ఉరిపై ఉత్కంఠకు తెరపడింది! చర్చోపచర్చలు, వాదోపవాదాలు ముగిశాయి. 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్‌కు మరణశిక్ష అమలు ఖరారైంది. శిక్షను తప్పించుకునేందుకు అతడు చివరికి వరకూ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ రోజు(గురువారం) ఉదయం నాగ్‌పూర్ జైల్లో మెమన్‌ను ఉరి తీయనున్నారు. ఇదే రోజు అతడి పుట్టిన రోజు కూడా! శిక్ష అమలుపై స్టే ఇవ్వాలన్న మెమన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు బుధవారం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. మెమన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను సైతం మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు తిరస్కరించారు. ఇక ఆఖరిగా.. క్షమాభిక్ష కోరుతూ బుధవారం మెమన్ మరోసారి రాష్ట్రపతిని ఆశ్రయించారు. రాత్రి 10.45 గంటల సమయంలో.. క్షమాభిక్షను తోసిపుచ్చుతూ రాష్ట్రపతి నిర్ణయం వెలువరించారు. ఇక ఉదయం శిక్ష అమలు కావడమే మిగిలింది!!