పదకొండేళ్ల క్రితం ముంబై పేలుళ్లలో తాజ్ హోటల్‌లో దిగినవాళ్లను అలెర్ట్ చేసి, ప్రాణాలు కాపాడిన మల్లికా జగద్.. ‘క్రైసిస్ మేనేజర్’గా మళ్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చారు. ‘ముప్పును తప్పించు కోవడం’పై మల్లిక ఇస్తున్న మోటివేషనల్ స్పీచ్‌ల ఆడియోలు, వీడియోల కాపీలను ఇండియాలోని పెద్ద పెద్ద హోటళ్లు బస చేసేందుకు వచ్చే తమ అతిథులకు ఇస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న సున్నితమైన పరిస్థితుల రీత్యా ముందు జాగ్రత్తగా మల్లిక ఇస్తున్న టిప్స్‌ని హోటళ్లు, ట్రావెలర్స్ ఫాలో అవుతున్నారు.
26 /11. ఈ తేదీ భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజు. ఈ తేదీతో పాటు దేశానికంతటికీ ఒక పేరు గుర్తొస్తుంది. అజ్మల్ కసబ్! ఆ రోజు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా టెర్రరిస్టులు దేశంలో చొరబడి ముంబైలో సృష్టించిన నరమేధాన్ని దేశం మర్చిపోవడం కష్టమే. ఉగ్రమూక దాడిలో ప్రాణాలు కోల్పోయిన 174 మంది అభాగ్యుల లెక్క ఉంది. మూడు వందల మంది క్షతగాత్రుల లెక్క ఉంది. అయితే బతికి బయటపడిన వారి ప్రాణాల లెక్క గురించి అప్పట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత కొన్నాళ్లకు మల్లికా జగద్ అనే మహిళ వల్ల ఆ లెక్క తెలిసింది. ఉగ్రదాడి సమయంలో తాజ్ ప్యాలెస్‌లో చిక్కుకున్న అతిథులను కాపాడిన మల్లికా జగద్ ఆ హోటల్‌లో డైనింగ్ హాల్ నిర్వహణ బాధ్యతలు చూసుకునే అసిస్టెంట్ బాంక్వెట్ మేనేజర్. అప్పుడామె వయసు ఇరవై నాలుగేళ్లు. ఘటన జరిగింది 2008లో.
భోజనాలు చేస్తున్నారు
ఆ రోజు రాత్రి తొమ్మిదిన్నర. భోజనాల సమయం. ఉన్నట్లుండి తుపాకీ పేలుళ్లు వినిపించాయి. మొదట్లో ఆ శబ్దాలను తుపాకీ పేలుళ్లనుకోలేదామె. ఆమే కాదు, తాజ్ హోటల్‌లో హెరిటేజ్ వింగ్‌లో ఉన్న అరవైకి పైగా అతిథులు కూడా ఆ శబ్దాలను టపాకాయల శబ్దాలుగానే పొరబడ్డారు. అది పెళ్లిళ్ల సీజన్ కావడం కూడా అందుకు కారణమే. ఆ సంఘటన మల్లిక జ్ఞాపకాల్లో ఇప్పటికీ సజీవంగానే ఉంది. ‘‘హోటల్లో పేలుళ్లు వేగవంతమైన కొద్దిసేపటికి అవి తుపాకీ పేలుళ్లని మాకు సమాచారం వచ్చింది. ఆ వచ్చిన సమాచారం కూడా అంతవరకే. లోపలికి చొరబడిన వ్యక్తి చేతిలో ఉన్నది చిన్న తుపాకీనా, లేక మెషీన్ గన్నా అనే వివరం కూడా తెలియదు. మా డైనింగ్ హాల్‌లో ఆ క్షణాన అరవైకి పైగా అతిథులున్నారు. వారిని కాపాడడం మా బాధ్యత. ‘ప్రాణాలను ఫణంగా పెట్టి అయినా సరే వాళ్లను కాపాడాలి. అందుకోసం చివరి శ్వాస వరకు పోరాడుదాం’... అని మా సిబ్బందికి చెప్పాను’’ అని ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు మల్లిక.
పిల్లల్నీ వదలడం లేదు
‘‘డైనింగ్ హాల్ తలుపులు, కిటికీలన్నీ మూసి, మెయిన్ డోర్ లాక్ చేసి లైట్లాపి, చిన్న చప్పుడు కూడా చేయకుండా జాగ్రత్తపడుతున్నాం. హోటల్ మీద దాడి జరిగిందని వార్తల ప్రసారం మొదలైంది. గెస్ట్‌ల ఫోన్‌లు ఒక్కొక్కటిగా రింగవుతున్నాయి. టీవీలు చూసిన వాళ్లు తమ వాళ్ల క్షేమ సమాచారం కోసం ఆత్రుతతో చేస్తున్న ఫోన్ కాల్సే అవన్నీ. ఇప్పుడైతే చిక్కుకుపోయిన వాళ్లు తమను తాము ఫొటో తీసుకుని వాట్సప్ చేయవచ్చు. అప్పట్లో ఆ సౌకర్యం లేకపోవడంతో అవతలి వారికి వీరి క్షేమ సమాచారం తెలియాలంటే ఫోన్‌కాల్ ఒక్కటే మార్గం. రింగయితే, సైలెంట్ మోడ్‌లో లైట్ వెలిగినా ఇక్కడ మనుషులున్న సంగతి తెలిసిపోతుందని, ఫోన్‌లన్నింటినీ ఆఫ్ చేయించి అందరినీ నేల మీద నిశ్శబ్దంగా కూర్చోమని కోరాం.
ఇంత జరుగుతున్నా తుపాకీతో కాలుస్తున్న వ్యక్తి టెర్రరిస్ట్ అని కొన్ని గంటల వరకు తెలియలేదు. వచ్చిన వ్యక్తి హోటల్‌లో దిగిన విఐపీలను టార్గెట్ చేసి షూట్ చేస్తున్నాడని మాత్రం తెలిసింది. ఎవరినీ పట్టుకుని ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ కూడా చేయడం లేదు. పిల్లలు, ఆడవాళ్లు అనే తేడా లేకుండా కనిపించిన వారిని కనిపించినట్లు చంపేస్తున్నారు. ఒక్కొక్క గదిని డోర్ నాక్ చేస్తూ, తలుపు తీసిన వారిని అక్కడే కాల్చేస్తున్నారు. హాల్‌లో ఉన్న వాళ్లలో సహనం నశిస్తోంది, ఒక్కొక్కరుగా సంయమనం కోల్పోతున్నారు. ఆలస్యమయ్యే కొద్దీ మెడికల్ ఎమర్జెన్సీలు తలెత్తుతాయేమోనని భయం మొదలైంది మాలో. మన మిలటరీ రంగంలోకి దిగిన తరవాత మేము ఊపిరి పీల్చుకున్నాం.
అప్పటి వరకు నాకు ఇలాంటి క్లిష్టపరిస్థితిని ఎదుర్కోవడం గురించి ఏ మాత్రం అవగాహన లేదు. ఆ సందర్భం, అతిథులకు కష్టం రాకుండా చూసుకోవడం అనే మా ఉద్యోగ బాధ్యత నన్ను నడిపించాయి’’ అన్నారు మల్లిక జగద్.ముంబయి పేలుళ్లలో మల్లిక సమయస్ఫూర్తికి, ధైర్యానికి లెక్కలేనన్ని ప్రశంసలతోపాటు టాటా ట్రస్ట్ ఆమెను నిర్వహణ స్థాయికి పదోన్నతి కల్పించింది. మోటివేషనల్ స్పీకర్‌గా ఆమె చేత సేవలను కొత్త ఉద్యోగులకు చెప్పిస్తోంది. టెడెక్స్ ప్రోగ్రామ్‌లో మల్లిక ఇచ్చిన ప్రసంగాన్ని శ్రోతలు పిన్‌డ్రాప్ సైలెన్స్‌తో విన్నారు. నాయకత్వం నేర్పిస్తే రాదు, అది మనిషిలో పుట్టుకతో వస్తుంది. సందర్భం వచ్చినప్పుడు నిరూపించుకుంటుంది... అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు. అందులో మల్లిక మాత్రం మానవత్వం నిండిన
మల్లిక నిజమైన నాయిక
ఆ రోజు తాజ్ హోటల్‌లో బస చేసి మల్లిక ధైర్యసాహసాలతో ప్రాణాలు నిలుపుకున్న అతిథులు ఇప్పుడు సోషల్ మీడియాలో అప్పటి సంగతులను గుర్తు చేసుకుంటున్నారు. ‘‘మల్లిక గొప్ప లీడర్. ఆ రోజు మేమున్న గదంతా పొగతో నిండిపోయింది. అందరి దగ్గరకు వచ్చి నీళ్లిచ్చి శబ్దం చేయవద్దని గుర్తు చేస్తూ భుజం తట్టి ధైర్యం చెప్పింది. మమ్మల్ని రక్షించడానికి సైన్యం వచ్చారు. వాళ్లు ముందుగా లేడీస్ ఫస్ట్ అని మల్లికనే బయటకు తీసుకెళ్లబోతే ఆమె వెళ్లలేదు. ‘‘ముందు గెస్ట్‌లు, తర్వాత మా సిబ్బంది, ఆ తర్వాతనే నేను’’ అని చెప్పి మమ్మల్ని ఒక్కొక్కరిని జాగ్రత్తగా బయటకు పంపించడానికి సైన్యంతో సహకరించింది. అప్పుడా గదిలో ముప్పైకి పైగా పెద్ద పెద్ద సంస్థలు నడుపుతున్న వ్యాపార దిగ్గజాలున్నారు.
మల్లిక వాళ్లందరికంటే పెద్ద లీడర్, ట్రూ లీడర్ అనిపించింది నాకా క్షణంలో. నన్ను బయటకు తీసుకెళ్తున్న క్షణంలో మల్లికతోపాటే ఉండి చివరగా ఆమెతోపాటే బయటపడదాం అనిపించింది. మేమంతా బయటపడి ఆమె చిక్కుకుపోతుందేమోనని కూడా భయం వేసింది. అలా జరగకూడదని, ఆమె క్షేమంగా బయటపడాలని మేమంతా కోరుకున్నాం. ఇప్పుడు టెడెక్స్ ప్రోగ్రామ్‌లో తన స్పీచ్ వింటుంటే ఆ భయంకరమైన క్షణాలు ఆవరించినట్లే అనిపిస్తోంది. మల్లికను ఇలా చూడడం సంతోషంగా ఉంది’’అని లీనా నాయర్ తన బ్లాగ్‌లో రాసుకున్నారు.
నాయకత్వానికి ఉదాహరణ.
– మంజీర
Comments
Please login to add a commentAdd a comment