ఉరితో యాకూబ్ హోరాహోరీ | Yakub with the execution hard fought | Sakshi
Sakshi News home page

ఉరితో యాకూబ్ హోరాహోరీ

Published Thu, Jul 30 2015 12:14 AM | Last Updated on Sun, Sep 3 2017 6:24 AM

Yakub with the execution hard fought

ఉరితాడుతో ముంబై బాంబు పేలుళ్ల నేరస్తుడు యాకూబ్ మెమన్ సాగించిన హోరాహోరీ పోరాటం ముగిసింది. 23 ఏళ్లుగా నాగపూర్ జైల్లో... ప్రత్యేకించి ఎనిమిదేళ్లుగా ఉరితాడు నీడలో ఉంటున్న యాకూబ్‌కు గురువారం ఉదయం మరణశిక్ష అమలు చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బుధవారం చకచకా సంభవించిన పరిణామాలన్నీ యాకూబ్‌కున్న దారుల్ని మూసేశాయి. క్యూరేటివ్ పిటిషన్‌పై విచారణ ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్నాయంటున్న కొన్ని సాంకేతిక లోపాలపైనా, అన్ని అవకాశాలూ ముగియక మునుపే మహారాష్ట్ర ప్రభుత్వం ‘డెత్ వారంట్’ జారీచేయడంపైనా వచ్చిన అభ్యంతరాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చగా... అంతకు కొన్ని గంటలముందు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు అతని క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించారు. ఇక యాకూబ్ తరఫున భిన్న రంగాలకు చెందిన ప్రజాస్వామికవాదులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముందు దాఖలు చేసి ఉన్న క్షమాభిక్ష పిటిషన్ ఒక్కటే మిగిలింది. దాన్ని తోసిపుచ్చాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రణబ్‌కు సలహా ఇచ్చారు. ఆ సలహాకు భిన్నంగా ఆయన వ్యవహరించకపోవడానికే ఆస్కారం ఉంది. మరోపక్క యాకూబ్ న్యాయవాదులు అర్ధరాత్రి రెండోసారి సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టారు.

మార్చి 1993లో జరిగిన ముంబై బాంబు పేలుళ్ల వ్యవహారంలో యాకూబ్‌కు, మరో 10మందికి టాడా ప్రత్యేక కోర్టు 2007లో మరణశిక్ష విధించింది. వీరిలో యాకూబ్ మినహా మిగిలినవారి ఉరిశిక్షలను సుప్రీంకోర్టు రెండేళ్లక్రితం యావజ్జీవ శిక్షలుగా మార్చింది. ముంబై మహానగరంలో ఒక హిందూ స్నేహితుడితో కలిసి చార్టెర్డ్ అకౌంటెంట్‌గా గౌరవనీయమైన స్థానంలో ఉన్న యాకూబ్ ఉరిశిక్షకు అర్హమైన నేరంలో దోషిగా రుజువుకావడం...53 ఏళ్ల వయసులో తన పుట్టినరోజునే ఉరికంబం ఎక్కాల్సిరావడం ఒక వైచిత్రి. అయోధ్యలో 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత దేశవ్యాప్తంగా అలుముకున్న ఉద్రిక్త పరిస్థితులు, పరిణామాలే దీనంతటికీ కారణం. ఆ ఏడాది డిసెంబర్ నెలాఖరున, 1993 జనవరి మొదటి వారంలో ముంబైలో చోటుచేసుకున్న మతకలహాల్లో 900మంది మరణించారు. వారిలో అత్యధికులు ముస్లింలు. ఇందుకు ప్రతిగా నగరంలో జనసమ్మర్ధంగా ఉండే 12 ప్రాంతాల్లో  పేలుళ్లు జరిగి 257మంది మరణించారు. దేశ చరిత్రలో ఆర్డీఎక్స్‌ను వినియోగించడం అదే ప్రథమం. ఈ పేలుళ్ల వ్యవహారంలో మెమన్ కుటుంబం పాత్ర వెల్లడై వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించేసరికే అందరూ దేశం దాటి వెళ్లిపోయారు. పెద్దవాడైన టైగర్ మెమన్, ఆయన కుటుంబం ఇప్పటికీ పాకిస్థాన్‌లోని కరాచీలోనే తలదాచుకుంటున్నారు.

ఇప్పుడు యాకూబ్ మెమన్ కంఠానికి బిగుసుకుంటున్న ఉరిపై సాగిన వివాదం రెండు దశాబ్దాలక్రితం ఇందిరాగాంధీ హత్య కేసులో మాజీ పోలీస్ అధికారి కేహార్‌సింగ్‌కు పడిన ఉరిపైనా...పార్లమెంటుపై దాడి కేసులో రెండేళ్లక్రితం అఫ్జల్ గురుకు అమలైన ఉరి విషయంలోనూ అల్లుకున్న చర్చలు గుర్తొస్తాయి. ఆ రెండు సందర్భాల్లోనూ దోషులుగా నిర్ధారణ అయినవారికి అన్యాయం జరిగిందని ప్రజాస్వామికవాదులు భావించారు. ఇప్పుడు యాకూబ్ కేసులోనూ అలాంటి వాదనలే వినిపిస్తున్నాయి. అయితే శిక్షను వ్యతిరేకిస్తున్నవారిలో రెండు రకాల వారున్నారు. పేలుళ్ల పథకరచన యాకూబ్‌కు తెలియదని వాదిస్తున్నవారు కొందరైతే...ఆయన ఖచ్చితంగా నేరస్తుడేనని, అయినా ఉరి సరికాదని అంటున్నవారు మరికొందరు. నేరస్తుడని విశ్వసించినా ఉరి వద్దని చెప్పినవారిలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) మాజీ ఉన్నతాధికారి రామన్ ముఖ్యులు. యాకూబ్ కరాచీనుంచి భారత్ రావడానికి జరిగిన ఆపరేషన్‌లో ఆయన భాగస్వామి. ఉరి శిక్ష పడదని హామీ ఇచ్చాకే ఆయన పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ కళ్లుగప్పి వచ్చాడని రామన్ వెల్లడించారు. వస్తూ ఐఎస్‌ఐ పాత్రను నిర్ధారించే అనేక పత్రాలనూ, సీడీలనూ, తమకు ఆశ్రయమిచ్చిన ఇంటి పరిసరాల వీడియోలనూ తీసుకొచ్చాడు. మారు పేరుతో తనకు పాక్ ప్రభుత్వం జారీచేసిన పాస్‌పోర్టును ఇచ్చాడు. అతని సహకారం లేకపోతే మన దేశంలో పాక్ సాగిస్తున్న దుశ్చర్యల గురించి బయటి ప్రపంచానికి చూపేందుకు సాక్ష్యాలే ఉండకపోయేవని రామన్ చెప్పారు. రాజ్యం తరఫున ఇచ్చిన హామీని గౌరవించకపోతే రేపన్నరోజున ఏ ఉగ్రవాదీ సహకరించడన్నది ఆయన వాదన. కేసు కోర్టు ముందుకు వెళ్లేసరికే రామన్ రిటైరయ్యారు. ఇప్పుడైతే ఆయన జీవించి లేరు. అసలు యాకూబ్‌కు అలాంటి హామీ ఏమీ ఇవ్వలేదని కొందరు అధికారులు చెబుతున్నారు. రామన్ అత్యంత విశ్వసనీయత కలిగిన అధికారి గనుక ఆయన అబద్ధమాడారని భావించలేం. యాకూబ్ తోడ్పడిన తీరుకు సంబంధించిన అంశాలను ఆ కేసుతో వ్యవ హరించిన సీబీఐ అధికారులు టాడా కోర్టు ముందు ఎందుకు ఉంచలేదో, అతనికిచ్చిన హామీ నుంచి ప్రభుత్వం ఎందుకు వెనక్కి వెళ్లిందో ఎవరికీ తెలియదు. ఈ విషయమై సుప్రీంకోర్టు సైతం తన నిస్సహాయత వ్యక్తంచేసింది. అది కార్యనిర్వాహక వ్యవస్థ చేతుల్లోనే ఉంటుందని చెప్పింది.

మరణశిక్ష సరికాదన్న వాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. సోమవారం కన్నుమూసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సైతం ప్రాణం పోయలేని వ్యక్తికి ప్రాణం తీసే హక్కు ఉండరాదని అభిప్రాయపడ్డారు. 139 దేశాలు తమ శిక్షాస్మృతులనుంచి మరణశిక్షలను తొలగించాయి. అందువల్ల ఆ దేశాల్లో నేరాలేమీ పెరగలేదు. ఈ శిక్ష ఉండొద్దని 2000 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. చట్టంలో ఆ శిక్ష ఉన్నంతవరకూ న్యాయమూర్తుల వ్యక్తిగత అభిప్రాయాలు ఏమైనా కోర్టులు కూడా ఏమీ చేయలేవు. యాకూబ్ విషయంలో చెలరేగిన వాదోపవాదాలు, కలాంవంటివారి అభిప్రాయలు కూడా పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం మరణశిక్ష కొనసాగింపుపై సమీక్ష జరపాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement