుంటే న్యాయం త్రాసులో బలిపశువులుగా మారుతున్న వారంతా దళితులు, పేదలేనని రుజువవుతుంది. నేరం చేసిన వారెవ్వరైనా శిక్ష అనుభవించాల్సిందే, తప్పించుకోడానికి వీల్లేదు. నేరస్తుల విచారణ, విధిస్తున్న శిక్షల్లోని అంతరాలను గమనిస్తే నేరం తీవ్రతేగాక కులం, ధనం వంటి ఇతర అంశాల ప్రభావం తీర్పులపై అధికంగా ఉంటున్నట్టు స్పష్టమవుతోంది. ఢిల్లీ అధ్యయనం దీన్ని మరోమారు రుజువు చేసింది. రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రం కేవ లం రాతలకే పరిమితమైంది. వాస్తవంగా అమలవుతున్నది భారత రాజ్యాం గం కాదు. రెండు వేళ ఏళ్ల నాటి మనుస్మృతి. దానిలో 8, 9, 11 అధ్యాయాల లోని నేరము-శిక్షకు సంబంధించిన అంశాలన్నీ పుట్టుకను బట్టి, వర్ణాన్ని బట్టి శిక్షలని నిర్దేశించాయి. చాతుర్వర్ణ వ్యవస్థలోని ప్రజలకు వారి వారి వర్ణ నేప థ్యాన్ని బట్టి మనువు శిక్షలను ఖరారు చేశాడు. ఆ మనుధర్మాన్ని మెదళ్ల నిండా నింపుకొని మనం భారత రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నాం. ఆరు దశాబ్దాల స్వతంత్ర భారత న్యాయ చరిత్ర దాన్నే రుజువు చేస్తోంది. ఈ తీరు మారాలి, తీర్పులూ మారాలి. అప్పుడే న్యాయానికి ధనిక, పేద, కుల, మత, ప్రాంతీయ భేదాలుండకూడదన్న అబ్దుల్ కలాం కల నిజమవుతుంది. మల్లెపల్లి లక్ష్మయ్య (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213