నేరము శిక్ష | Criminal punishment | Sakshi
Sakshi News home page

నేరము శిక్ష

Published Thu, Jul 30 2015 2:36 AM | Last Updated on Sun, Sep 3 2017 6:24 AM

నేరము శిక్ష

నేరము శిక్ష

యాకూబ్ మెమన్‌ను 1994 ఆగస్టు 5న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేశామని సీబీఐ చెప్తోంది. కానీ.. తాను 1994 జూలై 28న నేపాల్‌లో పోలీసులకు లొంగిపోయానని అతడన్నాడు. అతడిని అదుపులోకి తీసుకున్నపుడు యాకూబ్ కరాచీలో ఉండగా జరిపిన సంభాషణల ఆడియో రికార్డును కూడా అతడి బ్రీఫ్‌కేసు నుంచి స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్నప్పటి నుంచీ అతడిని తొలుత ఎరవాడ జైలులో ఉంచారు. 2007 ఆగస్టులో నాగ్‌పూర్ సెంట్రల్ జైలుకు బదిలీచేశారు. యాకూబ్ ఆ జైలు నుంచే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ వర్సిటీ నుంచి ఆంగ్ల సాహిత్యంలో, రాజకీయశాస్త్రంలో ఎం.ఎ. పట్టాలు పొందాడు.

యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్ 1962 జూలై 30న ముంబైలో పుట్టాడు. ముంబైలోనే కామర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశాడు. 1990లో చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సును పూర్తిచేశాడు. 1991లో బాల్య స్నేహితుడు చేతన్ మెహతాతో కలిసి ‘మెహతా అండ్ మెమన్ అసోసియేట్స్’ పేరుతో చార్టర్డ్ అకౌంటెన్సీ సంస్థను నెలకొల్పాడు. ఆ తర్వాతి ఏడాది వారు విడిపోయారు. యాకూబ్  ‘ఏఆర్ అండ్ సన్స్’ పేరుతో అకౌంటెన్సీ సంస్థను ప్రారంభించాడు.  మరుసటి ఏడాదే ముంబై మెమన్ సమాజం నుంచి ‘ఈ ఏడాది ఉత్తమ చార్టర్డ్ అకౌంటెంట్’ అవార్డు పొందాడు.  మాంస ఉత్పత్తులను ఎగుమతి చేసే ‘తేజ్‌రాత్ ఇంటర్నేషనల్’ అనే ఎగుమతి సంస్థను యాకూబ్ స్థాపించాడు.

1993 ముంబై బాంబు పేలుళ్ల ప్రణాళికారచన, అమలులో దావూద్ ఇబ్రహీంకు, తన సోదరుడైన టైగర్ మెమన్‌కు యాకూబ్ ఆర్థికంగా సాయం చేశాడని దర్యాప్తు సంస్థల అభియోగం. అలాగే.. టైగర్‌మెమన్ నిధుల నిర్వహణతో పాటు.. ఆయుధాలు, పేలుడు పదార్థాల వినియోగంలో 15 మందికి పాకిస్తాన్‌లో శిక్షణ కార్యక్రమానికి కూడా యాకూబ్ నిధులు సమకూర్చాడని ఆరోపణ.

యాకూబ్‌ను నేరపూరిత కుట్ర అభియోగం కింద దోషిగా నిర్ధారించిన టాడా కోర్టు అతడికి  2007 జూలై 27న ఉరిశిక్ష  విధించింది. ‘ఉగ్ర’దాడికి సాయం చేయటం, ప్రోత్సహించటం; ఆయుధాలలను అక్రమంగా కలిగివుండటం, రవాణా చేయటం; ప్రాణాలు హరించే ఉద్దేశంతో పేలుడు పదార్థాలు కలిగివుండటం అభియోగాల్లో కూడా అతడిని దోషిగా నిర్ధారించిన కోర్టు.. ఆ నేరాలకు గాను జీవిత ఖైదు, 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.  

టాడా కోర్టు తీర్పుపై మరో 100 మందితో పాటు యాకూబ్ సుప్రీంకోర్టులో అప్పీలు చేశాడు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అతడికి విధించిన మరణశిక్ష నిర్థరణ కోసం కోర్టులో రిఫరెన్స్ పిటిషన్ వేసింది. వీటిపై 2011 నవంబర్ 1న విచారణ ప్రారంభించిన సుప్రీం కోర్టు 2013 మార్చి 21న తీర్పు ఇస్తూ.. యాకూబ్‌ను నాటి దాడుల వెనుక ‘మాస్టర్‌మైండ్’గా, ‘డ్రైవింగ్‌ఫోర్స్’గా అభివర్ణిస్తూ.. అతడికి విధించిన ఉరిశిక్ష ఖరారు చేసింది. మరో 10 మందికి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా తగ్గించింది. ఈ ఖైదు పడ్డ 18 మందిలో 16 మంది ఆ శిక్షను ఖరారు చేసింది.

ఆ తర్వాత.. సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరుతూ యాకూబ్ రివ్యూ పిటిషన్ వేశారు. 2013 జూలై 30వ తేదీన.. సుప్రీం ద్విసభ్య బెంచ్ మౌఖికంగా విచారించాలని కోరిన యాకూబ్ దరఖాస్తును తిరస్కరించింది. రివ్యూపిటిషన్‌ను కొట్టివేసింది. మరణశిక్ష తీర్పులపై రివ్యూ పిటిషన్లను మౌఖికంగా విచారించాలనియాకూబ్ రిట్ పిటిషన్ వేశాడు.

2013 ఆగస్టు 14న యాకూబ్‌కు మరణశిక్ష అమలు చేయటానికి మహారాష్ట్ర ప్రభుత్వం తొలి డెత్ వారంట్ జారీ చేసింది.

క్షమాభిక్ష కోసం యాకూబ్ చేసుకున్న దరఖాస్తును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2014 ఏప్రిల్ 11న తిరస్కరించారు.

మరణశిక్ష తీర్పుల సమీక్షను.. చాంబర్లలో కాకుండా బహిరంగ కోర్టులో విచారించాలని యాకూబ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ విచారిస్తున్నందున.. యాకూబ్‌కు ఉరిశిక్ష అమలును నిలిపి ఉంచాలంటూ 2014 జూన్ 2న సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది.

యాకూబ్ రివ్యూ పిటిషన్‌పై 2015 మార్చి 24న కోర్టు హాలులో విచారణ మొదలైంది. అతడి తరఫున సీనియర్ న్యాయవాది జస్పాల్‌సింగ్ వాదించారు. 2015 ఏప్రిల్ 9న రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత యాకూబ్ క్యురేటివ్ పిటిషన్ వేయగా.. సుప్రీంకోర్టు ఈ నెల 21వ తేదీన దానిని తిరస్కరించింది.

ఈలోగా.. యాకూబ్‌కు ఉరిశిక్ష అమలు చేయటానికి జూలై 30వ తేదీని నిర్ణయిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం డెత్ వారంట్ జారీ చేసింది. దీంతో యాకూబ్ మహారాష్ట్ర గవర్నర్‌కు క్షమాభిక్ష దరఖాస్తు పెట్టుకున్నాడు. అలాగే.. తనకు చట్టపరంగా గల ప్రత్యామ్నాయాలన్నిటినీ వినియోగించుకోకముందే డెత్ వారంట్ జారీ చేయటం చట్టవ్యతిరేకమని పేర్కొంటూ.. క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం వచ్చే వరకూ తనకు ఉరిశిక్ష అమలు చేయటాన్ని నిలిపివేయాలని కోరుతూ జూలై 23న సుప్రీంలో రిట్ పిటిషన్ వేశాడు.

జూలై 28: యాకూబ్.. తాను సమర్పించిన క్యూరేటివ్ పిటిషన్‌పై ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. దానిపై నిర్ణయం తీసుకునే విషయంలో సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం అవసరమైన కోరం హాజరు కాలేదని తాజా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తూ.. దీనిపై అత్యవసరంగా విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తిచేశారు.

జూలై 29: ప్రత్యేకంగా ఏర్పాటైన త్రిసభ్య ధర్మాసనం.. యాకూబ్‌కు మరణశిక్ష అమలుపై స్టే విధించటానికి నిరాకరించింది. యాకూబ్ మహారాష్ట్ర గవర్నర్ సి.విద్యాసాగరరావుకు క్షమాభిక్ష దరఖాస్తు సమర్పించారు. ఆయన దానిని తిరస్కరించారు. దీంతో యాకూబ్ మరోసారి రాష్ట్రపతికి క్షమాభిక్ష దరఖాస్తును సమర్పించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement