ఇస్లామాబాద్ : అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం విషయంలోదాయాది దేశం పాకిస్తాన్ మరోసారి మాట మార్చింది. దావుద్ కరాచీలో ఉన్నట్లు అంగీకరించి, అతన్ని టెర్రరిస్టుల జాబితాలో చేర్చిన పాక్.. వెంటనే యూటర్న్ తీసుకొని,ఇబ్రహీం కరాచీలో లేడని, అతనికి తమ దేశంలో ప్రవేశం లేదని ప్రకటించింది. భారత్ మీడియా కావాలనే దావుద్ తమ దేశంలో ఉన్నట్లు అంగీకరించినట్లు తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించింది.
ప్యారిస్‌కు చెందిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(FATF) జూన్ 2018లో విధించిన గ్రే లిస్ట్ నుంచి తప్పించుకునేందుకు... తాజాగా పాకిస్తాన్ 88 నిషేధిత ఉగ్రవాద సంస్థలు, దాని అధినేతలపై కఠిన ఆంక్షలు విధించింది. ఇందులో దావుద్ ఇబ్రహీంను పేరుకూడా ఉంది. దావుద్ ఇబ్రహీంతో పాటు జమాతుద్ దావా చీఫ్ హఫీజ్ సయీద్, జైషే మహ్మద్ చీఫ్ ముసూద్ అజహర్, జకీర్ రెహమాన్ లఖ్వీ తదితరుల పేర్లను కూడా ఆ జాబితాలో చేర్చింది. వీరి స్థిర, చరస్తులను సీజ్ చేసి, వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తున్నట్లు తెలియజేస్తూ రెండు నోటిఫికేషన్ల విడుదల చేసింది. గ్రే లిస్ట్‌లో దావుద్‌ను చేర్చడంతో మాఫియా డాన్ తమ దేశంలోనే ఉన్నట్లు పాక్ అంగీకరించినట్లయ్యింది. అయితే లిస్ట్ ప్రకటించిన కొన్ని గంటలకే దాయాది దేశం మాట మార్చింది. దావూద్ తమ దేశంలో ఉన్నారని అంగీకరించినట్లు భారత్ మీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తుందని ఆరోపించింది. దావుద్‌కు తమదేశంలో చోటు లేదని పేర్కొంది. ఈ మేరకు పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అది కొత్త నోటిఫికేషన్ ఏం కాదని, ఈ నోటిఫికేషన్ ద్వారా పాక్ ఎలాంటి కొత్త ఆంక్షలు విధించలేదని స్పష్టం చేసింది. (చదవండి : దావూద్ గుట్టువిప్పిన పాకిస్తాన్)
ఆగస్టు 18న జారీ అయిన ఒక నోటిఫికేషన్ గురించి స్థానిక విలేకరులతో పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి జాహిద్ చౌధరి మాట్లాడుతూ.. పాకిస్తాన్ 2020 ఆస్టు 18న జారీ చేసిన ఎస్ఆర్ఓ (చట్టబద్ధమైన నోటిఫికేషన్) చాలా పక్కా సమాచారంతో ఉందని, ఇంతకు ముందు జారీ చేసిన ఎస్ఆర్ఓను కూడా ఒక ప్రక్రియ ప్రకారమే ఇచ్చామని తెలిపారు. అందుకే నిషేధిత జాబితా, నిషేధిత చర్యల్లో ఎలాంటి మార్పులూ ఉండవని స్పష్టం చేశారు.
‘ఐక్యరాజ్యసమితి ఆంక్షల జాబితాలో తాలిబాన్, ఐఎస్, అల్‌ఖైదాల ప్రస్తుత స్థితిని చూపించడానికి 2020 ఆగస్టు 18న రెండు సంయుక్త ఎస్ఆర్ఓలు జారీ చేశాం. అప్పుడప్పుడూ ఈ ఎస్ఆర్ఓలు విడుదల అవుతుంటాయి. అలాగే, చట్టపరమైన అవసరాలు, అంతర్జాతీయ బాధ్యతల ప్రకారం విదేశాంగ శాఖ ఈ ఎస్ఆర్ఓలను ప్రచురిస్తుంది. కానీ భారత్ మీడియా మాత్రం ఈ రిపోర్ట్ ద్వారా పాకిస్తాన్ ఏవో కొత్త ఆంక్షలు విధించిందని కథనాలు నడిపిస్తుంది. అది సరికాదు. ఈ ఎస్ఆర్ఓను చూపిస్తూ మా దేశంలో కొందరు ఉన్నట్లు(దావూద్) పాకిస్తాన్ అంగీకరించిందని భారత మీడియాలోని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అవి నిరాధారం, కల్పితం’అని జాహిద్ చౌధరి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment